Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 29


    "నాన్న గారికి ఈమధ్య మరీ నీరసంగా వుంటోందర్రా!  చ్యవనప్రాశ స్పెషల్ తెచ్చుకోమని ఎన్నాళ్ళనుంచో చెప్తున్నాను. అది తెచ్చుకుని వుంటారు" అంది మా శ్రీమతి. నేను ఆఫీసుకీ,  పిల్లలు  స్కూల్స్, కాలేజీలకి  వెళ్లాక ఇంక ఆవిడకి కాలక్షేపం రేడియో  యేనాయె!  అందులోని  ప్రకటనల ప్రభావం  ఆమాత్రం వుండకుండా వుంటుందా?


    "నిన్న డిస్పెన్సరీకి వెళ్ళి రావాలన్నారు నాన్నగారు. బహుశా.... ఈరోజు వెళ్ళి వుంటారు. వాళ్లేదో టానిక్ ఇచ్చి వుంటారు!" అంది మా పెద్దమ్మాయి చెల్లాయితో - వినీ వినిపించనట్లుగా.

 
    వాళ్ళందర్నీ కాసేపు ఆటపట్టించాలన్న ఉద్దేశంతో - నేను ఆ సీసా లేబుల్ కనబడకుండా నావైపు పెట్టుకుని, "ఇదిగో.. దీని ఆకారం చూసి చెప్పండర్రా - ఇదేమయ్యుంటుందో!" అన్నాను.

 
    "జామ్.....!"


    "బూస్ట్...!'


    "చ్యవనప్రాశే కదండీ..!"


    అమ్మాయిలేమీ మాట్లాడలేదు.


    "ఇదేదీ కాదు. మీరందరూ పప్పులో కాలేశారు" అన్నాను.


    "నేనుకాదు!" అంది మా పెద్దమ్మాయి.

 
    "ఆ ... నువ్వు చెల్లాయి చెవిలో చెప్పిన మాటలు విన్నాలే!" అంది మా చిన్నమ్మాయి.

 
    "అవునమ్మా... నువ్వు నిండుకుండవి!" అని, "ఆ...... ఇదుగో చూడండర్రా - ఈరోజు మనింట్లో విందు! అంటూ లేబుల్ కనిపించేటట్లు సీసా తిప్పాను.

 
    "ఏమిటీ.... పచ్చడి సీసానా!?" అన్నాడు మావాడు నోరు వెళ్ళబెట్తూ.


    "పచ్చడి కొనుక్కురావడమేమిటండీ.... ఇంట్లో వున్న ఊరగాయలే తినలేక పోతున్నాం. అవన్నీ బూజు కట్టేస్తున్నాయి కూడాను. మొన్న కూడా నిమ్మకాయ బూజుకట్తే జాడీ ఎండలో పెట్టాను.... చూడలా? మళ్ళీ ఇదెందుకండీ.... మీకు డబ్బు ఎక్కువైనట్టుంది!" అంటూ ఉపన్యాసం వరదలా  వదిలింది నా శ్రీమతి.

 
    "ఎవరు తింటారని నాన్నగారూ.... ఇది తేవడం? ఇంతకన్నా  ఏ కలాఖానో తెస్తే  అందరం తినేవాళ్లంగా!" అంది మా పెద్దమ్మాయి.

 
    "అందరూ తినాలనే తెచ్చాను. తెల్లవారి లేస్తే దీని గురించిన  ఎడ్వర్టయిజ్ మెంట్ లు పేపర్లో చూడ్డంలా?  రేడియోలో వినడంలా? ఓసారి తెచ్చి చూస్తే  ఆ రుచేమిటో మనకీ తెలుస్తుంది . బాగుందనుకుంటే  మనమూ ఆ విధంగా చేసుకోవచ్చు" అన్నాను నేను.

 
    "అంతేలెండి - మీ మగవాళ్లు వ్యవహారాలు ఇలాగే వుంటాయి. ఇంతకీ... ఎంత చిలుము వదిలిందేమిటి?" అంది మా ఆవిడ.


    "ఆ.... పదిహేడు రూపాయలే!" అన్నా తేల్చిపారేస్తూ.

 
    "పదమూడు రూపాయలు!" అని ఒత్తిపలికి "హు..... ఆ డబ్బుతో మనం ఇంట్లో పెట్టుకుని వుండే పెద్ద జాడీలో సగం ఊరగాయ వచ్చి వుండేది. సరే... కానీండి. ఇటువంటివి తెచ్చేముందు కాస్తంత  ముందు చెప్తే ఆ రభసంతా వుండకపోవు!"అంది.

 
    'మందు చెప్తే తేనిస్తారా?' అని మనసులోనే ఆనుకుని, "రుచి చూసి ఆ తర్వాత కామెంట్ చేయండి. ఎలాగూ భోజనం టైమైంది.  తొందరగా వడ్డించండి. అందరికీ ఈ ఊరగాయ వెయ్యి!" అంటూ ఆ సీసాని మా ఆవిడ చేతికి అందించాను.


    చచ్చిన ఎలకను పట్టుకున్నంత బాధగా ఆ సీసాను పట్టుకుని అయిష్టంగా లోపలికి తీసుకువెళ్ళింది మా ఆవిడ.

 
    అమ్మాయిలు పీటలూ, కంచాలూ పెట్టడానికి అమ్మ వెనకాలే లోపలికి వెళ్లారు.


    అబ్బాయిలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉండిపోయారు.

 
    నేను కాళ్లు కడుక్కుని బట్టలు మార్చుకోవడానికి వెళ్లాను.

 
                              *    *    *    *    *


    అందరం భోజనాల దగ్గర కూర్చున్నాం.


    "నాన్నగారికి ఆ ఊరగాయ కొంచెం వెయ్యవే!" అని మా పెద్దమ్మాయికి పురమాయించింది మా శ్రీమతి.

 
    "నువ్వు కూడా కొంచెం వేయించుకో!" అన్నాను.


    "అబ్బో .. నాకొద్దు! నేనెప్పుడైనా బజారు ఊరగాయలు తిన్నావా? తలుచుకొంటేనే నాకు ఒళ్ళు జలదరిస్తుంది" అంటూ ఒళ్ళు వంకర్లు పోనిచ్చింది.


    బజారు నుంచి తెచ్చే మిఠాయిలు తినడానికి మా ఆవిడకేమీ అభ్యంతరం, జలదరింపూ వుండవు.  ఎటొచ్చీ ఊరగాయకే వచ్చింది.


    "మీరేసుకోండే!" అన్నా అమ్మాయిల వంక చూస్తూ.


    "అమ్మో ...నాకొద్దు!" అంది మా పెద్దమ్మాయి - ఆకు పురుగుని చూసినట్లు! అది  ముమ్మూర్తులా వాళ్లమ్మ పిల్ల.


    "నాక్కొంచెం వెయ్యవే అక్కయ్యా!" అంది చిన్నమ్మాయి.

 
    ఎలాగూ తప్పనిదాన్ని  గౌరవంగా ఒప్పుకుంటే బాగుంటుందన్నట్లు -


    "మీరు రుచి చూసి చెప్పండర్రా!" అన్నా అబ్బాయిలతో - వాళ్ళు ఎలాగూ కాదనరన్న నమ్మకంతో.


    వాళ్లేమీ మాట్లాడలేదు.


    మా పెద్దమ్మాయి సీసా మూత తీసి - నాకూ, చెల్లాయికీ, తమ్ముళ్లకీ కొంచెం కొంచెం వడ్డించింది.

 
    "తొందరగా మూతపెట్టవే! ఆ వాసనకి నాకు కడుపులో తిప్పుతోంది!" అంది శ్రీమతి ముక్కు మూసుకుంటూ - వెల్లుల్లిని చూసిన శ్రీవైష్ణవులలాగా.


    మా అమ్మాయి సీసాకి మూత బిగించి ఏదో ఎంగిలో, అంటో ముట్టుకున్నట్లు చేతులు కడుక్కుని వచ్చి కంచం దగ్గర కూర్చుంది.


    మా రెండో అమ్మాయి ఊరగాయని కొద్దిగా నాలిక్కి రాసుకుని ఆముదం త్రాగినట్లు ముఖం పెట్టింది.

 
    "బాగాలేదు నాన్నగారూ! ఏమిటో మసాలా వాసనగా వుంది. రుచి కూడా ఏమిటోగా వుంది!" అంటూ ఆ కాస్త ఊరగాయనీ పక్కకి తోసేసింది.

 
    "వగలు పోకు. కాస్త నాలిక్కి రాసుకుంటే రుచి తెలిసిందా ఏమిటి? ఓ ముద్ద కలుపుకుని చూడు!" అన్నాను.

 

    "లేదండీ.. .అసలు నాకా వాసనే గిట్టడం లేదు. తింటే డోకు వచ్చేస్తుంది!"అంది.

 
    ఇంక నేను బలవంతం చేయలేదు.

 
    మామూడో అమ్మాయి దానికి వంత పాడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS