Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 32

 

    
                                 10

    ఆమె ప్రారంభించిన త్రవ్వకం పనిని కొనసాగించేందుకు ఉత్సాహంతో ఎదురు తెన్నులు చూస్తున్న ఆదిమ జనులు విభ్రాంతులయినారు. జయకృష్ణ జ్యోతి పక్కనే వున్నాడు.
    భయవిహ్వలంగా అరచి పడిపోతున్న జ్యోతి వలయాకృతిలో వున్న రాయిని తాకకుండా పట్టుకున్నాడు. అతడందించిన ఆసరాతో నిలువరించుకుంది. కానీ ఆమె శరీరం బిగుసుకుపోయినట్లుగా అయింది. చూపులు ఆ వంకనే నిలిచిపోయినాయి.
    ఆమె అంతగా భయపడిపోయిన కారణం ఏమిటో తెలుసుకుందుకు ఆ వంకకు చూశాడు జయకృష్ణ. పెద్ద పెద్ద రాళ్ళు వలయంగా పెట్టి వున్న సమాధి గుహ అది. చాలా సమాధి గుహలున్నాయి. వాటన్నింటికీ అది కేంద్రబిందువులా ఉంది.  
    శిధిలమయిపోగా లభించిన తామ్రపత్రాలు ముఖ్యంగా తుది తామ్రపత్రం ఆధారంగా ఆలోచిస్తే శ్వేతకి శరీరాన్ని దాచి ఉంచిన సమాధి గుహ అదే అయి వుండాలి.
    ఆ రాతి వలయం మధ్యలో త్రవ్వితే శ్వేతకి ప్రానరహితమయిన కంకాళమూ, ఆమె బ్రతికి ఉండగా వాడిన వస్తువులూ, ఆమె ఆత్మ అక్కడ నించి విముక్తమాయెందుకు అగోచరశాక్తేయుడు ఊహించిన పద్దతీ , సమాధి గుహలో దొరకాలి.
    ఆ పనికి ఉద్యమించి ప్రాణాలను పణంగా ఒడ్డి అత్యంత సాహాసానికి పూనుకున్న జ్యోతి త్రవ్వకం పనిని ప్రారంభించటమే సమంజసమని భావించాడు జయకృష్ణ.
    అలా కాని పక్షంలో ఆమె పలుగు పట్టవలసిన అవసరమే లేదు. పన్నెండు అడుగుల లోతు త్రవ్వటమనేది అందరు ఆదిమ జనులకు పెద్ద పని ఏమీ కాదు. కాని తొలిసారి పలుగు దింపుతూనే విరుచుకుపడి పోయింది జ్యోతి. ఆమె అంతగా భయపడిన కారణమేమిటా అని ఆ దిక్కు పరిశీలనగా చూచిన జయకృష్ణ కూడా భయపడ్డాడు.
    పెద్ద రాళ్ళూ వలయంగా పేర్చిన సమాధి గుహ ఉపరితలం మీద అసంఖ్యాకమయిన చిన్న చిన్న రంధ్రాలున్నాయి. ఎప్పుడయితే జ్యోతి విసిరినా పలుగు ఒక రంద్రాన్ని తాకిందో, దానిలోంచి ఒక సర్పం సర్రున వెలుపలకు వచ్చి రాతివలయం వెలుపలకు పరుగు తీసింది. దాని నుంచి సంకేతాన్ని అందుకున్నాయేమో అనిపించేలా లెక్కించటానికి వీలుచిక్కని సంఖ్యలో వివిధ జాతుల సర్పాలు ఆ సన్నని రంద్రాల నించి వెలుపలకు రావడం. రాతి వలయాన్ని దాటి పారిపోవటం ప్రారంభించినాయి. జనులు బిగుసుకు పోయి చూడటం మొదలెట్టారు. వారికి పాముల్ని చంపటం అలవాటు లేదు. ఎందుకంటె వారికి అది ఆహారం కాదు. వాటి జోలికి పోనివారికి అవి ఎప్పుడూ అపకారం చేయాలనే అనుకోవు.
    ఆహారం కాని జంతువులనూ, అపకారం చేయని జంతువులనూ చంపటం ఆటవికుల మర్యాద కాదు. అందునించి వారంతా ఒక ప్రక్క ఒరిగిపోయి నిలచి చూడటం ప్రారంభించారు.
    ఇంచుమించు పది నిమిషాల పాటు వారందరిలో రక్త ప్రసాదం ఆగినట్లు  అయింది. ఎక్కడి వారక్కడ బొమ్మల్లాగ నిలిచిపొయినాయి. వలయం మధ్యలో ఉన్న అనేక రంద్రాల నించి అస్మఖ్యాకమయిన సర్పాలు వచ్చాయి.
    పైన అన్ని రంధ్రాలున్నాయి. కాని, వాటి ఆవాసం నేల మాళిగలో ఒక చోటున వుంటుంది. వందలాది సర్పాలు సాంఘిక జీవనం సాగిస్తాయి.
    అటువంటి ఆవాసం మీద విరోధుల దాడి ఆరంభమయిందని అవి సంకేతాల ద్వారా పరస్పరం తెలుసుకున్నాయి. ప్రాణభయంతో పారిపోయి మరొక వలయంలోని రంద్రాలలోకి దూరిపోతున్నాయి. అవి విరోధుల దాడి ఎదురు అయిందని తెలియగానే ముందు పారిపోయేందుకు ప్రయత్నిస్తాయి.
    ఒకవేళ అది సాధ్యపడకపోతే ప్రాణాలకు తెగించి ఎదురు నిలుస్తాయి. అది నాగుల స్వభావం. కాని ఇక్కడ అలాంటి పరిస్థితి వాటికి ఎదురుకాలేదు. అందరూ స్థాణువుల్లా నిలిచిపోయినారు.
    వాటి గమనాన్ని రవంత నిరోధించిన వారు ఒక్కరయినా లేరు. అందునించి అవి వలసపోయి మరొక వలయంలోని ఆవాసానికి చేరుకున్నాయి. ఇదంతా ఒక భయానకమయిన దృశ్యంగా యించుమించు ఇరవై నిమిషాలు నడిచింది.
    అప్పటికి జ్యోతికి ముచ్చెమటలు పోసినాయి. ఆమె తలను ఒడిలో వుంచుకుని ఒక రాతి మీద రాతిలో మలచిన బొమ్మలా నిశ్చలంగా కూర్చుండి పోయినాడు జయకృష్ణ.
    క్రమంగా గుండెలు గుబులేత్తించే ఆ దృశ్యం మటుమాయయింది. ప్రధానమయిన సర్పాలన్నీ వడివడిగా వెళ్ళిపోయాక వృద్దసర్పాలు , బాల సర్పాలు చివరిగా వెలుపలకు వచ్చినాయి.
    వృద్ద సర్పాలయితే ముందు పోయిన వాటిని అనుసరించే వెళ్ళిపోయినాయి. పిల్ల పాములు కొన్ని దారి తప్పి ఆదిమజనుల మధ్యకు కంగారుగా వచ్చి పడ్డాయి. వారు ప్రక్కకు తప్పుకుని దారి యిచ్చారు.
    ఆ దారిన అవి అవతలకు పోయినాయి.
    అన్ని పాములూ వెళ్ళిపోయిన తరువాత మళ్ళా వారిలో చైతన్యం కలిగింది. మయదర్శనం చేసి తిరిగి వచ్చిన వారిలాగా విచలితమయిన ముఖముద్రలతో తిరిగి పని ప్రారంభించారు ఆదిమ జనులు.
    జయకృష్ణ జ్యోతిని వెంట తీసుకు వెళ్ళి ఒక చెట్టు నీడకు చేర్చాడు. అక్కడ ఆమె షాక్ నించి తెరుకుందుకు కొంత సమయం పట్టింది. ఈ లోగానే తిరిగి వచ్చేశాడు జయకృష్ణ.
    ఆదిమ జనులకు త్రవ్వకం పనిలో తగు సూచనలు యివ్వటం ప్రారంభించినాడు. అర్కేలాజికల్ డిపార్టుమెంటు ఉద్యోగి కావటం నించి ఇటువంటి త్రవ్వకం పనులు చేయించటం అతడికి అలవాటు.
    శ్రీ బృందావన్ గోయెల్ యిచ్చిన సూచనల వల్ల, ప్రోత్సాహం వల్ల అతడు ఆ విద్యలో అనుభాశాలి కూడా అయినాడు. అతడు ఈవరకే డిపార్ట్ మెంటు వారు త్రవ్వించిన సమాధి గుహల్ని చూచాడు. త్రవ్వకం   పనిలో పొరపాట్లు జరిగితే అపురూపమయిన ప్రాచీన కళా సంపాదకు నష్టం జరుగవచ్చు.
    కళాత్మకమయిన వస్తువులు విరిగి పోవచ్చు. అందు నించి పొరపాట్లు జరుగకుండా అతడు తగు జాగ్రత్తలు తీసుకున్నాడు.
    తప్పిదం జరుగకుండా వుండాలంటే త్రవ్వవలసిన తీరు తెలియాలి అవి భూమిలోపల వుండే స్థితిని ముందుగా ఊహించగలిగితే పని త్వరితంగా సునాయాసంగా చేయగలుగుతాడు.
    అందునించి సమాధి గుహల అకార విశేషాన్ని ముందుగా మనసులో ప్రత్యక్షం చేసుకున్నాడు. సమాధి గుహలుండే రాతి వలయాలు వందలాదిగా ఒకేచోటున వుంటాయి.
    రాతి వలయాలంటే ఇంచుమించు మూడు టన్నుల బరువు వుండే వర్తులాకారపు శిలలు అనేకం ---- ఒక వర్తులపుపరిధి లోపల పేర్చి వుంటాయి.
    అవి భూమిపైన ఉంటాయి. దగ్గరగా వెళ్ళి చూస్తే వాటి ఉనికి గుడ్రంగా కన్పిస్తుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS