"మీ చెల్లికి మీరే నగలు కొంటుంటారా?"
'చీరలు కూడా నేనే తీసుకుంటాను. నా సెలెక్షన్ అంటే మా చెల్లికి చాల యిష్టం. చిన్నప్పుడు కూడా నేను ఎంపిక చేసిన రంగులే నచ్చుతాయి అనేది నా చెల్లి" అంటూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని చెల్లి గురించి మరో అబద్దం చెప్పాడు జయసింహ.
"ఆమెను నాకు పరిచయం చేయండి . మేమిద్దరం స్నేహం చేస్తాం. షాపింగ్ కి వెళ్ళేప్పుడు మీరు కూడా రావచ్చు లెండి" అంది నవ్వుతూ!
"విత్ ప్లెజర్! దానికి అభ్యంతరం ఏముంది?"
"మీ బంగ్లా ఎక్కడుంది?" అని అడిగిందామె ఆసక్తిగా!
ఓ అరక్షణం ఆలోచించాడు జయసింహ.
"నోబుల్ పార్కు దగ్గరే మేము ఉంటున్నాం" అన్నాడు ధైర్యంగా!
'చాల రిచ్ ఏరియాలో ఉంటున్నారు!" ఈ మాట ప్రియాంక కూడ అనటం అతనికి జ్ఞాపకం వచ్చింది. నవ్వుకున్నాడు.
"మీరు కారులో వచ్చారా?"
"తీసుకురాలేదు. ఓ మిత్రునితో కలిసి వచ్చాను. మీరు కలవమని అడ్రసు యిచ్చారు కదా! అది జ్ఞాపకం వచ్చింది. వచ్చేశాను"
"ఈసారి కారులో వచ్చేప్పుడు మీ చెల్లిని కూడా తీసుకురండి"
"ఓ తప్పకుండా! అంతకంటేనా?"
"రేపు సాయంత్రం వస్తారా?"
"వస్తాను. కాని వంటరిగానే! నా సిస్టర్ కి ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయి"
"అలాగే రండి. నా నగలూ, చీరలూ చూపుతాను. సహజంగా ఆడవాళ్ళతో అనవలసిన మాట అతనితో అనేసింది షీనా.
* * *
నీకు అయిన వాళ్ళు ఎవరూ లేరు. నీకే సమస్యలున్నాయి. ఒంటరి వాడివి. ఏమాత్రం ప్రపంచ జ్ఞానం లేని వాళ్ళు ఈ ప్రపంచంలో చాల సుఖంగా మనుగడ సాగిస్తున్నారు.
నువ్వు అనవసరమయిన సమస్యలేవో కావాలని కల్పించు కుంటున్నావని నా అనుమానం!
ఇంతకూ ఏమిటా సమస్యలు" అని అడిగిందామె.
"అవన్నీ మరొకరితో చెప్పగలిగిన విషయాలైతే బహుశా వాటిని త్వరగా పరిష్కరించుకో గలిగేవాడిని అనుకుంటాను"
"సరే! చెప్పోద్దులే! ప్రస్తుతం నీకు డబ్బు కావాలి . అంతేనా?"
'అవును, నువ్వు నా గురించి తెలుసుకుంటున్నావు"
"ఎంత కావాలి ?"
"పది వేలు కావలి అర్జంట్ గా!"
"ఆ మధ్య పదిలక్షలు కావాలన్నావు?"
"అదీ కావాలి! ఇదీ కావాలి!!"
"పదివేలు కావాలంటే నే నివ్వగలను"
"మీరు జాలిపడి యిస్తే నేను ఎలా తీసుకుంటాను. ఆ మొత్తాన్ని తిరిగి మళ్ళీ మీకు ఎలా యివ్వగలను? ఎలాగయినా సంపాదించాలి "
"ఓ అదా సంగతి! అందుకొక మార్గం ఉంది. చెప్పమంటారా?"
"చెప్తే ఆ జన్మాంతం మీకు రుణపడి ఉంటాను"
"అక్కర్లేదు. రుణ విముక్తి అయ్యే దారి" కూడా నేనే చెప్తాను "
"మీరిప్పుడు వరాలిచ్చే దేవతలా కన్పిస్తున్నారు "
"ముఖస్తుతి అపెయ్యండి సార్! నేను చెప్పేది వినండి! ఇవాళ టి.వి లో ఐ వార్త వచ్చింది విన్నారా?"
"పేపరు కూడా చదవలేదు"
"ఏం తీరిక దొరకలేదా!"
"తీరిక దొరికింది. కానీ పేపరు దొరకలేదు. పోవాలనుకున్నప్పుడు చిన్న వస్తువు అయినా అంది రాకపోవటం ఓ విచిత్రం!
ఓ చిన్న పేపరు చూడాలన్న చిన్న కోరిక తీర్చుకోవటానికి ఎన్నో తంటాలు పడ్డాను. ఆ దృశ్యం నాకింకా జ్ఞాపకం ఉంది.
'అయితే కొద్ది గంటల్లో లక్ష రూపాయలు సంపాదించే అవకాశం గురించి మీకింకా తెలియదన్నమాట!"
"లక్ష రూపాయలా! కొద్ది గంటల్లోనా? ఎలా? ఎలా?' యెంతో ఆసక్తిగా అడిగాడు జయసింహ!
"చెప్తాను, కాని అది చాలా ప్రమాదం! మీరు అలాంటి సహసాల్లో తలదూర్చటం నాకు యిష్టం లేదు." అన్నది ప్రియాంక.
"కోరికలు అవసరాలు పెద్దవయినప్పుడు ప్రాణాలను తెగించి సాహసాలు చేయటం తప్పనిసరి!"
"నేను సిద్దంగా వున్నాను. మీకెందుకు సందేహం చెప్పండి. ప్లీజ్---!"
"సాయంత్రం ఆరుగంటల ముప్పయి నిముషాలకి సవాయ్ బార్ కి రండి అక్కడ చెప్తాను " అందాకా గుడ్ బై!"
"థాంక్యూ!' కారు ఆగింది దిగాడు జయసింహ!
"మళ్ళీ మీరు ఎన్ని రోజులు అంతర్ధానమై పోతారో! మళ్ళీ యెప్పుడు కనిపిస్తారో/ అంతా అనుమానమే కదా!"
"కాదు. తప్పకుండా వస్తాను. అది ఎంత సహసామైనా ఆ కార్యక్రమంలో పాల్గొంటాను. లక్ష రూపాయలు సంపాదిస్తాను."
"ప్రాణాలకు తెగించి పోటీలో నిలుస్తారా?"
"నిరభ్యంతరంగా నిలుస్తాను. అది నా అవసరం"
"మీరు లైఫ్ ఇన్సురెన్స్ చేశారా?"
"ఎందుకని ? మీరు ఏజన్సీ తీసుకున్నారా? సారీ చేయలేదు. బహుశా ఎన్నటికి చేయను కూడ"
"ఇప్పుడు మీరేమిటో నాకు అర్ధమయింది. వెళ్ళి రండి"
"సాయంత్రం ఆరు ముప్పైకి మీకోసం సవాయ్ బార్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను."
"బహుశా మీకన్నా ముందే నేను అక్కడుంటాను"
"థాంక్యూ వేరిమచ్!"
ప్రియాంక యాక్సిలెటర్ బలంగా త్రోక్కింది. కనుమరుగై వెళ్ళిపోతున్న కారు వంక చూస్తూ నిలిచిపోయాడు జయసింహ!
అతని మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. వెనుక నించి భుజం మీద చేయి పడటంతో ఉలిక్కిపడి చూచాడు.
అతని ముఖం ఆనందంతో విప్పారింది. కళ్ళు మెరిసాయి!
'మీరు? యిక్కడ? యిలా? వండర్? బట్ హౌ?" అన్నాడు జయసింహ అమితాశ్చర్యంతో కన్నులు పెద్దవి అవుతున్నాయి.
"ఎస్! నేనే! గవర్నమెంట్ హాస్పిటల్ లో ఓ కేసు అటెండ్ అయ్యేందుకు వచ్చాను. అలాంటిదే కేసు. డబ్బు చాల త్వారగా యివ్వగలిగారు. ఆపరేషన్ చేసి తిరిగి వస్తున్నాను."
"కేసు సక్సెస్ అయిందా!"
"ఎందుకు కాదు? సక్సెస్ అయింది. టెలిగ్రాం యిచ్చాను అంద లేదా-----?"
"వచ్చింది . డబ్బు కోసమే తిరుగుతున్నాను "
"ఆలస్యం చేయకు మరి! వెంటనే ఏర్పాట్లు చేసుకుంటే ప్రమాదం నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది "
"వెంటనే ఎంత కావాలి?"
"పదివేలు కావాలి! ఈ అవకాశం కేవలం మూడు వారాలు మాత్రమే! ఆ తరువాత అయినా ఆ మొత్తం కావాలి"
"మీరు ఎక్కడ దిగారు?
"మా బంధువుల యింట దిగాను" అడ్రస్ యిచ్చాడు . దాన్ని తీసుకుని దిగులుగా చూచాడు జయసింహ!
"ఎన్ని రోజులుంటారు?"
"రేపు సాయంత్రం ఆరు పదికి ప్లయిట్! నేను వెళ్ళేసరికి డబ్బు అక్కడుండాలి. లేదా నాతో తీసుకుపోవాలి"
"తప్పకుండా! మీరు వెళ్ళేలోగా అందిస్తాను"
"వెరీ గుడ్! నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా వుంది . నీలాంటి పట్టుదల కలిగిన యువకులు ఏదైనా సాధించగలరు"
