Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 29

నీతికీ కట్టుబడిన వాళ్ళందరూ
నాలుక పిడచకట్టుకు పోతూ
ఎడారి దారుల పోతూవుంటే
ఒక హంతకుడు ఉరిశిక్ష తప్పి

ఉయాల లూగుతాడు
ఒక దురహంకారి నిముషాని
కొక పాకిస్తాన్ సృష్టిస్తాడు
ఒక వినాయకుడు నాయకుడై
జోహార్లు అందుకుంటాడు
అదృష్టపు గెడసాని అపాంగ
వీక్షణ ఎవరికి ఎవరికి
క్యూలో నిలబడండి జనులారా
ముసలివాడు మూర్ఛరోగి
మొద్దు ఎద్దు మానవుడు దానవుడు
అందరూ స్వయంవరానికి రావచ్చును
అర్హత లవసరం లేదు

కాయ్ రాజా కాయ్
కాస్తేవుంది చూస్తేలేదు
ఒకటికి మూడు రెట్లు
స్వర్గానికివే మెట్లు
క్షణంలో సగంలో కుబేరుడివి
కనురెప్ప పాటులో కుచేలుడివి
బెదిరిపోకు భీతావహులకిచట స్థానంలేదు
బెదురుగుండె సరితీసుకు
మండే అగ్నిగుండాన దూకు
చివరికి మిగిలిన బూడిదలో
చిన్న మెత్తు స్వర్గం దొరకదు
చినిగిన స్వప్నపు సంచీలో
చితికిన భాష్పం నిలవదు
అందుకే నేస్తం జీవితమే ఒక జూదం
ఖేదానికి మోదానికి లేదసలే భేదం

          *     *     *                        ---1958

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS