Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 31

 

    "దొరసానీ ! అడవి అనగానే క్రూర జంతువూ లుంటాయి. వాటికీ మేము భయపడం. కాని క్రూరజంతువుల్లాంటి మనుషులు అప్పుఅప్పుడు ఈ ప్రాంతాలకు వస్తారు.
    వారి గురించి భయపడతాం. మాకు చదువు లేదు. సంపద లేదు. ఈ కాలపు నాగరికత లేదు. నాగరికుల కున్నంత స్వార్ధం కూడా లేదు. అప్పుడప్పుడు ఈ ప్రాంతాలకు వచ్చే నాగరికులు అనేక ఆగడాలు చేసేవారు.
    అందునించి అటువంటి వారు కన్పించినప్పుడు జాగ్రత్తపడటం మా అందరికీ అలవాటు. లచ్చిమి ఎలాగో మీ పోలకువ కనిపెట్టింది. మీరు నిద్దరోయిందాక పొంచి వుండి మీ దగ్గరున్న ఆయుధాన్ని పట్టుకుంది." అంటూ ఒక చాకు చూపించిందామే.
    దాన్ని చూడగానే జ్యోతికి నవ్వు వచ్చింది. అది కాయలు, రొట్టెలు కోసుకునేందుకు ఉపయోగించే చాకు. జయకృష్ణ తన వెంట కిట్టులో తీసుకువచ్చాడు.
    "దొరబిడ్డా! అటువంటి ఆగడాలను నేను చేయనని ఎలా అనుకున్నావు." అని అడిగింది ప్రశాంతమయిన స్వరంతో.
    "రాత్రి నీ మీద దాడి చేసినప్పుడు అలాంటిదానవే అనుకున్నాను. నీ తీరు చూచాక ఇప్పుడలా అనిపించలేదు. నీకు తోడుగా ఎవరూ లేక పోయినా నిశ్చింతగా వున్నావు. అది నీ మంచి మనసు కాదా!
    ఒంటరి అడదానావు . నిన్ను నేనేమీ చేయను. ఏ పని మీద ఈ చోటుకు వచ్చావో మనసు దాచుకోకుండా చెప్పు." అన్నది గూడెం పెద్ద.
    జ్యోతి ఆమెకు అర్ధమయేలా అంతా చెప్పివేసింది.
    "దుస్సాహసం చేసినావే దొరసానీ! నీ పుంజుకి మేత పెట్టిస్తాను. నా మీద కుర్రు పెట్టకు " అంటూ  నవ్వి లచ్చిమి వంక చూచిందామే.
    లచ్చిమి దొరసాని తోడుగాడయిన జయకృష్ణ ను వెంట పెట్టుకోచ్చేందుకు బూగురు చెట్టు దగ్గరకు పరుగుతీసింది.
    సరిగ్గా గంట తరవాత తిరిగి వచ్చింది వగర్చుకుంటూ.
    "దొరబిడ్డా! అక్కడ పుంజు లేడు" అంటూ తాను తేచ్చిన వార్త చెప్పింది. దాంతో కలతపడినట్లు అయింది జ్యోతి . ఆమె కలవరపాటుని చూసిన దొరబిడ్డ ఆమెను ఓదార్చింది.
    "దొరసానీ! కుర్రుమనకే నామీద! తోడూగాడిని తొందరగానే రప్పిస్తా" అంటూ ఆ చుట్టూ పక్కల వెదికేందుకు మనుషుల్ని పంపింది. లచ్చిమి మాత్రం జ్యోతితో వుండిపోయింది.
    ఆ పగలంతా ఒక వంక మనసు కలత పడుతున్నా తన పనిలో లచ్చిమి చేయగల సాయం గురించి ఆలోచించింది జ్యోతి.
    ఆరాలు తీయగా ఆమె నించి కొన్ని సంగతులు తెలిశాయి. ఆ ప్రాంతాలకు దగ్గరలో కొండగుట్టలు కన్పించీ కంపించని కొన్ని రాతి నెలలు వున్నాయి. ఆ ప్రాంతాలలో అక్కడక్కడ జ్యోతికి కావలసిన రాతి వలయాలు కన్పిస్తాయి.  
    ఆ వార్త తెలిశాక ఈ లచ్చిమి తన పాలిటి భాగ్యలక్ష్మి అని భావించింది జ్యోతి. ఒకవేళ ఆ రాత్రికి జయకృష్ణ రాని పక్షంలో తామిద్దరమయిన వెళ్ళి ఆ ప్రాంతాలను పరిశీలించాలని నిశ్చయించుకుంది. కాని చీకటి పడుతుండగా వానరదండులా అన్వేషణ కార్యక్రమంలో వెళ్ళినవారు జయకృష్ణను వెంట బెట్టుకు వచ్చారు.
    అతనిని చూడగానే జ్యోతి ఉత్సాహంతో పొంగిపోయింది. ఆ రాత్రి వారికి మంచి మర్యాదలు చేసి విందులు వినోదాలతో ఊపిరి సలపకుండా చేశారు. అర్ధరాత్రి అవుతూ వుండగా వారి పరిస్థితి ఏమిటో రవంత అయినా ఆలోచించకుండా ఒక పాకలోకి పంపివేసి వెదురు చీలికల అభ్యంతరాన్ని బిగించేశారు.
    పాక వెలుపల కాపు కూర్చుంది లచ్చిమి.
    అ రాత్రి రక్షణ వలయంలో నించి ప్రశాంతమయిన మనసుతో భవిష్య కార్యక్రమం గురించి మాట్లడింది జ్యోతి.
    "జయకృష్ణగారూ! మీరు దయతో యిచ్చిన సహకారం ఫలించే  క్షణాలు దగ్గర అయినాయి. ఇక్కడకు దగ్గరలో కృష్ణాతీరమంతా శిలామయంగా వుంటోంది. అక్కడ సమాధిగుహల బాహిరమయిన చిహ్నాలు ఉన్నట్లుగా చెప్తోంది లచ్చిమి. ఆమెను వెంట పెట్టుకు పొతే రేపటికే మన ప్రయత్నం ఫలించవచ్చు " అని చెప్పిందామె.
    ఆ పగలంతా జ్యోతి అదృశ్యం గురించి తాను పడిన ఆవేదననూ, తిరిగిన అలసటనూ క్షణంలో మరచినాడు జయకృష్ణ. అతని అంతర్యం ఆనంద తరంగణిలా అయింది.
    అయితే రాత్రి జరిగిన సంఘటన కాసేపు తలచినా ఏక్సిడెంట్ మాత్రం కాదు. అది ఎంకరేజ్ మెంట్ అనుకోవాలి అనుకున్నాడు.
    "ఈ ప్రయత్నం ఫలించటానికి మీ తోడు దొరికినప్పుడే తోలి ప్రోత్సాహం లభించింది. ఇంక నేను లక్ష్యాన్ని చేరగలనన్న ధైర్యం నాకిప్పుడు కలుగుతోంది" అన్నది జ్యోతి.
    "లక్ష్యాన్ని చేరడం సాధ్యమే కావచ్చు. కాని గత అనుభవాలను పురస్కరించుకుని అక్కడ ఇంతకన్నా భయంకరమయిన అనుభవాలు ఎదురు అవుతాయని నేను అనుకుంటున్నాను. లక్ష్యాన్ని దగ్గర అవుతున్నా మంటే శ్వేతకి సృష్టించబోయే ప్రమాదాలకు కూడా దగ్గర అవుతున్నామనే కదా అర్ధం." అన్నాడు జయకృష్ణ.
    కాని జ్యోతి తల అడ్డంగా ఊగించింది.
    "నేనలా అనుకోవటం లేదు జయకృష్ణా! ఎందుకంటే లక్ష్యమనేది నేను అంటున్న చివరి మజిలి ఎక్కడో మీకు అర్ధం కాలేదు. సమాధి గుహను తెలుసుకోవటం నా తోలి మజిలీ! మలి మజిలీలో ....." అంటూ సిగ్గుతో ఆగిపోయింది జ్యోతి.
    జయకృష్ణ రవంత ఉత్తేజితుడయినాడు. సిగ్గువల్ల ఆమె పూర్తి చేయకుండా విడిచి పెట్టిన మాట బయట పెట్టించాలని ఎంతగానో ఆశించాడు.
    "అది నాతొ చెప్పరాని రహస్యమా?" అన్నాడు మధుర స్వరాన.
    "కాదు జయకృష్ణా! నా తుది మజిలీ నీ గుండెల్లోనే ! నీవు నా పురుషుడువు కాగలిగితే పరిపూర్ణమయిన అర్ధంతో ఈ బ్రతుకు పండింది అనుకుంటాను" అన్నదామె.
    "నా మనసులో మాటే నీవు నీ మాటగా చెప్తున్నావు" అన్నాడు జయకృష్ణ నవ్వుతూ! జ్యోతి అంతర్యం వెల్లువలా పొంగింది. అంతర్యం లోని ప్రేమ వార్నిధులు పొంగి చెలియకట్టల్ని త్రెంచుకుంటూ ఉరికి వచ్చినాయి.
    కొద్ది క్షణాల తరువాత తనవాడు కావలసిన పురుషుని బాహువుల్లో తనను తాను మరచిపోసాగింది జ్యోతి. కిలకిల నవ్వులు ఆమెకు తెలివి తెప్పించినాయి.
    వెదురు చీలికల అభ్యంతరానికి అవతల లచ్చిమి తోటి యువతులందరినీ పోగు చేసింది. వారంతా అభ్యంతరాన్ని అవతలకు నెట్టి వారి పారవశ్యాన్ని కోడిగం చెయ్యసాగారు.
    జ్యోతి సిగ్గుపడింది. ఆమె ముఖంలో కన్పించే చిరుకోపాన్ని గ్రహించిన లచ్చిమి అందరినీ అవతలకు పంపేసింది.
    ఇంక ఈ రాత్రి నిర్ణిద్రంగానే గడిపింది జ్యోతి. ఇంక అతనికి దూరంగా వుండవలసిన కాలం ఎంత నిడివి అయినదా అని ఆలోచించింది. ఆమె ఆలోచనలతో నిమిత్తం లేని కాలం కరిగిపోయింది. తెల్లవారింది. మందారంలా పొడచిన సూర్యుడు మంచు ముద్దలా అయినాడు. ఉదయించిన పగడ చూర్ణం లాంటి సూర్యుడు పైకొచ్చి వజ్రపు చూర్ణం అయినాడు.
    పలుగులు, పారలతో అదిమాజనులు వెంటరాగా ఆ చోటుని అన్వేషిస్తూ ప్రయాణం ప్రారంభమయింది.
    లచ్చిమి సాయంతో రాకాసి గుహలున్న చోటుని కనుక్కోవటం సులభతరమయింది.
    పెద్ద పెద్ద రాళ్ళతో పేర్చిన వందలాది వలయాలకు కేంద్ర బిందువులా వున్న వలయంలో త్రవ్వకం ఆరంభమయింది. అందరి కన్నా ముందు తానె పూనుకుని వలయం మధ్య త్రవ్వకం పనికి ఆరంభంగా పలుగు దింపింది జ్యోతి. మరుక్షణంలోనే కెవ్వున అరచి విరుచుకుని పడిపోయిందామె!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS