Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 30

    "క్షుద్రశక్తులున్నవాళ్ళకి అవి పోవాలంటే తలగొరిగించటం, పళ్ళూడగొట్టం చేస్తారు. మనం మొదటిది చేస్తున్నాం. వీలుని బట్టి రెండోది కూడా చెయ్యచ్చు."
    "మరి గోళ్ళూడగోట్టటం?" అవధాని కుతూహలం.
    "ఉండవయ్యా నీ కంగారు కాకులెత్తుకెళ్ళ. అదీ చేద్దాం. ఇదేగా మొదలు" సోమయాజి ప్రపంచాన్నంతా జయించినంత ఆనందంగా చెప్పాడు.
    "మొత్తానికి సాధించారు మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు." పేరిభట్టు మెచ్చుకోలుగా అన్నాడు.
    "ఇంకోసంగతి తెలుసా? పెత్తనం అంతానాదే. తనకేం తెలియదు. అన్ని ఏర్పాట్లూ నన్నే చెయ్యమన్నాడు. ఇంక మనిష్టం" సోమయాజి దర్పంగా చెప్పాడు.
    వెంకమాంబమీద ఇష్టం ఉన్నవాళ్ళు, సోమయాజి కుతంత్రాలు తెలిసినవాళ్ళూ మాత్రం చాలా బాధపడ్డారు. ఊరికి ఏదో అరిష్టం తప్పదని భయపడ్డారు. సోమయాజి, అతడి అనుయాయిబృందం మాత్రం సంబరంగా ఏర్పాట్లు చేయటంలో నిమగ్నమయ్యారు.
                                   * * *
    ఆదివారం రానే వచ్చింది. ఎంత సంబాళించుకున్నా కృష్ణయార్యుడికి, మంగమాంబకి గుండెలు దడదడలాడుతూనే ఉన్నాయి. వెంకమాంబ మాత్రం యథాప్రకారం ప్రతిరోజూ లాగే ఇంటిపనులన్నీచేసి, నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి ధ్యానమగ్నురాలై కూర్చుంది. తాము అనుకున్న పని చెప్పకుండానే వెంకమాంబ చెయ్యటం శుభశకునంగా భావించారు. ఇష్టంలేకపోయినా, సోమయాజి భయంతో తప్పనిసరిగ వచ్చిన మంగలి ముందు నరసింహస్వామిని, ఆంజనేయుని దర్శించుకుని వెంకమాంబ దగ్గరికి వెళ్ళాడు.
    ఒక పక్క ఆడవాళ్ళంతా గుమిగూడి గుసగుసలాడుతున్నారు. కొంతమండి మంగమాంబని ఓదారుస్తున్నారు. కృష్ణయార్యుడు మాత్రం ఎవ్వరితో మాట్లాడకుండా ఒంటరిగా ఒక పక్కగా నిలబడి శూన్యంగా చూస్తూ ఉన్నాడు.
    "అమ్మా! పుష్కరిణి ఒడ్డుకు రండి" అని చెప్పాలని అతడి ఆలోచన. కాని ఆమెను సమీపించగానే ఆ మంగలికి విపరీతమైన భయం కలిగింది. వణుకు పుట్టింది. చేతులుకాళ్ళు వణకటమే తప్ప తన ఆధీనంలో లేవు. ఏదో విధంగా కాళ్ళూచేతులూ కూడగట్టుకుని పరుగు లంకించుకున్నాడు "బాబోయ్! సింహం! గాండ్రిస్తోంది!!! కోరలు....గోళ్ళూ... ... ..." అంటూ.
    సోమయాజి బృందానికి అవమానంతో కోపం ఎక్కువయ్యింది. ఏంచేయాలా అని అందరూ తర్జనభర్జన పడ్డారు. కసితీరేట్టుగా ఒక నిర్ణయానికి వచ్చారు. "మంగలిని భయపెట్టింది కనక మంగలిచేయాల్సిన పని తండ్రి చేసితీరాలి" అని తీర్మానించారు. దేనికీ భయపడకూడదని కుమార్తె చెప్పిన మాట గుర్తుచేసుకుని కృష్ణయార్యుడు అభావంగా ఆ పని చెయ్యటానికి పూనుకున్నాడు.
    "తల్లీ! మా కులదైవమా! పుష్కరిణి ఒడ్డుకురా!" అన్నాడు. వెంకమాంబ కన్నులు తెరిచింది.
    "అమ్మాయిని తీసుకురా!" అన్నాడు భార్యనుద్దేశించి. మంగమాంబ మరబొమ్మలాగా కదిలి వెంకమాంబ రెక్కపుచ్చుకుని లేవదీసింది. ఎవరిని ఎవరు నడిపించుకుని వెడుతున్నారో తెలియనివిధంగా ఇద్దరూ కలిసి పుష్కరిణి ఒడ్డుకి చేరారు.
    వెంకమాంబ నిశ్చలంగా కళ్ళుమూసుకుని, పద్మాసనంలో కూర్చుని తండ్రితో "కానీయండి!" అంది.
    కళ్ళలో నీళ్ళుకమ్ముతున్నా, నీటిపొర కంటిచూపుకి అడ్డుపడుతున్నా, వణుకుతున్న చేతులతో కత్తి వెంకమాంబ తలమీద పెట్టాడు. తర్వాత జుట్టంతా తియ్యటం ఎట్టాజరిగిందో కృష్ణయ్యకి తెలియదు. సోమయాజి బృందమంతా సంతోషంతో కేరింతలు కొట్టినంతపని చేశారు - జంధ్యాలు సర్దుకుంటూ, ఉత్తరీయాలు దులుపుకుంటూ, పిలకలు జాడించి తిరిగి ముడివేస్తూ -
    ఈపనిలో తమవంతు కర్తవ్యం నిర్వర్తించటానికి ఎదురుచూస్తున్న ఆడవాళ్ళు వచ్చి వెంకమాంబ ముఖాన ఉన్న బొట్టు తుడిచి, చేతిగాజులు పగులగొట్టి, తీసుకుని వెళ్ళి పుష్కరిణిలో దింపి, చేతులు పట్టుకొని తమతోపాటు మునకవేయించారు. మునిగిలేచి చూసేసరికి అందరూ కొయ్యబొమ్మలైపోయారు. తెరిచిన నోళ్ళు అలాగే ఉండిపోయాయి.
    నీళ్ళలో మునిగి లేచిన వెంకమాంబ తలమీద జుట్టు యథాప్రకారం ఉంది. ముఖాన కుంకుమ చెక్కుచెదరలేదు. జోడించిన చేతులకి గాజులు మెరుస్తున్నాయి.
    "మాయ! మోసం!!" సోమయాజి అరిచాడు.
    ఎవరూ అతడి మాటకు స్పందించలేదు.
    "కనికట్టు. కృష్ణయ్య కూతురు జుట్టుతియ్యలేదు, తీసినట్టు మనని నమ్మించాడు."
    "ఇదుగో కృష్ణయ్య గొరిగిన వెంకమ్మజుట్టు" అంటూ పేరిబొట్టు నేలమీద పడున్న వెంకమాంబ జుట్టుని చేత్తో తీసి చూపించాడు.
    "మళ్ళీ చెయ్యమను! చూద్దాం!" సోమయాజి ఆవేశంగా అన్నాడు.
    "ఇప్పటికి మనం ఊరుకోటం మర్యాద!" అని తనతో లాక్కెళ్ళాడు అవధాని.
    "మీ ఆచారం ప్రకారంమీరు అన్నీ సంప్రదాయ బద్ధంగా నిర్వర్తించారు కదా! మీలోటు లేదు. మీకెటువంటి పాపంరాదు. తర్వాత విషయాలు వదిలేసి హాయిగా ఇళ్ళకి వెళ్ళండి" అంది నాంచారమ్మ సోమయాజి బృందాన్ని చూసి. ఆడవాళ్ళని చూసి,

    "మీపని మీరు చేశారు. మీకు ఎటువంటి పీడా ఉండదు. మీ మాంగల్యాలకి ఢోకా లేదు. పుష్కరిణిలో ఇంకో మునక మునిగి, స్వామిని దర్శించుకుని పాపం పొగొట్టమని ప్రార్థించి చెంపలేసుకుని ఇళ్ళకెళ్ళండి" అంది.
    అందరికీ తలలో నాలికగా, తల్లితోడుగా ఉండే నాంచారమ్మ మాటలని మారు మాట్లాడకుండా పాటించారు అందరూ.
    ఇంటిదారి పట్టిన సోమయాజి బృందానికి తలతీసేసినట్టయింది. ఎదిరించినంతకాలం తప్పు వెంకమాంబ వైపు ఉంది. ఇప్పుడు తలవంచిందికాని తలెత్తుకోలేకుండా చేసింది. ఇప్పుడు కాకపోయినా, వీలైనంత త్వరలో పగతీర్చుకోవాలనుకుంటూ ఇళ్ళకి చేరారు.
    ఇంటికి చేరే సరికి సోమయాజి మనుమడికి చిన్నబిడ్డనెప్పి వచ్చి కొయ్యబారిపోయాడు.
    అవధానిగారి కోడలు జుట్టువిప్పుకుని వీధిగుమ్మంలో నుంచుని మామగారిని చూడగానే "మంగలిని తీసుకునిరా! క్షౌరం చేయించుకోవాలి" అని లోపలికి రానియకుండా తరిమింది.
    పురిటికి వచ్చిన కృష్ణశర్మ కూతురు తండ్రిని చూడగానే భయంతో
    "నాకొడుకుని చంపకు, నా దగ్గరికి రాకు భయం వేస్తోంది. నేను వెళ్ళిపోతా!" అంటూ ఏడిచింది.
    రామక్కకి వళ్ళంతా మంటలు.
    పారిజాతానికి నాలిక దురదపెట్టి ఏంచేయాలో అర్థంకాక గిలగిలలాడింది.
    లక్షిందేవికి చెవిలో హోరు.
    భ్రమరాంబకి వళ్ళంతా దురదలు.
    బుచ్చికి కడుపునొప్పి... ... ...
    అందరికీ తలొక రకమైన బాధ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS