Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 30

 

    కాని అలా జరగలేదు . ముక్కు సూటిగా పరిగెడుతున్న గుర్రాలను రాకసిలా నోరు తెరచి వున్న గుహ ఎదురుగా రాగానే రెక్కలు మొలచినాయి. అవి యింకా పైకి ఎగిరి మబ్బు తునకల మధ్య నించి పోయి పోయి శిఖరాల మీదికి చేరుకున్నాయి.
    రెండు శిఖరాల మీద నుంచి రాజు, రాణి ఒకరి నొకరు చూచుకున్నారు. రాజు అదే చిరునవ్వు నవ్వాడు.
    రాణి అతని కోసం తాను నిలచిన గిరి శిఖరం మీద నించి పరుగు తీయసాగింది. ఆ రెండు శిఖరాల మధ్య వంతెన లాంటిదేమీ లేదు. పరుగుతీసున్న రాణి కొండ కోన కొమ్ముకి వచ్చి లోయలోకి జారిపోవటం ప్రారంభించింది.
    భాధగా రాజు వంక చూచింది. అతడు చెరగని చిరునవ్వు అలాగే నవ్వుతూ కన్పించాడు. రాణి లోయలోకి పడిపోయింది. లేచి దిగులుగా రాజు వంక చూచింది.
    రాజు నెమ్మదిగా చిరునవ్వు నవ్వి తానూ కూడా దిగివచ్చి ఆమెను గాడంగా కౌగలించుకున్నాడు. బాహువుల మధ్య బందీ అయిన రాణి బుగ్గల మీద ముద్దుల ముద్రలు అద్దటం ప్రారంభించాడు.
    ఉక్కిరిబిక్కిరి అయింది రాణి.
    ఊపిరి సలపని స్థితిలో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉలికిపడి లేచి కూర్చుంది జ్యోతి. ఆమెకు కంఠం తడారిపోయింది. లేచి వెళ్ళి పాకలో మూలాన వున్న సొరకాయ డోల్లలోని నీరు మట్టి పాత్రలోకి ఓంపుకుని దాహం తీర్చుకుంది.
    ఏమిటో పిచ్చి కల? అనుకుంది.
    కలలు ఊరికే రావు. అవి పిచ్చిగా అన్పిస్తాయి. కాని విశేషణ చెయ్యగలిగితే అర్ధాలు తెలుస్తాయి. అని ప్రొఫెసర్ శ్రద్దాదేవి  ఒకప్పుడు చెప్పిన మాటలు ఆమెకు జ్ఞాపకం వచ్చినాయి.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవి ఎప్పుడు ఫ్రాయిడ్, యూనస్ లాంటి మనస్తత్వ శాస్త్ర మేధావుల గ్రంధాలు చదువుతూ వుండేది! "కలలు అర్ధరహితంగా కన్పిస్తాయి కాని అవి ఎన్నటికీ అర్ధరహిత మయినవి కావు . అన్వయించుకో గలిగితే వాటి అర్ధాలు ఎవరికయినా స్పురిస్తాయి. విశ్లేషించటంలో మన వివేకం పనిచేయాలి" అని వారు చెప్తారట.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవి  వారు చెప్పే విషయాల్ని ఎంతో సున్నితంగా వివరించి చెప్పేది. ఆ మాటలిప్పుడు జ్యోతికి జ్ఞాపకం వచ్చినాయి.
    అది యదార్ధమయితే ఇప్పటి కలకు కూడా ఒక అర్ధం ఉండి వుండాలి. కలలో కన్పించిన ప్రతి చిన్న అంశాన్ని జ్ఞాపకం తెచ్చుకుని ప్రస్తుత పరిస్తితులకు అన్వయించుకోవడం కోసం ప్రయత్నిస్తోందామె.
    ఆ పచ్చిక మైదానం సజావుగా సాగిపోయిన గత జీవితం. గుర్రాలు ముందుకు అనవతం అవిచ్చిన్నంగా సాగిపోయే కాలానికి సంకేతం. మైదానం ఎదురుగా కన్పించిన సముద్రం సమస్యలు. అందులో కన్పించిన అలలు ప్రమాదాలు, వాటి గురించి తాను భయపడింది. జయకృష్ణ చిరునవ్వుతో వాటిని సమీపించాడు. కాలమే ఇరువురినీ వున్నత పదానికి తీసుకు వెళ్ళింది. ఉన్నత పధమంటే ఆదర్శ మార్గంలో సయినించటం.
    అక్కడా మబ్బుతునకలు , కొండలవంటి అవరోధాలు ఎదురు అయినాయి. బహుశా రాకసి నోరు తెరచినట్లు కన్పించిన గుహ శ్వేతకి తాలుకూ సమాధి గుడి అయివుండాలి.
    గిరి శిఖరాల మీదికి వెళ్ళిపోవటం విజయాన్ని సాధించటమే అన్నమాట. ఈ కాలని ఆధారం చేసుకుని ఆలోచిస్తే ఈ సమాధి గుడి అన్వేషణలో విజయాన్ని సాధించి , విజయమనే గిరి శిఖరాన్ని అధిరోహించాలి ఇరువురూ! కాని కొండ కొనకొమ్ము నించి తాను జారీ పడిపోవటం, జయకృష్ణ చిరునవ్వు నవ్వటం, తిరిగి వచ్చి తనను......ఇంకా ఆలోచిస్తోంది జ్యోతి.
    ఆ రాణి తాను అయితే రాజు జయకృష్ణే! ఛా......ఛా అతనెంత చిలిపివాడు. ముద్దులతో ముఖమంతా అద్దేశాడు. ఉక్కిరిబిక్కిరి చేసేశాడు జయకృష్ణ రాజు! తాను రాణి!!
