Previous Page Next Page 
గెస్ట్ హౌస్ పేజి 30

స్టేషన్ లో ఓ చిన్న లైటు మాత్రమే వెలుగుతోంది.
"నాకు డబ్బులిస్తే నేను వెళ్లిపోతాను సార్" అన్నాడు బగ్గీవాడు.
రాబర్ట్ డబ్బులిచ్చాడు.
డబ్బులు తీసుకుని చెప్పాడు బగ్గీవాడు "చాలా జాగ్రత్తగా వెళ్లండి సార్..."
రాబర్ట్ అలాగేనన్నట్టు తలూపాడు.
బగ్గీవాడు వెళ్లిపోయాక చెప్పాడు రాబర్ట్.
"మనం ఇక్కడ్నుంచి ఓ పదిహేను నిమిషాలు నడవాల్సి వుంటుంది"
పరమహంస తరళవైపు చూసి ముందుకు కదిలాడు. తరళ వాళ్లిద్దర్నీ అనుసరించింది.
అర్దరాత్రి...
ఒంటి గంట ముప్పయి నిమిషాలు.
రామయ్య కళ్ళు మూసుకునే వున్నాడు.
అతని నోరు విరామం లేకుండా మంత్రాక్షరాలను ఉచ్ఛరిస్తోంది. అతని శరీరం వేడితో దహించుకుపోతున్నట్టుంది.
ఆ పరిసర ప్రాంతాలు నిశ్శబ్దంగా వున్నాయి.
క్షుద్రశక్తులు ఆ ప్రాంతాన్ని పహారా కాస్తున్నట్టున్నాయి.
అకోరా తంతులోని ఒకటవ అంకం పూర్తి కాబోతుంది.
ఈ అంకం పూర్తయితే జరిగే పర్యవసానం ఎంత తీవ్రంగా వుంటుందో..."

                                                  * * *
అర్దరాత్రి
రెండు గంటలు...
గుహలో నుంచి బయటకు వచ్చింది ఓ పెద్ద పులి.
దాని కళ్ళు చీకట్లో కూడా మెరుస్తున్నాయి...అప్పటి వరకు మగతగా ఉన్న ఆ పులి ఎవరో నిద్రలేపినట్టు లేచింది.
ఎవరో ఏదో తనని ఆదేశిస్తున్నట్టు  ముందుకు అడుగులు వేసింది.

                                         * * *
హఠాత్తుగా మెలకువ వచ్చింది నచికేతకు.
చెట్టుకింద చలిమంటలో విలియమ్స్ అటు, ఇటు తిరుగుతూ కనిపించాడు.
తనకి హఠాత్తుగా మెలకువ వచ్చింది.
లీలగా ఏవో శబ్దాలు. అదే సమయంలో సూరజ్, సూర్యనారాయణ, ప్రభులకు కూడా మెలకువ వచ్చింది.
"ఏమైంది నచీ..." ప్రభు అడిగాడు.
"ఏమీ కాలేదు. కానీ..." ఆగాడు నచికేత.
ప్రభు భయంగా అన్నాడు.
"నాకేదో అనుమానంగా వుంది. ఇందాక నా చెవుల్లో ఏదో మాటలు లీలగా వినిపించాయి. అవేమిటో తెలియడంలేదు. భయంతో కళ్ళు తెరిచాను.
"నేనూ అంతే..." సూరజ్ అన్నాడు.
సూర్యనారాయణ ఏదో చెప్పబోయాడు.
నచికేత మాట్లాడొద్దన్నట్టు సైగ చేసి, మెల్లిగా చెట్టు మీదనుంచి కిందకి దిగాడు.
 అతనితో పాటు  మిగతా ముగ్గురూ దిగారు.
విలియమ్స్ వాళ్ల వంక ఆశ్చర్యంగా చూసేడు.
"ఏంటీ...పడుకోకుండా కిందికి దిగారు అంతా కలిసి..." అడిగాడు నవ్వుతూ విలియమ్స్.
"నీకు నీకేం వినిపించలేదా?" అడిగాడు నచికేత...
నచికేత ఆలోచనలో పడ్డాడు.
తమ నలుగురికి వినిపించి, విలియమ్స్ కి మాత్రం వినిపించకపోవడం ఏమిటి?
సరిగ్గా అప్పుడే వాళ్లని పులి సమీపించ సాగింది.
నిశ్శబ్దంగా...చాలా నిశ్శబ్దంగా వచ్చింది పులి అక్కడికి.
చలిమంటలో అక్కడ తమకెదురుగా ఉన్న పులిని చూసి భయపడిపోయేరు.
ముందుగా ఆ పులిని ప్రభు చూసాడు. వెంటనే వణికిపోతూ అరిచాడు.
అప్పటికే ఆ నలుగురు పులిని చూసారు.
ఒక్కక్షణం వాళ్లకి ఏం చేయాలో తోచలేదు.
తమవైపు చూస్తోంది పులి. నచికేత నలుగురికి సైగ చేసాడు.
చెట్టు ఎక్కడం అంత ఈజీ కాదు.
ఈలోగా పులి ఎటాక్ చేసినా చేయొచ్చు...పారిపోవడం ఒక్కటే మార్గం. చీకటిలో తలా ఓ దిక్కు పారిపోవడం కన్నా ఒకేవేపు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని పారిపోతే...
నచికేత అందరికి సైగచేశాడు.
వెనక్కి తిరిగి పరుగు పెట్టారు.
అప్పటివరకూ అలానే నిలబడి ఉన్న పులి వీళ్లని తరమసాగింది.
అకోరాలోని మొదటి అంకం ప్రభావమే ఇదంతా అని వాళ్లకి తెలియదు.
పులిని నిద్రలేపి ఆ ఐదుగురిని భయబ్రాంతులకు గురిచేయడమే మొదటి అంకం ప్రభావం.

                                        * * *
ఒకటి...
రెండు...
మూడు...
పదిహేను నిమిషాలు ఏకధాటిగా పరుగెత్తారు.
మధ్య మధ్య చెట్లు, రాళ్ళు, పొదలూ...అయినా అయాసపడలేదు.
తమ వెనుకే పులి తమని ఛేజ్ చేస్తూ వస్తున్నట్టు అర్ధమవుతూనే వుంది.
ఒక్క క్షణం ఆగి ఊపిరి తీసుకున్నారు. ఎక్కడో పులి గాండ్రింపు...
మళ్ళీ పరుగు మొదలెట్టారు...
ఆ భయంతో వాళ్ళు దారి తప్పారు. చిత్రావతి అడవిలో ఉన్న ఒకే ఒక నరమాంస భక్షకుడి గుహవైపు వాళ్ళు పరుగెత్తసాగారు.

                                        * * *
కేవలం ఐదు అడుగులు ఎత్తు ఉన్న ఆ గుహలో పడుకుని ఉన్నాడు ఏడున్నర అడుగుల ఆ నరమాంస భక్షకుడు.
తైల సంస్కారం లేని జుట్టు...
బలమైన, దృఢమైన శరీరం, అతని పళ్ళు చాలా ఎత్తుగా షార్ప్ గా వున్నాయి.
అతను గుర్రు పెడుతుంటే పక్షులు భయంతో ఎక్కడికో ఎగిరిపోతున్నాయి.

                                                      * * *
ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచాడా నరమాంస భక్షకుడు.
అతని ముక్కు పుటాలకు ఏదో వాసన...తన కిష్టమైన వాసన... న..ర..వా..స..న..
కొన్ని సంవత్సరాలుగా అతను నరమాంసానికి దూరంగా ఉన్నాడు. జంతువులను చాటుగా ఎటాక్ చేసి తినడమే అలవాటు చేసుకున్న అతనికి చాలా సంవత్సరాల తర్వాత నరవాసన వేసింది.
అర్ధరాత్రుళ్ళు అతనికి మెలకువ రాదు. కానీ ఇప్పుడు మెలకువ వచ్చింది. ఎందుకు?
"లే...నిద్ర నుంచి మేలుకో...నీ కిష్టమైన నరవాసన...వెళ్ళు...వెళ్ళు...ఆ ఐదుగుర్నీ నీ విషపు గోళ్లతో చీల్చి చంపి...ఆరగించు..."
ఎవరి మాటలో లీలగా వినిపిస్తున్నాయి.
గులకరాళ్ల డబ్బాలో వేసి గులకరించినట్టు అతని గొంతులోనుంచి విచిత్రమైన శబ్దం వినిపించింది.
మెల్లిగా లేచాడు. తల వంచి ఆ గుహలో నుంచి బయటకు వచ్చాడు.
ఆ ఐదుగురూ ఒక్క క్షణం ఆగి మరోసారి వూపిరి పీల్చుకున్నారు.
"నచీ లాభం లేదు...నేనిక పరుగెత్తలేను" ప్రభు అన్నాడు.
"నాక్కూడా ఓపిక లేదు నచీ...ఏదో ఒకటి చేయాలి...దగ్గర్లో ఏదైనా షెల్టర్ లాంటిది దొరికితే బావుండు" విలియమ్స్ అన్నాడు.
నచికేత సునిశిత దృష్టి, పరిసరాలను పరిశీలిస్తోంది..
చీకటిలో పరుగెత్తడం వల్ల రాళ్ళు, రప్పలు తగిలాయి. అక్కడక్కడ చేతులు గీరుకుపోయాయి. అంత చలిలోనూ శరీరమంతా స్వేదం అలుముకుంది.
నచికేత వీపుకు వేలాడుతోన్న ఏర్ బేగ్ లో నుంచి టార్చిలైటు తీసాడు.
చాలా చిన్న పెన్ టార్చి అది. చిన్నకాంతిలోనే చుట్టూ చూసేడు. గుబురుగా చెట్లు. అతను తల తిప్పి గుహవైపు చూసేడు.
చిన్నపాటి గుహ కనిపించింది.
"అటు చూడండి..." అరిచినట్టు అన్నాడు నచికేత.
నలుగురూ అటువైపు చూసేరు.
అక్కడో గుహ కనిపించింది.
"ఆ గుహలో తలదాచుకుందాం...ఈ రాత్రికి..." చెప్పాడు నచికేత.
"ఒకవేళ ఆ గుహలో ఏమైనా..."
"పద చూద్దాం..." ప్రభు మాటలు మధ్యలోనే కట్ చేసి గుహ దగ్గరకి వెళ్లి టార్చిలైట్ ఫోకస్ చేసి లోపలికి చూసాడు.
అంతా ఖాళీ...
ఏదో వాసన వస్తోంది గుహలోనుండి...అయినా తప్పదని ఆ గుహలోకి తలలు వంచి...లోపలికి అడుగుపెట్టారు.
చాలా చిన్నగావుందా గుహ.
అలా నేలమీద కూచోగానే నిద్రపట్టేసింది. అప్పటి వరకూ పరుగెత్తడంవల్ల అలుపొచ్చేసి...
చాలా సేపటి తర్వాత...
ఏదో శబ్దం రావడంతో అందరూ ఒకేసారి కళ్ళు తెరిచారు.
ఎదురుగా వొళ్ళు గగుర్పొడిచేలా న..ర..మాం..స.. భ..క్ష..కు..డు...

                                       21
ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని నిశ్శబ్దం ఆవహించింది.
భయంకరమైన ఏడున్నర అడుగుల నరమాంస భక్షకుడి ఆకారం చూడగానే ఐదుగురి మొహాల్లోనూ భయం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది...ఐదు అడుగుల ఎత్తువున్న ఆ లో నిలబడ్డం వాళ్లకు కష్టంగా వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS