Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 30

 

    "ఏమిటి మట్టాడవు ...... ఏమయింది నీకు?"
    'అబ్బే ...నాకేం అయింది , ఏమీ కాలేదు ..ఐయామ్ అల్ రైట్" లేచి నవ్వును ముఖాన తెచ్చుకుంటూ అన్నాడు సునీల్.
    "అవునూ ---- ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేశావు, ఏది అయినా ఊరు వెళ్ళావా"
    "లేదు ధీరూ .....ఎక్కడకూ వెళ్ళలేదు"
    "మరి ఎప్పుడూ వచ్చినా నీ రూమ్ కు తాళం వుంటుందే ...." అనుమానంగా చూస్తూ అన్నది.
    "ఎక్కువ కాలం ఈ సముద్రపు ఒడ్డునే గడుపుతున్నాను, నువ్వు ఇక్కడకు వచ్చి వుండవు అందుకే నీకు నేను కనిపించలేదు."
    సునీల్ మాటలలో ధ్వనిస్తున్న నిరాశను పసిగట్టింది ధీరజ.
    "ఇంకా నువ్వు మారలేదు. జరిగింది మరచిపోయి కొత్త జీవితం వైపు ఆశతో ఎదురుచూడాలి తప్ప నిరాశతో కుంగి పోకూడదు."
    "నిజమే ....నేనూ అలానే అనుకుంటున్నాను కానీ....."
    అతని గొంతు పోరబోయింది."
    ఏయ్....., అదిగో మరలా అంతలోనే ...." అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నది.
    "ఏమీ లేదు.....ఐయామ్ అల్ రైట్....." తడబడిపోతూ చెప్పాడు సునీల్.
    అతను తన మనస్సులో ఏదో మధనపడుతున్నాడనీ .....తన బాధను చెప్పుకోలేక పోతున్నాడనీ ఆమెకు అర్ధం అయింది.
    ఇక అతనిని ఒత్తిడి చేసి తరచి తరచి ప్రశ్నించే కన్నా మాములుగా వదిలేస్తేనే మంచిది అనిపించింది.
    కొన్ని కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపిస్తుంది."
    "ధీరూ ......నువ్వూ ఏదో చెప్పాలని వచ్చి అలా మూగనోము పట్టావేం" వాతావరణాన్ని తేలిక పరచడం కోసం అన్నాడు సునీల్.
    "నాకు ట్రయినింగ్ ఆర్డర్స్ వచ్చాయి...రేపే హైదరాబాద్ వెళ్ళాలి."
    "కంగ్రాచ్యులేషన్స్..... కనీసం నిన్ను అయినా పోలీస్ ఆఫీసర్ గా చూడాలనే నా కోరిక నెరవేరుతుంది అన్నమాట...." ఆమె చేతిని అందుకుంటూ అన్నాడు.
    "నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి."
    "యేమిటది?"
    "ముందు ప్రామిస్ చెయ్ .....తరువాత చెబుతాను."
    "సారీ ధీరూ..... విషయం యేమిటో తెలియకుండా మాట ఇవ్వలేను"
    నిర్మొహమాటంగా చెప్పాడు సునీల్.
    అంతకు ముందు ఎప్పుడూ అలా మాట్లాడి ఎరుగడు. కానీ అతని నుంచి అలాంటి సమాధానం వస్తుందని ఊహించని ధీరజ వాతాశురాలు అయింది.
    "అది కాదు సన్నీ....ట్రయినింగ్ కోసం నేను హైదరాబాద్ కు వెళ్ళాలి కదా....నేను అక్కడ నువ్వు ఇక్కడ ఒంటరిగా గడిపే కన్నా ఇద్దరమూ కలిసే వెళదామని"
    "అంటే......"
    "పెళ్ళి చేసుకుని జంటగా వెళదాము."
    "సారీ ధీరూ ...... నాకు ఇప్పట్లో పెళ్ళి చేసుకోవాలని లేదు."
    "ఎందుకని?"
    "కారణం అడగవద్దు , మన పెళ్ళి జరగదు అంతే"
    "ఇందాక ఇప్పట్లో పెళ్ళి చేసుకోవాలని లేదు అన్నావు.... ఇప్పుడు మన పెళ్ళి జరగదు అంటున్నావు. అసలు నీ ఉద్దేశ్యం ఏమిటి? ఒకరికొకరు తోడుగా ఉండాలని మనం ఎన్ని బాసలు చేసుకున్నాం. అప్పుడు ఇద్దరమూ నిరుద్యోగులమే, ఇప్పుడంటే నాకు ఉద్యోగం వచ్చింది, నీకు రాకపోయినా ఫరవాలేదు. మన ఇద్దరిలో ఎవరికి వచ్చినా ఒకటే కదా! మనలో మనకు అలాంటి బేధాలు లేవని ఆశపడ్డాను. ఒకవేళ మన పెళ్ళికి నేను ఉద్యోగస్తురాలిననే కారణం అడ్డు అయితే నాకు ఆ ఉద్యోగం వద్దు....అసలు హైదరాబాద్ వెళ్ళనే వెళ్ళను"
    ఉబికి వస్తున్నా కన్నీటిని పంటి బిగువున నొక్కి పెడుతూ అన్నది ధీరజ.
    "ప్లీజ్ ధీరూ! అలా అపార్ధం చేసుకోకు నాకు వుండే కారణాలు నాకు వున్నాయి."
    "ఏమిటవి నాకు తెలియని రహస్యాలు నీకు వున్నాయన్నమాట?"
    "తప్పదుగా రేపటి నుంచి ఎవరి మార్గం వాళ్ళు ఎంనుకోవాలిగా!"
    "నీ మాటలు నాకు అర్ధం కావడం లేదు. నీ మాటలలో ఏదో గూడార్ధం స్పురిస్తుంది."
    "ఏమీ లేదు ధీరూ ! నా బతుకు తెరువు కోసం నేను ఏదో ఒకటి చూసుకోవాలిసిందేగా అంటున్నాను. నాగురించి ఆలోచించవద్దంటున్నాను. ఎవరి భవిష్యత్ వాళ్ళు చూసుకోవాలి. నువ్వు ట్రయినింగ్ కు వెళుతున్నావు ....నా కంటితో నిన్ను ఒక పోలీస్ ఆఫీసర్ గా చూడాలి దట్స్ అల్! ఇంకేం ఆలోచించకు ప్లీజ్ గో హెడ్"
    "అంతమాట అనకు సన్నీ. ఐ లవ్ యూ నువ్వు లేకుండా నేను వుండలేను"
    "ప్లీజ్ ధీరూ......నన్ను అర్ధం చేసుకో! ముందుగా ఒకరిపై ఒకరు ఆశలు పెంచుకోవడం అవివేకమే అవుతుంది. నువ్వు సంతోషంగా ట్రయినింగ్ కు వెళ్ళు తరువాత తీరికగా ఆలోచిద్దాం!"
    ధీరజను కన్నీటితో సాగనంపాడు సునిల్.
    ట్రయినింగ్ వెళ్ళిన ధీరజకు తరువాత ఇన్ స్పెక్టర్ గా హైదరాబాద్ లోనే పోస్టింగ్ ఇచ్చారు....తరువాత ఎంత ప్రయత్నించినా సునిల్ ఆచూకీ తెలియలేదు.
    ఎనిమిది సంవత్సరాల కాలం ఇట్టే గడిచిపోయింది.
    ధీరజ డెప్యుటేషన్ మీద పోలీస్ ఇన్ స్పెక్టర్ గా విజయవాడ రైల్వేలో జాయిన్ అయింది.
    ఈ మధ్యకాలంలో సునిల్ ........ధీరజ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా లేకుండా పోయాయి.
    ఇరువురి గమ్యాలు వేరయ్యాయి......


                                                       *    *    *


    డాల్ఫిన్ బార్ అండ్ రెస్టారెంట్........
    రంగురంగుల బల్బులా కాంతిలో బార్ కొత్త అందాలను సంతరించుకున్నట్టు ఉంది.
    ఒక మూలగా వున్న టేబుల్ దగ్గిర కూర్చుని వున్న సునీల్ అప్పటికీ అరగంట నుంచి తాగుతూనే ఉన్నాడు.
    అతనితో పాటు ఉన్న స్నేహితులు ఇద్దరూ వద్దని వారిస్తున్నా వినిపించుకోవడం లేదు.
    వాళ్ళ టేబుల్ ప్రక్కనే వున్న ఇంకొక టేబుల్ దగ్గిర మందు కొడుతున్న ఇద్దరు యువకులలో ఒకడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు.
    అతను మాట్లాడే ప్రతి మాటా సునిల్ గుండెను రంపపు కోతకు గురిచేస్తుంది.
    "రేయ్ ......అక్కడ వున్నాడు చూడరా.....వాడు పెద్ద పొటుగాడిలా వచ్చాడు. పోలీస్ ఆఫీసర్ అవుతాడట.......కండలు దండిగా పెంచగానే సరిపోతుందా......ఎప్పుడు ఎవరిని ఎక్కడ పట్టుకోవాలో తెలియని దద్దమ్మా...... సబ్ ఇన్ స్పెక్టర్ సెలక్షన్స్ కోసం కావలసింది బాడీ బిల్డింగ్ అనుకుంటున్నాడు.
    "ఆ మాత్రం లోకజ్ఞానం లేనివాడు రేపు ఎస్.ఐ అయితే మాత్రం ఏం లాభం? టెస్ట్ లలో పాస్ కావడానికి మేధస్సు ఒక్కటే ఉపయోగించదు కమిటీలో ఉన్నవాళ్ళు బలహీనతలను కాచ్ చేయడం తెలియాలి. అతనికి ఎన్ని తెలివి తేటలు ఉన్నా చివరకు ఏమీ లేని నాలాంటి వాడు సెలెక్ట్ అవుతాడే తప్ప ఎన్ని జన్మలు ఎత్తినా అతను మాత్రం పోలీస్ సెలక్షన్ లో సెలక్ట్ కాలేడు."
    ఆ మాటలు సునీల్ కు మరింత కిక్ ను ఎక్కించాయి.
    "వెధవ ......తాగి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. వాడికి  లెప్ట్ అండ్ రైట్ ఇవ్వవలసిందే...." అంటూ సునిల ఫ్రెండ్స్ ఇద్దరూ ఆవేశంగా లేవబోయారు.
    "ఊరుకొండిరా వాడు చెప్పేది నిజమే"
    ఆశ్చర్యంగా నోళ్ళు వెళ్ళబెట్టారు మిత్రులు.
    "ఎస్ -----వాడి మాటలలో నిజం లేకపోలేదు. నాలాంటి వాడు ఏదో ఉద్దరిద్దాము అని పోలీస్ ఆఫీసర్ కావాలని ఆశపడడం తప్పు. ఎప్పటికైనా పోలీస్ యూనిఫారం వేయాలని నేను వువ్విళ్ళూరిన మాట నిజం. ఆ మాట తలుచుకుంటేనే నా మనస్సు ఉప్పొంగిపోయేది. అందుకోసం చెయ్యని ఎక్సర్సైజులు లేదు.......ఎక్కడ ఏ స్పోర్ట్స్ కాండక్ట్ చేసినా నేనే స్పోర్ట్స్ ఛాంపియన్ గా వచ్చాను.....
    "నాలోని నరనరమూ ఎప్పుడెప్పుడు సెలక్షన్స్ జరుగుతాయా అని ఆనందంతో ఎదురు చూశాయి. తీరా ఆ అవకాశం వచ్చింది కానీ నేను సబ్ ఇన్ స్పెక్టర్ గా తగనని తేల్చి చెప్పారు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలో రూపుదిద్దుకున్న నా వూహలకు అనుగుణంగా నా శరీర దారుడ్యాన్ని పెంచుకున్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS