Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 30

                                                    గొంగళి పురుగులు

బల్లపరుపుగా పరచుకొన్న జీవితం మీద నుంచి
భార్యామణి తాపీగా నడచివచ్చి అందికదా-
"పంచదార లేదు
పాల డబ్బా లేదు
బొగ్గుల్లేవు - రాత్రికి
రగ్గుల్లేవు."
రోజూ పాడే పాత పాటకి
రోజూ ఏడ్చే పాత చావుకి
నిలువలేక, వినికూడా కదలకుండా గొంగళీ పురుగు
సగం సగం తిన్న కలల్ని నెమరేస్తూ నిద్రపోయింది

రోజూ ఆవకాయ తిన్నట్లు
రొటీన్ అలవాటైన
బల్లపరుపు జీవితం కింద కాషస్ గా దాచిన
కోర్కెల సీక్రెట్ బాక్స్ లోంచి తీసి
ఉద్రేకాన్నీ, సెక్స్ నీ, శృంగారాన్నీ
క్రైమ్ నీ, షాక్ నీ, లాటరీ కాగితాల్నీ
చాటుకుండా చూసుకుని, నవ్వుకుని మీసం మెలేసుకుని
మాట్లాడకుండా జెంటిల్మన్ లా మత్తుగా పడుకుంది గొంగళీ పురుగు
బస్ స్టాప్ దగ్గర పరాయి ఆడది తనకేసి చూసిందని
మెరీనా కాంటీన్ యివతల నుంచుంటే మినపట్టు వాసన ఘాటుగా
వేసిందని
అసలు అప్పుడే కాంగ్రెసులో చేరివుంటే ఈపాటికి మినిస్టర్ని
అయిపోయి ఉండేవాడినని
పెళ్ళాం దగ్గర చెప్పాలని సర్దాపడి
"హయ్యోరామ నీ బతుక్కి" అన్నట్టు మూతివిరిచే
అర్ధాంగి ఆకారం తల్చుకుని
ముడుచుకుపోయిన గొంగళీ పురుగు
తన్ని తనే తీసుకుని గోడ అవతలకి
తన్ని తనే గిరవాటేసుకుంది.

భూకంపం వచ్చిందన్నా
మరో యుద్ధం రేగిందన్నా
తన భార్య కవలల్ని కన్నదన్నా
కంగారు పడక కోటు తొడుక్కుని
కోటీశ్వరరావు ఆఫీసుకెళతాడు, వస్తాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS