సోఫాలో అతని కెదురుగా కూర్చుని వెనుకనున్న అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. ప్రిజ్ వాటర్ తాగుతూ గమనించాడు. ఆమె తదేకంగా చూసుకుంటోంది. దేహాభిమానం ఎక్కువ కాబోలు.
గార్డెన్ సిల్కు చీర మీద ఎంతో అందంగా సెట్ అయిపోయిన నెక్లెస్ ఆమె మెడలో గిలిగింతలు పెడుతోంది.
షీనా చూపులు తన్మయభావంతో అరమోడ్పులయినాయి!
వాటర్ త్రాగిన తరువాత చిన్నగా దగ్గి తల ఎత్తాడు. ఆమె చూపులు త్రిప్పుకుంది. ఆ కొద్ది క్షణాల్లో ఆమె హాబీలు నగల మీద వ్యామోహం, జీవితాన్ని అతిగా అనుభవించాలన్న తాపత్రయం అన్నీ జయసింహకి అర్ధమయినాయి.
కొందరు ఈ జీవిత మంతా విషాదమయం అనుకుంటారు. ప్రమాదాల పుట్ట అనుకుంటారు. భగవంతుడు మనిషి కోరికలకు అడ్డు తగులుతూ ఉంటాడని విషాద భరితంగా ఆలోచిస్తాడు.
ఇంకో రకం మనుషులు జీవితమంతా ఆనందమయంగా అనుభావించాలనుకుంటారు. తెలివిగా ప్రమదాలనించి తప్పుకు తిరగాలనుకుంటారు. భగవంతుడు ప్రతి కూలంగా ఉన్నా తమ ఆనందాన్ని తామే మలుచుకోవాలనుకుంటారు.
జీవితం ఆనంద నిలయం చేసుకోవాలని పరుగెడతారు.
షీనా రెండో తరహ వ్యక్టి అని అర్ధమయింది. ఆమె ఇంకా మిస్! ఆనందానికి చీరలూ, నగలూ, అలంకారాలు చాల మంచిగా ఉపకరిస్తాయని ఆమెకున్న పరిపూర్ణ విశ్వాసం!
"ఐస్ క్రీం తీసుకోండి" అందామె.
"క్షమించండి. చల్లని వస్తువులు తీసుకోవటం అలావాటు లేదు "
"పోనీ కాఫీ యివ్వనా?"
"మీకెందుకు అంత శ్రమ! ఈ నెక్లెస్ ఎక్కడ తీసుకున్నారు?" ఆడవాళ్ళ దగ్గర నగల గురించి ప్రస్తావించి వాళ్ళ దృష్టిలో నిలబడ గలిగితే అతడు చక్రవర్తి కాగలుగుతాడు భవిష్యత్తులో!
"హాజీ సయ్యద్ భాయి గోల్డు షోరూం లో!"
"నట్వర్ లాల్ షాపులో మంచి నగలుంటాయి ' అన్నాడు జయసింహ.
"మీ ఆవిడకి అక్కడే కొంటూ ఉంటారా?"
"క్షమించండి . నాకింకా పెళ్లి కాలేదు. మా చెల్లికి నట్వర్ లాల్ షాపులోనే కొంటూ ఉంటాను"
'అక్కడ ఖరీదు ఎక్కువంటారు . అందుకే నేనెప్పుడూ వెళ్ళాను"
"బంగారు నగలు శాశ్వతంగా ఉండే వస్తువులు కదండీ!"
"అందుకని మనం క్వాలిటీ చూసుకోవాలి. కాని ఖరీదు గురించి ఆలోచించకూడదు " అన్నాడు అన్నీ తెలిసిన వాడిలా!
"వెల్ సేడ్! నేను అంత దూరం ఆలోచించలేదు. ఎకానమీ ఆలోచించాను. ఇంకోసారి అక్కడే తీసుకుంటాను"
"ఇది కూడా బాగానే ఉంది లెండి. ఆ చీర మీద చాల బ్రహ్మాండంగా ఒప్పిస్తోంది" అన్నాడు పొగడ్తగా!
"ఈ చీర మీద బాగుంటుందనే తీసుకున్నాను" అందామె.
జయసింహ మనసులో నవ్వుకున్నాడు. ఎవరయినా నగల మీద మ్యాచింగ్ బట్టలు తీసుకుంటారు. కాని చీర మ్యాచింగ్ కోసం నగలు కొంటారా ఎవరయినా?
అంటే చీరలు నగలు, అలంకారాలు ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె తన్మయురాలై పోతుందన్నమాట! ఒళ్ళు మర్చిపోతుంది.
'చీర బాగుంది. చీర మీద ఆ నక్లెస్ బాగుంది. మ్యాచింగ్ సెలెక్ట్ చేసుకోవటంలో ఉంటుంది అంతా!' అన్నాడు జయసింహ.
'అవునండీ! అందరూ నన్ను అలాగే అంటారు, మ్యాచింగ్ సెలెక్ట్ చేసుకోవటాలు కుదరని వాళ్ళు బ్రతిమాలి నన్ను తీసుకుపోతారు షాపింగ్ కి! అందామె గర్వంగా అదో గొప్ప అయినట్టు.
"మ్యాచింగ్ వేసుకున్నంత మాత్రాన అందరూ అందంగా ఉంటారా?" అలంకారాలకు తగినట్టుగా ఉండాలి మనిషి కూడ!' అంటూ సూత్రా బుద్దమయిన ప్రయోగాన్ని విడిచాడు జయసింహ!
ఆ అస్త్రం వెళ్లి ఎక్కడ తాకాలో అక్కడ తాకింది. గాడిపొయ్యి లాంటి మనసున్న మగాడి చేత అందాన్ని పోగిడించుకోగాలిగిన ఆడది అదృష్టవంతురాలు!
ఆమె పొంగి పోయింది.
"మీలాగా అన్నీ తెలిసిన వాళ్ళుంటే నాకెంతో యిష్టం! మీరు ఏం తీసుకోలేదు. నాకెంతో బాధగా ఉందండీ!"
"నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. మనసు బాగోలేదు."
"అవునవును. మీరు రాగానే నేను అడిగాను. మీరే సంభాషణ పక్కదారి పట్టించారు. ఏమిటి ప్రాబ్లం!"
"నా లాకర్ నంబర్ ఎనబై ఎనిమిది!"
'అవును "కీ" యిచ్చారు కదా! చూశాను"
"ప్రేలుడు ఎలా జరిగిందంటారు?"
"ప్రాధమిక రిపోర్టుల వల్ల ఎక్స్ ప్లోజివ్ ప్రయోగించబడిందని తెలుసుకున్నారు. ఇంకా ఇన్విష్టిగేషణ్ జరుగుతోంది"
"ప్రేలుడు వస్తువు లోనికి ఎలా వస్తుందంటారు?"
"మీరే ఆలోచించండి . బ్యాంకు ఉద్యోగులు అలా చేయటానికి అవకాశం ఉండదు కదా! లాకర్స్ తీసుకున్న వారు ఎవరో వస్తువులు దాచుకునేందుకు వచ్చినప్పుడు పెట్టవచ్చు."
"తమ ప్రాపర్టీతో పాటుగా బాంబు కూడా పెట్టవచ్చు . అలా జరిగి ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం."
"అంతకన్నా అద్భుతమయిన రహస్యం మరేదయినా ఉందేమో ఇన్వెష్టిగేషణ్ లో తెలిసిపోతుంది కదా!"
"అవును! మీరు నాకొక రహస్యం చెప్తానన్నారు . గుర్తుందా?"
"నాకు మతిమరుపు చాలా ఎక్కువ! క్షమించండి!"
"నేను లాకర్ తీసుకున్న తరువాత ప్రేలుడు జరిగింది కొద్ది రోజులకే! ఈ మధ్య కాలంలో ఎవరయినా లాకరు తీసుకున్నారా?"
"అవునండీ అడిగారు కదూ! రిజిష్టర్ చూశాను. అడ్రస్ వ్రాసుకున్నాను. ఇలాంటివి చెప్పకూడదు."
"ఒక్కొక్కసారి ప్రమాదం జరుగుతుంది. అయినా తెలుసుకుని ఏం చేస్తారు? అందువల్ల మీకు ప్రయోజనం ఏమిటి?" అని అడిగిందామె.
"పగిలిపోయిన లాకర్స్ ఎప్పుడు ఎవరు తీసుకున్నారో తెలుసుకున్నందు వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది ."
"అనుమానించదగిన వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుందామని."
'అది పోలీసులు చేయవలసిన పని కదా!"
"మనం చేసే ఇన్వేష్టిగేషన్ వారికి సాయపడవచ్చు కదా!"
"అవునవును. అది మీ తప్పు కాదు" ఆమె లేచి వెళ్ళి వాలెట్ లో దాచి ఉంచిన ఓ చిన్న స్లిప్ తెచ్చి యిచ్చింది."
దాని మీద లాకరు తీసుకున్న వ్యక్తీ పేరు, లాకర్ నెంబర్! తేదీ అన్ని వివరాలు ఉన్నాయి. అది చదివి నిర్ఘాంతపడిపోయాడు.
లాకర్ ప్రియాంక పేరు మీదుగా ఉంది. తాను తీసుకున్న తరువాత మూడవ రోజు లాకర్ బుక్ అయింది.
అతని కన్నులు అమితాశ్చర్యంగా విప్పారుకున్నాయి.
"ఫిమేల్ అనుకుంటాను. బహుశా నగలు దాచుకునేందుకు తీసుకుని ఉండొచ్చు" అంది షీనా.
"ఈమె మీ బ్యాంక్ కి వచ్చిందా ? మీరు చూశారా?"
"లాకర్ తీసుకునెందుకు బ్యాంక్ కి రావాలి. రాకుండా తీసుకునేందుకు కూడా పద్ధతులున్నాయి. ఎలా జరిగిందో నాకు తెలియదు. లాకర్స్ మెయిన్ టెయిన్ చేసేందుకు వేరే అకౌంటెంట్ ఉన్నారు."
"ఎవరో పాపం! నగలు దాచుకునేందుకు తీసుకుని ఉంటుంది. ఆమెను అనుమానించటం చాలా పొరపాటు"
"మీరు చేసిన సాయానికి చాలా థాంక్స్!" ఇంకా ఆ టాపిక్ పొడిగించాల్సిన అవసరం లేదన్నట్లుగా చూశాడు.
అప్పటికే షీనా అటెండర్ కోసం ఎదురు చూస్తోంది. వచ్చే వేళ అయింది. ఏ క్షణంలో అయినా రావచ్చు.
"మళ్ళీ ఎప్పుడు కలుస్తారు ?" అందామె. గ్రీన్ సిగ్నలు యిచ్చేసిందని అర్ధం చేసుకున్నాడు జయసింహ.
