ఆ తుంపరలు తనమీద పడకుండా ఈసారి ముందు జాగ్రత్తగా పక్కకి ఒంగింది హరిణి.
".......దమ్మిడి మిగలడం లేదండీ! అప్పుడొక రోజున మా నాన్న నాకు కల్లో కనబడ్డాడండీ. కనబడి. "ఒరే అమ్మాన్నా! రాశి భూమి దున్నినన్నాళ్ళు నాలుగు రాళ్ళు వెనకేసుకోలేవురా! ఈ వ్యవసాయం మాని సాహిత్యవ్యవసాయం మొదలెట్టు! సాహిత్యం మన వంశంలోనే ఉందని తెలియదా నీకు! అన్నాడండీ! సాహిత్యం నిజంగానే మా యింట్లో ఉందండీ. మా నాన్న కీచకవధ అనే బుర్రకధ రాశాడండీ"
"కలలో వచ్చారంటే మీ నాన్నగారు ......?" అన్నాడు ఎడిటరు.
"ఆయన్లేరండీ! బుర్రకధ రాసిన తర్వాత ఆయన్ని బుర్ర పగలకొట్టి చంపేశారండీ"
"బుర్రకధ రాసినండుకా?" అంది హరిణి ఆశ్చర్యంగా.
"కదండీ గ్రామ కక్షలండీ"
"నేను మీకు చెయ్యగలిగింది ఏమన్నా వుందా?" అన్నాడు ఎడిటరు.
"ఉందండీ!" అని నేల మీద పెట్టిన జనపనార సంచీని అతికష్టం మీద పైకి లేపాడు అమ్మన్న. దాన్లో నుంచి పెద్ద దస్త్రంలా ఉన్న కాగితాల కట్ట తీసి ఎడిటరు ముందు ఉంచాడు.
చూశాడు ఎడిటరు. అన్ని కాగితాలనీ కలిపి దారంతో కట్టడం సాధ్యమయినట్లు లేదు. అందుకని కుట్లు ఉండవలసిన చోట్ల దానికి సైకిలు చక్రానికి ఉండే స్పోక్స్ బిగించబడి వున్నాయి. అవి జారిపోకుండా వాటికి పైనా కిందా నట్లు బిగించి ఉన్నాయి.
"జానీ అని మా ఊరి సైకిల్ షాపు ఒనరండీ! నాకు మంచి ఫ్రెండండీ! అతను చేసి ఇచ్చాడండీ ఇట్లాగా" అన్నాడు అమ్మన్న.
ఆ కాగితాల దస్త్రానికి పైన బ్రౌన్ పేపరు అట్టవేసి ఉంది.
దాని మీద రాసి వున్నాయి అక్షరాలు.
"మామల మరాఠీ"
మళ్ళీ చదివి, అది మాయల మరాఠీ అయివుండాలనుకున్నాడు ఎడిటరు.
కనీసం పదిహేను వందల పీజీలు ఉంటుంది ఆ స్క్రిప్టు.
దాని కింద చిన్న అక్షరాలతో ఉంది. "మొదటి భాగం" అని.
"మీరు ఇది వేసేలోపల రెండో భాగం రాసేస్తాను. అశ్రద్ధ చెయ్యకు సార్! నేను చాలా కష్టజీవిని!" అన్నాడు అమ్మన్న. చూపుడు వేలుని కొక్కెంలా చేసి నుదుటి మీదకు పోనిస్తూ.
వెంటనే హరిణి కుర్చీలో నుంచి లేచి, టేబుల్ కి రెండో వైపు వచ్చి కూర్చుంది.
తను చెప్పదలుచుకున్నది అమ్మన్న నొచ్చుకోకుండా ఎలా చెప్పాలా అని ఒక నిమిషం అలోచించి అన్నాడు ఎడిటరు.
"చూడండి అమ్మన్నగారూ! ఇంత బృహత్తరమైన నవలలు వేసే రోజులు కావు ఇవి! అంతా స్పీడ్ ఏజ్! మీరు చిన్న అర్టికల్సుతో మొదలెట్టండి. ఏ మాత్రం బాగున్నా నేను తప్పకుం........"
దానికి కన్విస్ అవలేదు అమ్మన్న. కాసేపు మౌనంగా ఉండి, తర్వాత వేదాంతంగా నవ్వాడు, "నేను రాతి నేలను దున్నడం మొదలేప్పుడూ అంతేనండీ! అందరూ నిరుత్సాహపరిచిన వాళ్ళే గానీ ప్రోత్సహించిన వాళ్ళెవరూ లేరు! అయినా నేను పట్టినపట్టు వదలకుండా పదేళ్ళు సాగుచేస్తే ఈసారి పిల్లిపెసర మొలవలేదూ! అలాగే ఇది కూడా ఈ మాయల మరాఠీ పది భాగాలు పూర్తి చేసి తప్పకుండా ఏదో ఒక పత్రికలో ప్రచురిస్తాను. నేను కష్ట జీవినండీ . వస్తాను" అని చెమట తుడుచుకుని, ఆ కాగితాల దస్త్రం సంచీలో పెట్టుకుని భారంగా వంగి నడుస్తూ వెళ్ళిపోయాడు.
"ఎవరండీ ఈ కష్టజీవి" అని నవ్వుతు ఎడిటరు రియాక్షన్ కోసం అయన మొహంలోకి చూసింది హరిణి.
చిన్నగా నవ్వి, ఆ టాపిక్ ఇంక అక్కడితో కట్ చేసినట్లు అన్నాడు ఎడిటరు. "రాసుకొచ్చారా ఇంటర్యు బాగా వచ్చిందా!"
"ఓ!" అంది హరిణి ఉత్సాహంగా.
"ఏదీ!" అని చెయ్యి జాపబోతూ, ఏదో స్పురించినట్లు ఆగిపోయాడు ఎడిటరు. అతని చేతులు టేబుల్ మీద ఉన్న కాగితాలను అటూ ఇటూ కదుపుతూ వెదకడం మొదలెట్టాయి.
కొత్త సీరియల్ తాలూకు స్క్రిప్టు ఎక్కడ పెట్టాడు తను.
బజర్ నొక్కి పీయేని పిలిచాడు.
పి.ఏ. రాగానే, "కొత్త సీరియల్ మొదలెట్టాం కదా ఈ వారం దాని స్క్రిప్టు ఏదీ?" అన్నాడు.
"మొదటివారంది ప్రింటయిపోయింది సర్! రెండో వారం కంపోజింగ్ లో వుంది. మూడో వారం దగ్గరనుంచి మొత్తం స్క్రిప్టు మీ దగ్గరే ఉండాలి." అన్నాడు పి.ఏ.
"అవును, ఇందాక నా టేబుల్ మీదే చూసినట్లు నాక్కూడా గుర్తు" అని ఆగి , ఏదో తట్టినట్లు అన్నాడు ఎడిటరు "గాడ్! ఇందాక వచ్చిన అమ్మన్న తన మాయల మరాఠీ స్క్రిప్టు తో బాటు ఇది కూడా పట్టుకెళ్ళిపోయాడేమో పొరబాటున"
ఫై.ఏ. గబగబా తలుపు దగ్గర కెళ్ళి "ఆత్మారాం" అని పిలిచాడు పెద్దగా.
ఆఫీసు బాయ్ ఆత్మారాం వచ్చాడు.
"ఆత్మారాం! ఇప్పుడేళ్ళాడు ఒక మనిషి. పేరు అమ్మన్న అయన తన స్క్రిప్టుతో బాటు మన స్క్రిప్టు కూడా పట్టుకెళ్ళిపోయాడేమో చూసిరా! పరిగెత్తు" అన్నాడు ఎడిటరు.
ఆఘమేఘాల మీద వెళ్ళిపోయాడు ఆత్మారాం.
"ఎందుకైనా మంచిది! ఒకసారి కప్ బోర్డులో చూడండి అన్నాడు ఎడిటరు పి.ఏ. తో.
