నవసమాజానికి నాందీ ప్రవచనం
స్వాగతం సుస్వాగతం
రక్తాక్షికి స్వాగతం. తెలుగు ఆడపడుచులకు, అన్నదమ్ములకు, వివిధ రంగాలలో తమ ప్రజ్ఞా పాటవంతో తెలుగు తల్లికి నీరాజనమిచ్చిన, తెలుగు ప్రతిభను దిగ్దిగంతాల ప్రతిధ్వనింపచేసిన మేధావులకు, శాస్త్రజ్ఞులకు, స్రష్టలకు, వాగ్గేయ కళాకారులకు, దేశభక్తులకు, పూజ్యులకు స్వాగతం శుభ స్వాగతం.
తెలుగునేల గుబాళిస్తోంది వేపపూవు పరిమళంతో. తెలుగు జనత పరవళ్ళు తొక్కుతోంది-కొత్త ఆశలతో, కొంగ్రొత్త భావాలతో.
వగరు చిగుళ్ళను మేసిన కోకిలమ్మ మత్తుగా, మధుర మంజుల మనోజ్ఞ నిక్వాణంతో గిలిగింతలు పెడుతోంది నవయుగ మహోదయ సంకేతంగా.
గంటల సవ్వడితో సాగింది-చైత్ర రథం ముందుకు పూర్ణకుంభంతో, ఇక్షుధ్వజంతో, జయ జయ ధ్వానాల సందడితో, నవ వసంతాగమన సంరంభంతో.
బంధుమిత్రుల పరస్పరాభివందనాలతో, ప్రేమలాలస సౌహార్ద్ర భావనలతో, పండుముత్తయిదువు పాల పొంగులతో పొంగించిన పరవాన్నపు వడ్డింపులతో, వేపపూవు ప్రసాదం ఆరగింపులతో, మధురంగా, మధురాతి మధురంగా, నిండుగా, వయ్యారంగా, సింగారంగా, ఓరకంటి చూపులో గిలిగింతలు పెడుతూ ఆశలు పెంచుతూ అనురాగాలు పంచుతూ పెళ్ళికూతురిలా ముస్తాబయి సాక్షాత్కరించింది రక్తాక్షి. తీరిపోయిందని పాత ముత్తయిదువులా రుధిరోద్గారి నిష్క్రమించి చరిత్ర పుటల్లోకి చల్లగా మెల్లగా.
ఈ కేరింతలలో పులకింతలలో ఎక్కడో గగనం మూగవోయిన గొంతుతో, ఎండిపోయిన స్వరంతో-"సమానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్", -ఎవరదీ ఎవరదీ అని చూస్తే అమరజీవి గురజాడ గొంతు అడుగుతోంది "నా ప్రబోధం జాతిని మేల్కొల్పలేదా" అని ఆవేదనతో.
ఎన్నో ఉగాదులు గడిచినయ్. ఎందరెందరో మహానుభావులు పుట్టారు పునీతులయ్యారు. ఎన్నెన్నో సంఘటనలు ఎన్నెన్నో సంస్కరణలు. ఎన్నో గొంతులు అంటున్నాయి-అదే పనిగా ప్రజాస్వామ్యం కావాలి, పేదరికం పోవాలి అని. పేద గుడిసెలో అంటగాగిన బక్క డొక్కలతో మూలుగుతున్న శ్రామికుడు తొంగి చూచాడు బైటికి యిదంతా నాకోసమేనా అని-నాకు మంచిరోజు వస్తుందా అని-నా పక్కనున్న భవంతి వంటిది కాకపోయినా ఎండావానలకు నీడిచ్చే గృహవసతి నాకు కలుగుతుందా అని. ఆకలితో శోషపోయిన అజ్ఞానపుటంధకారంలో మునిగిపోతున్న నా బిడ్డల జీవితానికి సుంతయినా, కూసంతయినా వెలుగు వస్తుందా, విజ్ఞానం కలుగుతుందా అని. వట్టి కుండతో నీరు పెగలని కంటి తడితో కడఅంటి వున్న కొన వూపిరితో అభాగిని ఆడబడుచు వెలికి వచ్చింది "యిగిరిపోయిన మా బ్రతుకులకు మోక్షం వచ్చిందా" అని.
వచ్చింది స్వాతంత్ర్యం. ముప్పయ్యేడేళ్ళు యీ కలల మగతలోనే నిలిచింది జాతి కదులుతున్న యీ కాల ప్రవాహంలో, కడలేని నిరీక్షణలో. రాక్షస, వల, పింగళ, కాళయుక్తి, సిద్దార్ది, రౌద్రి, దుర్ముఖి, దుందుభి, రుదిరోధ్గారి-ఎన్నో ఉగాదులు గడిచిపోయాయి, ఈ ప్రతీక్షణలో.
కాలం మారుతోంది. కాని కష్టాలు, సమస్యలు పెరుగుతూనే వున్నాయి. బాధలు మెండవుతున్నాయి. బ్రతుకే తీవ్ర సమస్యగా మారింది. మానవత్వం మరుగైన నేటి యీ సమాజంలో తాను ఒక మానవుడా అన్న అనుమానం వస్తోంది. సామాన్య మానవుల జన్మహక్కయిన కనీస అవసరాలు తనకు తీరనందున సామాజిక పరమైన న్యాయం తమకు దక్కుతుందా అని అనుమానం వస్తోంది బాధిత తాడిత పీడిత సామాన్య ప్రజానీకంలో.
అటు పక్క ధనం మూలుగుతోంది మత్తెక్కి వెలుగులోకి రాలేక నల్ల చీకటి మాటున మరుగున. బలిసిన దేహంతో పెరిగిన ఆశతో అనుభవమవుతోన్న భోగ విలాస లాలసతతో కంపయినా యింపుగానేవుంది, స్వార్ధమైనా తీపిగానే వుంది. దోపిడీ అయినా శ్రమ లేకనే వస్తోంది. మోసమైనా చలామణీ అవుతోంది. లంచమైనా అన్యాయమైనా అక్రమమైనా చెల్లుబడి అవుతోంది. పదవా గుప్పెట్లో వుంది. అధికారమా హస్తగతమయింది. అన్నిటికి నేనే నేనే అన్న ఆ స్వార్ధమే వరదలై ముంచెత్తుతోంది వర్తమాన రాజకీయాన్ని పాపం! ఊహించుకోలేకపోయారు యీ పరిణామాన్ని స్వాతంత్ర్యాన్ని తెచ్చిన సమర యోధులు అమరవీరులు. ఏమో ఆనాటి కన్నుమూతల్లోనే తృప్తి కలిగిందేమో-యీనాడే వుంటే, యీనాటి యీ పరిణామం చూస్తే యిందుకా, యీ విధానానికా ఆనాడు తుపాకీ గుళ్ళకు రొమ్ముఒడ్డి మేను నిలిచింది. యిందుకా కుళ్ళాయి గట్టి భారతమాత ఒడిలో కుంచించుకు పోయిన పేద సమాజంలో నేనొక నిరుపేదనని చెప్పుకున్నది. అంటరానితనం, కులం, మతం, కుమ్మరించిన విషజ్వాలలను ఆర్పుతానని, హాలాహలం నించి అమృతం పండిస్తానని జాతి గౌరవం పెంపొందిస్తానని అన్నది, ఊహించుకున్నది. సమ సమాజం సర్వతోముఖవికాసం సమైక్యతా సిద్దాంతం అందరి చెవుల్లో గింగురు మనేలా ఎన్నో సార్లు ధ్వనించింది ప్రచారం చేసింది-యీ పరిణామానికేనా? యీ తీరుకేనా? యీ తెన్నుకేనా? అని రెప రెప లాడుతున్నవి నింగినించి తొంగిచూస్తున్న అమరవీరుల ఆకృతులు. ఘోషిస్తున్నాయి ఆత్మలు. ముఖం జేవురిస్తోంది చిన్నబోయిన కవళికలతో.
రక్తాక్షికి మనం సరైన నిర్వచనం యివ్వాలా-ఆ అరుణ కెంజాయ క్రోధ చూడ్కుల మంటలలో సమాజాన్ని సలసలా కాగించాలా, ఈ బాధిత పీడిత తాడిత ప్రజానీకాన్ని వంశపారంపర్యంగా వస్తున్న అతిహీనమైన దీనస్థితిలోనే వుంచాలా-
పెరిగిపోతున్న బొజ్జ్వల ధనరాసుల భుక్తంతో యింకా యింకా మెండుగా నిండుగా పెరుగనివ్వాలా? ఏదీ ఏదీ ఏదీ అన్న ప్రశ్న అనుక్షణం దిగలాగుతోంది దిగులు పడుతున్న నన్ను.
అర్ధాలకు పెడర్ధాలు, యీ గమనంలో ఎదురు దెబ్బల ఎదురవుతోన్న అవరోధాలు ఎన్నో యింకెన్నో-
అయినా నా వెనక నా తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అండగా వున్నారన్న ధైర్యంవుంది గుండె నిండుగా. అవరోధాల అతిక్రమించగలనన్న ధీమా వున్నది-మనస్సులో మెండుగా.
జేవురింపుతో వొంటినంటిన కాషాయం సర్వపరిత్యాగం తో ధీరత్వంతో నిస్వార్ధపరమైన పవిత్ర భావంతో గడచిన ఏడాది నెమరు వేసుకుంటే తృప్తి కలుగుతోంది కూసంతైనామేలు చేయగలిగానని. విశ్వాసంతో నమ్మకంతో అన్నగా ఆదరించి యీ పదవీ బాధ్యతలు నాకప్పగించిన నా వారికీ నిస్వార్ధ సేవలను అందించగలిగానని.
ఫలితంగా మగతలో మూలుగుతున్న జాతి నిద్ర లేచింది. హక్కులను పరిరక్షించుకొనే ధైర్యంతో పేద జనం కాలు నిలదొక్కుకుంటున్నది. మా ఓట్ల వల్ల మా కేమి జరిగింది, ఏమి వొరిగిందని, మాకు కావలసింది యిదని తెల్లకాలర్లను పట్టి నిలదీసి అడుగుతున్నది. ఇచ్చాం ఇచ్చాం అంటే ఎవరిదిచ్చావ్? నీ అబ్బ సొత్తుగాదిది. ప్రజాస్వామ్యం ప్రజల సొత్తు, మా పాలు మా శ్రమకు లభించావలసిన ఫలం, రాజ్యంగ పరిధిలో మా బలహీన వర్గాలకు రక్షణ, మా సంక్షేమం చూడవలసిన బాధ్యత ప్రభుత్వ వ్యవస్థది. అది మరచిపోతే, కళ్ళు మసకవేస్తే నీ అధికారం చూపును నడినెత్తికి తెస్తే ఫలితం అనుభవించే రోజు వస్తుందని సవాలు చేస్తున్నది సింహకిశోరంలాగా ప్రళయ ఘర్జనతో.
స్త్రీని అబల అని ఒక పక్క అధిక్షేపిస్తూ సహధర్మచారిణి, అర్ధాంగి అని ఎన్నెన్నో బులిబుచ్చకపు యిచ్చకాలతో మమ్ము వంచించిన రోజులు పోయాయి, సమాజంలో సమ శాతంగా వున్నమాకు సమాన హక్కులు ఆస్థిలో అన్నింటిలో కావాలి, డబ్బుతో భర్తలణు కొనుక్కునే ఆ దౌర్భాగ్యం అంతరించాలి-అన్న హెచ్చరికలతో పలనాటి నాగమ్మ, రాణి రుద్రమ్మ, మగువ మాంచాల, సింహపురి చానమ్మలను గుర్తుచేస్తున్నది మహిళాలోకం.
బ్రిటీష్ బానిస విద్యావిధానమా యీ నాటికీ అని ఎంగిలి మొంగిలి చదువులతో నాలుగు గోడల మధ్య బిగించిన బ్రతుకులో కేవలం పొట్ట పోసుకునే ఉద్యోగ పరిధిలో బ్రతకడమేనా బోధనాపరమార్ధం, బ్రతుకు తెరువు కల్పించని వ్యర్ధ నిరర్ధకపు డిగ్రీల మూటలు భుజాన వేసుకొని ఎక్కే దిగే గడపల నిరాశ్రయులుగా నిర్భాగ్యులుగా నిరుద్యోగులుగా యువతను దిగజార్చే యీ అవశేషపు చదువులా యింకా యీ దేశంలో అని వెక్కిరిస్తోంది-నేటి నిరుద్యోగ సమస్య పెరుగుతోన్న అసంతృప్తితో రగులుతోన్న దావానలంలా.
మట్టిలో మాణిక్యాలు పండించినా శ్రమకందని రీతిలో తన పంటకు తగినంత విలువ లభించని దగా బజారులో అసంతృప్తితో, అన్యాయంతో ముడుచుకుపోతున్న రైతన్న అడుగుతున్నాడు యీ చిల్లర పెంకులా నా బంగారు పంటకని. సబ్బు బిళ్ళకో సెంటుబుడ్డికో తన ధరను తానే నిర్ణయించుకునే అధికారం పారిశ్రామికవేత్తకున్నప్పుడు, మరి తాను పండించిన పంటకు తానెందుకు ధర నిర్ణయించుకోలేకపోతున్నానని నిలదీసి అడుగుతున్నాడు అన్నదాత రైతన్న. నిర్ధారణలేని బ్రతుకులో గిట్టని కూలి పైసలలో ఎదుగూ బొదుగు లేని జీవితంతో అంధకారం ఆవరించిన బ్రతుకుతో తన యిల్లాలు చంటిపాప బాగోగులు నిండుగా చూచుకున్నానన్న తృప్తిలేని కొరవడ్డ బ్రతుకుతో, తృప్తిలేని జీవితంతో, పడిమారిన ఆశలతో అనాదరణతో, వంచనతో మొండిగా బ్రతుకీడుస్తున్నారు వ్యవసాయ కార్మికులు, కూలీలు కుతుకబంటి పేదరికంతో కూరుకుపోయిన కార్మికులు, శ్రామికులు, బడుగువర్గాలు, కష్టజీవులు, శ్రమజీవులు అసంతృప్తితో మూలుగుతున్నారు యీనాటికీ పూర్తిగా మారనిపెత్తందారీవిధానానికి రోసి. చివికిన ఆశలతో, చిరిగిపోయిన బ్రతుకులతో చీదరించుకుంటున్నారు యీస్వార్ధపూరిత సమాజాన్నీ, యీ ద్రోహవిధానాన్నీచూచి.
వీరి ఆశలు తీర్చాలి, బ్రతుకులలో బంగారు బాటలు వేయాలి, అంధకారంలో ఆశాజ్యోతులు వెలిగించాలి, నిత్యం ఊరుతున్న జాతిని ఊబిలోకి లాగుతున్న సమస్యలను పరిష్కరించాలి. సమాజంలో రాక్షసిలా, నరమాంసానికి మరిగిన పెద్దపులిలా నానాటికీ పెచ్చు మీరుతున్న, హెచ్చిపోతున్న అక్రమాన్నీ అన్యాయాన్నీ దౌర్జన్యాన్నీ లంచగొండి విధానాన్నీ రూపుమాపే వరకు సమాజంలో శాంతి లేదు, క్రాంతి రాదు.
మత్తెక్కిన భూతంలా నరసమాజం మీద విరుచుకుపడి అందిన అసహాయులను నములుతున్న నరరూప రాక్షసులను జాతి విద్రోహులను మతోన్మాదులను తుదముట్టించి సమాజంలో శాంతిభద్రతలకు సోపానం వేయాలి. ఆల్ప సంఖ్యాకులకు, హరిజన, గిరిజన వెనుకబడిన తరగతుల వారికి పరిపూర్ణమైన రక్షణ కలిగించాలి. అభివృద్ధి కార్యక్రమాలతో వారి బ్రతుకులు పండించాలి. సంతృప్తితో వారి జీవితాలు నిండించాలి. పాలక వ్యవస్థమీద వారికి నమ్మకం కలిగించాలి. సౌభ్రాతృత్వం, సమానత్వం, సమగ్ర ఆర్ధిక సముద్దరణ విధానం వంటి పవిత్ర మానవతా సిద్దాంతాలతో వారి మనుగడకు మంచి విధానాలందించిన నాడే దేశ సమైక్యతా, సామాజిక శాంతి, జీవిత సంతృప్తి అందివ్వగలుగుతాం అన్ని విధాలా. ఈ దోపిడీ వ్యవస్థ నశించాలి. పెట్టుబడిదారీ విధానం నశించాలి. అన్ని రంగాలలో దళారీ పద్దతి సమసిపోవాలి. సామాజికపరమైన బాధ్యత ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అప్పుడే....అప్పుడే....నిజమైన ఉగాదికి సరైన నిర్వచనం. అప్పుడే.....అప్పుడే.....ప్రతి యింతా వసంతం. అప్పుడే.....అప్పుడే.....బడుగు వర్గాలలో క్రాంతి కిరణం. అప్పుడే.....అప్పుడే.....నవ సమాజానికి నాందీ ప్రవచనం.
ఇది జరగనినాడు, యీ ఉగాదులు కేవలం ఊహలేనని తేలిననాడు....ఆనాడు 1947లో వచ్చింది....కాదు నిజమైన స్వాతంత్ర్యం. అసంతృప్తితో, అసహనంతో, అశాంతితో కుతకుత లాడుతున్న యీ అభాగ్య నిర్భాగ్య పీడిత ప్రజానీకం తెస్తుంది మరో విప్లవం. లిఖిస్తుంది మరో స్వాతంత్ర్య చరిత్ర రక్తాక్షరాలతో. ఏది మన ధర్మం, ఏది మన రీతి, ఏది మన నీతి-మానవతణు ముందుంచుకొని మనసుతో జవాబియ్యవలసిన తరుణం వచ్చింది. ఈ వేదిక నుండి యీ ఉగాది పర్వదిన శుభ సందర్భంలో అశేష ప్రజానీకానికి మనవిచేస్తున్నాను-తెలుగు జాతి మనది, తెలుగు సంస్కృతి వికాసాలకు వారసులం మనం.
పలనాటి బ్రహ్మన్న అలనాడే నేర్పాడట సమానత్వం చాపకూటితో. తేట తెలుగులో ఆటవెలదిలో జాతికి నీతులు నేర్పాడట వేమన్న. కాసులకు కవితను కుదువబెట్టక పరమపవిత్ర భాగవత రచనలో పరవశించాడట పోతన. కందుకూరి వారి సంస్కారం, గురజాడవారి ప్రబోధం, అల్లూరి విప్లవం, టంగుటూరి నిబ్బరం, అమరజీవి త్యాగం పెంచాలి జాతిలో. పెంపొందాలి తెలుగువారిలో జాతీయ భావం. రగిలించాలి గుండెల్లో సేవా భావం. పరిశ్రమించాలి ప్రగతి వీరులై ప్రతి ఒక్కరు బాలచంద్రులై. ఘడ్గతిక్కనలై, తాండ్రపాపయలై.
నిండుదనంతో తనువు పులకించి పరవశురాలు కావాలి ఆనాడు తన బిడ్డల ప్రాభవాన్ని చూచుకొని తెలుగుతల్లి. మెండుగా దండిగా వర్షించాలి తనవారిపై మంగళ ఆశీఃస్రవంతులు. అదే తెలుగువారికి నిజమైన ఉగాది. అదే నిజమైన వేపపూ ప్రసాదం. అదే వగరుచిగుళ్ళను మేసిన కోకిలమ్మ కాకళీ కూజితం. అదే మధుర మంజుల మనోజ్ఞగీతం.
"అదుగో! అమర కవి కంఠం వినిపిస్తోంది.......
దేశమనియెడి దొడ్డ వృక్షం
నరుల చెమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్
ఆకులందున అణగి మణగి
కవిత కోకిల పలకవలెనోయ్
పలుకులను విని దేశ మం
దభిమానములు మొలకెత్తవలెనోయ్
రక్తాక్షి ఉగాది సందర్భంగా ఏప్రెల్ 2, 1984న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో చేసిన ప్రసంగం
