ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం. కాని అందరి మనస్సుల్లోనూ ఉన్న అనుమానం మాత్రం ఒకటే. "ఉదయం తాము చేసినపని సమంజసమేనా? తప్పు చేశామా? ఒకవేళ తప్పయితే పరిహారం ఏమిటి. ఎవరికి తోచిన విధంగా వారివారి సంస్కారాలననుసరించి లెంపలు వేసుకున్నారు. క్షమించమని మనసులోనే ప్రార్థించారు. కొండకి వస్తామని, తలనీలాలు ఇస్తామని ఇంకా అనేక రకాలుగా మొక్కుకున్నారు. అన్నీ సద్దుబాటయ్యాక, మళ్ళీ మనస్సులో కోపం, కసి మామూలే.
తమ అందరి ఇళ్ళలో ఈ ఇబ్బందులన్నింటికీ వెంకమాంబని 'కష్ట పెట్టడమే' కారణం అనుకున్న వాళ్ళు పరిస్థితులు చక్కబడ్డాక వెంకమాంబే కారణం అనటం మొదలుపెట్టారు.
"చాకలి బూసికి వెంకమ్మబట్టలు ఉతికినరోజున జ్వరం వస్తుందిట."
"వాళ్ళింట్లో మిగిలిన అన్నం పెడితే తిన్నరోజు వరాలుకి కడుపునొప్పి తప్పదుట"
"మొన్నపొద్దున్నే నిద్రలేచి గుమ్మంలోకి రాగానే ఈ మహమ్మారి ముఖం కనిపించిందిట. ఆరోజు పనులన్నీ చెడిపోయి, కాలికి దెబ్బకూడ తగిలిందిట పాపయ్యశాస్త్రిగారికి."
"ఈ వెంకమ్మ మన ఊరికి పట్టినపీడ"
"అరిష్టహేతువు, ఇబ్బందులన్నిటికీ మూలకారణం"
"ఎట్లా వదలించుకుంటాం?"
"ఊర్లోంచి తరిమేస్తే కాని దరిద్రం వదలదు"
ఊరొదిలి పొమ్మనటానికి ఏవంక చెపుదామా అని ఎంత ఆలోచించినా దొరకటం లేదు. అయినా చెప్పటానికి ఎవరికీ ధైర్యం చాలటంలేదు. సంప్రదాయం చట్టుబండలైపోతుంటే ఊరుకోటం అవమానకరంగా ఉంటోంది. తమకన్న పెద్దవారి సహాయం తీసుకుని వారి చేత చెప్పించి అయినా వెంకమాంబ పొగరు, అహంకారం అణిచి బ్రాహ్మణీకాన్ని, సంప్రదాయాన్ని రక్షించాలని కంకణం కట్టుకున్నారు.
ఆ సమయంలో పొరుగూరికి పుష్పగిరి పీఠాధిపతులు వచ్చారనే వార్త తెలిసింది. తమ సమస్యకి పరిష్కారం దొరికిందని సంతోషించారు. తమ ప్రవరలు చెప్పి నమస్కారాలర్పించారు. వారి సనాతన ధర్మ రక్షణని కీర్తించారు. తమ గ్రామాన్ని కాపాడమని ప్రాధేయపడ్డారు. వారిదీక్షానామంలో ఉన్న నృసింహ క్షేత్రమైన తరిగొండ ఘనతని, తమ గ్రామానికి పట్టినపీడని, తమ వాక్చాతుర్యంతో, నటనాచాతుర్యంతో వర్ణించి మరీ చెప్పారు. వేదశాస్త్రాలకి విలువనివ్వక, సంప్రదాయ విరుద్ధంగా ఉన్న వెంకమాంబ ప్రవర్తనని భూతద్దంలో చూపించారు. తమ అశక్తతని ఒప్పుకున్నారు. స్వామివారేదోఒకటి చెయ్యక తప్పదన్నారు.
* * *
వేదసంప్రదాయ పరిరక్షణ దీక్షాకంకణధారులు, దక్షులు అయిన శ్రీశ్రీశ్రీ విద్యానృసింహ భారతీస్వాములవారు తాము తరిగొండకి వేంచేయటం అవసరం అని భావించారు. సోమయాజి, అనుయాయులు స్వామివారిని తరిగొండకి ఆహ్వానించి, వారి విడిదికి కావలసిన ఏర్పాట్లన్నీచేసి, స్వామివారి రాకగురించి ఊరంతా చాటింపు వేయించారు.
అన్నమాట ప్రకారం అనుకున్న రోజున పుష్పగిరిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యానృసింహ భారతీస్వామివారు శిష్యబృందంతో తరిగొండ గ్రామానికి విచ్చేశారు. పూర్ణకుంభస్వాగతాలు, భిక్షలు అందుకుని నృసింహాలయంలో విడిది చేశారు. ఊరిలోని వారంతా స్వామివారిని దర్శించుకుని తమ జన్మ ధన్యం చేసుకున్నారు. ఆరోజు దేవాలయంవైపు తొంగిచూడనిదల్లా కృష్ణయార్యుని కుటుంబం ఒక్కటే! ఎవరి నియమాలు నిబంధనలు వారివి. మన ఇష్టా నిష్టాలని ఇతరులమీద రుద్దకూడదు కదా!
అపరాహ్ణం అయినా తమ దర్శనానికి రాని వెంకమాంబను పిలుచుకురమ్మని శిష్యులని పంపించారు. లేకపోతే వారి రాక వ్యర్థం అవుతుంది. వెంకమాంబ రాకకోసం అందరూ దేవాలయంలో ఉత్సుకతతో ఎదురుచూస్తూ ఉన్నారు. తిరిగి వస్తున్న శిష్యులని చూచి ఉద్వేగ పడిపోయారు. శిష్యులు మాత్రమే తిరిగిరావటం వారికెంతో నిరాశ కలిగింది. వచ్చిన శిష్యుల మొహాలు వాడిపోయి ఉన్నాయి. వారింతవరకు అటువంటి అవమానాన్ని పొందిఉండలేదు. వారు స్వామివారికి నమస్కరించి తలవంచుకుని నిలబడ్డారు.
"ఆ యువతి ఎచ్చట?" స్వామివారు ప్రశ్నించారు.
"రాలేదు స్వామీ!"
"ఎందుచేత?"
"భోజనము చేయుచున్నదట. పూర్తికాగానే తనంతట తానే వచ్చెదనన్నది స్వామీ!"
"మేమామె కొరకు నిరీక్షించవలెనా? ఎంత ధైర్యం? అది అజ్ఞానమా? అహంకారమా?" స్వామివారికి కోపంకన్నా ఆశ్చర్యమే ఎక్కువ కలిగింది. ఆమె విషయం తేల్చి బుద్ధి చెప్పక తప్పదని గట్టిగా నిర్ణయించుకున్నారు.
"వెంకమాంబకోసం ఈ ఊరిదాకా వచ్చినవాడివి. కొంచెంసేపు ఆగలేవా?" అనుకుంది నాంచారమ్మ.
"మొత్తానికి పీఠాధిపతిని మన ఊరు తీసుకువచ్చింది వెంకమాంబ. ఘటికురాలే" పేరిభట్టు మెచ్చుకున్నాడు మనస్సులోనే.
"అది ధైర్యమూకాదు, అజ్ఞానమూ కాదు, పొగరు" అన్నాడు సోమయాజి పళ్ళునూరుతూ.
"కండకావరం" స్వాముల ఎదుట అటువంటి భాష ఉపయోగించకూడదన్న జ్ఞానంకూడా లేకుండా వెనకనుంచి కూశాడొక పండితమ్మన్యుడు. నెమ్మదిగా, గట్టిగాను కూడ దుర్భాషలాడుతూ గలగలా మాట్లాడుకుంటున్నారు. పెద్దల ఎదుట పాటించవలసిన కనీస మర్యాద కూడ మర్చిపోయారు. ఒక్కస్త్రీ ఇంతమందిని లెక్కచెయ్యకుండా ఉందంటే ఆ ధైర్యానికి కారణం తెలుసుకోవాలసిందే అనుకున్నారు స్వాములవారు. వారి అనుభవంలో ఇంత వరకు ఇటువంటి వ్యక్తిని చూచి ఉండలేదు.
ఇంతలో వెంకమాంబ వస్తోందన్న వార్త గుడిలో జనం ఉద్వేగాన్ని పెంచింది. అంతకుముందే చేసుకున్న ఏర్పాటు ననుసరించి ఇద్దరు శిష్యులు స్వామివారికి వెంకమాంబ ముఖం కనపడకుండా అడ్డుగా తెరపట్టుకున్నారు. స్వామివారు జుట్టున్న విధవల ముఖం చూడరుకదా! తాను తెచ్చిన కొబ్బరికాయను తెరకిందనుండి స్వామివారున్న వైపు పెట్టింది.
"నీవు గొప్పపండితురాలనని అహంకరించుంటివట!"
"అటువంటిదేమీలేదు. నేను ఆ శ్రీనివాసునికి దాసిని. అంతే!"
"పిలువగానే రావలయునని తెలియదా? ఆలసించుట అపరాధము కాదా!"
"మీ పిలుపు అందుకునే సమయానికి భోజనం చేస్తూ ఉన్నాను. తింటున్న ఆహారాన్ని వదిలెయ్యటం మహాపాపంకదా! అన్నం పరబ్రహ్మ స్వరూపమని మీకూ తెలుసు. దుర్వార్తలు విన్నప్పుడు కూడ వడ్డించుకున్నది పూర్తి అయినాకనే విస్తరిముందునుండి లేవమంటుంది శాస్త్రం. మీ పిలుపు దుర్వార్తకాదు. శుభవార్త. అందుకని తింటున్న భోజనం మధ్యలో ఆపక, పూర్తిచేసి ఆపై ఒక్కక్షణం ఆలసించక, పెద్దలవద్దకు రిక్తహస్తాలతో రాకూడదని నారికేళ ఫలంతో వచ్చాను.
