Previous Page Next Page 
యువత నవత పేజి 29

   
    "ఏడిచారు! నన్నేం చేయలేరు. అంత తేలిగ్గా దొరికే మామూలు ఆడపిల్లను కాను."

     "అంటే నేను కావాలని లొంగిపోయానా? కామాంధులబలం సంగతి మీకు  తెలియదు."

    కాని, చివరికి ఒప్పించింది సుధ, కేసు పెట్టడానికి.

    మెడికల్ రిపోర్ట్సు తలక్రిందులు కాకుండా చూడడంతో ప్రారంభమైంది కష్టం సుధకు. నేరస్థులు డాక్టర్ని కొనే ప్రయత్నంలో వున్నారని తెలిసి కలవరపడిపోయింది సుధ.

     ఒకరోజు ఆఫీసులో వెంకటరత్నం అని యు.డి. సి. అడిగాడు "ఎంతవరకు వచ్చిందండీ మీ మానభంగం కేసు?"

    వెంకటరత్నం చూపులో, మాటలో ఒళ్ళంతా కారం రాచుకొన్నట్టుగా వుంటుంది సుధకు. "నా మానభంగం కేసేమిటి?" అంది చర్రుమన్నట్టుగా.

     "సుజాత వెనుకుండి నడుపుతున్నది మీరేకదా?"

    "అయితే?"

    "మీరు చాలా మోడరన్ లేడీకదా? చాలా అభ్యుదయంగా ఆలోచిస్తారు కదా! ఈ శీలం విషయంలో ఎందుకాలోచించలేకపోతున్నారు? ఇద్దరు ఇష్టపడి పాల్గొంటే ఏం పేచీలేదు! సుజాత విషయంలో బలవంతం గానే పొందడం జరిగిందనుకొండి!  అంతమాత్రాన పోగొట్టుకోనిది, ఆమె ఏం పోగొట్టుకొందని? అసలు, పోగొట్టుకొంటే పోయేది కాదుకదా?" అన్నాడు మార్మికంగా.

     "ఒక ఆడపిల్లతో మాట్లాడేప్పుడు కొంచెం సభ్యతగా మాట్లాడాలని గుర్తుపెట్టుకోండి, మిస్టర్ వెంకటరత్నం" వాడిగా అంది సుధ.

    "ఆడపిల్ల అన్నవిషయం మీరు బరితెగించినట్టుగా కనిపిస్తేనో!" మళ్లీ నవ్వాడు వంకరగా.  "మగవాళ్లకి మేం యేం తీసిపోయామని వాదిస్తారు! సెక్స్ దగ్గరికి వచ్చేసరికి ఆడపిల్ల అని గుర్తొస్తుందీ?ఎక్కడో యేదో జరిగింది!రెండు  రోజుల్లో చూసి పోయేదాన్ని పట్టుకొని  ప్రచారం చేస్తున్నారు. తెలియని వాడికికూడా ఈ మానభంగం సంగతి తెలిసిపోవాలని!అసలు శీలానికి మగవాడివ్వని ప్రిఫరెన్స్ మీ ఆడవాళ్లు యెందుకివ్వాలి!"

    సుధ కసిగా అంది. "ఇద్దరు పాల్గొనే సృష్టి కార్యక్రమంలో మగవాడికి ఎప్పుడూ కడుపురాదు కనుక! ఎప్పుడూ ఆడదాని కడుపే ముంచుతుంది కనుక!"

    "ఆడవాళ్లు అన్నీ చేయగలుగుతున్నారు! చేయలేనిది అదొక్కటే, మగవాడికి కడుపుతెప్పించండి!" అన్నాడు వీ. డి. వో యాదగిరి. "అసలా అమ్మాయి ఎదురు తిరిగకుండా సహకరించి వుంటే యెంత ఎంజాయ్ చేసి వుండేది?ప్చ్! మంచి ఛాన్స్ పోగొట్టుకొంది. స్త్రీకి ఎవరయినా బలాత్కారం చేస్తారేమోనని భయం యెంతగా వుంటుందో, బలాత్కరింపబడాలన్న కోరిక రెట్టింపుగా వుంటుందట. అలా కోపంగా చూడకండి సుధగాగూ!  చలం అన్నాడామాట నేననలేదు"

    "కాని నేనంటున్నాను! ప్రతి మగాడికీ కనపడ్డ ఆడదాన్నల్లా చెరచాలని వుంటుందట! కాని యెవరేమయినా అనుకొంటారని సభ్యత ముసుగువేసుకోవడం జరుగుతుంది."

    "అయ్య బాబోయ్! ఎంత అభాండం!"

    "బాంబువేసింది సుధాదేవి!"

    "ఏదో డిస్ కషన్ లో వున్నట్టున్నారు!" అంటూ ప్రవేశించాడు బి. డి. వో.  చంద్రకాంత్.

    "ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఇలా కూర్చోండి సర్!" సుధ వినయంగా కుర్చీచూపింది.

    "ఊఁ ఏమిటీ?" అడిగడు కూర్చొని.

    "శీలం విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?"

    "శరీరానికి సంబందించిందా?" ఆత్మకు సంబంధించిందా?"

    "ప్రస్తుతం జరుగుతున్న చర్చ శరీరానికి సంబంధించిన దానిమీదే జరుగుతూంది!"

    "శీలం అనేది స్త్లీరకి మాత్రమే వుంటుంది, ఉండాలి అనుకొంటారు చాలామంది! నేనంటాను, పురుషుడికికూడా వుంటుంది, ఉండాలి అంటాను నేను!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS