నిజం చెప్పాలంటే ఆమె నల్లగా రూపం మార్చుకున్న లిండాబ్లెయిర్ లాగానో ఆమెకు అప్ప లాగానో కన్పిస్తోంది రంగు మార్చుకుని 'జంగిల్' చిత్రంలో అడవిరాణి పాత్ర నటిస్తున్న దాన్లా వుంది.
కొంతదూరం పోయాక పీచంగి ముళ్ళు రాచుకోవటం నించి చెమ్మగా అవుతున్న రక్తం ధారగా కారటం ప్రారంభించింది. ఒక గచ్చపొదలోకి దూరింది ఆ అర్ధనగ్న అడవి సుందరి.
జ్యోతి కూడా అత్యంత దుస్సాహంతో ఆ గచ్చ పొదను దూరింది. పొదలోకి దూరాక తిరిగి రాగలందుకు హామీ ఏమీ లేదు. అయితే ఆ పని చేయకుండా ఉండలేదు జ్యోతి.
కాని ఫలితాంశం శూన్యమే అయింది. లిండా బ్లెయిర్ అప్ప లాంటి అర్ధనగ్న ఆటవిక సుందరి పొద అవతల కన్పించలేదు. ఇవతల కన్పించలేదు. పొద మధ్యలోనూ కన్పించలేదు.
పరిసరాలలో ఆమె పోలకువ ఎక్కడా పొడకట్టలేదు.
నిరాశాపతురాలాయిపోయి ఉస్సూరని నిట్టూర్చింది జ్యోతి. తాను బూరుగు చెట్టు దిగి ఆమెను వెంబడించే తొందరలో ఏ దిక్కుగా పరుగు తీసిందీ గమనించుకోలేదు. ఇప్పుడు ఏ దారిన తిరగి పోవలసిండీ కూడా అగమ్యమే అయిపొయింది.
అటు చీకటి పోతపోసిన బొమ్మలాంటి అడవీ యువతీ దొరకలేదు. ఇటు తిరిగి పోయే దారీ తెలియలేదు. అటూ ఇటూ దారి తెలియకపోవడంతో అలాగే నిలిచి అయోమయంగా చూడసగిందామె.
తెలియని దారి గురించి ఆలోచిస్తూ అలాగే నిలచిపోయింది. రవంత సేపు అయాక చుట్టూ ప్రక్కల పొదలలో అలికిడి అయింది.
చీకటిని జయించలేని గ్రుడ్డి వెన్నెలలో దూరపు వస్తువులేవీ కన్పించటం లేదు. కళ్ళు చికిలించి చూచిందామే. అయినా ఏమీ కన్పించలేదు. అందాకా వచ్చాక పరిస్థితిని ఎదుర్కోవటం అనివార్యం. ఆత్మ రక్షణ కోసం పయత్నించటం తప్పనిసరి.
ఆ అలికిడి ఏమయినప్పటికీ తానొక వృక్షం మీదికి చేరిపోవటం ఒక్కటే క్షేమమయిన మార్గమని తోచింది జ్యోతికి. ఏదైనా ఒక చెట్టు మొదలుకు చేరి ఆ ప్రయత్నం చేయాలని అడుగు ముందుకు వేసిందామే. పనస, అడవి ప్రత్తి ! వేప వృక్షాలు ఆ ప్రాంతాలలో చాలానే వున్నాయి. కాని తక్షణ సహాయానికి అటువంటిది అందుబాటులో లేకపోయింది . మరో రెండడుగులు వేసింది జ్యోతి.
ఈసారి ఆమె గుండెల మీద కత్తి మొన లాంటిదేదో గ్రుచ్చు కుంది. ఆది చర్మాన్ని చీల్చుకుని గాయం చెయ్యలేదు. కాని వక్షస్సు మీద బిగుతుగా ఒత్తుకు పోతూ వుండటం నించి ఏ క్షణంలో అయినా చర్మం చిట్లుపోయి రక్తం చిమ్మేలాగా వుంది.
అంగుళం మేర అటూ ఇటూ కదిలినా అంతే జరుగుతుంది.
"కదలకే దొరబిడ్డా! కదిలినావంటే కత్తి మొన ఖస్సున గుండెల్లో దిగిపోతుంది. దూకుడు తగ్గించు. ఇది దొరసాని అనహ!" అని విన్పించింది జ్యోతి గుండెలు గుబులేత్తించినాయి ఆమె మాటలు.
నిలిచినా చోట రాతిబొమ్మలా అయిపొయింది జ్యోతి.
ఎదురుగా ఒక నీడ కన్పించింది. గ్రుడ్డి వెన్నెలలో ఆ కన్పించేది ఒక స్త్రీ రూపామనీ, ఆమె ఆటవికురాలనీ గ్రహించింది జ్యోతి. ఆమె అజ్నాపించినట్లుగా తాను ఆగిపోయింది కాబట్టి తక్షణం జరిగే ప్రమాదం ఏమీ లేదని , అలా తక్షణమే తన ప్రాణం తీయటం ఎదుటి వ్యక్తీ లక్ష్యమయితే ఇంతసేపు ఆగవలసిన, ఆలోచించవలసిన అవసరం వుండదని స్పురించింది.
ఈ ఆలోచన రాగానే రవంత ధైర్యం వచ్చింది.
ఆమె అలా నిలిచిపోయిన మరుక్షణం ప్రక్క పొదలలో కూడా అలికిడి అయింది. అయిదారు నీడలు ఆమెను చుట్టూ ముట్టినాయి. ఇద్దరు ముందు కొచ్చి రెండు చేతులూ వెనుకకు విరిచి పట్టుకున్నారు.
జ్యోతి తాను వారి చర్యల్ని నిరోధించాలని ప్రయత్నించడం వృధా ప్రయాస అని గుర్తుంచింది. ప్రాణం లేని రబ్బరు బొమ్మలాగ వారు ఎలా త్రిప్పితే అలా తిరగసాగింది.
వారామేను కొంతదూరం నడిపించి కొన్ని పాకాల మధ్యకు తీసుకు పోయినారు.
ఎవరూ ఆమెతో ఏమీ మాట్లాడలేదు. వారలా ఎందుకు చేస్తున్నారో జ్యోతికి రవంతయినా భోధపడలేదు. కాని సంభాషణలు ఆధారంగా వారందరికీ ఒక నాయకురాలు వున్నదనీ, ఆమె ఆజ్ఞలను వారు తు.చ. తప్పక పాటిస్తారని గ్రహించిందామె.
జ్యోతి ఆముదపు ప్రమిద వెలుగుతున్న ఒక పాకలోకి నెట్టి వేయబడింది. పాకకు ఒకే ద్వారముంది. దాన్ని మూసి వేసేందుకు వెదురు చీలికలతో తయారయిన అభ్యంతరముంది.
దాన్ని వాకిలిని అడ్డంగా వుంచి మిగిలిన అందరూ బయటకు వచ్చేశారు. కొందరు ఆడవాళ్ళు బయట కాపుగా వున్నారని వెలుపలి నుంచి విన్పించే మాటల ద్వారా గ్రహించింది జ్యోతి.
తెలియకవచ్చి వలలో తగులుకున్న లేడి పిల్లలా అయింది ఆమె పని. లోపల పరచి ఈతాకు చాప మీద కూర్చుని అలసట తీర్చుకుంది. తనను విరోధిగా భావించి వారు బంధించారని బహుశా తెల్లావారక విచారించ వచ్చుననీ అనిపించింది. భాష కూడా అడ్డు కాకపోవటం నించి ఆ విచారణ నించి తాను సులభంగానే బయటపడవచ్చు.
ఆలోచించినకొలదీ తనకు ఎటువంటి అపకారమూ జరగదన్న నమ్మిక దృడతరం అయింది. మొదటిది తాను వారికి ఎటువంటి అపకారమూ చెయ్యలేదు. రెండవది వారూ తొందరపడి అపకారం చేసే వ్యక్తులు కాదని ఇప్పటి చర్యల వల్ల అర్ధమవుతోంది.
తనను గురించి తాను బాధపడవలసింది లేదని తీర్మానించుకున్న తరువాత రవంత నిద్ర పట్టింది. కలత నిద్ర!
ఆ కలత నిద్రలో కల లాంటి ఆలాపన కలుగుతోంది ఆమెకు.
ఒక రాజూ! రాణి! రెండు గుర్రాల మీద ఎక్కి వాటిని పరుగులు తీయిస్తున్నారు. పచ్చని పచ్చిక తివాచిలా పరచి వున్న మైదానాలలో అమిత వేగంతో పరుగు తీస్తున్నాయి గుర్రాలు.
ఆ మైదానం చివర సుదూరంగా పొంగుతున్న సముద్రం ఎదురుగా కన్పిస్తోంది. నీళ్ళు నురగలు క్రక్కుతూ ఇంతెత్తున పొంగుతున్నాయి. రాణి గుండెల్లో రాయి పడింది. ఈ గుర్రాలు పరుగులు తీస్తూ పరుగులు తీస్తూ ఆలా వెళ్ళిపోయి ఆ సముద్రంలో మునిగిపోతాయి కాబోలు అని భయం. అయినా గుర్రాలు ఆగలేదు. పరుగులు తీసినాయి. ఆ రాజుకి రవంత అయినా భయం లేనట్లుంది. రాణిలా ఆ సముద్రంలో మునిగిపోతామన్న భీతి లేకుండా మధ్య మధ్య ఆమె వంక చూచి చిరునవ్వు నవ్వు తున్నాడు. రాణి భయంగా ముందుకు చూపుతోంది.
అతడు లక్ష్య పెట్టలేదు. చిరునవ్వు చెరిగిపోలేదు.
గుర్రాలు సముద్రంలో పొంగుతున్న కెరటాలకు దగ్గరగా వచ్చినాయి. మరి కొంచెం ముందుకు పొతే ఆ కెరటాల మధ్య మునిగిపోతాయి గుర్రాలు. కెవ్వుమని అరవబోయింది రాణి.
రాజు ఆమె వంక చూచి మరో నవ్వు నవ్వాడు. వెంటనే రాణికి విచిత్రమయిన అనుభూతి కలుగసాగింది.
గుర్రాలు ఈసారి నేలమీద కాక ఆకాశంలో పరుగులు తీస్తున్నాయి. వాటికి రెక్కలు మొలవలేదు. కాని ఆకాశంలో పరుగులు తీస్తున్నాయి. క్రింద పొంగుతున్న సముద్రం.
ఆకాశంలో మబ్బు తునకల మధ్య రెండు శిఖరాలున్న ఒక కొండ కన్పిస్తోంది. ఒక గుహ రాక్షసి తెరచిన నోరులా కన్పిస్తోంది. ఈ గుర్రాలు ఆ గుహలోకి పరుగులు తీస్తాయని, ఆ చీకటిలో ఉన్న యేవో శక్తులు తమను అంతం చేస్తాయనీ తిరిగి భయపడ సాగింది రాణి.
