Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 29

    "అమ్మో! ఆడవాళ్ళలో కూడా హత్యలు చేసే వాళ్ళుంటారంటే నమ్మాలి ఇంక"
    "మామూలు హత్యలు కాదు, చేతబడి చేసి మరీ"
    "అబ్బో! చాలా పెద్ద మంత్రగత్తె"
    ఇటువంటి మాటలకి తోడు సోమయాజి మధ్యవర్తులచేత కూతురు జుట్టుతీయించమని పంపే వర్తమానాలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఎవరు చెప్పినా కదలిక లేకపోవటంతో సోమయాజి ఇంకతానే రంగంలో దిగాడు. కృష్ణయార్యుని ఇంటికి మరొక పదిమంది పెద్దమనుషులని తీసుకుని తానే స్వయంగా వచ్చాడు. నమస్కారాలు, ఆశీర్వచనాలు అయినాక,
    "కృష్ణయ్యా! అమ్మాయి సంగతి ఏం చేశావ్!" అడిగాడు సోమయాజి.
    కృష్ణయ్య మాట్లాడలేదు.
    "ఆ కార్యక్రమం ఏ రోజు చెయ్యాలనుకుంటున్నావ్"
    "... ... ..."
    "రేపు రాబోయే ఆదివారం నిశ్చయించాం. రాహుకాలం వర్జ్యం లేకుండా"
    "బాబాయ్!... ... ..."
    "నువ్వేం చెప్పటానికి లేదు. విను. అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. ఇంతకాలం మీనాన్నమీద ఉండే అభిమానంతో సహించాం. జుట్టున్న విధవ వుంటే ఊరికి అరిష్టం. ఇప్పటికే చుట్టుపక్కల ఊళ్ళవాళ్ళు మనూరి వాళ్ళని ఎద్దేవా చేస్తున్నారు. మీ ఒక్క కుటుంబం వల్ల ఊరంతటికీ చెడ్డపేరు రావటం మర్యాదకాదు. ఆదివారం వెంకమ్మజుట్టూ, గాజులూ తీయించకపోతే ఊరంతా నిన్ను వెలివేస్తుంది. ఇది ఆఖరు హెచ్చరిక."
    సోమయాజి విసవిసా రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. వెనక వచ్చిన గుంపంతా అనుసరించింది.
    కృష్ణయ్యకి, మంగమాంబకి ఏం చెయ్యాలో తోచలేదు. తమ కూతురు చెప్పినమాట సమంజసంగానే ఉంది. సోమయాజి మాటకొట్టిపారెయ్యటానికి వీలులేదు. మంచో, చెడోగాని అది సమాజం కట్టుబాటు. కులపెద్దగా ఆయన మాట కాదనటానికి లేదు. చూస్తూచూస్తూ వెంకమాంబ ఇష్టానికి వ్యతిరేకంగా జుట్టుతీయించటానికి మనసొప్పటంలేదు. సోమయాజి మాటకాదనే ధైర్యంలేదు. తానూ, తన కుటుంబం బతికుండాలంటే ఆయన చెప్పినట్టు వినక తప్పదు. "ఇదొక ప్రాణసంకట పరిస్థితి" అనుకోగానే పరిష్కారం దొరికినట్టయ్యింది. వెంటనే భార్యని పిలిచాడు.
    "అమ్మాయి ఎక్కడ?" అడిగాడు
    "గుడికి వెళ్ళింది" భయంభయంగా చెప్పింది మంగమాంబ.
    "అయితే ఇదే మంచి సమయం"
    "దేనికి?"
    "మనమ్మాయికి చెప్పలేం. సోమయాజిగారికి కాదని బతకలేం. అందుకని గుట్టుచప్పుడు కాకుండా బావిలోపడి ముక్కుమూసుకుంటే సరి సమస్య పరిష్కారమౌతుంది."
    "నేనూ మీతోపాటే" అంది మంగమాంబ కంగారుగా.
    "సహాధర్మచారిణి అనిపించుకుందామనా?" విరక్తితో కూడిన చిరునవ్వు.
    "ఎవ్వరూ రాకుండా తలుపులు వేసి వస్తాను'. అంటూ మొగసాలవైపు వెళ్ళింది మంగమాంబ.
                                                           * * *
    నృసింహస్వామి దేవాలయంలో ఉన్న ఆంజనేయుడి ముందు పద్మాసనం వేసుకుని కూర్చుని ధ్యానమగ్నురాలై ఉంది వెంకమాంబ. ధ్యానం మధ్యలో దీనవదనంతో తల్లి, తండ్రి బావిలో దూకటానికి సిద్ధమౌతున్నట్టు గోచరించింది. ధ్యానం భగ్నమైంది. వెంటనే పరుగులాంటి నడకతో ఇల్లుచేరింది. వీధిగుమ్మంలోపలనుంచి గడియ పెట్టి ఉంది. ఎంత కొట్టినా తెరవటం లేదు. మరింత వేగంగా అడుగులువేసి పెరటి గుమ్మం చేరి లోపల ప్రవేశించింది. ఆ సమయానికి కృష్ణయార్యుడు, మంగమాంబ ఇద్దరు నూతిగట్టున నిలబడి, కళ్ళుమూసుకుని చేతులు జోడించి దైవప్రార్థన చేస్తున్నారు. సరిగ్గా తనకు ధ్యానంలో కనపడిన దృశ్యం ఇదే. తనకీ దృశ్యం కనపింపచేసిన నరహరికి మనస్సులో కృతజ్ఞతలు తెలుపుకుని నెమ్మదిగావారిని చేరుకుని,
    "అమ్మా!" అంది.
    ఇద్దరూ కళ్ళు తెరిచారు.
    "నాన్నా! మీ ఇష్ట ప్రకారమే కానీయండి. మీ అభీష్టానికి ఎదురు చెప్పను. తల్లితండ్రులని బాధించే ఆధ్యాత్మికసాధన నిష్ప్రయోజనం. నావైపు నుండి వత్తిడి లేకపోతే ఊళ్ళోవాళ్ళ వత్తిడి తట్టుకోగలుగుతారు. వారి మాట మాత్రం కాదని ఎందుకనాలి? కానిద్దాం. వారిలోనూ వారి చేష్టలలో కూడ భగవంతుడేగా ఉన్నది."
    ఇద్దరికీ ధారాపాతంగా కన్నీళ్ళుకారిపోతున్నాయి. నూతి గట్టుదిగి నిస్సత్తువగా కింద కూలబడ్డారు. వాళ్ళదగ్గరగా తనూ కూర్చుని శాంతంగా చెప్పింది.
    "ఆత్మహత్య మహాపాతకం అని తెలుసు కదా! అటువంటి పాతకానికెందుకు సిద్ధపడ్డారు? మీకు కష్టం కలగకుండా కాపాడే కూతురున్నదని గుర్తురాలేదా? మీ వంటి జ్ఞానం, దైవభక్తి ఉన్నవాళ్ళే ఇట్లా తొందరపడితే సామాన్యులమాట ఏమిటి? మిమ్మల్ని అందరూ పిరికివాళ్ళుగా పరిగణిస్తారు. అంతేకాదు మీలో తప్పు ఉందని, ఓడిపోయామని ఒప్పుకున్నట్టు అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో! ఆ పైవాడేం చేయదలచాడో?" ఒక్కొక్కమాటతో దుఃఖం నుండి కొద్దిగాకొద్దిగా తేరుకుంటున్నారు. తన అవివేకానికి సిగ్గుపడ్డారు. కుమార్తె చెప్పిన మాటలతో ధైర్యం వచ్చింది.
    "భగవంతుడిని నమ్మినవాళ్ళకి ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే ధైర్యం ఉంటుంది. దేవుడిని నమ్మకపోతే పిరికితనం, దైన్యం, దుఃఖం కలుగుతాయి" అంది.
    "నిజమేనమ్మా! మాకు ధైర్యం దేవుడున్నాడని కాదు నువ్వున్నావని" అన్నాడు కృష్ణయార్యుడు.
    "నువ్వు నన్ను కన్నతల్లివి" అంటూ కూతురు తలమీద చెయ్యివేసి నిమిరింది మంగమాంబ.
    "లెండిమరి! స్వామికి మహానైవేద్యానికి ఆలస్యమౌతుంది" అంటూ తానులేచి, ఇద్దరికీ చెరొకచెయ్యి అందించింది.
                                                           * * *
    సోమయాజి ఆనందానికి అవధుల్లేవు. వెంకమాంబ మీద ఇది తానుసాధించిన మొదటి విజయం! అదీ మామూలుది కాదు. చాలా గొప్పది. తన చుట్టూ భజన సంఘాన్ని చేర్చుకుని వాదనలో వెంకమాంబని ఎలా ఓడించిందీ, కృష్ణయార్యుని ఎలా భయపెట్టిందీ గొప్పలు చెప్పుకుంటున్నాడు.
    "దెబ్బకి దెయ్యం దిగివచ్చింది" అన్నాడు.
    "నిజంగా దెయ్యమేకదా! ఇన్నాళ్ళూ ఏమంత్రగాళ్ళకీ లొంగలేదు. ఇవ్వాళ సోమయాజిగారి మంత్రానికి లొంగింది" అవధాని భజన చేశాడు.
    "ఈ దెబ్బతో దాని శక్తులన్నీ కూడా పోతాయి" సోమయాజి గర్వంగా చెప్పాడు.
    "అదెట్లా?" కృష్ణశర్మ సందేహం.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS