"థాంక్యూ సర్! డబ్బు యివ్వటమే నేను చేయగలిగింది. అ తరువాత చేయవలసింది అంతా మీరే కదా!"
"నీ మీద నాకు ప్రేమ వుంది. గౌరవముంది. నీ పని నువ్వు చేయగలిగితే నా పని నేను చేస్తాను. ప్రామిస్!"
"యూ ఆర్ గ్రేట్ సర్! థాంక్యూ " వెళ్ళిపోతున్న అయన వంక ఆరాధనా భావంతో చూస్తూ నిలిచిపోయాడు.
ఆ తరువాత మనసంతా దిగులు ఆవరించింది.
డబ్బు సంపాదించేందుకు మిగిలి ఉన్న ఒకే దారి ప్రియాంక పెట్టిన పోటీలో పాల్గోనటమే.
దానిలో తాను ఓడిపోతే! గాలిలో దీపం పెట్టి ఆడుతున్న జూదం ఏమవుతుందో చూడాలి.
మనసుని తొలిచేస్తున్న ఈ ఆలోచనలతో ఆరున్నర గంటల వరకూ గడపటం అంటే మాటలా?
ఆంజనేయస్వామి గుడి వైపు నడిచాడు. కళ్యాణమంటపం నీడలో కూర్చుని గంజాయి అమ్ముతున్నాడు బైరాగి.
ఖరీదయిన కషాయి రంగు లాల్చీ వేసుకున్నాడు. జోలెకూడా కాటన్ క్లాత్ తో కుట్టించుకున్నాడు.
"నాతొ వ్యాపారం అంతా కాస్ట్లీ! మాటలు కాదు నాయనా? కావాలనుకుంటేనే తీసుకుపో!" అంటూ ఈసడింపుగా. అవతలి వ్యక్తీ ఖంగు తిని పోయాడు.
అడిగిన డబ్బు యిచ్చి పోలితిన్ ప్యాకెట్ తీసుకున్నాడు. దాన్లోంచి బయటికి కన్పిస్తోంది. దాన్ని భద్రంగా దాచుకుని వెళ్ళిపోయాడు. అంత దూరంలో ఉన్నాడు జయసింహ!
వ్యాపారం తాలుకూ తొందర అయిపొయింది. అడిగిన డబ్బు జేబులోకి వచ్చి పడింది. తృప్తిగా తల ఎత్తాడు బైరాగి.
"ఓ నువ్వా! రా! రా! రావయ్యా! నా మీద గూడచారి పనిచేస్తున్న వాడిలాగా ఏమిటా చూపు? దగ్గరకు రా!' అంటూ ఆహ్వానించాడు. బవిరి గడ్డం దువ్వుకున్నాడు.
జయసింహ వెళ్లి ప్రక్కనే కూర్చున్నాడు.
"ఈ జనానికి మళ్ళీ ఏదో గాలి తగిలిందయ్యా! రెండు రోజుల్నించి మళ్ళీ చీమల దండుగా బయల్దేరారు.
సంపాదన బాగుందిలే! భోజనం చేశావా?"
'అవును. పూర్తయింది !"
"అబద్దాలేందుకు చెప్తావయ్యా! ముఖం చూస్తేనే తెలుస్తుందిలే! రా! హోటల్ కి పోదాం! అతని ఆస్థి అయిన కాటన్ గుడ్డతో కుట్టిన జోలె ఒక చోట మూట కట్టి పెట్టాడు.
రెండు కాళ్ళు లేని ఓ కుంటి వాణ్ణి పిలిచి దానికి కాపుంచాడు.
"ఇక పద పోదాం" అన్నాడు.
"దానిలో చాలా "మాల్" ఉందనుకుంటాను?" అన్నాడు జయసింహ.
"ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. కుంటి వెధవ పారిపోలేదు. దానిలోంచి ఏవైనా వస్తువులు కదిలిస్తే తంతానని భయం.
అయినా వాడు నాకు సాయంగా పనిచేస్తాడు. రోజుకి అయిదు రూపాయలిస్తాను. ఇంకేం చేసి సంపాదిస్తాడు వెధవ! నమ్మకంగా పడి ఉంటాడు" అన్నాడు బైరాగి!
ఎసి హోటల్ వైపుగా దారి తీశాడు. అతనితో పాటుగా కలిసి భోజనం చేయటం జయసింహకి యిష్టం లేదు.
వోద్దంటున్నా "మీల్స్ రెండు" అంటూ హుందాగా ఆర్డర్ ఇచ్చేశాడు భైరాగి! అతనిది చాలా నిర్లక్ష్య వైఖరి.
"సంపాదించేది ఎందుకు? నాలాంటి బైరాగులకి నా అనేవాళ్ళు ఎవరూ ఉండరు. ఏ పూట ఎవరు దగ్గరవుతారో వాళ్ళే మిత్రులు వాళ్ళే బంధువులు.
చాలా తేలిగ్గా సంపాదించటం , అంతకన్నా తేలిగ్గా ఖర్చు చేయటమే నాకు సరదా!" అన్నాడు.
"సంసార జీవితం లోంచి దారి తప్పి బైరాగిని అయ్యావు. ఈ దారి నుంచి కూడా తప్పితే నువ్వేమవుతావు."
ఈ ప్రశ్న విని భైరాగి పకపకా నవ్వాడు వికృతంగా!
"మోసగాడిని అవుతాను. వంచకుడిని అవుతాను. సమాజాన్ని మోసగించాను. నన్ను నేను మోసగించుకుంటున్నాను!
ఇదంతా నా అనందం కోసం! నాకు కావాలను కుంటున్న విలసజీవితం కోసమే!
ఏం? అలా చేయటం తప్పంటావా?
సమాజ శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నామనుకుంటున్న నీతి కోవిదుల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను.
కోట్లకు కోట్లు సంపాదించి అతి నయవంచనతో మోసంతో అమాయక ప్రజల బలహీనతలు ఆధారంగా కోటీశ్వరులయిన వాళ్ళున్నారు. మంచిగా సమాదించిన వాళ్ళూ వున్నారు.
వాళ్ళు పదవుల కోసం పోట్లాడుకుంటూ నువ్వు లక్షలు సంపాదించావంటే నువ్వు కోట్లు సంపాదించావని దూసిపోసుకుంటూన్నారు. ప్రజల ఎదుటే సాక్ష్యాలు చూపుకుంటున్నారు.
అందు,లో ఒకరు మంచి వారని ఒకరు తప్పు చేశారని తీర్పు చెప్తారు జనం! మరికొద్ది సంవత్సరాలకి ఆ తప్పు చేసిన వాళ్ళనే మళ్ళీ ప్రజా బంధువు అంటారు.
ఈ గజి బిజీ గందరగోళం అంతా ఏమిటి?
మీరిద్దరూ ఒకరికి కిరీటం పెట్టాలి. కాబట్టి పెట్టేస్తారు. వాళ్ళు మళ్ళీ జనం మీద పడి దోచుకున్నా సరే!
లంచాలు తీనే ఉద్యోగులు పట్టుబడి లంచాలు కట్టి మళ్ళీ ఉద్యోగం నిలుపు కుంటున్నారు. నిన్న తప్పు నిరూపించబడిన అధికారిని మళ్ళీ మా మీద ఎందుకు రుద్దారు అని ఎవ్వరూ అడగరేం?
ప్రాణాలు కాపాడే హాస్పిటల్ లో ఏం జరుగుతోంది?
చట్టాల్ని కాపాడే పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతోంది?
న్యాయాన్ని కాపాడే కోర్టుల్లో ఏం జరుగుతోంది ?
మున్సిపాలిటీలలో అవినీతి-----
కార్పోరేషన్ లలో పక్షపాతం -----
దేవాలయాల్లో ఆక్రమాలు---
సెక్రటేరియట్స్ లో ఐ ఏ.ఎస్ ఫామిలీ ల రాజకీయాలు-------
పీఠాదిపతుల ఆశ్రమాల్లో ప్రబలిపోతున్న అవిశ్వాసాలు-----
దేన్నీ ఎవరూ నిలుపు చేయలేదు? ఫలితం ఖచ్చితంగా ఎదిరించి ప్రశ్నించలేరు.
ఎందుకొచ్చిన కంఠశోష బాబూ!
దమ్ముంటే ఎదిరించాలి! లేకపోతే ఆదారినే మన శక్తి మేరకు అనుసరించాలి! కొండల మీద కొండల్లా ఎత్తుగా సముద్రాల కన్నా విశాలంగా పేరుకుపోయి పరుచుకుపోయినా చెత్త అవినీతిని ఏ మంత్రాలతో మాయం చేయగలరు?
జనబలం, ధనబలం కలిగిన మహానుభావుల్ని ఎవరూ అడగలేరు. పైగా ఆశ్రయిస్తారు, సమర్ధిస్తారు.
నేను గంజాయి అమ్ముకున్నందు వల్ల భూకంపాలు రావు. అగ్ని పర్వతాలు పగలవు. కుల పర్వతాలు తలక్రిందులు కావు.
ఏమీ ప్రమాదం లేదు. గొంగళిలో ఒకే ఒక్క చిన్న వెంట్రుకలా మాలాంటి వాళ్ళు!
భోజనం వచ్చింది. తినవయ్యా బాబూ!' అన్నాడు బైరాగి.
ఎవరికి వాళ్ళే యిలా అనుకుంటూ చేసుకోకపోతే సమాజం ఏమవుతుందా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు జయసింహ, భూమి గుడ్రంగా ఉంది. బయలుదేరిన చోటే చేర్తాం ఆలోచించటం వెస్ట్.
గ్రహాలు వలయంగా తిరుగుతున్నాయి.
అసలు సృష్టి అంతా దీర్ఘావృత్తాకారంలో ఉందట. మనిషి ఆలోచనలు మాత్రం ఎందుకు వర్తులం కాకూడదు?
భోజనం తరువాత బైరాగి ఖరీదయిన సిగరెట్లు కొన్నాడు.
