10
అప్పుడే బైండింగ్ పూర్తి అయి, తన టేబుల్ మీదికి వచ్చిన మొదటి కాపీని చూస్తున్నాడు ఎడిటరు. బైండింగ్ అంటే ప్రింట్ అయిన పేజీలు , కవరు పేజీ కలిపి పిన్ చెయ్యడం.
[పత్రిక మూడు సెట్స్ గా తయారవుతుంది. మొదటిది పేజీల ప్రింటింగ్. రెండోది కవరు పేజీ. ప్రింటింగు - మూడోది బైండింగ్.
ప్రతి స్టేజిలోనూ తను జాగ్రత్తగా చెక్ చేస్తాడు. ప్రతి డిటైల్ ని కూడా. ఈ వారం రెండు డిఫేక్త్స్ వచ్చాయి. ఒకటి మాములు పేజీల్లో ఒకటి కవరు పేజీలో.
వాటిని అప్పటికప్పుడే కరెక్ట్ చేయించాలని చాలా తాపత్రయపడ్డాడు తను. కానీ కుదరలేదు.
ఎంత ప్రయత్నించినా ఆ డిఫెక్ట్ డిఫెక్ట్ గానే ఉండిపోయాయి.
ప్రతి పేజీని, కవరు పేజీని విడివిడిగా భూతద్దంలో నుంచి చూసినట్లు చూసినప్పుడు చాలా ప్రామినెంట్ గా కనబడిన ఆ డిఫేక్త్స్ బైండింగ్ పూర్తి అయి వచ్చిన ఈ కాపీలో కూడా అంత కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయా!
చూడాలి!
మేగజైను రీడర్స్ మీద కలిగించబోయే టోటల్ ఎఫెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని పరిశీలనగా చూశాడు ఎడిటరు.
కవర్ పీజీ కలర్ కంబినేషను బాగానే వుంది. కానీ పత్రికటైటిలు కింద బార్డర్ లాగా సాలిడ్ - బ్లూ వెయ్యమన్నాడు తను. కానీ ప్రింటింగ్ లో ఆ సాలిడ్ బ్లూ రాలేదు. స్క్రీన్ వేసినట్లున్నారు. చాలా డల్ గా వుంది కలర్. న్యూస్ స్టాండ్స్ లో మేగజైను వేలాడదీసినప్పుడు అల్లంత దూరానికి కూడా ప్రముఖంగా కనబడేటట్లు టైటిలు.
కానీ అంత ప్రామినెంట్ గా రాలేదు ఇది! ఆ లోపం కనబడుతూనే వుంది.
పేజీలు తిప్పాడు. ఒక పీజీ దగ్గర ఆగిపోయాయి అతని చూపులు.
ఈ పేజీకి చాలా లైట్ స్క్రీన్ వెయ్యమని ఇన్ స్త్రేక్షన్స్ ఇచ్చాడు తను. కానీ బాగా డార్క్ గా వచ్చేసింది. ఆ స్క్రీన్ బాక్ గ్రవుండ్ మీద ప్రింట్ చేసిన అక్షరాలు చదవడం కష్టంగా వుంది.
తను ఇంతవరకూ అబ్జర్వు చేసిన ఆ రెండు లోపాలు ఇంకా కనబడిపోతూనే వున్నాయన్నమాట!]
కానీ ఆ రెండు లోపాలూ తప్పిస్తే, మొత్తం మీద ఆ వారం ఇష్యూ ఎక్స్ లెంట్ గా వచ్చింది.
ముఖ్యంగా , ఆ కీర్తి అనే కొత్త రచయిత్రి రాసిన సీరియల్ ఈ వారమే మొదలెట్టాడు తను. చాలా గొప్పగా రాసింది ఆమె.
సీరియల్ మొదటి వారం మేటరులోని భావాన్ని అంతా మూడు రేఖల్లో కుదిస్తూ ఆర్టిస్టు వేసిన ఇల్లస్ట్రేషన్ కూడా చాలా బాగా వచ్చింది. తన సూచలని సరిగ్గా కేచ్ చెయ్యగలిగాడు ఆర్టిస్టు.
చూస్తున్న ఎడిటరు కాపీని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు రెడీ అయినవి దాదాపు ఒక పది కాపీలు మాత్రమే. మిగతా కాపీలన్నీ బైండింగ్ అయి, ప్యాకింగ్ పూర్తి అయి మార్కెట్ లోకి వచ్చేసరికి ఇంకో నాలుగైదు రోజులు పడుతుంది.
ఇష్యూ మార్కెట్ లోకి రావడానికి మూడు వారాల ముందే మొదలవుతాయి తన ప్రయత్నాలు. ఇష్యూ తాలూకు డమ్మీని తయారుచేస్తున్నప్పటి నుంచి, దాన్ని కవర్ పేజీ నుంచి చివరి పీజీ దాకా ముస్తాబు చేసి మార్కెట్ లోకి పంపేవరకు ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ చిన్న చిన్న కాంప్లికేషన్స్, దాటి నెక్ట్స్ టెన్షన్స్ -------ఇవన్నీ తప్పవు. అన్నిటికీ, అందరికి సహనంగా సమన్వయం కుడురుస్తూ వుండడం తన బాధ్యత. చాలా వరకూ వాటన్నిటినీ సక్సెస్ పుల్ గానే సాల్వ్ చేస్తూనే ఉంటాడు తను.
కానీ, చాలా సాధించాలన్న సంతృప్తితో బాటు, సాధించవలసినది ఇంక ఏదో వుందన్న అసంతృప్తితో ముగుస్తుంది ప్రతివారం కూడా!
ఆ అసంతృప్తికి మరో పేరే క్రియేటివిటీ!
ఇంకా ఏదో చెయ్యాలి అన్న తపన వున్నన్ని రోజులు క్రియేటివిటి అణగారిపోదు.
ఒక్క క్షణం కుర్చీలో వెనక్కి జీరగిలబడి రిలాక్స్ అవుదామనుకునే సరికి , డోర్ కి వున్నా గ్లాస్ లో నుండి హరిణి మొహం కనబడింది. "మే ఐ కమిన్!" అన్నట్లు నిశ్శబ్దంగా కులుతున్నాయి ఆమె పెదవులు . ఆ పెదవుల పైన చిరునవ్వు పూత.
"ప్లీజ్ కమిన్" అన్నాడు ఎడిటరు.
హరిణి వచ్చి కూర్చోగానే మరో వ్యక్తీ కూడా లోపలికి వచ్చాడు. అతని కుడి చేతిలో ఒక జనపనార సంచీ వుంది. దాని బరువుకి కొద్దిగా వంగి వున్నాడు మనిషి.
"కూర్చోండి" అన్నాడు ఎడిటరు.
అతను వుస్సురుమంటూ కూర్చుని, సంచీ కింద పెట్టాడు. కుడి చేతి చూపుడి వేలుని కొక్కెంలా మడిచి, నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుని చెయ్యి విదిలించాడు.
ఆ తుంపరలు వాన జల్లులా హరిణి మీద పడ్డాయి.
అతని వైపు ప్రశ్నార్ధకంగా చూశాడు ఎడిటరు. "చెప్పండి"
"నేను చాలా కష్టజీవినండి!!" అన్నాడతను విషాదంగా.
"వింటున్నాను" అన్నట్లు తల పంకించాడు ఎడిటరు.
"నా పేరు అమ్మన్న అండీ! నాకు ఒక ముసలి తల్లి, ముద్దుల చెల్లీ వున్నారండీ"
ముసలితల్లి ఖళ్ ఖక్ మని దగ్గుతుందా! అనుకుంది హరిణి, నవ్వు కనబడకుండా కర్చీపు పెదిమలకు అడ్డం పెట్టుకుంటూ.
"మా అమ్మ ఊపిరి వదిలినప్పుదల్లా అరిచినట్లు శబ్దం వస్తుందండీ! ఉబ్బసం రోగం అండీ!" అన్నాడు అమ్మన్న. "మా చెల్లెమ్మకేమో పెళ్ళి కాలేదండీ! మా కున్నది ఒక్కటే ఎకరం పొలం అండీ! అది కూడా రాశిభూమి అండీ! మా ఇంటికి నేనేక్కోడినే దిక్కండీ! ఆ ఇల్లు కూడా పడిపోయేట్లు ఉందండీ! రాత్రింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకు కష్టపడినా ....." అని చూపుడు వేలుని కొక్కెంలాచేసి , నుదుటికి పట్ట్టిన చెమటను తుడుచుకున్నాడు అమ్మన్న.
