దశమ గ్రహ గ్రహణం
ఊరి పెద్దలు రచ్చబండ దగ్గర కూర్చుని చుట్ట కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
గ్రామంలో అయ్యవారి అమ్మాయి లేచిపోవడం దగ్గర్నుంచి కాశ్మీరులో అల్లకల్లోలం వరకు అన్ని విషయాలు వారి చర్చల్లో దొర్లుతున్నాయి.
దూరాన్నుంచి కరణంగారి పాలేరు కోటేసు వగరుస్తూ వస్తూ కనిపించాడు.
వాడిని చూస్తూనే -
"మళ్లీ ఎవరి కొంపకి నిప్పుపెట్టడానికో కరణం వీడిని ఊరిమీదకి వదిలాడు!" అన్నాడు ఎడ్డినాయుడు నోట్లోంచి చుట్టతీసి తుపుక్కున ఉమ్మివేస్తూ.
"ఈ కరణం ఖబర్ స్థాన్ కి పోతేనే ఈ "దోమాడ" గ్రామానికి పట్టిన పీడ విరగడకాదు!" అన్నాడు పీర్ సాయిబు అసహ్యంగా.
కరణాలలో అత్యధికులకి మంత్రాంగం, తంత్రాంగం మామూలు విషయాలే! తలలు మార్చడం వెన్నతో పెట్టిన విద్యయే!! సమస్యలను సృష్టించి, అవి పరిష్కారం కాకుండా జాగ్రత్త పడుతూ అందర్నీ తమచుట్టూ తిప్పుకుంటుండడం పరిపాటే!
అయితే.... వీటన్నిటితోపాటు దోమాడ కరణానికి మరో క్వాలిఫికేషన్ వుంది. అందరికీ మంచి చేస్తున్నట్లు నటిస్తూ అందరి మధ్యా కొట్లాటలు పెట్టి, వాళ్ళు కొట్టుకు చస్తూంటే చూసి ఆనందించడం ఆయన హాబీ!
ఈ విషయం ఊరివారందరికీ తెలిసినా ఆయన్ని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేకుండడంతో ఎవరూ నోరు మెదిపేవారు కాదు. చాటుమాటున తిట్టుకోవడమేకాని, ఎదుటపడితే అడిగేవారు కాదు. అందువల్ల ఇష్టంవున్నా, లేకపోయినా ఆయన చెప్పినట్లల్లా కీలుబొమ్మల్లా ఆడుతూండేవారు.
కరణంగారికి తగినవాడే ఆయన పాలేరు కోటేసు. కరణం విశ్వామిత్రుడైతే - వీడు నక్షత్రుడు. ఆయన చూసి రమ్మంటే వీడు కాల్చి వచ్చే రకం! భూలోకంలో నారదమహర్షి లేని లోటును వాడు యథాశక్తి తీరుస్తుంటాడు. అందుకనే కోటేసును చూసినా ఊరిప్రజలకు పరమ అసహ్యం.
"ఏమిట్రా.. పందెంగుర్రంలా వగరుస్తూ వచ్చావు?" అన్నాడు చౌదరిబాబు - వాడు దగ్గరికి రాగానే. పట్నంలో ఓ వెలుగు వెలిగించినప్పటి గుర్రప్పందజాల అనుబంధం అనుభవం ఆనకింకా పోలేదు.
"బాబుగోరూ.... మా దొరకు మీదికి వచ్చింది. ఇప్పుడో, మరికాసేపట్లోనో అన్నట్లున్నాడు. ఊరిపెద్దల్ని చూసి మాట్లాడితేనే కాని, ఆరి పానం పోదట. మిమ్మల్నందర్నీ పిలుచుకు రమ్మని నన్ను ఉరుకులెత్తించాడు. బేగి పోండ్రి. నేనింకా మందుకోసం ఆచార్లుగోరి దగ్గరకు పోవాలి!" అంటూ పాఠం అప్పచెప్పినట్లు చెప్పి సమాధానం కోసం చూడకుండా అదే పోక పోయాడు కోటేసు.
"కరణం గారికి వంట్లో బాగాలేదనీ, నాలుగురోజులు నలతగా వున్నాడనుకున్నాం కాని, ఇలా ప్రాణం మీదికి వస్తుందనుకోలేదే! అందుకే ఏ క్షణానికి ఏమొస్తుందో ఎవరూ చెప్పలేరన్నారు పెద్దలు!" అన్నాడు చౌదరిబాబు దివాలా తీసినవాని వేదాంత ధోరణిలో.
"ఏం నాయుడూ.. పోయొద్దాం అంటావా?! ఎంత పాపిష్టిముండా కొడుకైనా చివరిక్షణంలో మనల్ని చూడాలనుకుంటున్నాడాయె!" అన్నాడు చౌదరిబాబు.
"పుఱ్ఱెతో పుట్టిన బుద్ది - పుడకలతోకాని పోదంటారు చౌదరిబాబు! ఈ కరణం పోతూపోతూ కూడా మనకేదో పితలాటకం పెట్టే పోతాడు. అందుకనే వాడి నీడిన్నా నాకు భయమే! వెళ్లేదేమిటి పోదూ....!" అన్నాడు నాయుడు.
"ఆ మాట నిజం! కరణం ఈ జమీన్ మీద సైతాన్. ముదనట్టపోడు పోతే పోనీ...!" అన్నాడు పీర్ సాయిబు బీడీ దమ్ములాగుతూ.
"ఏమిటీ ...అందరూ సీరియస్ గా చర్చించుకుంటున్నారు?" అంటూ వచ్చాడు ఏసుపాదం చేతిలో బైబిల్ పట్టుకుని. ఆయన ఆ గ్రామం చర్చిలో పాస్టర్.
"రా... రా.. నువ్వే తక్కువయ్యావు!" అన్నాడు చౌదరి.
"ఏం లేదు నల్లదొరా.... కరణానికి ప్రాణం మీదికొచ్చిందట. ఇప్పుడే కోటేసుగాడొచ్చి కబురు చెప్పాడు" అన్నాడు నాయుడు.
వాళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు. నిగనిగలాడే అల్లనేరేడు పండు వర్ణంతోపాటు, వేశభాషల్లో ఇంగ్లీషువారిని అనుకరించాలని ప్రయాసపడ్తుంటాడు ఏసుపాదం. తన పేరుని కూడా జాన్సన్ అని మార్చుకునే ప్రయత్నంలో వున్నాడు. అదింకా గెజిట్ పబ్లికేషన్ కాలేదు. ఆ లాంఛనం పూర్తయితే - పాము కుబుసాన్ని విడిచినట్లు ఏసుపాదం నామాన్ని వదిలేసి 'జాన్సన్' అవతారం ఎత్తుతాడు. అందుకే నాయుడు సరదాగా అతన్ని "నల్లదొరా!" అని పిలుస్తుంటాడు. వాళ్లిద్దరికీ వున్న చదువుకొద్దీ అతనేమీ అనుకోడు.
ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ - "దైవ కుమారుడైన ప్రభుఏసు పాపులను క్షమియించును. కరణము గొప్ప పాపములు చేసినవాడైనను క్షమియింపుమని కోరుచో క్షమియించును. ఆయన పరమ దయామయుడు. కనుపోయి చూచుటయే ఉత్తమము" అన్నాడు ఏసుపాదం. నిత్యమూ చర్చిలో అలవాటైన బైబిల్ భాషలో.
"కరణం సామాన్యుడే కాదు, మనల్ని చూడకుండానే ప్రాణం పోయిందంటే దయ్యమై పట్టుకుంటాడు కూడాను!" అన్నాడు చౌదరి నవ్వుతూ.
"ఆవ్.. .ఆవ్... ఆ మాట నిజం!" అన్నాడు పీర్ సాయిబు.
"అయితే పోదాం.... పదండి! ఆలస్యం ఎందుకు.... ఈలోగా చస్తాడో, ఏమో!" అన్నాడు రెడ్డినాయుడు లేస్తూ.
ఆ వెనకనే అందరూ లేచారు.
* * * * *
ఊరిపెద్దలంతా కరణంగారింటికి చేరుకున్నారు.
కరణంగారి ఇంటిముందు వసారాలో నులకమంచం మీద పడుకోబెట్టారు.
ఊరిలోని ఆయుర్వేద వైద్యుడు ధన్వంతరి ఆచార్లుగారు వచ్చి ఏదో నల్లని పొడిని తేనెలో రంగరించి కరణంగారి నాలుకకు రాస్తున్నాడు. చెట్టులేనిచోట ఆముదం చెట్టే మహావృక్షమైనట్లు - ఆ కుగ్రామంలో దేదీప్యమానంగా వెలుగుతున్నాడు ఆచార్లుగారు.
దూరాన్నించి ఆచార్లుని చూడగానే - "నీ చేతిమాత్ర వైకుంఠ యాత్ర! అన్నట్లు అదుగో... ఆచార్లు కూడా వచ్చేశాడు కరణానికి మరణశాసనం రాయడానికి, అంపకాలు పెట్టడానికీ!"అన్నాడు చౌదరి నవ్వుతూ.
అందరూ వెళ్లి కరణం గారి మంచం దగ్గర నిలబడ్డారు.
వీరి రాక చూసి గుమ్మానికి అవతల కూర్చున్న ఆడవారు మరికొంచెం వెనక్కి జరిగారు. కరణంగారి ప్రక్కనే స్టూలు మీద ఆయన తమ్ముడు కూర్చున్నారు.
అతన్ని చూడగానే "ఎలా వుంది?" అని అడిగాడు రెడ్డినాయుడు.
