రాగిణి కన్నీళ్ళు ఆమె గుండెని తడిపేశాయి. చెంపల్ని కడిగేశాయి. కోటయ్య బాబాయ్ దేముడిలా అనిపించాడు. మనస్సులో అతనికి శతకోటి నమస్కారాలు పెట్టి, నీరసం వొచ్నినదానిలా, అలా కుర్చీలో కూర్చుండిపోయింది. అలా ఎంతసేపు కూర్చుందో, గదంతా దీపం లేక చీకటితో నిండిపోయేవరకు, తనకి తెలివేలేదు.
లేచి లైటు వేసింది. ఆలోచనలతోటి, తలనొప్పిగా అనిపించింది. వేడిగా టీ చేసుకుని తాగింది! ఉదయం చేసుకున్న అన్నం కూరా, వుండగా, వాటిని వేడి చేసుకుని, ఏదో తిన్నాననిపించుకుంది.
"ఈ ఉత్తరానికి శిల్ప ఏమని సమాధానమిస్తుందో? ఎప్పటికి సమాధానమిస్తుందో?" ఇవే ఆలోచనలతో సతమతమయిపోతూ, కాస్సేపు మనశ్శాంతికోసం, వివేకానందుని పుస్తకం, రామకృష్ణ పరమహంస పుస్తకం తీసి తిరగేసింది.
ఆ పుస్తకాలలోని మహాత్మ్యం, ఆ వేదాంతంలోని భావం మనస్సుకీ టానిక్కులా పనిచేస్తుంది. దడదడలాడే గుండె మామూలుగా కొట్టుకోవడం మొదలయింది. ఏ అర్ధ రాత్రికో, పుస్తకాన్ని మూసి, కన్ను మూసింగి రాగిణి.
శిల్ప కోటయ్యతాత ఉత్తరాన్ని అవినాష్ కి చూపించింది! అవినాష్ మనసు ద్రవించింది. ఏదో చెప్పాలనుకున్నాడు! వెంటనే ఉత్తరంలో తాతయ్య రాసిన చివరి వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి. "తుది నిర్ణయం నీదే అయుండాలి" అందుకే మాట్లాడకుండా ఊరుకున్నాడు.
రాగిణి యధాప్రకారం స్కూలయిపోయాక అక్కడ నిలబడి చూస్తోంది. అవినాష్, శిల్పా మాట్లాడుకుంటూ వస్తున్నారు ఈ మధ్యన ప్రతీరోజు, శిల్ప తను పంపిన డ్రెస్సులనే వేసుకోవడం చూస్తోంది. స్కూలు టైములో యూనిఫారాలు తప్ప, బడి అయిపోయాక వీళ్ళిష్టమొచ్చిన బట్టలు వేసుకోవచ్చును వీళ్ళు అంతకుముందు ఎప్పుడూ భరణి పంపించిన బట్టల్లోనే కనబడేది శిల్ప! ఏమిటో! తల్లి హృదయం తల్లడిల్లిపోతూ తదేకంగా చూసి తృప్తిపడింది.
ఎందుకనో ఆ రోజు అవినాష్ ని, శిల్పని చూస్తూవుంటే, ముచ్చటగా అనిపించడమే కాక మనసులో చిలిపికోరిక పుట్టుకొచ్చింది! వాళ్ళిద్దరి స్నేహం, అన్యోన్యతా, ఆ బంధం అలా నిలిచిపోవాలంటే అది వివాహబంధమైపోవాలి! కోటయ్య బాబాయ్ కి చెప్పాలి, పైగా వాళ్ళిద్దరి ఈడూ జోడూ, ఎంతో బాగుంది.
తన పిచ్చి ఆలోచనకి తనే నవ్వుకుంది! ఇంతచిన్న వయస్సులో వీళ్ళని గురించి ఇలా ఆలోచించడం ఏమిటీ? సిల్లీ! - అనుకుంది. కానీ, వాళ్ళని చూసినప్పుడల్లా, ఈ అభిప్రాయం ఒకసారి దోబూచులాడిపోతోంది తనలో! సరే! జరిగేది జరగకమానదు అనుకుంటూ వాళ్ళిద్దరినీ మనసారా ఆశీర్వదించింది.
కాలం గడుస్తోంది! రామానుజంగారికి మైల్డ్ అటాక్ వచ్చిందనీ, పదిరోజులు ఆసుపత్రిలో వుండి, మొన్ననే ఇంటికి తిరిగొచ్చారనీ, నిన్నూ శిల్పనీ, చూడాలని వుందని అంటున్నారనీ, ఈసారి సెలవులకి ఒకసారి రమ్మనమనీ రాసింది భరణి!
'భగవంతుడా! తండ్రిని కూడా దూరంచెయ్యకు! మనసులోనే గండం పెట్టింది రాగిణి.
ఆరోజు కోటయ్య బాబాయ్ దగ్గరినుంచి రాగిణికి రెండుత్తరాలు వుంచిన పెద్ద కవరొచ్చింది. "రాగిణీ! ఒకటి మీ నాన్న నాకు రాసిన ఉత్తరం. ఇంకొకటి, శిల్ప రాసిన ఉత్తరం. రెండూ చదువు. నేను నీకు తరవాత రాస్తాను. మీ పిన్నికి కొంచెం ఒంట్లో బాగులేదు ఈ మధ్యన. పూర్ణిమ వాళ్ళమ్మగారింటికి విశాఖపట్టణం వెళ్ళింది. నిన్ననే వొచ్చింది. ఆ గొడవల్లో నీకు నేను ఉత్తరం రాయలేకపోయాను. శిల్ప ఉత్తరం చదువు. ఆ తరవాత వెళ్ళి కలుసుకో! శిల్పని కలుసుకున్నాక, నాకు ఉత్తరం రాయి. మీరిద్దరూ కలిసి, నాలుగురోజులు సెలవు పెట్టొచ్చి, మీ పిన్నిని చూసివెళ్ళండి ఉంటా!
ఆశీస్సులతో నీ
కోటయ్యబాబాయ్"
ముందు శిల్ప ఉత్తరం తీసింది చదవడానికి! మడత విప్పుతూ వుంటే, గుండె దడదడలాడింది.
"డియర్ కోటయ్య తాతయ్యా! మీ ఉత్తరం చాలాసార్లు చదివాను. చదువుతూన్న కొద్దీ కొత్త ఆరాలు కలుగుతున్నాయి. తాతయ్యా! బాగా ఆలోచించే రాస్తున్నాను. నిజం చెప్పాలంటే మీ ఉత్తరం వొచ్చినప్పటి నుంచీ, ఇప్పటివరకూ ఆలోచిస్తూనే వున్నాను. ఇందులో అమ్మ తప్పేమీ లేదు......" రాగిణి కళ్ళు సంతోషంతో వర్షించాయి. ఆనందం పట్టలేక పిచ్చిదానిలా అరవాలనిపించింది! ఒక్క నిముషం ఆగి మళ్ళీ చదవడం మొదలెట్టింది.
"తాతయ్యా! నేను పుట్టడానికీ, పెరగడానికీ కూడా బాధ్యురాలయిన అమ్మని నేను ఎంతగానో అసహ్యించుకున్నాను! ద్వేషించుకున్నాను! ఆమె మొహంమీదే ఏవోవే మాటలున్నాను! తాతయ్యా! అమ్మ ఇప్పుడు ఎక్కడుందో కూడా నాకు తెలీదు. మొన్నామధ్యన, అమ్మ నాకు బట్టలు పంపించింది. ఆ బట్టలు వేసుకుంటూ వుంటే, నాకు అమ్మ ఒళ్లో కూర్చున్నట్టనిపిస్తోంది. అందుకే అవ్వే వేసుకుంటున్నాను. తాతయ్యా! అమ్మ నాతో మాట్లాడుతుందా? నేనన్న మాటలకి కోపం వచ్చిందేమో! వెళ్ళి వందసార్లు సారీ చెప్పాలి. కానీ అమ్మ ఎక్కడుందో నీకూ తెలీదే! గ్రాండ్ పాకీ, పిన్నికీ ఉత్తరం వ్రాస్తున్నాను. అమ్మని అర్జంటుగా చూడాలనివుంది. అమ్మ కనిపించాక, ఇంకెప్పుడూ ఒదిలిపెట్టి వుండను. అమ్మని ఇక్కడే ఊటీలోనే వుంచేసుకుంటాను. అప్పుడు, నేనూ అవినాష్ హాస్టల్లో కాక అమ్మదగ్గరే వుండొచ్చును. అమ్మని ఎక్కడున్నా వచ్చేయమని రాయండి. నాకు కోపంలేదని చెప్పండి. కోటయ్య తాతయ్యా! మీరు చెప్తే అమ్మ వచ్చేస్తుంది. మీరంటే అమ్మకికూడా, నాలాగే ఎంతో ఇష్టం!
ఉంటామరి
మీ శిల్ప"
ఉత్తరం ఒకసారి, రెండుసార్లు, పదిసార్లు అలా ఎన్నిసార్లు చదివిందో! సంతోషంతో మైకం కమ్మినదానిలా, తన్మయత్వంలో ఉత్తరాన్ని గుండెకి అదుముకుంది! ముద్దెట్టుకుంది! అలా ఎన్నిసార్లు ఎంతసేపు వుందో!
రెండో ఉత్తరం తీసింది. మనసు పరవశంతో పరవళ్ళు తొక్కుతోంది! తండ్రి కోటయ్య బాబాయ్ కి రాసిన ఉత్తరం అది.
"కోటయ్యా! నాకు, ఒంట్లో ఏమీ బాగాలేదు. ఎన్నాళ్ళు బతుకుతానో, ఎప్పుడు రాలిపోతానో నాకు తెలీదు. మా ఇంటిని శిల్ప పేరుమీద రిజిస్టరు చేయించమని రాశాను! రిజిష్టరు చేయించేశావా? ఒరేయ్! నాకింకొక్క కోరిక వుంది. చిన్నప్పుడు మనం అనుకునే వాళ్ళం, మనం ఎలాగైనా బంధువులం కావాలని, గుర్తుందా? ఆత్మబంధువులం ఏనాడో అయ్యాము. కాకపోతే బంధువులం కాలేకపోయాం! ఒరేయ్! నీ మనవడు అవినాష్ ని, మా శిల్పకిచ్చి పెళ్ళి చేద్దాం. ఆ ఇల్లు శిల్పకి నేనిచ్చే పెళ్ళికానుక! శిల్ప పెళ్ళిదాకా, నేను బతికుంటానంటావా? రాగిణి పెళ్ళి చూడలేకపోయాను. ఏం జరిగిందో, ఎలా జరిగిందో! శిల్ప పెళ్ళి చూడాలని వుంది. తప్పకుండా బతుకుతాను! రాగిణీ, శిల్ప కలుసుకునేలా చెయ్యి. ఈసారి సెలవుల్లో వాళ్ళిద్దరినీ, అవినాష్ ని అమెరికా పంపకూడదూ? అసలు నువ్వెందుకు రాకూడదోయ్! భరణీ, కాశ్యప్ సంతోషిస్తారు నువ్వొస్తే! దీనూ, దివ్యా మనకి ఆడుకోవడానికి కంపెనీ! ఏమంటావ్? వచ్చేయ్!
ఉంటారా! రాస్తుంటే చెయ్యి ఒణుకుతోంది!
నీ రామానుజం"
ఉత్తరాలను భద్రంగా పర్సులో పెట్టేసింది.
కొంచెం టీ పెట్టుకుని తాగింది రాగిణి! గడియారం చూసింది. ఆరున్నరయింది! కనుచీకటి పడుతోంది. గబ గబా వెళ్ళి స్నానం చేసొచ్చింది. "వంట మెల్లగా చేసుకోవచ్చులే! ముందు ఈ ఉత్తరాలని, సిస్టర్ ఫెర్నాండస్ కి చూపించాలి! ఆమె శిల్పని పిలిపిస్తుంది! శిల్ప తననూ చీసి, సంతోషంతో 'అమ్మా' అంటూ వచ్చి, కౌగిలించుకుంటుంది. అలా ఇద్దరం కాస్సేపు ఈ లోకాన్నే మరచిపోతాం! ఆ తరువాత..... తరవాత సిస్టర్ ఫెర్నాండిస్ తో చెప్పి, శిల్పనీ, అవినాష్ నీ తనింటికి తీసుకొచ్చేస్తుంది తను! ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరవుతూ, సంతోషంగా గదికి తాళంపెట్టి బయటికొచ్చింది. వర్షం మొదలయింది. ఏయ్ టాక్సీ..... టాక్సీ.... అని పిలిచి టాక్సీని ఆపింది. ఎక్కి కూర్చుని, "ఊటీ స్కూలుకి పోనీ" అంది.
