Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 31


    అటు దీపికగారి విషయం పెళ్ళయ్యాక ఆవిడ ఇష్టాలు చెల్లుతాయా? ప్రొఫెసర్ గారి చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేస్తానంటే ఆ వచ్చేఅతను అంగీకరిస్తాడా! నోర్మూసుకుని ఇంట్లో కూర్చో అంటారు. పోనీ  ఒకవేళ అతను అంగీకరించినా పెళ్ళి అయేక, పిల్లలూ జెల్లలూ  జరిజాటం ఎలా వీలవుతుంది?

    ఇలా మీ అసిస్టెంట్స్ ఇద్దరూ కాస్త ముందూ వెనగ్గా ఒకేసారి మనిమానేస్తే, మీ పరిస్థితి ఏమౌతుంది? మేము సేకరించిన సమాచారం నోట్  చేసుకునేసరికే రోజు సరిపోతుంది మీకు.  మరి మేము లేకపోతే ఎలా? ఇన్నాళ్ళూ కష్టపడి చేసింది అంతా వేస్ట్ అయిపోదూ?" అన్నాడు.

    భవిష్యత్తు అంధకారం అయిపోగా గడగడ వణికిపోయారు ప్రొఫెసర్ గారు. "మరేమిటి దారి మోహన్?" దీనంగా అడిగారు.

    "ఒక్కటే మార్గం వుంది!" అంటూ ఆ మార్గం వివరించాడు.

    ప్రొఫెసర్ గారి మొహం మళ్ళీ కళకళలాడింది "శభాష్ యిది మంచి ఆలోచన" అన్నారు ఆనందంగా.

    "ఆలోచన మంచిదే కానీ జరిగే మార్గం కనబడటం లేదు. దీపికగారికీ, యిష్టమేకానీ, వాళ్ళ నాన్నకీ యిష్టం లేదు నన్ను చూడగానే కర్ర పుచ్చుకుని వెంటపడతాడాయన. వాళ్ళ అన్నయ్యేమో తన చెల్లిలివంక చూస్తే నరికేస్తానన్నాడు. పోనీ వాళ్ళకి తెలీకుండా రహస్యంగా పెళ్ళి చేసుకుందాం అనుకుంటే దీపిక అంగీకరించడం లేదు."

    "ఎలా అంగీకరిస్తుందయ్యా? తప్పుకాదూ!"

    "తప్పేమరి. కాదన్నానా? కానీ  ఏం చేస్తాం లోక కాల్యాణంకోసం తప్పదు మరి!"

    "ఏమీ దండెత్తాడు. అసలయినా ఓసారి పెళ్ళయి పోయేక యెవరేం అన్నా  ఫర్వాలేదు."

    "సరే మరి! నీ యిష్టం!"

    "నా యిష్టంతో పని గడవదు. మీరు దీపికకి చెప్పిఒప్పించండి!" అన్నాడు మోహన్.

    ఆ సాయంత్రం దీపికని పిలిపించి నచ్చచెప్పారు పృధ్విగారు. "మోహన్ యెలాచెప్తే అలా చెయ్యమ్మా. అతను సాక్షాత్తూ మన పాలిట దేవుడు" అన్నారు "సరే సార్. మీరు చెపుతున్నారు కాబట్టి అలాగే చేస్తాను." అంది దీపిక.

    పక్కనే వున్న  మోహన్ గుండెనిండా ఊపిరి పీల్చుకున్నాడు "నీ  మూఢ గురుభక్తి పుణ్యమా అని నా పని తేలిక అయింది" అనుకున్నాడు.

    దీపికని పక్కకి పిల్చుకు వెళ్ళి ఏం చెయ్యాలో ఎక్కడికి రావాలో అన్నీ వివరంగా చెప్పాడు. శ్యామ్ దగ్గరికి వెళ్ళి  అతని చెవిన ఈ వార్త వేశాడు "జాగ్రత్త  పరమహస్యం" అన్నాడు.

    "మీకేం భయంలేదు. ఎవరికీ చెప్పను" హామీ ఇచ్చాడు శ్యామ్.

    ఆ రోజూ రాత్రి భోజనాలు అయ్యాక మావయ్య పక్కనజేరాడు మోహన్. కాసేపు ఆ మాటా ఈ మాటా చెప్పాడు.

    "మామయ్యా మన పక్కింటి సత్యంగారికి వేపకాయంత వెర్రిగానీ వుందా?" హఠాత్తుగా అడిగాడు.

    "వేపకాయంత ఏం ఖర్మ గుమ్మడికాయంత వెర్రి ఆ వెధవకి అయినా ఇప్పుడు వాడిగోల ఎందుకు?" విసుక్కున్నాడు సూర్యంగారు.

    "ఆ ఏం లేదులే! ఈ మధ్య ఓ తమాషా జరిగింది?"

    "ఏమిటది?" కుతూహలంగా అడిగాడు.

    "మళ్ళీ ఎవరితో నూ అనకు."

    "అనను"

    "ఆ సత్యంగారి కూతురు దీపిక లేదూ! ఆవిడ ఎవరినో లవ్ చేసిందిట. ఆ అబ్బాయి పాపం చాలా మంచి వాడు ఎంతో బుద్దిమంతుడు. కానీ కట్నం అడగటంలేదు. పెళ్ళి చెయ్యండి చాలు అంటున్నాడు. కానీ ఆయనేమో అంగీకరించడంలేదు."

    "ఏం! మాయరోగమా? తల్లక్రిందులుగా తపస్సు చేసినా యింతకంటే మంచి సంబంధం తను తేగలడా? పాపం ఆ యిల్లాలు  పిల్ల పెళ్ళి విషయంలో దిగులు పడిపోతోంది.

    "అవును మామయ్యా! ఆవిడ పెళ్ళిళ్ళ మాట ఎత్తేతే మండిపడిపోయి యిప్పుడిప్పుడే పెళ్ళి చెయ్యను అన్నాడుట."

    "వాడా మొండి వెధవ. మొదటినించీ అంతే. వాడికి తోచి ఏడవదు. యింకోళ్ళు చెప్తే వినడు" విసుక్కున్నాడు ఆయన.

    "అందుకని ఇవుడా అబ్బాయి ఈ అమ్మాయి కలిసి ఓ ప్లాను వేసుకున్నారుట. గప్ చిప్ గా పెళ్ళి చేసుకుందాం అనుకున్నారుట."

    "శభాష్, మంచిపని చేస్తున్నారు. పెద్దవాళ్ళు యిలాంటి మొండి వెధవలైతే పిల్లలు అలాగే చెయ్యాలి మరి!"

    "కానీ ఓ చిక్కొచ్చి పడింది. గుళ్లో పెళ్ళి జరిగే సమయంలో ఈ సత్యంగారు వెళ్ళి సైంధవుడిలా ఎక్కడ అడ్డంపడిపోతాడో అని భయపడుతున్నాడు అతను. నువ్వు సాయం చెయ్యాలి మామయ్యా. ఆ పెళ్ళి అయ్యేదాకా ఈయన ఇంట్లోంచీ కదలకుండా చూసుకోవాలి" బ్రతిమాలాడు మోహన్.

    ఆయనమొహం విప్పారింది. అది గమనించి మళ్ళీ మొదలు పెట్టాడు మోహన్. "ఈ పనికి నువ్వే  సమర్ధుడివి. ఎలాగయినా ఈ సాయం చేశావంటే నిన్ను జన్మంతా తల్చుకుంటారు ఆ దంపతులు" అన్నాడు.

    ఆయనకీ మహా హుషారు వచ్చేసింది. ఈ దెబ్బతో ఆ వెధవ తిక్క కుదురుతుంది. తగిన శాస్తి జరుగుతుంది. లేకపోతే తననిచూసి ఒకటే ఏడుపు తనకు లాట్రీ వచ్చిన దగ్గరనించి లోలోపల కుళ్ళుతున్నాడు. తనకీ ఐశ్వర్యం అభిస్తుంది దానితో తను కూడా మేడా అదీ కట్టేద్దాం అని ఆరాటపడ్డాడు సన్నాసి. దీపిక వాడిని ఎదిరించి పెళ్ళి చేసుకుంటే చెప్పెట్టికొట్టినట్లు అవుతుంది! అనుకుని ఆనందపడ్డాడు.

    "ఒరే మోహన్! వాడి విషయం నేను చూసుకుంటాను. ఆవిషయం నా కొదిలేసి నిశ్చింతగా మిగిలిన ఏర్పాట్లు చేసుకోమను అతన్ని యింతకీ పెళ్ళి ఎప్పుడు?" అన్నాడు.

    "ఎల్లుండిపొద్దున పదింటికి!"

    "సరే ఎల్లుండి తెల్లారిన దగ్గరనించి వాడు బయటికి రాకుండా చూసుకునే బాధ్యతనాది!" హామీ ఇచ్చేశాడు ఆయన.

    "పెళ్ళికాగానే దంపతులు ఆయన దగ్గరికి వస్తారు. ఆ తరువాత ఆయన యెంత అరిచిన ఏమీ లాభం వుండదు" అన్నాడు.

    "అవును పిచ్చికుక్కలాగా అరిచేస్తాడు, గింజుకుంటాడు, బి.పి రైజైపోతుంది వెధవకి!" ఆ సీన్ ఊహించుకుని మహొత్సాహపడిపోయారు సూర్యంగారు.

    తండ్రి కాళ్ళునొక్కుతూ కూర్చుంది దీపిక. రాత్రి పదిదాటింది. అందరూ నిద్రపోతున్నారు. తండ్రీ కూతుళ్ళు మాత్రం మెలకువగానే వున్నారు లంకెబిందెల గురించి గుసగుసలాడుతున్నారు.

    "నాన్నా మామయ్యని భారతికోసం వాళ్ళ స్నేహితుడి కొడుకునే సెటిల్ చేశారుట మీకు తెలుసా?" అంది హఠాత్తుగా.

    రుపరుసలాడాడు ఆయన. "ఆ వెధవ సంగతి ఇప్పుడు ఎందుకమ్మా ఆ ఒళ్ళుపొగరు సన్నాసి పేరెత్తితేనే కారం రాచుకునట్లు వుంటుంది నాకు" అన్నాడు.

    "అవుననుకోండి నాన్నా! యిప్పుడో చిన్న సమస్య వచ్చింది"

    "ఏమిటమ్మా?"

    "భారతికి నిశ్చయంచేసిన అబ్బాయి వున్నాడు కదా!"

    "ఆ వున్నాడులే! మామగారికి తగిన అల్లుడు. వాడో తిక్కశంకరయ్యా వాడిఅల్లుడుఅంతకంటేతిక్క శంకరయ్యా. ఇల్లిల్లూ తిరుగుతూ ఏవిటో పిచ్చి ప్రేలాపనలు చేస్తూ వుంటాడు" ఎగతాళిగా అన్నాడు స్యతం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS