ఇల్లీగల్ కార్యక్రమాలేమయినా చేస్తున్నాడేమో! డబ్బు సంపాదించాలంటే అక్రమ మార్గాలను ఎన్నుకోవడం బార్ యజమానులకు కొత్త ఏమి కాదు. తను వుహించింది నిజమే అయితే తప్పనిసరిగా ఏ చండలామయిన పనులో చేస్తుండాలి. అందుకు ఎవడో ఒకరిని బలిపశువును చేయాలి కాబట్టి అతని అదృష్టం కొద్ది తన దురదృష్టం కొద్ది తను అతని కంట పడ్డాడు.
ఎస్.....అదే అయుండాలి.
లేదంటే దారివెంట దానయ్యాలు పడి వుండగా లేనిది........ ఎందరో ఉద్యోగాలు లేక అలమటిస్తున్నప్పటికీ ఎంతో ఉదారంతో తనపైనే సానుభూతి చూపించడానికి వేరే కారణాలు ఉంటాయని ఆశించడం అవివేకమే అవుతుంది.
అసలు, అతను ఏం చెబుతాడో ముందు చూసి, తరువాత తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పి వెళ్ళిపోదామానే అభిప్రాయానికి వచ్చాడు సునిల్.
ఆరుగంటల ప్రాంతంలో వచ్చాడు గజపతి.
"మైడియర్ సునిల్ ఏమాలోచించావు?" వచ్చీ రావడంతోనే ప్రశ్నించాడతను"
"నాలాంటి నిరుద్యోగికి పిలిచి ఉద్యోగం ఇస్తానంటుంటే వద్దని ఎవరంటారు. కానీ ఎలాంటి ఉద్యోగమో తెలుసుకోకుండా చేయలేను."
"ఎవరయినా ఉద్యోగం దొరికితే చాలునని ఆశపడే ఈ రోజులలో నీలా కండిషన్స్ పెడితే నీకు ఈ జన్మకు ఉద్యోగం దొరకదు. జాబ్ ఇప్పించే నాలాంటి వాడు పెట్టవలసిన కండిషన్స్ నువ్వు పెట్టడం నాకు నవ్వు తెప్పిస్తుంది... అయినా నీ మానసిక స్థితి అంచనా వేయగలిగాను కాబట్టి నీ మాటలకు కోపం రావడం లేదు. నీ సందేహాలు ఎలాంటివయినా నిరభ్యంతరంగా తీర్చుకోవచ్చు" చిరునవ్వుతో అన్నాడు గజపతి.
"ఎలాంటి చట్ట వ్యతిరేకమయిన పనులు నాచేత చేయించకూడదు - నా ఆత్మాభిమానం ఎప్పుడు దెబ్బ తింటే అప్పుడే మానివేస్తాను. అందుకు మీరు అభ్యంతరం చెప్పకూడదు"
"ఓస్ అంతే కదా ----నీ ఇష్ట ప్రకారం గానే నీకు ఆ స్వేచ్చ ఇస్తున్నా...... అసలు నీకు నేను ఎందుకు ఉద్యోగం ఇస్తున్నానో తెలుసా? నేను నీలాగానే ఒకప్పుడు నిరుద్యోగి జీవితాన్ని గడిపినవాడినే. జీవితంపై ఎంతటి విరక్తి పెరుకుపోతుందో నాకూ అనుభవమే....బహుశా నేను పడినన్ని బాధలు ఎవరూ పడి వుండరు. నీలానే ప్రతి నిరుద్యోగి తనే లోకంలో ఎక్కువ పడుతున్నాననుకోవడం మామూలే ననుకో.....
"ఒక్కపూట తినడానికి కూడా తిండి దొరక్క అర్ధ రూపాయితో బన్ను కొనుక్కొని నీళ్ళు తాగిన రోజులు ఎన్నో ఉన్నాయి. అందుకే ఈరోజున ఏ నిరుద్యోగి కనిపించినా ఒకప్పటి నా దుర్భర జీవితం గుర్తుకొచ్చి బాధపడుతుంటాను. నా అన్నా వెళ్ళేవరూ వాళ్ళను ఆడుకునే ప్రయత్నం చేయరు. ఆ నరకాన్ని అనుభవించిన వాళ్ళకే అది అనుభవం అవుతుంది.
"అనుకోకుండా ఒక ధనవంతురాలి అమ్మాయితో నా పరిచయం ప్రేమగా మారి , పెళ్ళి చేసుకుని ఈరోజున సంఘంలో లక్షాధికారిగా నిలవగలిగాను. కానీ నిరుద్యోగ యువకులు ఎవరు కనిపించినా , వాళ్ళు పడే మానసిక వేదన నాకు తెలుసు కాబట్టి నాకు చేతనయినంత వరకు వాళ్ళకు సహాయపడటానికి ప్రయత్నిస్తుంటాను.
"కానీ చాలామంది ఇంత చదువు చదివి బార్ లో ఉద్యోగం చేయడం ఏమిటి అని మానేసి వెళ్ళి పోతుంటారు. వాళ్ళ ఖర్మకు జాలిపడటం మినహాయించి ఏం చేయగలను చెప్పు .....ఇప్పుడు నువ్వు కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నావు ......అంతే తప్ప నీవలన నాకేదో స్వప్రయోజనం ఉంటుందని అపోహ పడటమూ తప్పే!"
గజపతి మాటలలోని తీక్షణత సునిల్ మనసును కలవరపరిచింది.
తను అనవసరంగా అతని సహాయాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు తనను తనే నిందించుకున్నాడు.
"నన్ను క్షమించండి గజపతి గారూ"
"ఇట్స్ అల్ రైట్ మై బోయ్ .........ఎవరయినా నీలానే ఆలోచిస్తుంటారు అదేమీ తప్పు కాదులే."
తన ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో అర్ధం కాక సునీల్ మౌనం వహించాడు.
గజపతి వాగ్దానం చేసినట్టుగానే అతనికి తన బార్ లో సూపర్ వైజర్ ఉద్యోగాన్ని ఇచ్చాడు.
బార్ లో ఎలాంటి గొడవలు జరగకుందాం బార్ లో పనిచేసే ఉద్యోగస్తులందరూ సక్రమంగా తమ విధులు నిర్వర్తించేలా కంట్రోల్ చేయడం అతనికి అప్పగించిన బాధ్యతలు.
తన జీవితంలో తప్పనిసరిగా వసంతం తొంగి చూస్తుందనే ఆశతో ఆ ఉద్యోగానికి పూర్తిగా అంకితమై పోయాడు సునిల్.
* * *
హై హీల్డ్ చెప్పులు టకటకమనే చప్పుడు వినిపించడంతో ఉలిక్కిపడి వెనుతిరిగి చూశాడు సునిల్.
నిలువెల్లా చీరతో అసలు సిసలయిన భారతీయ వనితలా వున్న అందాల భరిణె కనువిందు చేసింది.
కాళ్ళకు వున్న చెప్పులు తప్పితే ........పదహారణాల పడతిగా నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
అప్పుడే ఆ యువతి కూడా సునిల్ ను చూసింది.
"ఎవరబ్బా ఈ హాండ్ సమ్ పర్సనాలిటీ?"
కళ్ళు ఆర్పకుండా ....దిశ మార్చకుండా అతని వైపు చూస్తూనే నడుస్తుంది ఆమె.
సునిల్ అడుగులు వేగంగా పడుతున్నాయి.
స్మూత్ గా వున్న ప్లోరింగ్ పైన ఆమె అడుగులు తడబడ్డాయి.
హై హీల్డ్ చెప్పులు కావడం వలన వెంటనే స్లిప్ అయి జర్రున జారింది ఆమె.
సరిగ్గా ఆమె కింద పడే సమయానికి లాఘవంగా తన చేతులతో ఆమెను పడిపోకుండా పొదివి పట్టుకున్నాడు సునిల్.
దాదాపుగా ఆమె ముఖం సునీల్ చాతికీ అతుక్కు పోయినట్టుంది.
తను వున్న స్థితి వెంటనే గమనించిన ఆ సుందరి ఖంగారుగా అతని చేతులలో నుండి దూరంగా జరిగింది.
సునిల్ కు కూడా ఆ సన్నివేశం ఎబ్బెట్టుగానే అనిపించింది.
"థాంక్యు హెండ్ సమ్ ....." అతనికి మాత్రమే వినిపించేలా మెల్లగా చెప్పి బార్ లోపలకు వెళ్ళిపోయింది.
ఆమె తన అందాన్ని మెచ్చుకున్నందుకు అనందించవలసినది పోయి సలక్షణంగా వున్న సుందరి ఈ బార్లోకి వచ్చింది ఏమిటి చెప్మా అని ఆలోచనలో పడిపోయాడు సునిల్.
ఉన్నట్టుండి ఎనౌన్స్ మెంట్ వినిపించింది.
"సెక్స్ అప్పీల్ బ్యూటీ మిస్ రేష్మా కొద్ది నిమిషాలలో తన తళుకు బెళుకులతో షేక్ అండ్ బ్రేక్ లతో సమ్మోహితులను చేయడానికి వస్తుంది.
కస్టమర్లు హుషారుగా నిషాలో చప్పట్లు కొట్టారు. కొందరు అయితే ఆనందాన్ని పట్టలేక విజిల్స్ వేశారు. మరికొందరయితే హుర్రే అంటూ కేకలతో చిందులు వేశారు.
అప్పటికి సునిల్ ఉద్యోగంలో చేరి వారం రోజులు అవుతుంది.
ఈ వారంలో గజపతి మంచితనం అతనికి అర్ధం అయింది బార్ లోని ఉద్యోగస్తులందరితో సునిల్ మంచి స్నేహాన్ని సంపాదించగలిగాడు.
ఇన్నాళ్ళు లేనిది ఈరోజు డాన్స్ ప్రోగ్రాం అంటున్నారేమిటి అనే అనుమానం వచ్చింది అతనికి. తన అనుమానాన్ని తీర్చుకోవడానికి ఒక స్టీవర్ట్ ను దగ్గరకు పిలిచి అడిగాడు.
"మన బార్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ ఆగిపోయి చాలా కాలం అవుతుంది, పోలీసులు ఒకసారి రైడ్ చేసి కేసు పెట్టారు. కోర్టులో స్టే తెచ్చే సరికి తిరిగి మళ్ళీ మొదలవుతున్నాయి ఈ రోజు నుంచి" అని చెప్పి వెళ్ళిపోయాడు అతను.
మ్యూజిక్ పార్టీ సంతోషాన్ని తెలియజేస్తున్నట్టు ఆర్కెస్ట్రా స్థాయి పెరిగింది.
తళుక్కుమనే తారలా గుండ్రని డయాస్ పై మెరిసింది ఒక బ్యూటీ క్వీన్.....
ఆమెను చూసిన సునీల్ తెల్లబోయాడు.
"నో డౌట్....
ఇంతకూ ముందు తను చూసిన పదహారణాల సుందరి ఆమె.
ఇప్పుడు డయాస్ మీద అర్ధ నగ్నంగా.
