Previous Page Next Page 
గెస్ట్ హౌస్ పేజి 29

సరిగ్గా అప్పుడే రాబర్ట్ ఇచ్చిన సెల్ ఫోన్ మ్రోగింది. చిన్న బీప్ బీప్ అన్న శబ్దంతో
నచికేత సెల్ ఫోన్ లో ఉన్న ఒకే బటన్ నొక్కాడు.
"హలో మిస్టర్ నచికేత...హౌ ఆర్ వ్యూ" అటువైపు నుంచి రాబర్ట్ అడిగాడు.
"మేము బావున్నాం...మమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు వెళ్లిపోయారు..." చెప్పాడు నచికేత...
"నువ్వు చాలా ఎలర్ట్ గా ఉండాలి మిస్టర్ నచికేత...నీకే మాత్రం అనుమానం కలిగినా, ఏ ప్రమాదం ఎదురైనా నన్ను కాంటాక్ట్ చేయ్...నేను కూడా బయల్దేరుతున్నాను" చెప్పాడు రాబర్ట్...
"అలాగే" అన్నాడు నచికేత..
రాబర్ట్ అటువైపు నుంచి ఫోన్ కట్ చేసాడు.

                                        * * *
"సేఫ్ గా రీచ్ అయ్యారా?" రాబర్ట్ సెల్ ఫోన్ ఆఫ్ చేసాక అడిగింది తరళ.
వాళ్లు అప్పటికే చిత్రావతి రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్నారు. ప్రొఫెసర్, తరళ, రాబర్ట్ ముగ్గురూ బయల్దేరారు. వాళ్ళు ఓ గుర్రపు బాగ్గీలో చిత్రావతి రైల్వేస్టేషన్ కు బయల్దేరారు...
చిత్రావతి రైల్వే స్టేషన్ కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పాడుబడిన రైల్వేస్టేషన్ లో ఓ గుర్రపు బగ్గీని మాట్లాడుతున్నారు. ప్రతి రోజూ ఉదయం  అక్కడ్నుంచి చుట్టుపక్కల వూళ్లకు గుర్రపు బగ్గీలు వెళతాయి...
ఎక్కువ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసేసరికి గుర్రపు బగ్గీ అతను ఒప్పుకున్నాడు.
చిత్రావతి రైల్వే స్టేషన్ దింపేసి గుర్రపు బగ్గీ వెనక్కి వచ్చేస్తుంది...గుర్రపు బగ్గీలో ఉన్న ముగ్గురూ ఆలోచనలో మునిగిపోయేరు.
ఇది జరగడానికి ఎనిమిది గంటల ముందు...

                                                                              * * *
రాబర్ట్ హిబ్రూ భాష లిపి తెలిసిన ఒకతన్ని తీసుకువచ్చాడు.
భూక్యా అతని పేరు.
దక్షిణాఫ్రికాలో పుట్టిన అతను...ఓ ఆటవిక జాతికి చెందినవాడు. అతి కష్టమ్మీద అక్షరజ్ఞానం నేర్చుకున్నాడు. ఆ తర్వాత సింగపూర్ వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసి అక్కడ్నుంచి ఇండియా వచ్చాడు. దక్షిణాఫ్రికా అడవుల్లో అతికొద్దిమందికి మాత్రమే తెలిసిన హిబ్రూ భాష అతనికి క్షుణ్ణంగా తెలుసు.
ఇండియాలో చిన్న చిన్న మేజిక్స్ చేస్తూ పొట్ట గడుపుకునే అతన్ని రాబర్ట్ 'ఐడెంటిపై' చేసి పట్టుకున్నాడు.

                                       * * *
హిబ్రూ లిపిలో ఉన్న ఆ తాళపత్ర గ్రంథాలు చదువుతున్న కొద్దీ భూక్యా నుదుట బిందువుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
క్షణక్షణానికి అతనిలో ఆందోళన పెరగసాగింది. అతని గుండె వేగం పెరిగిపోతుంది...

                                                                        * * *
ప్రొఫెసర్ పరమహంస భూక్యా వంకే చూస్తుండిపోయాడు.
ఆ తాళపత్ర గ్రంథాలు చదవడం పూర్తయ్యేక, ఒక్క నిమిషం రెస్ట్ లెస్ గా కళ్ళు మూసుకుని తెరిచి చెప్పాడు...                   "ఇందులో చాలా భయంకరమైన విషయాలు వున్నాయి. సరిగ్గా ఇవ్వాల్టికి ఏడవ రోజు కానీ, పదమూడవ రోజుకానీ బిత్రోచి నిద్రలేస్తుంది.
అకోరా తంతుతో బిత్రోచికి సమర్పణ జరుగుతుంది. ప్రంపంచమే నివ్వెరపోయే సంఘటనలు జరగనూ వచ్చు...నూటయాభయ్యేళ్ల తర్వాత నిద్రలేచే బిత్రోచి విపరీతమైన కోపంతో చెలరేగిపోతాడు. చిత్రావతి అడవిలో ఉన్న గెస్ట్ హౌస్ లో బిత్రోచి ప్రస్తుతం అసంతృప్తితో వున్నాడు.
ఆ అసంతృప్తికి ఆజ్యంపోసి అతనికి ఓ తెలివైన, బలమైన, దైవాంశగల వ్యక్తిని సమర్పిస్తే ఇక బిత్రోచి ప్రపంచాన్ని ఆక్రమించుకుంటాడు. గాలికన్నా వేగంగా ప్రయాణిస్తూ...గాలిలో కలిసి సృష్టినే హేళన చేస్తాడు. క్షుద్ర గణాలు రెచ్చిపోతాయి..." భూక్కా ఇంకా  చెప్పుకుపోతూనే వున్నాడు.
రాబర్ట్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ప్రొఫెసర్ పరమహంస ఆలోచనలో పడిపోయాడు.
రాబర్ట్ భూక్యా వైపు తిరిగి "థాంక్యూ వెరీమచ్...మీరు నాకు చాలా పెద్ద సాయమే చేసారు" చెప్పాడు అతని భుజం తట్టి, అతనికి డబ్బు ఉన్న కవరు అందజేస్తూ.
భూక్యా ఆ కవర్ ని రాబర్ట్ కి తిరిగి ఇస్తూ "వద్దు సార్...నేనే మీకు రుణపడి ఉన్నాను. సింగపూర్ లో స్మగ్లింగ్ కేసులో ఇరుక్కుపోయిన నన్ను కాపాడి, ఇండియా పంపించింది మీరే...ఆ విషయాన్ని మీరు మరిచిపోయినా, నేను మరిచిపోలేదు.
మరో విషయం...సింగపూర్ లో నేను కొన్నేళ్ళు సుసిరియో దగ్గర శిష్యరికం చేసాను. ఇతరులకు సాయం చేయాలన్న ఆయన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి...వీలయితే బిత్రోచి నిద్రలేవకుండా ప్రయత్నించండి.
అకోరా...తంతుని నియంత్రించండి. అకోరా తంతు మూడు రాత్రులు కొనసాగుతుంది. మూడు రాత్రుల్లో ఏదో ఓ రాత్రి మీరు అకోరా ప్రయోగాన్ని చేసే వ్యక్తిని చంపేయండి...అతని రక్తం యజ్ఞగుండంలో పడేలా..." చెప్పాడు భూక్యా.

                                       * * *
ఆలోచనల్లో నుంచి బయటపడ్డ రాబర్ట్ ఉలిక్కి పడ్డాడు.
కారణం...
గుర్రపుబగ్గీ...ఒక్కసారి ఆగిపోయింది...గుర్రం భయంతో బిగుసుకుపోయింది.

                                      20
"ఏమైంది?" రాబర్ట్ గొంతులో కంగారు, ఉలికిపాటు.
"గుర్రం ఆగింది. దేన్నో చూసి భయపడుతోంది..." గుర్రం బగ్గీ నడిపే వాడు చెప్పాడు భయపడుతూనే...
"గుర్రం భయపడ్డం ఏంటీ..." తరళ అడిగింది.
"బహుశా ఏదో దయ్యాన్ని చూసి వుంటుంది" భయపడుతూనే చుట్టూ చూస్తూ అన్నాడు గుర్రంబగ్గీ అతను.
"దెయ్యాన్ని చూసా?" తరళ గొంతులో ఆశ్చర్యం రెట్టింపయింది.
"దెయ్యాన్ని చూసే...నేను అనుకున్నంత అయ్యింది. చిత్రావతి వైపు రాకూడదనే అనుకున్నాను. మనం వెనక్కి వెళ్లి పోదాం..." బగ్గీవాడు భయపడుతూ అన్నాడు. బగ్గీని వెనక్కి తిప్పే ప్రయత్నం చేస్తూ.
"హలో...ఇప్పుడు వెనక్కి వెళ్తే ఎలా? మేమున్నాంగా, నీకేం భయంలేదు, నేను బగ్గీని తోలుతాను" అన్నాడు రాబర్ట్.
"మీకు తెలియదు సార్..అసలు రాత్రివేళ ఇటువైపు రావడం చాలా ప్రమాదం. గుర్రాలు దెయ్యాలను బాగా గుర్తుపడతాయి. ఇప్పుడు మనం ప్రమాదంలో ఇరుక్కున్నాం" బగ్గీవాడు బెంబేలెత్తిపోసాగాడు.
గుర్రం రెండు కాళ్ళూ పైకెత్తింది.
బగ్గీ బ్యాలెన్స్ తప్పుతోంది...
రాబర్ట్ గుర్రం బగ్గీ దిగేడు..
ప్రొఫెసర్ పరమహంస, తరళ కూడా కిందికి దిగారు.
బగ్గీవాడు భయంగా చూస్తున్నాడు.
రాబర్ట్ చుట్టూ చూసేడు.
రోడ్డుకిరువైపులా చెట్లు...చీకటి ముసురుకుంది...గాలి వేగంగా వీస్తోంది. ఆ గాలి వేగానికి చెట్లు అటు,ఇటూ కదులుతుంటే ఆ చెట్లమీదవున్న క్షుద్రశక్తులు భయంతో పరుగెత్తుకొస్తున్నట్టు వుంది.
ఆ మట్టి రోడ్డు నిర్మానుష్యంగా వుంది.
రోడ్డుకు పక్కగా ఓ చెట్టుకింద మొకాళ్ళ మీద కూచున్నాడు రాబర్ట్.
మోకాళ్ల కింద వున్న చిన్న చిన్న రాళ్ళు మోకాళ్లకు తగిలి నొప్పి కలుగుతుంది. అయినా లెక్క చేయలేదు. రెండు చేతులూ ఇంటూ ఆకారంలో పెట్టాడు.
కుడిచేత్తో ఎడమ చెవిని, ఎడమచేత్తో కుడి చెవిని పట్టుకున్నాడు.
సుసిరియోను మనసులో తలచుకున్నాడు. తరళ ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తోంది.
రాబర్ట్ పెదవులు కదలుతున్నాయి.
"ఓ దిశైవా...నేను చేసే ఓ మంచి ప్రయత్నాన్ని ఆశీర్వదించు. క్షుద్ర ప్రేతాత్మల నుంచి మమ్మల్ని రక్షించు. నీకు విధేయులై వుంటాం" రాబర్ట్ దిశైవను ప్రార్దిస్తున్నాడు.
చీకట్లో చెట్ల కదలిక భయంకరంగా వినిపిస్తోంది. చెట్లు ఆగి ఆగి కదులుతూ వుండడం వల్ల రాబర్ట్ మంత్రోచ్చారం చేస్తూ ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో క్షుద్రశక్తులను ఎదుర్కొంటూ ఉండడంవల్ల గుర్రం బగ్గీ అతను భయపడి పోయేడు.
మామూలుగా అయితే అతను చిత్రావతి అడవి వైపు వచ్చేవాడు కాదు. కానీ, ఎక్కువ మొత్తంలో డబ్బు ఇస్తాననడంతో ఆశగా వచ్చాడు.

                                      * * *
తరళ ఊపిరి బిగబట్టి చూస్తోంది...
ఏవో శబ్దాలు గాలిలో వస్తున్నట్టు అనిపిస్తోంది.
ప్రొఫెసర్ పరమహంస కళ్ళు పెద్దవయ్యాయి. సర్రున గాలిని కోస్తూ వెళ్తోన్న ఫీలింగ్...
అప్పటివరకూ రెండు కాళ్ళు ఎత్తి భయంతో బిగుసుకుపోయిన గుర్రం మెల్లిమెల్లిగా మామూలు స్థాయిలోకి వచ్చింది.
క్షుద్రఆత్మలను దిశైవ ఎదుర్కొంది.
రాబర్ట్ కు దారి సుగమం చేసింది.
రాబర్ట్ మాట్లాడకుండా వచ్చి బగ్గీలో కూర్చున్నాడు. అతనితో పాటు పరమహంస. తరళ ఎక్కి కూచున్నారు. బగ్గీవాడు ఏదో అనబోయి రాబర్ట్ మొహం లోకి చూసేడు.
రాబర్ట్ కళ్ళు అదో మాదిరిగా ఎరుపెక్కి వున్నాయి.
అతను బగ్గీవాడి వైపు చూడటం లేదు.
బగ్గీవాడు మౌనంగా బండిని తోలసాగాడు.
మునుపటి కన్నా వేగంగా వెళ్తోంది బగ్గీ...దారి పొడవునా దిశైవ నీళ్లకు సాయంగా ఉన్న విషయం ఒక్క రాబర్ట్ కు మాత్రమే తెలుసు.
గుర్రం బగ్గీ ఆగింది.
"ఇదే చిత్రావతి రైల్వే స్టేషన్..." చెప్పాడు బగ్గీవాడు...
ముగ్గురూ కిందకి దిగారు... 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS