Previous Page Next Page 
ప్రార్థన పేజి 31


    "కానీ అరగంట క్రితం కౌంటు కాస్త తగ్గిందన్నారు" అంది వసుమతి ఆశాజనకంగా. ఆ పరిస్థితుల్లో ఆ మాత్రం నమ్మకం కూడా లేకపోతే ఆమె తట్టుకునేట్టు లేదు.

 

    "అవును కాస్త గుణం చూపించింది. కాన్స్-క్యూర్ చాలా పవర్ ఫుల్ మందు. రోజు విడిచి రోజు వాడాలి. కానీ ప్రార్థన శరీరంలో కేన్సర్ గంట గంటకూ వ్యాపించిపోతుంది. అందువల్ల..."

 

    "అందువల్ల... మీరేం చేసేరు?"

 

    కర్కశంగా వెనుకనుంచి కంఠం వినపడేసరికి మహేంద్ర తలతిప్పి భార్గవను చూసేడు. భార్గవ ప్రార్థన గదిలోంచి బయటకొచ్చి గుమ్మం దగ్గర నిలబడి వున్నాడు. అతడి కళ్ళు ఎర్రగా వున్నాయి. గదిని, గదిలో డాక్టర్లని ఎలక్ట్రికలు పరికరాల్నీ చూస్తేనే అతడికి జరిగింది అర్థమయింది.

 

    మహేంద్ర భార్గవని చూసి, సంతోషంతో "ఓ, మీరూ వున్నారా? గుడ్" అన్నాడు.

 

    భార్గవ నవ్వలేదు "ప్రార్థన సడెన్ అర్సిత్ మియాకి కారణమేమిటి?" అని అడిగాడు సూటిగా.

 

    మహేంద్ర ఇబ్బందిగా చూసి, "వెల్-మీరూ డాక్టరే. మీకు తెలియనిదేముంది? ప్రార్థన కౌంట్ చాలా త్వర త్వరగా లక్షవైపు సాగిపోతూంది. ఏం చెయ్యాలో- దాన్ని ఎలా ఆపుచెయ్యాలో తోచటంలేదు. కాన్స్- క్యూర్ డబుల్ డోస్ ఇచ్చాను. దాంతో ఆమె గుండె వెంటనే రియాక్ట్ అయింది. అఫ్ కోర్స్... ఇలాంటి తాత్కాలికమైన సైడ్- అఫెక్ట్స్ సాధారణమే. ఒక్కసారి అసలు రోగం తగ్గిపోతే మిగతావి వాటంతట అవే కంట్రోల్ అయిపోతాయి. ఈ జుట్టు రాలటం- చర్మం చిట్లిపోవటం వగైరా..." అన్నాడు.

 

    "నేనడిగిన ప్రశ్నకి ఇంత వివరణ అనవసరం" అన్నాడు భార్గవ. అతడికి ఇంకా తన కూతురి బలహీనమైన స్వరం ఆర్థ్రంగా అరవటం వినిపిస్తూనే వుంది. తలచుకున్న కొద్దీ ఇరిటేట్ అవుతున్నాడు. "నేనడుగుతున్నది నా కూతురిలో ఇంత రియాక్షన్ ఎలా వచ్చిందీ అని".

 

    "చెప్పానుగా, కాన్స్- క్యూర్ డబుల్ డోస్ వాడేమని"

 

    "కానీ కాన్స్ -క్యూర్ లాటి పవర్ ఫుల్ మందు ఒక డోసు వేస్తే కనీసం ఇరవై నాలుగ్గంటలు వేచి చూడాలి కదా?"

 

    మహేంద్ర అవునన్నట్టు తలూపి- "మామూలు కేసుల్లో అయితే అలాగే చూడాలి. కానీ ఇది అబ్ నార్మల్ కేసు, అందుకని డబుల్ డోస్ ప్రయోగించి చూసేను" అన్నాడు.

 

    "ప్రయోగించి చూసేరా" భార్గవ కంఠం కీచుమంది. "నా కూతురు బాతుగానీ, కోతిగానీ కాదు డాక్టర్- మీరు ప్రయోగాలు జరపటానికి" అన్నాడు వెటకారమూ, కోపమూ మిళితమైన స్వరంతో.

 

    వసుమతి చప్పున అతడి దగ్గరకి వెళ్ళి అనునయిస్తున్నట్టుగా "ఏమండీ" అంది. అతడు ఆమెని పట్టించుకోకుండా, "నా కూతుర్ని ఇక్కడ చేర్పించింది రోగం నయం కావటానికి. అంతేకానీ, మీరు ప్రయోగాలు చెయ్యటానికి కాదు. నా కూతురికి ఇంతవరకూ ఏ గుండెజబ్బూ లేదు. మీ ప్రయోగం వల్ల అదొచ్చింది. దీనికి మీరేం సంజాయిషీ చెప్తారు" అన్నాడు.

 

    మహేంద్ర ఒక అడుగు ముందుకువేసి, తాపీగా అన్నాడు- "ఒకటే సంజాయిషీ! మా ట్రీట్ మెంట్ మీకు నచ్చని పక్షంలో ఇక్కణ్ణించి ఇంకో అన్ కాలజిస్టు దగ్గిరకో లేకపోతే డైరక్టుగ శ్మశానానికో తీసుకెళ్ళమని".

 

    "ఏమిటి - ఏమన్నారు మీరూ" అని భార్గవ అడుగు ముందుకు వేసేడు.

 

    వసుమతి భయభ్రాంతురాలై "నో" అని అరుస్తూ వాళ్ళిద్దరి మధ్యకు వెళ్ళింది.

 

    మహేంద్ర తాపీగా- "చెప్పండి, తీసుకెళ్ళిపోతారా?" అని రెట్టించాడు. వసుమతి కంగారుగా "లేదు... లేదు" అంటూ అతడి దగ్గరగా వెళ్ళి "డాక్టరు గారూ! ప్లీజ్" అంది. అతడు ఆమెను పట్టించుకోకుండా భార్గవతో, "చెప్పండి" అన్నాడు ఇంకొకసారి. వసుమతి చేతిలో మందు చీటీ వుంది.

 

    అతడు తాపీగా ఆ చీటీ అందుకుని మడత విప్పి చూసేడు.

 

    కాన్స్- క్యూర్.

 

    అతడు తిరిగి దాన్ని మడతపెట్టాడు.

 

    తనకందిస్తున్నాడేమో అనుకుని ఆమె చెయ్యి సాచింది. అతడు ఆ చీటీని ముక్కలు ముక్కలుగా చింపి వరండా గోడమీద నుంచి క్రింది విసిరేసేడు. ఆమె అవాక్కయి, ఏదో అనబోతూ వుంటే అతనే అన్నాడు. "తెచ్చినవన్నీ సర్దు- వెళ్ళిపోదాం".

 

    "ఎ... ఎక్కడికి?"

 

    "ఇంటికి .... పాపని తీసుకుని".

 

    మళ్ళీ ఇదేమిట్రా భగవంతుడా! అనుకుంటూ అతడివేపు బేలగా చూసింది. భార్గవ జుట్టు చిందరవందరగా వుంది. పెరిగిన గడ్డం- కళ్ళ క్రింద ముడతలు... దాదాపు పిచ్చివాడిలా వున్నాడు. "ఇక్కడంతా డబ్బు! డబ్బు!! ఇది ఆస్పత్రి కాదు, డబ్బుల్ని పిండే కార్ఖానా... పదండి... ప్రార్థనని తీసుకొని వెళ్ళిపోదాం" అని అతడు అంటూ వుండగా లోపల్నించి మహేంద్ర వచ్చాడు. భార్గవ అతడితో "మేము మా పేషెంట్ ని తీసుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాము" అన్నాడు.

 

    మహేంద్ర విస్మయంతో "... ఎక్కడికి?" అని అడిగాడు. రాష్ట్రంలో ఇంకో కేన్సర్ ఆస్పత్రి లేదు... దేశంలోకెల్లా అదే గొప్ప ఆస్పత్రి.

 

    "ఎక్కడికి తీసుకెళతారు"?

 

    "శ్మశానానికి. ఇక్కడికన్నా అదే మంచిది".

 

    డాక్టర్ మొహం ఎర్రగా మారింది. "నా కభ్యంతరం లేదు. వెంటనే డిశ్చార్జ్ చేస్తాను" అన్నాడు. వసుమతి కంగారుగా "ఆయన మాటలు పట్టించుకోకండి" అంది. ఇద్దరూ ఒకర్నొకరు శత్రువుల్లా చూసుకున్నారు.

 

    "లేటెస్ట్ కౌంట్ ఎంత?" భార్గవ అడిగాడు వ్యంగ్యంగా. అతడి కంఠంలో హేళన గుర్తించకుండా, "58,000" అన్నాడు మహేంద్ర సిన్సియర్ గా.

 

    అతడు వసుమతివైపు తిరిగి, "చూసేవా, రెమిషన్ కాదుకదా- కాన్ స్టన్నీ కూడా సాధించలేకపోయారు. ప్రొద్దున్నకి కౌంట్ 65,000 అవుతుంది. అంటే రోజుకు 15,000 చొప్పున పెరుగుతున్నాయి. ఈ లెక్కన ఇంకో మూడు రోజులు బ్రతుకుతుంది నా కూతురు. దీన్ని ఆపు చెయ్యటం కోసం ఈ రోజు డబుల్ డోస్ వాడారు వీళ్ళు. వీళ్ళదేం పోయింది! రేపు మూడు డోసులు వాడతారు. గుండె కాలిపోయి, స్ల్పీన్ కరిగిపోయి బాధపడేది నా కూతురు..." అంటూ ఒక నిశ్చయానికి వచ్చినట్టూ అతను అన్నాడు. "-ఆఖరు రోజుల్లో నా కూతురు ప్రశాంతంగా మరణించాలని కోరుకుంటున్నాను. అందుకే ఈ నరకకూపం నుంచి తీసుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను".

 

    మహేంద్ర అతడివైపే సూటిగా చూస్తూ "మీకు మతిపోయింది" అన్నాడు. "ఇంకెవరైనా ఈ మాట అని వుంటే అరెస్ట్ చేయించి వుండే వాణ్ణి".

 

    "నాకు కాదు పోయింది, మీకు! మీ అందరికీ!! నా కూతురికి నయం కాదు. మీరందరూ వేయి గొంతుకల్తో కాదన్నా అది పచ్చి నిజం"

 

    "మీరంత నిశ్చయంగా ఎలా చెప్పగలరు?"

 

    "కెమోథెరపీ మీద నాకు నమ్మకం లేదు కాబట్టి".


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS