మా పుత్రరత్నాలు ఏం చేస్తున్నారోనని వాళ్లవైపు చూశాను. బుద్దిమంతుల్లా ఇద్దరూ కొంచెంగా అన్నంతో కలుపుకుని ముద్దలు నోట్లో పెట్టుకుంటున్నారు. ఎంతైనా బయట తిండికి అంతో, ఇంతో అలవాటు పడ్డ మగరాయుళ్లాయె - వాళ్లకి ఆడపిల్లలకున్నంత భేషజాలెందుకుంటాయి? ముద్దలు చప్పరిస్తూ వాళ్లు - "ఫర్వాలేదు కాని, ప్రత్యేకించి కొనుక్కోవలసినంత రుచిగా ఏంలేదు నాన్నగారూ!" అన్నారు.
నేను తల కాస్త అటు తిప్పుకునేసరికి - కలిపిన అన్నాన్నీ, మిగిలిన పచ్చడినీ గుట్టుగా కంచం క్రిందికి తోసేశారు.
నేను అది చూసినా గమనించనట్లే ఊరుకున్నాను.
ఇంక నా వంతు వచ్చింది. అందరూ నావంకే చూస్తున్నారు.
ఆ ఊరగాయ తినాలని నోరూరిన సంఘటనలను, సందర్భాలనూ గుర్తుతెచ్చుకుంటూ కొంచెం ఊరగాయ తీసి నాలిక్కి రాసుకున్నాను. నాకు తెలీకుండానే నా ముఖ కవళికలు మారిపోసాగాయి.
వస్తున్న నవ్వును ఆపుకుంటూ ముఖం ప్రక్కకి తిప్పుకుంది మా ఆవిడ - అగ్నిహోత్రావధానులింట్లో కరటకశాస్త్రిలాగా.
మా అమ్మాయిలు నవ్వెక్కడ కనిపిస్తుందోనని తలలు దించేసుకుని క్రీగంట చూడసాగారు.
మగపిల్లల వైపు తిరిగి చూసే ధైర్యం నాకు చాలలేదు.
బింకానికి పోయి - తిరిగి చూసే ధైర్యం నాకు చాలలేదు.
బింకానికిపోయి - "ఊరగాయ పర్వాలేదనుకో. కాని, మసాలా కొంచెం ఎక్కువగా దట్టించాడు!" అంటూ కొద్దిగా అన్నంలో కలుపుకున్నాను. ఆ ముద్ద నోట్లో పెట్టుకున్నాను కాని, అది గొంతు దిగందే...!
అసలు సంగతేమిటంటే... ఈ ఊరగాయలో మసాలా మాట అటుంచి - అల్లం దట్టించివేశాడు. మసాలా వాసన మా ఇంట్లో ఎవరికీ గిట్టదు. నేను మసాలానైనా తినగలను కాని, అల్లం మాత్రం ముట్టుకోను. అది నాలిక్కి తగిలిందంటే డోకొచ్చినంత పనవుతుంది. అందుకే మా ఇంట్లో కూరలు చేసినప్పుడు అల్లం లేకుండా నాకు విడిగా తీసి ఆ తర్వాత అల్లం వేస్తారు. అటువంటిది - దానినిండా అల్లం వుండడంతో నేను ఒక్క ముద్ద కూడా మింగలేక ప్రక్కకి తోసేశాను...."అల్లం వేయకుండా వుంటే బాగుండేది!" అంటూ.
అంతే...! ఇంక మావాళ్ళ నవ్వులు కట్టలు తెంచుకున్నాయి. కన్నీళ్ళు వచ్చేదాకా పడీపడీ నవ్వసాగారు.
ఏడవలేక నేనూ నవ్వుతూ - "ఏమిటా నవ్వు?"అని కోప్పడ్డాను.
ఆ విధంగా అప్పటికి ముగిసింది ఊరగాయ పర్వం!
పది రోజులైనా, పదిహేను రోజులైనా ఆ ఊరగాయని ముట్టుకున్నవాళ్లు లేరు.
ఆరోజు ఆదివారం!
తీరిగ్గా కూర్చుని ప్రొద్దున్నే పేపర్ చదువుకుంటున్నాను.
"కాస్తంత పచ్చడి ముద్ద వేయండమ్మా!" అంటూ ఇంటిముందు నిలబడి అరిచాడో అన్నార్తుడు. వెంటనే నాకో బ్రెయిన్ వేవ్ కలిగింది.
ఎలాగూ మేము ఆ ఊరగాయని తినలేకపోతున్నాం. 'ఆ ముష్టివాడికిస్తే వాడు ఎంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతాడు. అటువంటి ఖరీదైన ఊరగాయని అతగాడు ఎప్పుడైనా తిని వుంటాడా?' అనుకుని వాడిని వుండమన్నాను.
ముందు ఆ సీసా తీసుకువెళ్ళి వాడికి ఇయ్యాలనుకున్నాను. కాని, 'అంతా ఒకడికే ఇచ్చే బదులు విష్ణుమూర్తి అమృతం పంచినట్లు పదిమంది ముష్టివారికి పదింతలు పంచితే పుణ్యం, పురుషార్దం కదా...' అనిపించింది. దొడ్లో వున్న ఓ బాదామాకు కోసుకువెళ్ళి అందులో కొంచెం ఎక్కువగానే ఆ ఊరగాయ పెట్టి్ తీసుకువెళ్లాను.
ఊరగాయ తాజాగా వుండడం, ఆకులో ఎక్కువగా కనిపించడంతో ఆ ముష్టివాడికి ఏమి అనుమానం వచ్చిందో - "బాబూ.. .నిజం చెప్పు - ఇందులో ఏ పురుగైనా పడిందా.... ఇంత పచ్చడిస్తున్నావు?" అని సూటిగా అడిగాడు. వీడెవరో బ్రతికిచెడ్డ ముష్టాడు కాబోలు.
'ఓరి నిన్ను తగ్గలెయ్యా...పుణ్యానికి పోతే పులెత్తుకుపోయిందని - నీమీద జాలి పడితే నా శీలాన్నే శంకిస్తున్నావా?' అనుకుని, "అదేం కాదోయ్... దీని బజారు నుంచి కొనుక్కొచ్చాం. ఇందులో మసాలా వేశారు. మేం ఎవ్వరం మసాలా తినం. అందువల్ల ఇచ్చేస్తున్నాను" అని ఉన్న నిజం చెప్పాను.
వాడు అనుమానంగా నావంక చూసి తప్పనిసరిగా దానిని తీసుకున్నాడు. ఏమనుకున్నాడో, ఏమో.... దానిని మిగతా వాటితో కలపకుండా జాగ్రత్తగా ఓ ప్రక్కన పెట్టాడు. ముందుకి సాగిపోతూ కూడా మధ్యమధ్య వెనక్కి తిరిగి నావంకే చూడడం మొదలుపెట్టాడు. వాడి ప్రవర్తనకినేను విస్తుబోయి అలాగే గేటు దగ్గరే నిల్చుండిపోయాను.
ముష్టివాడు నాలుగిళ్లు దాటాడో, లేదో..... ఎదురుగుండా " మాదాకోళమమ్మా!" అంటూ మరో ముష్టివాడు వస్తున్నాడు. వెంటనే వీడు వాడిని ఆపి, "ఇది తీసుకోరా..... నాకు ఈరోజు బాగానే దొరికిందిలే! ఇది నువ్వు తీసుకో!" అంటూ జాగ్రత్తగా నేనిచ్చిన పచ్చడిని ఆకుతో సహా వాడి జోలెలోకి వేశాడు.
ఆ దృశ్యం నాకు స్పష్టంగా కనిపించింది. ఆదివారం ప్రొద్దున రోడ్ మీద రద్దీ లేకుండడం, గాలివాలుగా వుండడంతో వాడి మాటలు కూడా నాకు స్పష్టంగా వినబడ్డాయి.
ఆ రెండో ముష్టివాడు కూడా దానిని అనుమానంగానే తీసుకోవడం నేను గమనించాను. ఒక ముష్టివాడు మరో ముష్టివాడికి ఊరికే కమ్మని తాజా ఊరగాయను వేస్తే నమ్మేటంతటి అమాయకుడా వాడు?
'బహుశా... వాడు కూడా దానిని ఇంకెవరినో ట్రాన్స్ ఫర్ చేస్తాడు. లేదా అవతల పారేస్తాడు....' అనుకుంటూ ఇంట్లోకి వచ్చి మా ఆవిడకి ఈ సంగతి చెప్పాను. "కొత్త ఊరగాయ ఊరికే పోతుందని సద్బుద్దితో చేస్తే ఎలా అయిందో చూడు! మిగతా ముష్టివాళ్లూ ఇంతే చేస్తారు! పోనీ..., ఏ స్నేహితులకైనా ఇస్తే వాళ్లేమనుకుంటారో!" అన్నాను.
"మీరు అంత ఎక్కువగా పచ్చడి పట్టుకెళ్లారు కాబట్టి - అదికూడా.... అన్నం లేకుండా కావడంతో వాడికి అనుమానం వచ్చింది. ఈసారి నుంచి మిగిలిపోయిన అన్నంతోపాటు కొద్దికొద్దిగా ఈ ఊరగాయ వేద్దాం. ఎవ్వరికీ అనుమానం రాదు. చెడకుండానే మొత్తం ఖర్చయిపోతుంది" అంటూ నాకు జ్ఞానోపదేశం చేసింది మా ఆవిడ.
'ఆవిడ ఉపదేశం ఊరగాయ కొనేముందు తీసుకొని వుంటే ఈ ఖర్చు, ఈ హైరానా తప్పేవి కదా...' అనుకుంటూ ఉసూరుమన్నాను. పైకి మాత్రం "అందుకేనోయ్.... కరణేషు మంత్రీ" అన్నారు అన్నాను మెచ్చుకుంటూ.
"ఆ - ఆ... మా మంత్రిత్వం అంతా అయ్యాకేగా!" అంటూ వంటపనిలోకి వెళ్లిపోయింది శ్రీమతి.
గట్టుమీదున్న 'ఊరగాయ సీసా' నన్ను చూసి నవ్వుతున్నట్లనిపించింది.
- స్వాతి వార పత్రిక ...... 20 జూలై' 90
