ప్రతి ఇంట నిత్యవసంతాలు చిందాలి
కొత్తదనాన్ని పుణికించి, కొంగ్రొత్త రీతులకు నాంది పలికిన రుధిరోద్గారి చేయగలిగినంత తన పనిని పూర్తి చేసుకొని నిష్క్రమించింది చరిత్ర పుటలలోకి శాశ్వతంగా.
సరికొత్త ఆశలను, ఆకాంక్షలను కల్పించి ఉవ్విళ్ళూరిస్తూ - చిరుమువ్వల సవ్వడిలో చెంగలిస్తూ - మధురంగా, మంజులంగా, మనోజ్ఞంగా పెండ్లి కూతురిలా ముస్తాబయి, సింగారంతో, విలాసంతో సాక్షాత్కరించింది - రక్తాక్షి.
కళ్ళలో కాఠిన్యంతొంగి చూచినా, మనసు మెత్తనే అనిపిస్తోంది.
చూపులోని సంజకెంజాయలు క్షాళన చేయాలి- సమజంలో పేరుకున్న అవినీతినీ, కుళ్ళునూ.
మనసులోని మార్దవం మల్లెపూవులా పరిమళించాలి -మానవ కళ్యాణానికి.
ఇదే మన ఆశ -ఆకాంక్ష.
పూర్వదిశలో భానుషఃకాంతులలో పులకించి వికసిస్తోంది కమలమ్మ-
వగరెక్కిన లేచివుళ్ళ తీపిదనంతో, కుహూ, కుహూ రవాల మంజుల మనోజ్ఞ నిక్వాణంతో మత్తుజల్లుతోంది కోకిలమ్మ -
పాత చేదని, కొత్త తీపని -
గతానికి, ప్రస్తుతానికి, ఆ గతానికి సుమధుర భావ వారధిగా చేదుతీపుల మేలు కలయికతో చవులూరిస్తోంది వేపపూ ప్రసాదం.
ఎన్నో వర్షాల వసంతాల వరుసలో, మంచి చెడుల అనుభవాల ముందుకు సాగె మానవ జాతి మధురంగా, మంగళకరంగానవ సంవత్సరం సాగిపోవాలని మనస్సు నిండుగా కోరుకుంటోంది గడిచినా, తరాలు దాటినా తలరాత మాత్రం మారలేదని మానవ సమాజం.
దరిద్రులు నిత్య దరిద్రులు!
సంపన్నులు పరమ సంపన్నులు!!
కలిగిన వారికే అవకాశాలు, లేనివారికి నిరాశ క్లేశాలు!!! ఎన్నో ఉగాదులు వెళ్ళిపోయాయి- నిండిన ఆశాకాసారాలను ఎండమావులుగా చేసి.
ఎన్నో ఏడాదులు గడిచిపోయాయి - మానవతనే అవహేళన చేసి.
'స్వార్ధాన్ని సవాలు చేసే క్షణంకోసం, సమసమాజానికి పునాది వేసే గడియ కోసం ఎన్నాళ్ళీ నిరీక్షణ' - అని లోలోన గొణుక్కుంటోంది -పేద ప్రజా బొంగురుపోయిన గొంతుతో, మూగపోయిన రొదతో. దశాబ్దాలుగా దారిద్ర్యంలో మ్రగ్గుతూ వచ్చిన తెలుగు ప్రజా ఎన్నుకొంది- ప్రజాస్వామ్య పద్దతిలో తణు పయనించ దలచిన దిశను -
వారి ఆశయాలకు, అభిలాషలకు అద్దం పడుతూ సాగిపోతున్నాం ముందుకు ప్రగతి పథంలో - అందరం కలిసి పరిశ్రమించి, పరిక్రమించి.
ఈ శుభదినాన ప్రజల ఆశబలంతో సంస్కారాత్మకమైన ప్రజాహిత కార్యక్రమాలను మరింత చురుకుగా అమలుపరచడానికి సిద్దమైంది ప్రభుత్వం.
కళామతల్లి మంజీరా మంజుల సింజితాలే మానవ నాగరికత వికాసానికి మధుర సంకేతాలు. సంస్కృతీ సత్సంప్రదాయాలే జాతి మనుగడకు జీవనాడులు. త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, అమరావతీనగర అపురూప శిల్పాలు, అజంతా గుహలలో ఆంధ్ర చిత్ర కారుల తూలికా విన్యాసాలు, తేనియలకు తీయందనాలు నేర్పిన తెలుగు కవితా కోకిల కూజంతాలు తిరిగి జీవం పోసుకొని. తెలుగు నేలపై వర్ధిల్లాలన్న తపన రూపం దిద్దుకొంటోంది నేడు- తెలుగు విజ్ఞాన పీఠంగా.
తెలుగు భాషా సంస్కృతీ వికాసాలకు నెలవుగా, తెలుగు విజ్ఞాన ప్రాభవ వీచికలకు కాణాచిగా అచిరకాలంలోనే అద్వితీయంగా రూపందుకొంటుంది - శారదా నిలయంగా.
ఆరుకోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరకూ -
దేశవిదేశాల్లో తెలుగు కీర్తిపతాకాలుగా వెలుగొందుతున్న మన తెలుగు ఆడపడుచులకు, అన్నదమ్ములకూ - రక్తాక్షి సుఖశాంతి సౌభాగ్యదాయిని కావాలని నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
తెలుగు నేల నలు చెరగుల వెన్నెలలు విరియాలని - పాడిపంటలతో, పారిశ్రామిక వికాసంతో నిండుదనంతో పండి పరవశించాలని-
తెలుగునాట ప్రతి యింట నిత్య వసంతాలు చిందాలని -
ప్రజలకోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలవంతం కావాలని - ఆకాంక్షిస్తున్నాను.
సర్వేజనా సుఖినోభవంతు.
రక్తాక్షి ఉగాది సందర్భంగా ఆకాశవాణి, దూరదర్శన్ కేం ప్రసారితం
