Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 30

 

    "మీ అమ్మ వప్పుకోంటుందే వూరుకుంటుందా, మా మీద దేబ్బలాటకి దిగదూ"
    "నేనాయింట్లో వుండకుండా వచ్చేస్తానమ్మా మా అమ్మ వప్పుకోకపోతే. లేకపోతే మా అమ్మ నాకు పెళ్లి చేస్తది. పిల్ల పెద్దమనిషి కాకుండా నెయ్యాలని అమ్మ అక్కడున్న ఆడోళ్ళతో చెపుతుంది. నాకు పెళ్ళి వద్దమ్మా ఇప్పుడు సదుకుంటాను. మీ అమ్మాయిలాగా సదూకోవాలని వుందమ్మా' ఏడుస్తూ అంది. అవును, పిల్లదానికి పెళ్ళంటూ అవుడే మొదలుపెట్టింది యాదమ్మ." సరే నీవు ముందు ఏడుపు అపు. నేను అయ్యగారితో కూడా మాట్లాడాలి కదా. మీ అమ్మని కూడా అడగాలి కదా. రేపొకసారి మీ అమ్మను తీసుకురా."
    "అమ్మతో చెప్పద్దమ్మా చెబితే వప్పదు" భయంగా అంది.
    "బాగుంది , చెప్పకుండా ఎలాగే, రేపొద్దున నా ఇంటి మీదకి దేబ్బలాటకి రాదూ. అసలు ముందు అయ్యగారోప్పుకోవాలి కదా. అయ్యగారితో , మీ అమ్మతో మాట్లాడాక ఆలోచిద్దాంలే. వెళ్ళు పని చూడు" అప్పటికి సముదాయించింది అరుణ.

                                                    ***

    'ఆడపిల్ల, ఎదిగే వయస్సు పిల్లని ఇంట్లో పెట్టుకుంటే వచ్చే ఇబ్బందులు అలోచుంచు, రోజంతా మనం ఇంట్లో ఉండడం, ఏదన్నా అటు ఇటు జరిగితే జవాబుదారి నీదవుతుంది. అనవసరమైన గొడవలు నెత్తి కెక్కించుకోకు" అన్నాడు శ్రీనివాసరావు అరుణ చెప్పింది విని.
    'మన అమ్మాయి ఉండడం లేదా ఇంట్లో, మనం ఇంటి కొచ్చే లోపల అది, దానికి ఇది తోడుగా ఉంటారు. ఇదీ స్కూలు కెళ్ళి సాయంత్రం వస్తుంది కదా. ఇంట్లో పని పూర్తి చేసి, స్కూలు కెడుతుంది. వీళ్ళతో పాటు సాయంత్రం చదువుకుంటుంది. మనకు పిల్లలకు అందరికి ఇంకాస్త సాయం అదింట్లో ఉంటే. దానికేలాగో మూడొందలు ఇస్తున్నాం . ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టి , మన పిల్లల బట్టలు ఇస్తే చాలు, దాని కోరిక తీరుతుంది. మనకూ సుఖం. ఈ రోజుల్లో ఇంట్లో పెట్టుకుందామన్నా ఎవరు దొరుకుతున్నారు. పాపం అది చదువుకోవాలని ఆశ పడ్తోంది. వాళ్ళమ్మ పన్నెండేళ్ళకే పెళ్ళి చేసి పంపేస్తుంది. దీనికి రేపు పెళ్ళి పిల్లలు, మొగుడు , తన్నులు, భవిష్యత్తు వీళ్ళందరి బతుకు ఇంతేకదా. లోకంలో అందరిని బాగుచేయలెం . ఏదో ఒక్క పిల్లనన్నా కాస్త ఆదుకుని దాని కాళ్ళ మీద అది నిలబడేట్టు చెయ్యాలనిపిస్తుంది. దానికి కాస్త ఉపకారం, మనకు కాస్త సాయం" అరుణ చెప్పింది సబబుగానే అనిపిస్తున్నా ఇంట్లో పెట్టుకుంటే వచ్చే సమస్యలు కాస్త ఆలోచనలో పడేశాయి. శ్రీనివాసరావుని ఆఖరికి 'నీ ఇష్టం. ఆలోచించుకో. వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుందో లేదో ముందు అడిగి చూడసలు. వాళ్లతో తగూలు పెట్టుకుని మాత్రం వద్దు వాళ్ళు వచ్చి మన మీద ఏడ్చి గొడవలు పెడితే మాత్రం వద్దు" అన్నాడు. "నాకామాత్రం తెలియదా వాళ్ళమ్మకి నచ్చ చెబుతా' అది అరుణ.

                                                      ***

    యాదమ్మకి నచ్చ చెప్పడం అంత సుళువైన పనికాలేదు. "మాకు సదూలెందుకమ్మా ఇంకో రెండిళ్ళలో పని చేసుకుని కాస్త డబ్బులు వెనకేసి ఆడపిల్ల పెళ్ళి సెయ్యాల. సదుకుంటే మొగుడ్నేక్కడ తేవాలి. చిన్నపిల్ల దానికేం తెలుసు. అది కాకపొతే, అది తెచ్చే డబ్బులు లేకపోతే యిల్లెలా గడుస్తుందమ్మా ముందు కడుపు నిండితే గదమ్మా సదువులు, సట్టుబండలు . ఒక్కర్తీనీ నేనెలా యిల్లు గడపను.
    "నీ మొగుడ్ని నిలబెట్టి అదగాలి డబ్బు, పెళ్ళాడి , పిల్లల్ని కని పట్టనట్టు వూరుకుంటే ....నీ ఊరుకుంటే మహా చక్కగా జల్సా చేసుకుని తాగి, తిని తిరుగుతాడు. మొగుడ్ని వదిలి, చిన్న పిల్ల దాని జీవితం పాడు చేస్తే ఎలా, పాపం అది చదువుకుని ఏదో ఉద్యోగం చేసుకోవాలని ఆశ పడ్తుంది. దాని బతుకు బాగుపడాలని లేదా నీకు" "ఉంటుందమ్మా , కాని ఏం చెయ్యను. అ దొంగ సచ్చినోడు తిన్నగుంటే నాకీ తిప్పలెందుకు తాగి డబ్బు లడిగితే తన్ని యింట్లో కుండమండ బద్దలు కొట్టి పోతాడు. వాడి చేత వళ్ళు కుళ్ళబోడిపించుకోడం ఎన్నిసార్లయింది. అందుకేనమ్మా యిప్పుడాడి జోలికి పోను. కట్టుకున్న పాపానికి, ఏదో మొగుడున్నాడు. మొగాడి అండ వుందిలే అన్న ధైర్యంతో ఏదో అడికింత తిండేట్టన్నాను. నా ఒక్కర్తి వల్ల కాక కాదమ్మా సుశీలని పనికి పెట్టింది. ఏం చదువుతుంది , మహా అయితే పదో క్లాసు చదివాకన్నా పెళ్ళి చెయ్యాలి గదమ్మా కాలేజీలకి పంపి బి.ఏ లు ఎమ్మెలు సదివించే తాహతు మాకుందా, పదో క్లాసంటే పదహారు, పదిహేదేళ్ళు వస్తాయి. అంత సదివిన దానికి మొగుడ్ని ఎడ తేను మీరే చెప్పండి" 'పెళ్ళో, పెళ్ళో అని ఎందుకు గోల, చదువుకుని ఏదో ఉద్యోగం సంపాదించుకుంటే నీకు సాయంగా వుండదా , పెళ్ళి కేం తొందర . తరువాతేప్పుడో కావాలంటే చేసుకుంటుంది. అనవసరంగా అలోచించి యిప్పుడు దాన్ని చదువు మన్పించకు' దాన్నేలాగేనా వప్పించాలని అరుణ ఆరాటం.
    'అదిలేకపోతే మరి నాకు రోజులేలా గడుస్తాయమ్మా దాని సంపాదనలేకపోతే'
    "ఏం దాన్నే అంటావు. నీ కొడుకున్నాడు గదా. వాడ్ని ఎక్కడన్నా పొద్దుట సాయంత్రం పనిలో పెట్టు. వాడేమో చదవడు.
    చదువుతానన్న దాన్ని వద్దంటావు. తిని రోజంతా తిరుగుతాడు, ఏ హోటల్లోనో, దుకాణం లోనో పనికి పెట్టు. స్కూలుకి అడ్డు రాకుండా . 'ఆడు మగాడు, కాస్త అక్షరం ముక్క రావద్దా. రేపు ఏ పని చెయ్యాలన్నా సదువుండాలి. గదమ్మా. ఇంకా చిన్నాడు, వాడికేం చాతనవుతుంది పని' యిబ్బందిగా అంది. కొడుకు పట్ల దానికి ఉన్న ప్రేమ , సుశీల ఆడపిల్లని దాని పట్ల నిర్లక్ష్యం అన్న తెలిసిన అరుణ ఆ తేడా చూపడం సహించలేకపోయినా అంతకంటే ఏ అనాలో తెలీలేదు. 'ఏమో యాదమ్మా , నీ కూతురు పాపం ఏడుస్తుంది చదువు చదువు అని నేను దాన్ని యింట్లో పెట్టుకుని దాని చేత యిప్పట్లాగే పని చేయించుకుని తిండి, బట్ట, దాని అవసరాలు అన్నీ చూసుకుంటూ చదివిస్తాను నీవు వప్పుకుంటే. నీ కిష్టం లేకుండా నేనేం చెయ్యగలను. అది బాగుపడాలంటే నీవు వప్పుకో. లేదంటే అది తెలిసి తెలియని వయసులో ఏ అఘాయిత్యమన్నా చెయ్యచ్చు. లేదంటే ముందు ఆలోచన లేకుండా ఎటన్నా పారిపోతే దాని బతుకు బండలవుతుంది. చూసుకో" కాస్త బెదిరిస్తున్నట్టుగానే అంది. ఆలోచనలో పడింది యాదమ్మా. 'నీ కూతురి తిండి బట్ట ఖర్చులు తగ్గుతాయి కదా అని సంపాదన లేకపోయినా గడవదా, నీవు కొడుకు గదా నీవింకో యిల్లు ఎక్కువ చేసుకో, నా మాట విని మీ వాడిని కాస్త ఎక్కడో పనికి కూదుర్చు'. వాడి మీద ప్రేమతో దీని బతుకు బలిపెట్టకు . దీన్ని చదువుకోని"
    'ఆడితో కూడా ఓ మాట అంటాను. మా మరిది వుంటాడు . అల్లతో కూడా అడిగి చూస్తాను." కాస్త మెత్తబడింది. చాటున వింటున్న సుశీల తల్లి మెత్తబడటం చూసి "అమ్మా నేనిదే చెపుతున్నా , నన్ను సదుకోనీయకపోతే యింత యిసం తాగి సస్తా. లేదంటే రైలు కింద తలెడతా. యింట్లోంచి పోతా, యిక్కడుండి నా బతుకునే బతుకుతా. మల్లా నీ మొగం సూడ." గట్టిగా అరిచి విసవిస వెళ్ళిపోయింది సుశీల. యాదమ్మ దిగాలుగా చూసి లేచింది.
    

                                                                                                                ***

    ఆ సాయంత్రం సుశీల చాలా ఆనందంగా వచ్చింది. 'అమ్మగారూ మా అమ్మ వప్పుకుంది. నేనింక యీడనే వుండిపోతా' , సంచి నిండా బట్టలు, స్కూలు బ్యాగులో పుస్తకాలు తెచ్చుకొని సంబరంగా వచ్చింది. 'మీ అమ్మ వప్పుకుందన్నమాట మీ అయ్య ఏమనలేదా' ఆనందంగా అడిగింది అరుణ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS