Previous Page
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 32


    శిల్ప కంట్లో నీళ్లు తిరిగాయి!
    "ఈ అమ్మాయిని తీసుకెళ్లండి" అంది డాక్టర్. సిస్టర్ ఫెర్నాండిస్ శిల్ప భుజాలు పట్టుకుంది. 'వెళ్దాం' రమ్మన్నట్టుగా పిలిచింది.
    "నో.... నో.... నేనురాను!.... నేనురాను!..... ఐ.... లవ్.... మై..... మమ్మీ.....! మా అమ్మ..... నా ప్రాణం.....! మమ్మీ....! కుంతి కర్ణుణ్ణి చూడకుండా, కర్ణుడితో మాట్లాడకుండా చచ్చిపోలేదు మమ్మీ! నువ్వెందుకు నన్ను చూడకుండానే చచ్చిపోయావు......? ఆసుపత్రి దద్దరిల్లేలా ఏడ్చింది శిల్ప!
    వాన  మరీ పెద్దదయింది. 'ఆకాశం చిల్లిపడిందా? లేకపోతే దేవతలు కూడా ఈ దారుణానికి ఏడుస్తున్నారా?' అనిపించేలా!
    "అవినాష్! శిల్పని పిలువు?" అంది సిస్టర్ ఫెర్నాండిస్!
    అవినాష్ శిల్ప దగ్గరకెళ్ళాడు. చెయ్యిపట్టుకుని, వెనక్కి తీసుకొచ్చాడు.
    శిల్ప బొమ్మలానడిచి అవినాష్ వెనకాలే వచ్చింది. గాలివానకి, ఊరు ఊరంతా లైట్లు పోయాయి. చిమ్మ చీకటి! శిల్ప గుండెలనిండా కటిక చీకటి!!
    శిల్ప మాట్లాడదు! ఏమడిగినా సమాధానం చెప్పదు! అన్నిటికీ నిలువునా, అడ్డంగా తలూపుతుంది! "సిస్టర్! శిల్ప చేత మాట్లాడించడమెలాగో నాకు అర్థంకావడంలేదు" అంది సిస్టర్ లిల్లీ! సిస్టర్ ఫెర్నాండిస్ మళ్లీ పుస్తకాలు తిరగేసింది. "సిస్టర్! మా శిల్పని మామూలు పిల్లలాగా తయారుచెయ్యండి! ప్లీజ్!" కోటయ్యగారి మాటలు, సిస్టర్ ఫెర్నాండిస్ ఆలోచిస్తోంది! శిల్ప ఎలా మారుతుంది? ఏం చెయ్యాలి? ఇవే అహోరాత్రులు ఆమెని వేధించే ప్రశ్నలు.
    కోటయ్యగారికి మెరుపులాంటి ఆలోచనవచ్చింది. భరణినీ, పిల్లలనీ కొన్నాళ్ళకోసం ఇండియాకి రమ్మనమని రాశారు!
    నెలరోజుల్లోగా వారి దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది. కాశ్యప్, రామానుజంగారు అందరూ బయలుదేరి వస్తున్నట్లు.
    దీనూ, దివ్యా ఆటలు శిల్పకి తమాషాగా అనిపిస్తున్నాయ్! వాళ్లు ఆడుకుంటూవుంటే తమాషాగా చూస్తూంది. వాళ్లు తప్పటడుగులు వేస్తూ పడుతూ లేస్తూ వుంటే నవ్వుతూ చప్పట్లు కొడుతుంది. వాళ్లు పాటపాడుతూ వుంటే, తనూ శృతి కలుపుతుంది!
    భరణి శిల్పని గుండెలకి హత్తుకుంది. శిల్ప ఆలింగనంలో రాగిణి చూసింది! కోటయ్యగారి సలహా ప్రకారం, "భరణివాళ్ళు హైదరాబాద్ తిరిగి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు." శిల్ప పలకలేదు. బండరాయి కాకూడదు! రాయిని కూడా పలికించి శిల్పంచేయాలి!" కోటయ్యగారి కోరిక! రామానుజంగారి కళ్ళల్లో తడి ఆరలేదు. కాలం గడుస్తోంది! గడుస్తూనే ఉంది! ఎవ్వరికోసం ఆగదు!
    "దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి!"
    "చేతులుకాలాక్ ఆకులు పట్టుకుంటే లాభంలేదు.
    గట్టిగా చదువుతున్నాడు, అవినాష్, మర్నాడు జరగబోయే సామెతల పోటీలో పాల్గొనడానికి, తాతగారు రాసిచ్చిన సామెతల లిస్టుని!! "ఒరేయ్! కోటయ్యా! ఏమిటిరా ఈ పిచ్చి పిచ్చి సామెతలు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా? ఎలా? 'ఫేట్' అంటే 'ఖర్మ' 'విధి' అనే అన్నింటికంటే పవర్ ఫుల్ రా! ఆ దీపం ముందు యివన్నీ ఎంత? ఆ దీపం వెలగాలి! అది ఆరిపోతే, ఇల్లేం చక్కబెట్టుకుంటావ్? ఆ దీపానికి 'స్విచ్' మనచేతుల్లో లేదోయ్! కనబడని హస్తం దాన్ని వేస్తుంది ఆర్పుతుంది" రామానుజంగారు ఆ సామెతలని చూసి ఎగతాళిగా నవ్వారు.
    కోటయ్య గుడ్లనిండా నీరు నిండింది! "నువ్వు చెప్పింది నిజమేరా?" అన్నారు కళ్ళు తుడుచుకుంటూ.
    అవినాష్ చదువుకుంటూనే ఉన్నాడు.....! శిల్ప, దీనూ దివ్యాలతో పాటు వారు పాడే పాటకి  తాళం వేస్తూ ఆ గీతాన్ని ఆలపిస్తూ ఉంది మౌనంగా!
    ఉన్నట్లుండి గబగబా వెళ్లి, రాగిణి పెట్టి తెరిచింది శిల్ప అందులోంచి ఆమె దాచుకున్న గజ్జెలను తీసింది. చేత్తో ఊపింది. ఘల్లు ఘల్లుమన్నాయి గుండెలు ఝాల్లుమనేలా!
    మళ్ళీ  ఊపింది....! ఇంకా ఊపిందో....! ఘల్లు ఘల్లుమన్న శబ్దం గదంతా మారుమ్రోగింది. దీనూ, దివ్యా  ఆ శబ్దానికి చప్పట్లుకొట్టి గంతులేస్తున్నారు.  శిల్ప నవ్వుతూ  ఆ గజ్జెలను కాళ్ళకు కట్టుకుంది. తనకు నచ్చినట్టు అడుగులు వేసింది. ఆ మువ్వల గలగలల్లో శిల్పకి  రాగిణి నవ్వులు వినిపించాయి! అడుగులు వేస్తూనే ఉంది ఇంటిల్లిపాదీ ఆ మువ్వల గలగలలు విని పరిగెత్తుకొచ్చారు. దీనూ, దివ్య కూడా అడుగులు వేస్తూ, చప్పట్లు కొడుతున్నారు. శిల్పకి ఇదంతా తెలీడం లేదు. ఆ మువ్వలలో మురిపించే తల్లి  నవ్వులే తనకి వినిపిస్తున్నాయి. తనూ నవ్వింది పగలబడి నవ్వింది పసిపాపలా!
    "అమ్మా! ఆలకించు ఈ మువ్వలు! ఆశేర్వదించు. నేనూ నీ అంతటి దాన్ని కావాలని! మనస్సులోనే తల్లి పాదాలకి అభివాదం చేసింది ఇష్టం వచినట్లు మెలికలు తిరుగుతూ ఆడుతోంది పాడుతోంది. తల్లిని కౌగలించుకున్నంతగా మువ్వలని కాళ్ళకి కట్టుకుని పరవశించి పోయింది.
    ఇప్పుడు శిల్ప ఆడుతోంది! 'మయూరి'లా పరవశించిపోతుంది!  సిస్టర్ ఫెర్నాండిస్ తృప్తిగా నిట్టూర్చింది, తను చదువుతున్న పుస్తకాలను పక్కకి పెట్టి!
                           (శుభం)


 Previous Page

WRITERS
PUBLICATIONS