"కానీ నా కండ బలం , భుజబలం వాళ్ళకు అవసరం లేదనీ మరొక మార్గంలో ఉద్యోగం సంపాదించవచ్చని వాడి మాటలను బట్టి తెలిసింది. ఇంకెందుకు ఈ శరీరాన్ని ఇలా పోషించాలి. అందుకే నేటి నుంచి విస్కికి దాసోహం అంటున్నాను" తడబడిపోతున్న కంఠంతో తన హృదయ ఘోషను బయట పెట్టాడు సునిల్.
"అలాంటి నిర్ణయం తీసుకోవద్దురా.....నువ్వంటే ప్రాణం యిచ్చే ధీరజ కోసం అయినా నువ్వు తాగుబోతువి కావడానికి వీలులేదు" నచ్చ చెప్పాడు ఒక స్నేహితుడు.
"నా జీవితాశయం నేరవేరనప్పుడు నేనేమయినా అవుతాను. నా జీవితం నా యిష్టం...ధీరజ కాదు కదా ఎవరూ నన్ను శాసించలేరు.....తాగుబోతుగానే గాదు కావాలంటే తిరుగుబోతుని కూడా అవుతాను. ఏం చేస్తారు మీరు ...." కిక్కు ఎక్కువై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న సునిల్ వైపు చూసి బాధతో నిట్టుర్చారు మిత్రులు ఇద్దరూ.
బేరర్ ను పిలిచి బిల్ పే చేసి సునిల్ ను నడిపించుకుంటూ బయటకు తీసుకు వెళ్ళారు. ఒక ఆటోను కేకవేసి అతన్ని ఎక్కించి అడ్రస్ చెప్పి అటో వాడికి డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా తీసుకు వెళ్ళమని చెప్పి వెళ్ళిపోయారు అతని మిత్రులు.
అటో బయలుదేరింది.....
ఉన్నట్టుండి ఆటోవాడికి ఏదో ఆలోచన వచ్చినట్టుంది.
బీచ్ రోడ్ దగ్గరకు రాగానేసునీల్ ను బలవంతంగా ఆటోలో నుంచి దించి రోడ్ పక్కనే పడుకోబెట్టి వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
బాడుగ తోలకుండానే డబ్బులు ముట్టినందుకు ఆనందంగా ఉంది ఆ అటోవాడికి.
దాదాపుగా నర సంచారం ఆగిపోయినట్టు అప్పుడప్పుడు ఆ రోడ్డు పై నుంచి ఏదో ఒక వెహికల్ వెళుతూనే వున్నది.
ఎవరూ సునీల్ ను గమనించలేదు.
నెమ్మదిగా డ్రయివ్ చేసుకుంటూ వస్తున్నా ఒక పెద్ద మనిషి దృష్టి దూరంగా హెడ్ లైట్స్ కాంతిలో ఎవరో మనిషి పడి ఉండటాన్ని గమనించింది.
సునిల్ పక్కనే కారును ఆపి చుట్టూ పరిశీలించి చూశారు.
ఎవరూ కనిపించలేదు.
ఒక నిమిషం అలోచించి మందు మత్తు. నిద్రమత్తులో మునిగి పోయి వున్న సునిల్ ను కారు వెనుక సీట్లో పడుకోబెట్టి స్టీరింగు ముందు కూర్చున్నాడతను.
మరునిమిషంలో మెత్తగా దూసుకుంటూ వెళ్ళిపోయింది ఆ కారు.
* * *
సునిల్ కళ్ళు భారంగా విచ్చుకున్నాయి.
ఒళ్ళంతా నొప్పులు-----
రాత్రి బాగా తాగడం వల్లనేమో తలంతా దిమ్ముగా వున్నట్టు అనిపించడంతో బలంగా తల విసిలిస్తూ లేచి కూర్చున్నాడు.
బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు.
ఎదురుగా నున్న గోడపై అర్ధ నగ్నంగా వున్న సుందరీమణి నిలువెత్తు వాల్ పెయింటింగ్ చూడ ముచ్చటగా వున్నది.....తన గదిలోకి ఆ కళాఖండం ఎలా వచ్చిందో ననుకుంటున్నంతలోనే తను మెత్తని పరుపుపై వున్నానన్న విషయం అర్ధం అయింది.
గాభరాగా నలువైపులా చూశాడు.
ఖరీదయినా ఫర్నిచర్ తో విలసవంతుల పడకగది ఎలా వుంటుందో ఇప్పుడు స్పష్టంగా కళ్ళతో చూడగలుగుతున్నాడు సునిల్.
ఇది తన గది కాదు.
ఏం జరిగి ఉంటుందో, తను ఇక్కడకు ఎలా వచ్చాడో ఒక పట్టాన సునిల్ కు అర్ధం కాలేదు.
రాత్రి బార్ కు వెళ్ళడం, ఎక్కువ మందు తీసుకోవడం బలవంతంగా స్నేహితులు తనను బయటకు తీసుకురావడం అన్నీ ఒకదాని వెంట ఒకటి గుర్తుకు వచ్చాయి.
మరి స్నేహితులు తన రూమ్ కు తీసుకు వెళ్ళకుండా ఇక్కడకు ఎందుకు తెచ్చినట్టు?
అలా అలోచిస్తున్నంతలోనే ఖరీదయిన బట్టలు ధరించిన వ్యక్తీ ఒకతను ఆ గదిలోకి వచ్చాడు.
"గుడ్ మార్నింగ్ మిస్టర్ రాత్రి సుఖంగా నిద్ర పట్టిందను కుంటాను."
ఆశ్చర్యంతో తల మునకలై పోతూ అతని వైపు చూశాడు.
"మీరు ఎవరు? అసలు నేను ఇక్కడకు ఎలా వచ్చాను?"
రాత్రి నేనే తీసుకువచ్చాను.... ముందు తలస్నానం చేయి.....మత్తు వదులుతుంది. హాయిగా రెస్ట్ తీసుకో..... నీ కధ తరువాత చెబుదువు గానీ!
"మీరు నన్ను తీసుకురావడం ఏమిటండీ?"
"రాత్రి నేను బార్ కు వస్తుండగా బీచ్ రోడ్ పక్కనే నువ్వు పడి ఉండడం చూసి నా కారులో తీసుకొచ్చాను, మా బార్ లోని కుర్రాళ్ళు నిన్ను గుర్తుపట్టి అంతకు కొద్ది నిమిషాల క్రితమే నువ్వు మా బార్ లోనే చిత్తుగా తాగావని., నిన్ను ఫ్రెండ్స్ బలవంతంగా బయటకు తీసుకు వెళ్ళారనీ చెప్పారు సో.....వాళ్ళే నిన్ను అక్కడ వదిలి వెళ్ళి ఉండాలి" అన్నాడతను.
"నో .....వాళ్ళు ఎందుకు అలా వదిలి వెళ్ళిపోతారు..... అటో ఎక్కించడం కూడా తెలుసు నాకు"
'అయితే .....ఆటోవాడు వదిలేసి వెళ్ళి వుంటాడు"
"కావచ్చు ......మీరు ఆ బార్ లో ......."
"ఆ బార్ ఓనర్ ని నేనే! అదే, ఆ విషయాలన్నీ తరువాత మాట్లాడు కోవచ్చు ముందు నువ్వు స్నానం చేసి రా!" అన్నాడు ఆ పెద్ద మనిషి.
"మీ పేరు?"
"గజపతి .....నువ్వు తాగి కోపంతో మాట్లాడిదంతా మా కుర్రవాళ్ళు విని నీ గుర్తించి చెప్పారు.... ఉద్యోగం రాలేదని ఎంతగానో నిరుత్సాహ పడుతున్నావు గానీ, నీ బాడీ క్యాలిఫికేశన్స్ కు తగినది నీలాంటి వాడు చేయవలసిన ఉద్యోగం ఒకటి ఉంది. ఆ పని నీలాంటి దృడమయిన యువకుల వల్లనే సాధ్యపడుతుంది. ఆ ఉద్యోగం నేను ఇస్తాను. చేయడానికి నీకు ఏమయినా అభ్యంతరమా?" ఒక నిమిషం ఆగాడు గజపతి.
"ఉద్యోగమా ........చేస్తాను.......కానీ!"
"నో మోర్ క్వచ్చన్స్.....నీ అర్హతలకు తగిన జాబ్ నేను ఇస్తానంటున్నానుగా ........ముందు విశ్రాంతి తీసుకో.... ఇక్కడ నీకు ఏ లోటూ వుండదు. బెల్ నొక్కితే బోయ్ వస్తాడు. ఏం కావాలన్న క్షణాల మీద సప్లయ్ చేస్తాడు. భోజనం చేసి విశ్రాంతి తీసుకో.....మళ్ళీ వచ్చి కలుస్తాను" అంటూ వెళ్ళిపోయాడు గజపతి.
అయోమయంగా తలాడిస్తూ వుండిపోయాడు సునీల్.
ఈ రోజుల్లో ఎవరూ మరొకరిపై జాలి, సానుభూతి కురిపించరు. అలా చేశారంటే అతనితో తప్పనిసరిగా ఏదో వొక ప్రయోజనం వుండి తీరుతుంది. ఎలాంటి ఉపయోగం లేకుండా ముక్కు మొహం తెలియని వ్యక్తిని ఆదరించరు. ఆ విషయం సునీల్ కు తెలియనిదేమి కాదు.
అందుకే ఆ పెద్దమనిషికి తనతో ఏం అవసరం ఉండి వుంటుందో ఆలోచించే ప్రయత్నం చేశాడు. అసలే తలంతా దిమ్ముగా ఉండడం వలన కాబోలు ఆలోచిస్తున్న కొద్ది తల వాచిపోతుంది.
అన్యమనస్కంగానే లేచి బాత్ రూమ్ కి వెళ్ళాడు.
స్నానం ముగించి కాలింగ్ బెల్ నొక్కాడు.
"ఏం కావాలి సార్?" అంటూ సర్వీస్ బోయ్ వచ్చాడు.
"నన్ను ఇక్కడకు తెచ్చిన పెద్ద మనిషి ఎవరు?" సూటిగా ప్రశ్నించాడు సునీల్.
"అయన మా యజమాని గజపతి గారూ"
"అంటే నిజంగానే అయన బార్ ప్రొప్రయిటరేనా?"
"అవును"
ఒక క్షణం మౌనం వహించాడు సునిల్.
"ఏమయినా కావాలా సార్"
ఆ... టిఫిన్ ఉంటుందా?"
"తెస్తాను సార్" అంటూ వెళ్ళిపోయాడు సర్వీస్ బోయ్.
గజపతి చెప్పింది నిజమే నన్నమాట. అతను బార్ ప్రోప్రయిటర్ అయితే తనవలన ఏ ఉపయోగం ఉంటుందో ఊహించే ప్రయత్నం చేశాడు.
