"అదేం సార్?" ఒక పురుషుడు ఒకస్త్రీతో, అంటే భార్యకాని స్త్రీతో సంబంధం పెట్టుకొంటాడనుకోండి! ఆ సందర్భంగా ఆ స్త్రీ శీలం కోల్పోయింది అంటాంగాని, పురుషుడు శీలం కోల్పోయాడనం కదా?" అన్నాడు వెంకటరత్నం.
"అనంకాని, అనాలి న్యాయమైతే! ఆనాడు ధర్మశాస్త్రాలు రచించిన పురుషుడు స్త్రీకి నిషేధాలు విధించి, తను మాత్రం విచ్చలవిడిగా సుఖాన్ని జుర్రుకొనే అవకాశాల్ని వుంచుకొన్నాడు!" "శీలం" స్త్రీకి మాత్రమే సంబంధించిన విధేయంగా వుంచాడు! కాని, బలంతో స్త్రీని గెలుచుకొనే ఆటవిక దశనుండి, బహుభార్యాత్వంనుండి ఏకపత్నీవ్రతుడయ్యే నాగరీక దశకు తిరగరాసే ఆ ధర్మశాస్త్రంలో "శీలం స్త్రీ కి మాత్రమే కాదు, పురుషుడికి వుండాలి" అని తప్పకుండా రాయాలి"
ఆపుకోలేని సంతోషంతో చప్పట్లు కొట్టింది సుధ. "స్త్రీకే కాదు, పురుషుడికికూడా వుండాలి అని మీరూ, నేనూ అంటాంకాని, పురుషుడికిలేని "శీలం" స్త్రీకి మాత్రమే ఎందుకు? అనే వర్గంకూడా ఒకటి బయల్దేరింది సమాజంలో దీనికి మీరేమంటారు సర్?"
"ఒక పురుషుడు విశృంఖలంగా తిరుగుతున్నాడంటే కొందరి స్త్రీల భాగస్వామ్యం వున్నట్టేకాదా? అందుకని, స్త్రీ శీలవతి అయితే పురుషుడి విచ్చలవిడి తనానికి కొంతవరకు ఆనకట్ట వేయడం జరుగుతుంది, ఆమె కూడా తనకు శీలం అక్కరలేదనుకొంటే మనిషి తిరోగమనం ప్రారంభమౌతుంది. చివరికి ఆటవిక దశకు చేరుకొని కోరికలు తీర్చుకోవడమే ప్రధానంగా పెట్టుకొంటాం. అసలు కామమే మనిషిని జంతువుగా మార్చగలశక్తి కలది. దానిమీద కొన్ని నిబంధనలు లేకపోతే మనం మనంగా వుండం. కుక్కలం పందులం అయిపోతాం! సభ్య మానవుడు ఆశించడు. ఆశించదగిన పరిణామం అదికాదు కదా?"
"ఆకలేస్తే అన్నం తింటాం. దాహంవేస్తే నీళ్లు తాగుతాం. ఏదీ తినాలంటే అది తింటాం. ఏది తాగాలంటే అది తాగుతాం. అందులో తప్పేమీలేదు. నిబంధనలు అసలే లేవు. దాహం, ఆకలి లాంటిదే సెక్స్ అని ఎందుకనుకో కూడదు?" అడిగాడు యాదగిరి.
"దానికి చాటు ఆ బట్టలెందుకు? విప్పేసి ఈ మాటలు మాట్లాడు! అప్పుడు వాదన కొనసాగిద్దాం" అని లేచాడు చంద్రకాంత్.
వారంరోజులే క్రితమే జాయిన్ అయ్యాడు బి. డి. వో గా చంద్ర కాంత్! ఎంగ్ పర్సనే. పెళ్లయిందా? పిల్లలెందరు? లాంటిది ఇంకాఎవరికీ తెలియవు ప్రస్తుతం అతడికి తెలిసిన వాళ్లింట్లో దిగినట్లుగా తెలుసు ఆఫీస్ స్టాఫ్ కు.
చంద్రకాంత్ వెళ్లిపోయాక యాదగిరి అన్నారు. "వట్టి బి. సి. అవతారం ఉన్నట్టున్నాడు"
"ఒక మగాడు మాట్లాడాల్సిన మాటలుకాదు!" అన్నాడు వెంకటరమణ.
ఆరోజు రాత్రి సుధ చెప్పింది శాలినితో "మా కొత్త బి. డి. వో. అందమైనవాడేకాదు, అందమైన మనసుకూడా వుంది."
"ఏమిటి సంగతి?" అడిగింది శాలిని.
".........." ఆరోజు చర్చ సంగతి చెప్పింది.
"పెళ్లయిందా?"
"తెలీదు."
"వయసు ఎంతుంటుందేమిటి?"
"ముప్పైకి పైనే వుంటుంది!"
* * * *
వరండాలో కూర్చొని పిల్లలకు పాఠాలు చెబుతూంది శాలిని.
"వి. డి. వో. ఉందా?"
నిర్లక్ష్యంగా, మొరటుగా వినిపించిన కంఠానికి తృళ్లిపడ్డట్టుగా చూసింది శాలిని.
ఎదురుగా ఇద్దరు యువకులు నిలబడి వున్నారు ఇద్దరూ బాగా నలుపు కాని, వాళ్ల నలుపు ఎత్తికొట్టేలా తెల్లటి బట్టలు వేసుకొన్నారు. చూడగానే తెలిసిపోయేలా వున్నారు, మిడిమిడి జ్ఞానం వున్నవాళ్లనీ, డాబులకి మాత్రం తక్కువలేదని. ఒకడు కర్చీఫ్ మెడకి కట్టుకుంటే, ఒకడు చేతికి చుట్టుకున్నాడు. చూపుల్లో చెప్పలేనంత నిర్లక్ష్యం ఎదురొచ్చిన వాటిని నరుక్కుపోయే పదును కనిపిస్తూంది ఆ కళ్ళలో.
"ఎవరు మీరు?" అడిగింది శాలిని.
"ఆవిడకు తెలుసు! ఉందా ఇంట్లో!"
"పేరు చెప్పడానికి అంత స్టయిలెందుకు?" ఒళ్లు మండినట్టుగా అంది శాలిని.
"మా పేర్లతో నీకేం అవసరం? మేం వచ్చింది నీకోసం కాదులే!" అందులో ఒకడు వెటకారంతో జవాబిచ్చాడు.
ఎంతకైనా తెగించేట్టున్న ఆ మగాళ్లతో సంభాషించడం తనదే బుద్ది తక్కువ అని తెలిసిపోయింది శాలినికి. గబుక్కున లోపలికివచ్చి "రెండు అడవి జంతువులు వచ్చాయి నీకోసం! సంగతేమిటో తెలుసుకొని త్వరగా పంపించెయ్యి" అంది శాలిని.
