Previous Page Next Page 
నా కథవింటావా పేజి 29


    టాక్సీ దిగి ఒక్కసారి ఆశ్రమంలో వున్న  అరబిందో వారి సమాధికి నమస్కరించింది. మళ్ళీ టాక్సీ ఎక్కి అన్నయ్య రాసిచ్చిన వినోద్ వాళ్ళ స్నేహితుల అడ్రసు తీసుకుని  చూసి, టాక్సీని అక్కడికి పొమ్మంది.
    వినోద్  వాళ్ళ స్నేహితులు  రామచంద్రన్ గారు సహృదయంగా ఆహ్వానించాడు కావ్యని !
    కావ్య ఒంటరిగా  ఒస్తుందనుకున్న వాళ్ళు, పాపతో సహా  ఆమెని చూసి, "మీకు పాప కూడా వుందా ?" అడిగారు.
    "అవునండీ!"
    "వారు...."
    "వారు....ఈ లోకంలో లేరు!" అంది.
    "ఓ....! పదండి  లోపలికి!" అంటూ  ఆమె కోసం ఏర్పాటు చేసిన గదిలోకి తీసికెళ్ళారు.
    స్నానపానాలన్నీ  అయ్యాక  అరబిందులవారి  ఆశ్రమాన్ని పూర్తిగా చూడడానికి వెళ్ళింది కావ్య! ప్రార్ధనా మందిరం, అక్కడున్న నిశ్శబ్దం, మౌనంగా చేసే ఆ ప్రార్ధనా ,ప్రశాంత వాతావరణం, దివ్యంగా అనిపించింది కావ్యకి! అతని సమాధి ముందు నిలుచుని, పాపకి దివ్య అని పేరు పెట్టింది కావ్య! కాదు కవితగా మారిన కావ్య! ఆశ్రమం నడుపుతూన్న  అనేక చేతి పరిశ్రమలను తిలకించింది!
    ఎందరో ఆస్తిపరులు, తమ ఆస్తులను వదలి, ఈ ఆశ్రమంలో చేరి ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారు. ఈ వాతావరణంలో  ఎంతో  మనశ్శాంతి  దొరికింది కావ్యకి! రామచంద్రన్ గారి పలుకబడితో  ఒక స్కూల్లో టీచర్ ఉద్యోగాన్ని సంపాదించింది!
    వారే ఆశ్రమానికి కొద్ది దూరంలో బడికి దగ్గరగా వుండేటట్టు  ఒక చిన్న ఇల్లు కూడా చూసిపెట్టారు! పాప సంరక్షణ కోసం  ఒక ఆయాని ఏర్పాటు చేసుకుంది కావ్య !
    కొత్త జీవితం !
    కొత్త ఆశలు !
    కొత్త ఆశయాలు !
    అన్నీ పాప కోసమే! అంతా ఆ లక్ష్య సిద్ధికోసమే !
    కాగితం కలం తీసి క్రాంతికి  ఉత్తరం  రాయడానికి  ఉపక్రమించింది కావ్య! తన కొత్త పేరును  కూడా సూచిస్తూ, 'కవిత' అని సంతకం చేసింది!
                                                                             19
    ఉత్తరం చదివి నిర్ఘాంతపోయాడు క్రాంతి! "ఎందుకిలా  చేసింది ? అసలే వున్న సమస్యలతో  ఛస్తున్నాం. ఇప్పుడా బిడ్డ నా బిడ్డకాదన్నా  ఎవరు నమ్ముతారు ? బిడ్డ వుండగా, ఆమెని పెళ్ళిచేసుకోవడానికి  ఎవరు ముందుకొస్తారు?" తలపట్టుకుని కూర్చుని, ఆమె పంపిన  ఫోటోలను  చూస్తూ కూర్చున్నాడు. కావ్య దివ్య నెత్తుకుని  తీసుకున్న  ఫోటోలు! ముద్దుగా వున్నాయ్! ఆ ఫోటోలు చూసిన ఎవ్వరూ కూడా నమ్మరు ఆ పాప ఆమె పాపకాదంటే! చక్కటి ఫ్రాకూ, కాళ్ళకి సాక్సూ, తలకీ  టోపీ  ముద్దు లొలుకుతూ  వుంది.
    క్రాంతి చేతిలోంచి  ఫోటోలు తీసుకుని చూసింది  శోభన.
    "అసలు నాకే నమ్మబుద్ధి కావడంలేదు! ఒక వేళ ఈ పాప నిజంగా కావ్యకి...."
    "శోభనా!....పిడుగులా  అరిచాడు.
    "అయినా నాకెందుకులెండి!" శోభన ఆ ఫోటోలని  అక్కడ పడేసింది.
    "అన్నయ్యా ! దేముడు ఈ బిడ్డని నాకోసమే పంపించాడేమోననిపిస్తుంది. నా చేతిలో పడింది కాబట్టి ఈ పాప ఇంత హాయిగా భద్రంగా వుంది. లేకపోతే ఎన్నివేలకి, ఎన్నిసార్లు చేతులు మారేదో! చివరికి ఏమయ్యేదో ? ఈ పాప జీవితం అలా కాకూడదని, నేను నా బిడ్డగా ప్రకటించి ,తండ్రి ఏడని అడిగితే ఏం చెప్పాలో తెలీక ఈ లోకంలోనే లేరూ అని చెప్పి, విధవరాలిలాగా బ్రతుకుతున్నాను, నేను చేసినది  త్యాగమవునో కాదో నాకు తెలీదు. కానీ, ఈ పసి పాపని పెంచి పెద్దచేసి ,ఒక పనికొచ్చే వ్యక్తిగా దేశాని కందిస్తున్నాను అన్న తృప్తి మాత్రం  నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది! అన్నయ్యా! నా నిర్ణయాన్ని ఎవరు ఆమోదించినా  ఆమోదించక పోయినా, నువ్వు తప్పక హర్షిస్తావని  తెలుసు! ఒకవేళ నేను తప్పు చేశానన్న  భావన నీకు కలిగితే నన్ను క్షమించు. తరుచు  ఉత్తరాలు రాస్తూ వుండు. వొదిన కనగానే ఉత్తరం రాయి.
                                                                                                                                             నీ
                                                                                                                                           కవిత 
    ఉత్తరం మడిచిపెట్టి  కళ్ళు తుడుచుకున్నాడు. "నువ్వెప్పుడూ  తప్పు చెయ్యవు కావ్యా! నీ హృదయం ఎంతో విశాలం! ఎంతో సున్నితం! నిన్నర్ధంచేసుకోలేక, మేమే తప్పు చేస్తూ వుంటాం!" అన్నాడు తనలో తను మాట్లాడుకుంటూన్నట్టే, గట్టిగా మాట్లాడుతూ.
    "ఆమె చేసే పన్లన్నీ  మీకు మంచిగానే కనిపిస్తాయ్! ఏ కులం వాళ్ళు ఏ మతం వాళ్ళు మదమెక్కి కనిపారేసిన సంతు అయివుండొచ్చు  ఆ పిల్ల! లేదా ఏ దొంగకో ఏ కులటకో పుట్టివుండవచ్చు కూడా! ఏమీ చూసుకోకుండా పెద్ద తగుదునమ్మా అంటూ, త్యాగశీలిలా  ఆ పిల్లని  తెచ్చిపెట్టుకుంటే, ఎవరు హర్షిస్తారు ?
    "శోభనా! ఎవరికి పుట్టినా, ఏమయినా పసిపిల్ల  ఆ పిల్లదేం తప్పు! ఆమె పెరుగుతూన్నది, కావ్య చేతిలో! అదే ఆ పిల్ల చేసుకున్న అదృష్టం!"
    "అబ్బ! కావ్య చేతిలో పెరగడం  అంత అదృష్టమా?" వ్యంగ్యంగా అంది శోభన!  
    "అవును! అంతటి సంస్కారవంతురాలి  చేతిలో, అంతటి సహృదయురాలి చేతిలో ఆ పాప పూర్వజన్మ సుకృతం."
    "చాల్లెండి. ఎవరైనా వింటే నవ్వుతారు. ఇప్పటికే చెడిపోయిందని ఊరంతా అంటున్నారు .రేపు ఈ పిల్ల దీనికే పుట్టిందని కోడై కూస్తుంది లోకం!"
    "ముందూ నువ్వే కూసేట్టున్నావ్ ? జాగ్రత్త! ఈ విషయం ఎవరికైనా తెలిసిందో!....నేను ఊరుకోను!"
    "ఏం రహస్యంగా ఉంచుతారా ?"
    "అవసరం లేదు"
    "మరి ?"
    "నువ్వేమీ మాట్లాడకు".
    "నా నోరు మూస్తే సరిపోయిందా ? లోకం నోరు ముయ్యలేరు."
    "లోకానికి భయపడాల్సిన పనేమీ  చెయ్యలేదు  నా చెల్లెలు. పైగా మనుష్యులు గర్వించేలా, మనసున్న మనిషిగా ఒక మంచి పని చేసింది!"  
    "చాల్లెండి! మెచ్చుకోడానికైనా  అర్ధముండాలి! తప్పుడుపన్లు చేస్తూ సమర్ధించుకునే వాళ్ళని మిమ్మల్ని మాత్రమే చూశాను"
    "శోభనా!" అరిచాడు క్రాంతి.
    "అమ్మా!" అంటూ నడుంపట్టుకుని  మెల్లగా  మంచం  దగ్గరికి  నడిచింది శోభన!
    "శోభనా! ఏమైంది ?" అంటూ కంగారుగా  దగ్గరికి వెళ్ళాడు.
    "నొప్పి! నొప్పి!" మూలుగుతూ మంచంమీద కూర్చుంది  శోభన!
    "వెంటనే టాక్సీని  తెప్పించాడు. పనిమనిషిని  పిలిచి నర్సింగ్ హోంకి తీసికెళ్ళాడు. డాక్టరు పరీక్ష చేసి, సాయంత్రానికో రాత్రికో  పురుడు రావొచ్చు" అంది. అత్తగారిని వెంటనే  ఫ్లయట్ లో రమ్మని టెలిగ్రాం పంపించాడు. ఫోను కూడా చేశాడు. తను ఆఫీసుకి సెలవుపెట్టి, నర్సింగ్ హోంలోనే వున్నాడు. ఆ సాయంత్రానికల్లా  వచ్చేసింది, శోభన వాళ్ళమ్మగారు! ఆవిడొచ్చిన  ఒక గంటా, రెండు  గంటలకే, శోభనకి పురుడొచ్చింది.
    కావ్యకి ఉత్తరం  రాశాడు. వీలైతే  వొచ్చివెళ్ళమని  రాద్దామనుకున్నాడు. కానీ శోభనకి  ఇష్టం వుండదు. గొడవచేస్తే  ఆరోగ్యం పాడవ్వచ్చు! అందుకని  రాయలేదు!
    బారసాల నాటికి బంధువులందరూ  వొచ్చారు కావ్య తప్ప. కావ్య రావడానికి వీల్లేదని ఆజ్ఞాపించింది శోభన! ఆదరణా, ఆప్యాయతా లేని చోటికి ఆమెని పిలవడమెందుకులే  అని ఊరుకున్నాడు క్రాంతి! ఆ మాటే రాశాడు కావ్యకి!
    మేనల్లుణ్ణి  చూడాలన్న  అభిలాషా, శోభన రానివ్వదన్న విషయం, ఒక కంట్లో  ఆనందం, ఒక కంట్లో దుఃఖం, తల్లడిల్లిపోయింది కావ్య!
    దివ్య మిసమిసలాడుతూ  దబ్బపండులా  వుంది! మనుషుల్ని  గుర్తుపట్టడం, నవ్వడం, బోర్లాపడడం, ఈ ఊసులతో  బోలెడంత  కాలక్షేపంగా వుంది కావ్యకి!
    క్రాంతి కొడుకుకి  'చైతన్య స్వరూప్' అని పేరు పెట్టారు. మనమడిని చూసి మురిసిపోయారు శోభన  అమ్మా నాన్న! కొడుకుని  ఎత్తుకున్నప్పుడు, అమ్మనీ, కావ్యనీ  గుర్తుచేసుకుని  బాధపడ్డాడు క్రాంతి! ఒకరు లేరు, ఇంకొకరు  ఉండిలేరు అనుకుంటూ.
    కాలం పరిభ్రమిస్తూనే  వుంటుంది. ఎవ్వరికోసం  ఆగదు. దేన్నీ లక్ష్యపెట్టదు. దివ్యని స్కూల్లో చేర్చింది కావ్య! చదువులోనూ, ఆటల్లోనూ, అల్లరిలోనూ  ఫస్టే అనిపించుకుంటోంది దివ్య!
    "అమ్మా నాకు ఎన్ని ఫ్రైజులొచ్చాయో చూడూ" అంటూ  చూపించింది దివ్య! కప్పులన్నీ  ముందరేసుకుని, ఒకరోజు  కావ్య అన్నింటినీ  చూస్తోంది  మురిపెంగా!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS