Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 30

 

అందరం కలిసి శ్రమిద్దాం


    
    ఉత్సాహంతో, ఉల్లాసంతో జరుపుకొనే పండుగ-ఉగాది. తెలుగు వత్సరానికి అది. తెలుగుతనం పల్లవించిన వసంతానికి నాంది.
    శాతవాహనుల నాడే అలల తలదన్ని చెలగిన మహోజ్వల చరిత్రకు వారసులం మనం. కాకతీయులనాడే తెలుగు జోదుల కరవాలాల తళతళ లతో దిక్కులు ఎరుపులు దిద్దుకొన్నాయి. తెలుగు కోయిల కూజంతాలు తేనియలకు తియ్యదనాలు నేర్పాయి. అదంతా ఒక తీయని కల. కాలగర్భంలో కలసిపోయిన ఒక కమనీయ గాథ.
    తెలుగు జాతి నవనవోన్మేషం కావాలని, తెలుగునాడు సర్వతోముఖంగా ప్రగతి పథంలో ముందడుగు వేయాలని, దేశవిదేశాలలో తెలుగుభాషా సంస్కృతి వికసనం కొత్త పుంతలు తొక్కాలని మన ఆశ-ఆకాంక్ష.
    దశాబ్దాలుగా దగాపడ్డ తెలుగుప్రజా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకొంది తను పయనించవలసిన ప్రగతి పథాన్ని-తెలుగుదేశంలో చెదరని విశ్వాసముంచి. పునరంకితమయింది చిత్తశుద్ధితో తెలుగు జాతి పునరుజ్జీవనానికి.
    అందరం కలసి శ్రమిద్దాం అహర్నిశలు. ఉషస్సు లెరుగని, ఉగాదులకు నోచుకోని బడుగు జీవుల చీకటి బ్రతుకులలో నూతన కాంతులు నింపుదాం. ఆంధ్రప్రదేశ్ ని ఆసేతు హిమాచలానికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుదాం. సమైక్యతతో, సమధిక కృషి సాగించి సాధిద్దాం సర్వతోముఖాభివృద్ధిని. మీ అండదండలే, ఆశీస్సులే మాకు కొండంత బలం.
    రక్తాక్షి ఉగాది శుభసందర్భంగా ఆరుకోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజ;లందరకూ, వివిధ రాష్ట్రాలలో, వివిధ దేశాలలో తెలుగు కీర్తి పతాకలుగా వెలుగొందుతున్న తెలుగు ఆడబడుచులకూ, అన్నదమ్ములకూ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రక్తాక్షి మీకు సుఖశాంతి సౌభాగ్యదాయిని కావాలని, మీ కుటుంబాలు పచ్చగా, పరిమళంగా పదికాలాలపాటు పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS