Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 29

 

                                                ఆడపిల్లా అనొద్దు!

    అపుడే అన్నం వార్చింది యాదమ్మ. వార్చిన గంజిలో ఉప్పు వేసి గుప్పెడు అన్నం మెతుకులు గంజిలో వేసి రెండు గిన్నెలలో పోసింది. అన్నం ఓ పళ్ళెంలో సగం పెట్టి సగం కుండలో వదిలి పెట్టి మూట పెట్టి పొయ్యి వెనక్కి పెట్టింది. చిన్న సత్తు గిన్నేలోంచి పండు మిరప పళ్ళు చింతపండు కలిపి నూరిన పచ్చడి తీసి మధ్యన పెట్టింది. ఓ ఉల్లిపాయ ముక్కలు కోసి యింకో చిన్న పళ్ళెంలో పెట్టింది. 'ఒరే మల్లెశూ , సుశీలా బువ్వ తిందురు రండి' గుడిసె బయట ఆడుతున్న కొడుకుని, దీపం బుడ్డి దగ్గర కూర్చుని చదువుతున్న కూతుర్ని పిలిచింది. పదకొండేళ్ళ సుశీల పుస్తకం మూసి వచ్చింది.
    ఆడుతున్న మల్లేశు మట్టి చేతుల్ని కడుక్కోకుండా పరుగెత్తి వచ్చాడు. ' అరేయ్ పోయి కాళ్ళు సేతులు కడగరా , నిండా మట్టి గొట్టుకున్నావు ' అంది యాదమ్మ, చెమట కారుతున్న కొడుకు మొహం చీర కొంగుతో తుడిచి, వాడ్ని లాక్కెళ్ళి సిమెంటు తొట్టి దగ్గర నీళ్ళు తీసి కాళ్ళు చేతులు కడిగింది. తల్లిని విడిపించుకుని పరుగున వచ్చి కంచం ముందు కూర్చున్నాడు. పళ్ళెంలో అన్నం, పచ్చడి చూసి "కూరేం సేయలేదా నా కొద్దీ పచ్చడి' కోపంగా పళ్ళెం తోశాడు. ఆకలి మీద వచ్చిన మల్లేశు కి గొడ్డు కారం చూసేసరికి తిక్కరేగింది. 'కూర ఎడ వండనురా, సేతిలో పైస లేదు. ఎడనించి తెచ్చి వండాల కూర, నార, నెలాఖరు ఫస్టుకింకా రెండు దినాలుంది . నా కాడ పైసలు లేవు. "పప్పు చారన్నా చేసావా?" యాదమ్మ అపరాధిలా తల దించుకుని 'పప్పు అయిపోతోంది...రేపు తెస్తాలే దుకానంనించి...యీ యాల్టికి తిను, డా.....మా నాయనగా.....' అంది కొడుకుని బతిమిలాడుతూ. సుశీల నిశ్శబ్దంగా వచ్చి కూర్చుంది. తన ముందున్న గంజిగిన్నే, తమ్ముడి ముందున్న అన్నం పళ్ళెం వంక చూసి తల్లి వంక చూసింది. కూతురు చూపు అర్ధం అయింది యాదమ్మకి "ఏటే ఆ సూపు....మింగుతావా నన్ను. మింగు బతికిపోతాను. అందరికి యాడవస్తది అన్నం . యిన్ని గింజలుంటే ఉడకేసా . నెలాఖరు సేతిలో పైస లేదని నీకు తెలవదా.....పొద్దుటేల రొట్టె సేయనేదా . నిన్న రాత్రి అన్నం మింగలేదా....' అంది కూతురి భావం అర్ధం అయి కోపం వచ్చింది యాదమ్మకి. 'అన్నం నేకపోతే అడికేట్టా పెట్టావు , నాకు గంజి , ఆడి కన్నమా , ఎప్పుడూ అంతే నీవు . ఆ వున్నదేందో యిద్దరికీ సరింగ పెట్టరాదా" కోపంగా చూసింది. 'ఏటే సరిగా పెట్టేది. ఆడు మొగోడు సిన్నోడు....మనం యింటికాడుండే ఆడోల్లం ఏదుంటే అది తినాలి . అల్లు సదవాలి పనికి పోవాలి, కష్టపడాలి సంపాదించాలి అందుకే మొగోడు బలంగుండాలి. ఎప్పుడూ అడిమీద నీ కేడుపే. అసలే పైసలు లేవు. నీ గోల నీపడలే. తింటే తిను తినపోతే పో . ఆడి తిండి కెపుడూ నీ దిష్టే . కొడుకు కంచం లోంచి ఓ గుప్పెడు అన్నం తీసి కూతురి గంజిలో వేసింది. "నాకొద్దే ఈ కారం . కూరతే. అమ్మగారేం కూర యీయనేదా.....ఎల్లి రత్తమ్మ మామ్మ నడిగి యింత ఏదన్నా పట్రా." కొడుకు అన్నం ముట్టకుండా అలక సాగించాడు. 'అమ్మగారిస్తే నీకే ఎడతాకదురా . పొద్దుటేల యింత సాంబరిస్తే నీకే ఎట్టా యిప్పుడెం నేదు'. తిను బేగి ఉడుకు సల్లారిపోతుంది' యాదమ్మ గంజిగిన్నే ఎత్తి వేలితో కదిపి తాగడం మొదలు పెట్టింది. మధ్యలో ఉల్లిపాయముక్క కొరికింది.
    సుశీల తల్లి వంక చూసి యింక తను ఏం అన్నా లాభం లేదు. అలిగి తినకపోతే ఆకలికాగలేదు. మొగాడంట, ఆడు బయటకెళ్ళి పని చేయాలంట. ఏం తను బయటకెళ్ళి పనిచేయటం , ఏం తను బయటకెళ్ళి పనిచేసి, స్కూలు కెళ్ళి సదూకోడం నేదూ. తెల్లారి ఆరుగంటలకి ఎల్లి ఓ యింట్లో పనిచేసి మూడొందలు తేడం లేదూ. మళ్ళీ వచ్చి స్కూలుకి పోవడం లేదు. మల్లేశు పనికి పోతున్నాడా, అడికేమో అన్నం, కూర అన్నీ వేస్తుంది. అమ్మగారిచ్చిన యిడ్దేనో, పూరి ముక్కో ఏదిచ్చిన ముందాడికే పెడ్తాంది. మనసులో ఉక్రోసం ఎన్నోసార్లు బయటపెట్టినా - మొగాడితో ఆడోళ్ళకి వంతేంటి" అంటుంది. అయ్య తాగి తందనాలాడోచ్చినా, ఆడు డబ్బియకపోయినా ఆడికి అన్నం పెడ్తాది. తమ మూడొందలు తెచ్చిచ్చినా గంజీనీళ్ళు గతి, మల్లేశు స్కూలికి పోకుండా అతలాడుతాడు. స్కూలు కెళ్ళినా సదవడు, చదివని వాడ్ని పట్టుకుచదూ అని సతాయిస్తుంది. తను చదువకుంటానంటే 'పనికిరా, నా ఒక్కత్తి వల్ల గాదూ. నీవో రెండిళ్ళలో చేయి అని తిడుతుంది. యిదేక్కడి న్యాయమో అనుకుంటుంది. ఐదో క్లాసు చదువుతూ బడికెళ్లే సుశీలకి తల్లి ఆడపిల్లని తనను తక్కువగా చూస్తున్న సంగతి జీర్ణించుకోలేని స్థాయికి ఆలోచనలు ఎదిగాయి.
    తమ పనిచేస్తే అమ్మగారింట్లో అబ్బాయి, అమ్మాయి అని తేడా చూపరసలు. యిద్దర్నీ చక్కా మంచి స్కూలు పంపుతారు. యిద్దరికీ మంచి బట్టలు, ఇద్దరికీ రెండు సైకిళ్ళు, ఆడపిల్లవి నీకెందుకు సైకిలు అనరు. ఆడపిల్లవి చదివి ఏం చేస్తావు అని అనరు. అమ్మగారెప్పుడూ , అడెంటి మగేంటి యీ రోజుల్లో అంతా బాగా చదవాలి. ఉద్యోగాలు చేయ్యాలంటుంది. తనతో కూడా రెండు మూడు సార్లంది. ' సుశీల బాగా చదువుకో , లేకపోతే మీ అమ్మలాగే నీవూ అంట్లు తోముకుంటూ బతకాలి. మెట్రిక్ వరకన్నా చదువుకో ఏదో చిన్నపని లేదంటే ఏదో కోర్సులు చేసుకోవచ్చు అని చెప్పేది. గవర్నమెంటు మీకు జీతాలు లేకుండా చదివించినా చదువుకోరు. డబ్బులు కోసం మీ అమ్మలు పనిలో పెడతారు. తప్పు కాదు పని చేసుకో , కాని చదువుమానకు అంటుదప్పుడప్పుడు. తనకి తెలియని విషయాలెన్నో చెపుతుంది. పదో క్లాసు వరకు చదివితే అటెండరు ఉద్యోగాలోస్తాయట . లేదంటే ఏదో కోర్సులు టైలరింగు లాంటి పనిదొరికే చదువులు చదువవచ్చట.
    'మా అమ్మ రోజూ పోరెడుతుంది. చదువు మానేయమని , నన్ను మా అమ్మ సదవనీయదమ్మగోరూ" దిగులుగా అంది.
    అదేంటే , మీ అమ్మకి మతిపోయిందా ఏమిటి, నిన్ను కూడా తనలాగే పనిమనిషిని చేస్తుందా.
    "మా అయ్య యింట్లో డబ్బీయడు, అమ్మ తనోక్కర్తే ఎన్ని యిళ్ళల్లో చేస్తాను ఇంకో యిల్లు వప్పుకో అంటుంది. ఇంకో యిల్లు వప్పుకుంటే స్కూలికి ఎట్లా ఎల్లాలి నేను తన గోడు చెప్పుకుంది సుశీల. యిలాంటి స్థితిని ఎలా ఎదుర్కోవాలో చెప్పగల్గిన స్థితిలో లేదు అరుణ. సుశీల తండ్రి అటో నడుపుతాడు. వచ్చిన దానిలో సగం అద్దె కట్టి మిగిలేది తాగుడికి, పెళ్ళాం మరీ పోరుపెడితే అప్పుడప్పుడు యిరవై, ఏబై పడేస్తాడు. అలాంటి మొగుడిని, ఏం చెయ్యలేక రెక్కల కష్టం తోటి పిల్లని పెంచుతున్న యాదమ్మ సమస్యలు తెలిసి, సుశీల పట్ల సానుభూతి ఉన్నా ఏం చెయ్యలేని స్థితి అరుణది.
    అ ఏడాది పరీక్షలయ్యాయి. శలవలయ్యాక స్కూళ్ళు తెరిచారు. శలవుల్లో యింకో ఇల్లు కూడా పనికి ఒప్పుకుంది సుశీల. 'స్కూలు తెరిచాక పుస్తకాలు, యూనిఫారం ' కి డబ్బులు కావాలి గదమ్మా' అంది అరుణ అడిగితె. ఆ పిల్లకి చదువుమీదున్న శ్రద్దకి ముచ్చ టేసినా ఆ పిల్లకి ఎలా సాయపడాలో తెలియదు.
    తామిద్దరూ ఉద్యోగం చేస్తున్న యిద్దరు పిల్లల్ని పెంచి , చదివించి , ఓ ఇల్లు ఏర్పరచుకునే స్థాయిని మించినది కాదు తన ఆర్ధిక స్థితి.   

                                                   ***

    స్కూలు తెరిచిన రోజు కళ్ళు వాచిపోయేట్టు ఏడుస్తూ పనికి వచ్చింది సుశీల. "ఏమయిందే " అరుణ తెల్లబోతూ అడిగింది. సుశీల భోరుమంది. 'మా అమ్మ కొట్టింది. స్కూలు మానేయాలిట. సదివింది చాలు. నీ పెళ్ళి సేయ్యాలి . డబ్బు కావాలి అంటూ రెండు మూడిళ్లు పనికి కుదిర్చింది, ఏడుస్తూ అరుణ కాళ్ళు పట్టుకుంది" అమ్మగోరు, మీరు సెప్పండి మా అమ్మకి. అమ్మగారూ  నాకు డబ్బీయద్దు మీ ఇంట్లో వుంచుకొని యింత తిండేట్టండి. అన్ని పనులు చేసి పెడతా. నేను స్కూలుకెళ్ళి సదూకుంటూ అన్ని పనులూ చేసి పెడతా" ఆశగా చూస్తూ అడిగింది సుశీల. అరుణ యిబ్బందిగా చూసింది. పన్నెండేళ్ళ పిల్ల పూర్తి బాధ్యత తాము తీసుకోల స్థాయి వుందా. ఆడపిల్ల బాధ్యత తీసుకోడం మాటలా? ఎదిగే పిల్ల. రేపు ఏదన్నా యిటు అటు జరిగితే దాని తల్లి దండ్రి ఊరుకుంటారా. అసలు వాళ్ళ అమ్మా, నాన్నా దీనికి  వప్పుకుంటారా! పిల్లని తమ యింట వుంచడానికి వప్పుకుంటుందా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS