Previous Page Next Page 
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 30


    కారులో కూర్చోగానే, తండ్రిమాటలు గుర్తొచ్చాయ్! 'ఒరేయ్! నీ మనవడు అవినాష్ కి, నా మనవరాలు శిల్పనిచ్చి, పెళ్ళి చేద్దాంరా. అప్పుడు ఈ వివాహబంధం ద్వారా, 'ఆత్మ బంధువులం', బంధువులమవుతాం' అని! సరిగ్గా అదే ఆలోచన తనలోనూ పుట్టినందుకు ఆశ్చర్యపడుతూ, శిల్పని పెళ్ళికూతురిగా చూడాలని కోరుకోవడం, సంతోషం కలిగించింది. తనవల్ల తండ్రి పడిన బాధ, తండ్రి కోరిక తప్పక నెరవేర్చమని భగవంతుడిని ప్రార్థించింది. తండ్రి ఆరోగ్యం జ్ఞాపకం వచ్చింది. శిల్పకిప్పుడు పన్నెండేళ్ళు నడుస్తున్నాయి. రాగిణి గుండె గుభేలుమంది! శిల్ప పెద్దదైపోతున్నట్లుగా అనిపించింది.
    తండ్రి కళ్ళముందు, శిల్ప పెళ్లి ఘనంగా జరిపించాలి! కోటయ్య బాబాయ్ కి తండ్రికోరిక తప్పక తీర్చాలనీ, తనకీ మనసులో ముఖ్యంగా అవినాష్ శిల్పా అలా కలిసి తిరుగుతూ వుంటే, అటువంటి కోరికే వచ్చిందనీ, ఉత్తరం రాయాలి! అనుకుంది.

    టాక్సీ బడి ముందు ఆగింది. గబగబా దిగి డబ్బిచ్చేసి, సిస్టర్ ఫెర్నాండిస్ గదిదగ్గరకెళ్లింది. పరుగులాంటి నడకతో! గదికి వేసిన పెద్దతాళం తనని చూసి వెక్కిరించినట్టనిపించింది. ఏంచెయ్యాలో తెలీక కాస్సేపు అటూ ఇటూ చూసింది. ఎవ్వరూ కనిపించలేదు. పిల్లలెక్కడైనా కనిపిస్తారేమోననీ, అటూ ఇటూ చూసింది. ఎవ్వరూ లేరు! కాసేపటికి రహీం వచ్చాడు. "ఈరోజున పిల్లలందరూ 'కూమారు' వెళ్లారమ్మా ఎక్స్ కర్షన్ కి! ఈ పాటికి వచ్చేస్తూ వుంటారు. కూర్చోండి. ఇక్కడ కుర్చీవేస్తాను" అన్నాడు.
    రాగిణి ఒక్క నిమిషం ఆలోచించి "వద్దు రహీం! వాళ్లు రావడం కాస్త ఆలస్యం కావొచ్చును, నేను రేపు బడికి సెలవు పెడుతున్నాను. సిస్టర్ కి చెప్పు. నేను రేపు ఉదయం పదిగంటలకొస్తానని! అర్జంటుగా మాట్లాడాలని చెప్పు" అంది.
    ఈలోగా వర్షం పెద్దదయింది. "రహీం! నాకోటాక్సీ తెచ్చిపెట్టు ఇంటికి" అంది. "వాన బాగా పెద్దదయిందమ్మా! కాస్సేపు వుండండి! వాళ్ళూ వచ్చేవేళయింది" అన్నాడు రహీం!
    రాగిణికి ఉండాలని అనిపించలేదు. ఆమెలో పరవళ్లుతొక్కే ఉత్సాహం, పరుగెట్టిస్తోంది. రోడ్డుమీద ఉన్న ఎలక్ట్రిక్ స్థంబాల వెలుగులో, పర్సులోంచి పేపరూ పెన్నూతీసి, సిస్టర్ ఫెర్నాండెస్ పేరుమీద ఉత్తరం రాసింది.
    "డియర్ సిస్టర్!"
    మీ 'బ్లెస్సింగ్సూ', ఆశీర్వచనాలూ అన్నీ ఈరోజు ఫలించాయ్! మా శిల్ప నన్ను క్షమించింది. మా కోటయ్య బాబాయ్ కి నన్ను చూడాలనీ, నాతో మాట్లాడాలనీ, కలవరిస్తున్నానని చెప్పి పెద్ద ఉత్తరం రాసింది శిల్ప. మా బాబాయ్ ఆ ఉత్తరాన్ని నాకు పంపించారు. సిస్టర్! ఎప్పుడెప్పుడు మీకు ఉత్తరాన్ని చూపించాలా, ఎప్పుడెప్పుడు శిల్పని నా కౌగిట్లో బంధించి, ముద్దులతో అభిషేకం చెయ్యాలా అని ఉవ్విళ్లూరుతూ వచ్చిన నాకు, మీ గదితాళం వెక్కిరిస్తూ కనబడింది. పిల్లలెవ్వరూ కూడా స్కూల్లోలేరని, కూమారు వెళ్లాలనీ రహీం చెప్పాడు. రహీం మీరొచ్చేస్తారు, వుండమన్నాడు, కానీ సిస్టర్! నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు, ఇంటికి వెళ్లిపోతే రేపు పిల్లలకి కావలసిన ఏర్పాట్లు చేసుకోవచ్చును. సిస్టర్! మీది వెన్నలాంటి మనసు. నన్ను ఊరడించి, ఆశ్రయాన్ని కల్పించారు. నాలో కొత్త ఆశలు చిగురింపజేశారు. అటు మా కోటయ్య బాబాయ్, ఇటు మీరూ, ఎండిపోయిన ఈ మోడుకి, ఆశలు కల్పించి మళ్లీ మనిషిని చేశారు. మీ ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. రేపు పదింటికొస్తాను. ఉత్తరాలు చూపిస్తాను. శిల్పని రెడీగా వుంచండి.
                                                                                                                                     ఉంటా
                                                                                                                                   మీరాగిణి"
    ఉత్తరాన్ని రహీంచేతికిచ్చి, సిస్టర్ రాగానే ఇవ్వమని చెప్పి టాక్సీని పిలవమంది. శిల్ప ఎలాగా ఇవ్వాళ రాలేదు! తమ ఇంటికి వెళ్లి రేపు పిల్లల్ని ఇంటికి తీసుకురావడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యాలి! శిల్ప తన దగ్గరే పడుకుంటుంది. అవినాష్ కి ఒక మంచం కొనాలి! రకరకాల ఆలోచనలు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్! "రహీం! తీసుకొచ్చేయ్ టాక్సీ" అంది. ఇకచెప్పి లాభంలేదని, గొడుగేసుకుని వెళ్లి టాక్సీ తీసుకొచ్చాడు రహీం!
    "సిస్టర్ తో చెప్పు, నేనొచ్చి వెళ్లానని" అంటూ టాక్సీలోంచి మళ్లీ చెప్పింది రహీంకి. "సరే" నంటూ తలూపాడు రహీం.
    రోడ్డంతా వానతో బురదగా వుంది. ఉన్నట్టుండి 'ఢాం' అన్న శబ్దం చెవులు చిల్లులుపడేలా వినిపించింది! చీకటి కాటుకలా అల్లుకుపోయింది!
    ఆ చప్పుడుకి చుట్టు పక్కల వున్న జనం, గుంపులు, గుంపులుగా వొచ్చి చేరారు. "అయ్యో! టాక్సీని గుద్దేసింది లారీ"..... "డ్రైవరేడీ"?...... "అదుగో! అక్కడ పడున్నాడు"......."బతికున్నాడో?..... చచ్చాడో?..... గోల.... ఒకటే మాటలు!..... ఎన్నో కంఠాలు!!....."అరే.... ఇక్కడ టాక్సీలో ఒకలేడీ!...... నెత్తురు! తలమీద గాయమైనట్లుంది!"..... వేలగొంతుకలు చెవిలో మాట్లాడుతూన్నట్టుగా వినిపిస్తూ వుంటే, స్పృహకోల్పోయింది రాగిణి!
    కొంచెం కళ్లు తెరిచేసరికి, ఎదురుగ్గా, సిస్టర్ ఫెర్నాండిస్ "హల్లో రాగిణి! ఎలా వుంది? అంది చెయ్యిపట్టుకుని.
    "శిల్ప...... శిల్ప......" అంది మెల్లగా!
    "శిల్ప వస్తోంది! ముందునేనొచ్చేశాను! డోంట్ వర్రీ! బెంగ పెట్టుకోవద్దు..... యూ..... ఆర్..... ఆల్ రైట్" ఊరడించింది సిస్టర్ ఫెర్నాండిస్.
    డాక్టర్లు వచ్చారు. ఏదో ఇంజక్షనిచ్చారు! ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు, గాయానికి కట్టు కట్టడానికి! ఒక డాక్టరు రాగిణి బ్లెడ్ తీసింది, ఏ గ్రూపో తెలుసుకోవడానికి! మరో డాక్టరు. బి.పి. చూస్తున్నాడు.....!
    "శిల్ప...... శిల్ప......" మూలుగుతోంది రాగిణి.
    "శిల్ప ఎవరో తొందరగా పిలిపించండి" అన్నాడు డాక్టరు, సిస్టర్ ఫెర్నాండిస్ తో..... "వెళ్ళాడు డాక్టర్! శిల్ప వీళ్ళమ్మాయి! ఈ పాటికి వచ్చేస్తూండాలి!"
    రాగిణిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు. ఆపరేషన్, థియేటర్ లోకి తీసికెళ్లారు. సిస్టర్ ఫెర్నాండిస్, రాగిణి ఇంటికి టెలిగ్రాం పంపించింది, కోటయ్యగారికి పర్సులో దొరికిన ఉత్తరాలను తీసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS