తను స్కూల్లో అలా కప్పులు గెలుచుకుని ఇంటికొస్తే, ముద్దుల వర్షం కురిపించేది తల్లి! "ఉప్పు దిష్టి తీసిపారేయ్ అనేది" అమ్మమ్మ!
"చాల్లే గొప్ప! నాకూ ఒచ్చేయ్!" అనేవాడు క్రాంతి.
"నీకు రెండే వొచ్చాయి. నాకు నాలుగూ" అనేది తను.
ఇంతలో అమ్మ తినడానికేదో తెచ్చేది. దాంతో వాళ్ళ నోటికి పనితగిలి మాటలొచ్చేవి కావు.
"అమ్మా! ఏంటాలోచిస్తున్నావు. నా కప్పులు బాగులేవా ?" అడిగింది దివ్య.
"చాలా బాగున్నాయి! ఉండు దిష్టితీస్తా" అంటూ వెళ్ళి ఉప్పుతెచ్చి దిష్టి తీసేసింది. జంతికలు, మైసూర్ పాక్ ముక్కలు ప్లేట్లో పెట్టి తెచ్చిచ్చింది తినమని.
"ఏడో క్లాసుకి పబ్లిక్ పరీక్షలుంటాయి. బాగా చదవాలి" అంది కావ్య!
"ఓ....ఎప్పుడూ నేనే ఫస్టుకదా మా క్లాసులో అప్పుడూ నేనే ఫస్టు."
"కరెక్ట్!" అంటూ బుగ్గలునొక్కి గట్టిగా ముద్దుపెట్టుకుంది కావ్య!
"ఆ....మమ్మీ...." అరిచింది దివ్య! ఎదురుగ్గా నుంచున్న అతణ్ణి ఆశ్చర్యంగా చూసింది కావ్య!
అర్ధంకాక అతణ్ణే చూస్తూన్న తల్లినీ చూస్తూ వుండిపోయింది దివ్య!
"వినోద్!....నువ్వా ! ఎలా వొచ్చావ్ ? ఇన్నేళ్ళకి నేను జ్ఞాపకమొచ్చానా ?" అంటూ "దివ్యా వెళ్ళి ఆడుకో" అంది.
దివ్య వెళ్ళిపోయింది.
వినోద్ దివ్యని చూసి చిరునవ్వు నవ్వాడు.
"వినోద్ ! మా అన్నయ్య రాలేదా ? మా వొదిన బాగుందా ? చైతన్య ఎవరిలా వుంటాడు?" అంటూ ప్రశ్నలు వర్షం కురిపించింది.
"కావ్యా! నువ్వడిగిన ఏ ప్రశ్నకీ నేను సమాధానం చెప్పలేను. కారణం నేను హైదరాబాదు కాదు ఇండియానే వొదిలిపెట్టి దశాబ్దం దాటిపోయింది. ఇంచుమించు నువ్విక్కడికి రావడం నేను లండన్ వెళ్ళిపోవడం ఒక్కసారే జరిగింది. నేను వెళ్ళిన ఏడాదికే నాన్న మంచం పట్టారుట. నిరుడు ఈ రోజుల్లోనే ఆయన పోయారట. మా అన్నయ్యలు ఆ ఇల్లు అమ్మేసి, ఆస్తి అందరికీ పంచేశారు. ఒకటి రెండు ఉత్తరాలు మీ అన్నయ్యకి రాసినా, వాడు నాకు సమాధానం రాయలేదు. అందుకని నేనూ వాడికి రాయడం మానేశాను."
"వినోద్! మీ ఆవిడా, పిల్లలూ....ఐ....మీన్....ఎంతమంది పిల్లలు ? ఎవర్ని చేసుకున్నావు ? ఎక్కడున్నారు వాళ్ళు ?" మొదలగు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది కావ్య ? ఇన్నాళ్ళకి 'నా' అనే వాళ్ళని కలుసుకోవడం వల్లనేమో, ప్రశ్నలు పరంపరలుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్ ఆమెని !
వినోద్ కావ్యకేసి చూశాడు. "అవే కళ్ళు! అవే చూపులు! ఆ చూపులకే తను తపించేవాడు! ఆ కళ్ళల్లో ప్రేమ కుటీరాన్ని నిర్మించుకుని, కలకాలం కాపురం చేయాలనుకున్నాడు. కానీ, ఆమెపైన ఉన్న అపప్రదలు విని, తండ్రి ఒప్పుకోలేదు. ఆ ఘర్షణలవల్లే తను ఇండియా వొదిలిపెట్టి వెళ్ళిపోయాడు! ఇప్పుడు తిరిగివస్తూ, కావ్యని తనదాన్ని చేసుకోవాలనుకున్నాడు.
తియ్యని కలలుకంటూ, మద్రాసులో దిగి నేరుగా కావ్య ఇంటికే చేరుకున్నాడు. పాండిచేరీ కొచ్చి రామచంద్రన్ ఇంట్లో సామాన్లు పడేసి! కానీ........
"ఏంటాలోచిస్తున్నావు వినోద్ ?"
"ఆఁ....అదే....నాకింకా పెళ్ళికాలేదు."
ఆశ్చర్యంగా చూసింది కావ్య!
"ఏమీ ?"
"నేను కోరుకున్న అమ్మాయిని నాన్నగారు చేసుకోవద్దన్నారు."
"ఇప్పుడు నాన్నగారు లేరుగా!"
"కానీ నాకా అదృష్టం లేదు. ఆమెకి పెళ్ళయిపోయింది!"
"అయితే ఆమెని మర్చిపోయి, నిక్షేపంగా ఇంకెవరినైనా చేసుకో!"
"అది నావల్ల కాని పని! అది సరే! మీ ఆయనేం చేస్తున్నారూ ?" అడిగాడు.
ఉలిక్కిపడింది కావ్య! కళ్ళనిండా నీళ్ళు నిండాయి.
"వినోద్! నాకు పెళ్ళి కాలేదు" అంది నేలచూపులు చూస్తూ!
తన చెవులని తనే నమ్మలేనట్టు చూశాడు వినోద్ !
"మరి ఈ అమ్మాయి...."
"అదొక పెద్ద కథ...." అంటూ జరిగినదంతా చెప్పింది కావ్య!
ఆకాశాన్ని తన గుప్పిట్లో పట్టుకున్నంతగా సంతోషించాడు. వినోద్! పోగొట్టుకున్న పెన్నిధి తన కాళ్ళకి తగిలినంతగా సంతోషిస్తూ, "కావ్యా! ఐ....యామ్....వెరీ....లక్కీ!....ఇన్నాళ్ళూ నేను దేముణ్ణి నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతాను. కావ్యా....మైడియర్....మై డార్లింగ్!" అంటూ కావ్యని చుట్టేశాడు.
ఈ అనుకోని సంఘటనకి ఉక్కిరిబిక్కిరై పోతూ "వినోద్! ఏమిటిది ? ఒదులూ" అంటూ అతని కౌగిలి విడిపించుకోవడానికి పెనుగులాడింది కావ్య!
అప్పుడే లోపలికొస్తూన్న దివ్య అదిచూసి "మమ్మీ!"....అంటూ కావ్యని పట్టుకుంది, వినోద్ కేసి కోపం చూస్తూ!
తప్పు చేసినవాడిలా వినోద్ ఆమె కౌగిలిని విడిచేశాడు. తలవంచుకుని నుంచున్నాడు.
అది చూసి కావ్య, "కూర్చో వినోద్!" అంది. దివ్యని చూసి నవ్వుతూ "ఏమ్మా! ఏం కావాలీ ?" అడిగింది.
"నాకు చాక్లెట్లు కావాలి! నా ఫ్రెండ్సొచ్చారు" అంది.
కావ్య సీసాలోంచి చాక్లెట్లు తీసి దివ్యకిచ్చింది.
అవి తీసుకుని ,వినోద్ కేసి కోపంగా చూస్తూ, బయటకెళ్ళిపోయింది దివ్య!
"వినోద్ ఎంత పనిచేశావు! ఆ పసిదాని మనసులో ఏ భావన కలిగిందో !"
వినోద్ ఈ లోకంలో లేడు. ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న ప్రేయసి ఎదురుగా నుంచుని కన్ను గీటినంత, అనుభూతిని పొందాడు! తన్మయత్వంలో మునిగిపోయి, తన్ను తాను మరిచిపోయి, ఆమె కౌగిలింతలో ఈ ప్రపంచాన్నే మరిచిపోయాడు! "నన్ను క్షమించు కావ్యా! ఆనందాన్ని పట్టలేకపోయాను" అన్నాడు కావ్యని క్రీగంట చూస్తూ తలొంచుకుని !
కావ్య మాట్లాడలేదు !
"కావ్యా! కోపం వచ్చిందా? సారీ! నీ మనసు తెలుసుకోకుండానే, నా ఆవేశాన్ని ప్రదర్శించాను. కావ్యా! నీ కభ్యంతరం లేకపోతే, నిన్ను పెళ్ళి చేసుకుంటాను, వెంటనే!"
కావ్య తలెత్తి అతనికేసి చూసింది.
"వినోద్! నాకా అదృష్టం లేదు. లోకం దృష్టిలో నేను విధవరాలిని!"
"కావ్యా!" పిచ్చివాడిలా అరిచాడు.
"అవును వినోద్! ఇక్కడందరికీ నేను దివ్య తల్లిని! భర్తను పోగొట్టుకున్న విధవని! నేను.... పెళ్ళెలా.... చేసుకోగలను ?" కన్నీళ్ళని ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తూ చెప్పింది కావ్య!
"కావ్యా! కాదనకు! ఆ రోజుల్లో నాన్నని ఎదిరించి నా ప్రేమని నీకు వ్యక్తం చేసే, ధైర్యం నాకు లేకపోయింది. లేకపోతే ఏనాడో నువ్వు నాదానివయి వుండేదానివి! నీకూ ఈ అజ్ఞాత జీవనం వుండేది కాదు. మీ అమ్మా, క్రాంతీ కూడా సంతోషించి వుండేవారు! నా పిరికితనమే నా జీవితాన్ని నాశనం చేసింది కావ్యా, నాశనం చేసింది" కర్చీఫుతో, కన్నీళ్ళు తుడుచుకున్నాడు వినోద్.
"వినోద్! విధి బలీయం! దాని చేతిలో నుంచి తప్పించుకోవడం బ్రహ్మతరం కాదు."
"పోనీలే కావ్యా! ఇప్పటికైనా......"
"నో! నో!....దివ్య చాలా తెలివైనది ! అది తన తండ్రి చనిపోయాడనే అనుకుంటోంది! నేనూ అలాగే చెప్పాను. ఆ చిన్నారి మనసులో, మరో భావాన్ని కలిగించి దాని మనసు పాడు చేయలేను! వాడిన పువ్వు వికసించదు వినోద్! నువ్వు హాయిగా నీకు తగ్గ పిల్లనెవరినైనా చేసుకుని హాయిగా ఉండు."
"కావ్యా! అదే సంభవమైతే, ఇన్నేళ్ళు ఇన్ని ఊళ్ళు తిరిగినా, ఇలా వుండేవాణ్ణి కాదు. నువ్వు కాదంటే, నిన్ను జపిస్తూ నీ తలపులలో శేష జీవితాన్ని గడుపుతాను, కానీ మనసులేని పెళ్ళి చేసుకుని మనుగడ సాగించలేను."
"వినోద్!...."
"కావ్యా! నీకు....నేను ఇష్టమేనా ?"
"ఏం ప్రశ్న అది ? వెండి వెన్నెల నెలరాజు తార దగ్గరకెళ్ళి నీకు నేను ఇష్టమేనా ? అన్నట్టుంది నీ ప్రశ్న"
"కావ్యా! ఐ....లవ్....యూ....! కావాలంటే మనం ఈ ఊరొదిలిపెట్టి, ఇంకెక్కడికయినా వెళ్ళి పెళ్ళి చేసుకుందాం. దివ్యని హాస్టల్లో పెడదాం లేదా మనతో తీసుకుపోదాం!"
"అసంభవం వినోద్ ! దిక్కులేని ఆ పిల్లకి నేనే దిక్కై, చదువుల సరస్వతిగా తయారుచేసి, సకల మర్యాదలతో ఒక ఇంటిదాన్ని చేసి, ఒక బాధ్యతగల పౌరురాలిగా తీర్చిదిద్దాలనుకున్నాను. అందుకు నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను. ఇప్పుడు ఆ పిల్ల మనసులో లేనిపోని అనుమానాలు రేకెత్తించలేను! నేను దురదృష్టవంతురాలిని వినోద్ ! నేను పెళ్ళి చేసుకోవాలనుకున్నంత కాలం నాకు సంబంధాలు దొరకలేదు. నన్ను చేసుకోవాలని ఒక ఉత్తముడు నిరీక్షిస్తున్నట్టు కూడా నాకు తెలీదు. ఇప్పుడతడు పెళ్ళి చేసుకుంటానని ముందుకొస్తే ,చేసుకోలేని దీనస్థితిలో వున్నాను నేను! ఈ పరిస్థితిని ఏమంటారు ? విధా ? ఖర్మా ? దురదృష్టమా ? అన్నీనా ?" చెంపలమీంచి కారుతూన్న కన్నీళ్ళు, చీర కొంగుతో తుడుచుకుంది కావ్య!