    ఇలా ఆలోచించగానే జ్యోతికి సిగ్గుతో ముఖం కందగడ్డలా అయిపొయింది. చెంపలు విచ్చిన మందారాల్లా అయినాయి.
    చిత్రమయిన కల గురించి ఆలోచనలు ఇచ్చిన అనుభూతి వల్ల తానున్న స్థితిని మర్చుపోయింది జ్యోతి. మధురతరంగాల వంటి మందహాసాలు ముంచుకు రాగా చేతుల్లో ముఖం దాచుకుంది.
    "దొరసానీ! దొరబిడ్డ నిన్ను రమ్మంది" అన్న పిలుపు విని ఉలికిపడి తలయెత్తి చూచిందామే. అదిమజాతి యువతి ఒకామె ఎదురుగా నిలిచి తనవంక అదొకలా చూస్తోంది. రాత్రి కనిపించిన యువతి లాగే జుట్టు విరియబోసుకుంది. గజం న్నర పొడవు రెండడుగుల వెడల్పూ వున్న చిరు వస్త్రాన్ని మొలకు చుట్టుకుంది. దాని అంచుల్ని నాభి దగ్గర దోపుకోవటం నించి కొసలు పైకి లేచి వున్నాయి. మద్రాసీ పాకశాస్త్ర ప్రవీణుడల్లె మోకాళ్ళ వరకూ వున్న చిరువస్తమది.
    నేకేడ్ గా వున్న పిక్కలు ఉక్కు కండెల్లా కాలు కదిపినప్పుడల్లా కదులుతున్నాయి. పాదాలు చాలా మొరటుగా ధూళి దూసరికంగా ఉన్నాయి. బాహు కండరాలు మగవాడి కండరాల్లా బలీయంగా కన్పిస్తున్నాయి. వక్షస్సు రవంత అచ్చాదనతో బాగా కాలిన తరువాత అములోంచి తీసిన కుండ పింకుల వర్ణాన్ని తలపిస్తోంది.
    జ్యోతి మనసులో మెదులుతున్న సందేహాన్ని వదిలించుకుందుకు "రాత్రి ఏదో వస్తువు దొంగలించి పరుగు తీసింది నీవేనా?" అని అడిగింది .
    అవునని తల ఊగించిందా అమ్మాయి.
    మెడలో వున్న కంచు కడియం కణకణ మ్రోగింది. చెవుల కున్న ఇత్తడి పోగులు ఊగిసలాడినాయి.
    రవంత చిరుదరహాసం కూడా చేసిందా అమ్మాయి.
    "దొంగతనం చేసింది నీవు. "దొంగలా బందీ అయింది నేను ఎందుకు చేసావాపని ------? జ్యోతి నిష్టూరంగా అన్నది.
    ఆదిమజాతి యువతి రవంత నొచ్చుకున్నట్లుగా చూసింది. తెలుగు  నేలపై ప్రవహించే కృష్ణకు ఎగువ భూముల్లో పరిసర ప్రాంతాలు అడవులు కొండలు! ఆ తీర భూముల్లో ఆదిమ జాతుల వారున్నారు.
    ఆదిమ జాతుల సాంప్రదాయంలో ఇంకా కొన్ని ఛాయల్ని మిగుల్చుకున్న కోయ, చెంచు, పరిబగ్గుల, అనాది మొదలయిన వారంతా ఉన్నారు. ఆ తెగలలో ఈ అమ్మాయి ఏ తెగకు చెందినదో ఖచ్చితమయిన అంచనా వేయలేకపోయింది.
    "నీ పేరేమిటి-----?" అడిగింది.
    "లచ్చిమి" అన్నదా అమ్మాయి.
    "చెంచులక్ష్మినా?" నవ్వుతూ ప్రశ్నించింది జ్యోతి. అవునని తల ఊగించింది. "వేగిరం రావే దొరసానీ?" అని హెచ్చరించింది.
    రాబట్టే సమాధానాలను అనుసరించి కావలసిన కొంత సమాచారం అనదటమే కాక వారు తన మీద ప్రమాద కరమయిన దృష్టి తో లేరని కూడ గ్రహించింది జ్యోతి.
    జయకృష్ణ ఏమయినాడన్న ఆరాటాన్ని క్షణం మరచి గుండెల నిండుగా ఊపిరి పీల్చింది జ్యోతి.
    ఆమె వెంట వెలుపలకు వచ్చింది.
    తెలుగు నేలమీది ఆటవిక తేగల అందరి లాగే ఆ గూడెం లోనూ వలయాకారం పాకలు కొన్ని వున్నాయి. అవన్నీ ఒక వర్తులాకారపు పరిధిలో నిర్మించబడి వున్నాయి.
    పాకలేకాక పాకలన్నీ కలిపిన గూడెం కూడా వర్తులాకృతి లోనే వున్నది. మధ్య విశాలమయిన మైదానం వున్నది.
    మైదానంలో రెండు మూడు పెద్ద వృక్షాలున్నాయి. ఓ చెట్టు క్రింద పసుపు కుంకుమలు అద్దిన ఒక స్త్రీ దేవతావిగ్రహమూ, దానికి రెండు ప్రక్కలా నాగ శిలలూ ఉన్నాయి. నాగశిలపై సర్పాకృతులు సగం వరకూ సర్పాలు, నడుము నించి స్త్రీ రూపాలు!
    వాటి పక్కన ఒక మట్టి అరుగు మీద కూర్చుని ఉంది గూడెం పెద్ద. ఆమె చుట్టూ బాలురు, వృద్దులు, ఆడవాళ్ళు వున్నారు.
    దొరసాని రాగానే దొరబిడ్డ అరుగు మీద చోటిచ్చి మర్యాద చేసింది. మిగిలిన వారంతా చేతులు కట్టుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS