డాక్టర్లు కంగారుగా ఇటూ అటూ తిరుగుతున్నారు. శిల్ప ఇంకా రాలేదు.
వాన మరీ పెద్దదయింది! ఈ వర్షంలో, రహీం శిల్పని ఎలా తీసుకొస్తాడో! ఏమో! సిస్టర్ ఫెర్నాండిస్ కంగారు పడుతోంది.
రాగిణిని మరో అయిదు నిమిషాల్లో తీసుకొచ్చి మంచంమీద పడుకోబెట్టారు. "అప్పుడే ఆపరేషన్ అయిపోయిందా?" అడిగింది సిస్టర్ ఫెర్నాండిస్. "చెయ్యడంలేదు" కంగారుగా వెళ్లిపోయింది డాక్టరు.
మరో డాక్టరు బి. పి. మళ్లీ చూస్తున్నాడు! ఇంకో డాక్టరు మళ్లీ ఏదో ఇంజక్షనిచ్చాడు. శి....ల్ప.....శి.....ల్ప..... నూతిలోంచి వస్తున్నట్టుంది ఆమె గొంతు.
"సిస్టర్! శిల్పని పిలిపించండి" అంది డాక్టర్....."వస్తోంది డాక్టర్! కండిషన్ ఎలా వుంది? ఆపరేషన్ అవసరం లేదా?" సిస్టర్ మాటలు వినిపించుకోకుండా పరుగెత్తింది డాక్టర్ మంచందగ్గరికి.
రాగిణి ఊపిరందడంలేదు. ఎక్కిళ్ళు వస్తున్నాయి. డాక్టర్! అంటూ మరో డాక్టరిని పిలిచింది.
అతనొచ్చి 'పల్స్' చూశాడు! అందరూ కంగారుగా మంచం దగ్గర నుంచున్నారు.
"ఓ గాడ్! అసలు ఎందుకిలా చేస్తావు నువ్వు? ఎండిపోయిన ఆమె బ్రతుకికి ఆశలు కల్పించావు. కమ్మని కలలు కంటూ, తేలిపోతూన్న సమయంలో, ఇలాంటి పనిచేశావ్! ఆమెరి రక్షించు ప్రభూ! ఆమెని రక్షించు!" అంటూ భగవంతుణ్ణి ధ్యానిస్తోంది సిస్టర్ ఫెర్నాండిస్.
ఉరుములూ మెరుపులు. వాన మరీ పెద్దదైంది. మధ్య మధ్య వుండుండి పిడుగులు పడుతున్నాయ్! సిస్టర్! ఏవో ప్రార్ధనలు చేస్తోంది.
"డాక్టర్! శిల్ప వచ్చేస్తుంది. వర్షం వల్ల ఆలస్యమయి ఉంటుంది. రాగిణి కండిషన్ ఎలా వుంది? ఎంత డబ్బయినా సరే, ఆమెకి ఏ ప్రమాదమూ రాకుండా చూడండి" పిచ్చిదానిలా మాట్లాడుతోంది సిస్టర్ ఫెర్నాండిస్.
ఆమె మాటలు ఎవ్వరూ వినే స్థితిలో లేరు. ఎవరి హడావుడిలో వాళ్లున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. రాగిణి పర్సులో వున్న ఉత్తరాలన్నీ తీసి చదివింది సిస్టర్ ఫెర్నాండిస్. గుండె నీరైపోయింది. వెంటనే బయలుదేరి రమ్మని, టెలిగ్రాముతో పాటు ఉత్తరం కూడా రాసేసి, ఆసుపత్రి ఆవరణలోనే వున్నపోస్టు డబ్బాలో వేసేసింది.
'ఆసుపత్రి ఆవరణలోనే ఒక పోస్టాఫీసూ, ఒక బ్యాంకూ, ఒక కాఫీ హోటలు, పుస్తకాల దుకాణం వుండడం ఎంత అవసరమో' అనుకుంది. మనస్సు మనస్సులో లేదు. గేటుదాకా నడుచుకుంటూ వెళ్లింది. రహీం శిల్పాని తీసుకొస్తున్నాడేమో చూడ్డానికి!
"గేటుదాకా వచ్చినవాళ్లు లోపలికి రారూ! మనస్సులో ఆత్రుతగా వున్నప్పుడు అన్నీ అలా అనిపిస్తాయి." అనుకుంది. పసిపిల్లలా ఆలోచిస్తున్నందుకు, తనలో తనే నవ్వుకుంది సిస్టర్!
"డాక్టర్! ఏమీ అనుకోవద్దు. ఇన్నిసార్లు అడుగుతూన్నందుకు? ఆమెకేమీ ప్రమాదం లేదుకదా?" మంచందగ్గరికి వెళ్లింది సిస్టర్ ఫెర్నాండిస్. డాక్టర్, రాగిణి పల్స్ మరోసారి చూశాడు! గుండెని కొట్టి చూశాడు! మొహాన తెల్లగుడ్డ కప్పేశాడు! ఐ... యామ్... సారీ..... సిస్టర్!" అన్నాడు. బయట టాక్సీ ఆగింది రహీం, సిస్టర్ లిల్లీ, అవినాష్, శిల్పలని తీసుకుని, గబగబా లోపలికొచ్చాడు
సిస్టర్ ఫెర్నాండిస్ రాగిణి మొహంమీంచి బట్టలేపింది. శిల్పని మంచం దగ్గరికి తీసికెళ్లింది, భుజాలు పట్టుకుని, శిల్ప మాట్లాడలేదు. తల్లి శవంమీదపడి భోరుమని ఏడవలేదు! అలా గుడ్లప్పగించి, తల్లి కేసి చూస్తూ నుంచుంది. రహీం వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. సిస్టర్ లిల్లీ, సిస్టర్ ఫెర్నాండిస్ కర్చీపుతో కళ్లు తుడుచుకున్నారు.
"శిల్పా! నువ్వు ఒక్క నిమిషం ముందొస్తే చూసేదానివి అమ్మని! నీకోసం, కలవరించి, కలవరించి, కళ్లుమూసింది." అంది ఏడుస్తూనే శిల్పని ఓదారుస్తూ సిస్టర్ ఫెర్నాండిస్.
శిల్ప మాట్లాడలేదు! ఏడవలేదు!
డాక్టర్లు శిల్పని చూశాడు. "ఈమేనా శిల్పా!" అడిగింది లేడీ డాక్టరు
"అవును! అంది సిస్టర్.
"ఈమె కూతురా? పాపం! ఈమె లాగానే వుంది."
సిస్టర్ ఫెర్నాండిస్ కళ్లు తుడుచుకుని శిల్పకేసి చూసింది శిల్ప కంట్లో ఒక్కచుక్క నీరులేదు! "శిల్పా!..... శిల్పా!...." పిలిచింది సిస్టర్ ఫెర్నాండిస్. శిల్ప మాట్లాడలేదు, అవినాష్ బయటికెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. "శిల్పా! మమ్మీ నిన్ను చూడాలని వొచ్చింది. దారిలో ఏక్సిడెంట్ అయింది!"
శిల్పలో చలనం లేదు.
"డాక్టర్!..... డాక్టర్! శిల్పని చూడండి ఏడవడంలేదు! మాట్లాడడం లేదు! రాయిలా వుండిపోయింది." కంగారుగా చెప్పింది "సిస్టర్ ఫెర్నాండిస్ ఆ అమ్మాయికి 'షాక్' వచ్చినట్టుంది!" అంటూ డాక్టర్ శిల్ప దగ్గరికొచ్చి ఏక్సిడెంటు ఎంత ఘోరంగా జరిగిందీ, ఆమె శిల్పా..... శిల్పా..... అంటూ ఎంత ఎదురుచూసి, ఎదురుచూసి కన్ను మూసిందీ వర్ణించింది.
