Previous Page Next Page 
తరిగొండ వెంగమాంబ పేజి 2


    ఎవరి ఆలోచనలలో వారున్న ఆ దంపతులు ఏదో ఎంగిలిపడ్డా మనిపించారు. మంగమాంబ వంటగది గడపమీద తలపెట్టుకుని ఒళ్ళు వాల్చింది. కృష్ణయ్య వీథిగదిలో కాలుగాలిన పిల్లిలా తచ్చాడుతూ ఉండి పోయాడు. సంతానం లేదన్న దిగులునుమించి, తను దైవాన్ని నిందించానన్న అపరాధభావం అతణ్ణి ఆ క్షణంలో మరితంగా కుంగదీస్తోంది. పశ్చాతాపంతో అతడు మనస్సులోనే దేవునికి మాటిమాటికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాడు. సంతానం గురించిన తన స్వార్థచింత తనలోని వివేకాన్ని హరించివేసింది. జగత్తునంతటినీ సృష్టించి రక్షించే నిస్వార్థ ప్రేమమూర్తి అయిన ఆ పరాత్పరునే నిందించే స్థాయికి తనను దిగజార్చింది. విద్యావంతుడైన తనకన్నా, చదువు సంధ్యలులేని మంగమాంబ ఎంతో  వివేకవంతురాలు. గొడ్రాలని తనను అమ్మలక్కలు వేలెత్తిచూపించి గేలిచేస్తున్నా తన కొరతకు భగవంతుణ్ణి బాధ్యుణ్ణి చేసి ఏనాడూ నిందించని అచంచల భక్తి ఆమెది. ఆమెను భగవంతుడు తప్పక కరుణిస్తాడు. అవును, తప్పక కరుణిస్తాడు. ఆమె కడుపు తప్పకుండా పండుతుంది..
    ఈ ఊహ రాగానే అతనిలోని వేదన అంతా అంతరించి ఎంతో మనశ్శాంతి కలిగింది. ముఖం వికసించింది. ఉదయంనుంచి ఆవరించిన దిగులంతా దూదిపింజలా ఎగిరిపోయింది. ఇకనుంచి తాను దైవనింద చేయకూడదని నిశ్చయించుకున్నాడు. చెంపలు వేసుకున్నాడు.
    అతనిలో ఏదో తెలియని ఆనందం పురివిప్పి ఆడుతుండగానే ప్రదోష సమయం అయింది. సమీపంలోని శ్రీనివాసుడి కోవెలలో గంటమోగింది.
    కృష్ణయ్య ఉత్సాహంగా లోపలికి వెళుతూ "మంగా! త్వరగా తయారవు! గుడికి వెడదాం" అన్నాడు.
    భర్త గొంతులో తొణికిసలాడుతున్న ఉత్సాహాన్ని, ఆయన ముఖాన్ని ఆవరించిన వింత కాంతినీ గమనించిన మంగమాంబ మొదట ఆశ్చర్యపొయినా తర్వాత సంతోషంతో నిట్టూర్చింది.
    దంపతులిరువురూ కోవెలకు చేరి శ్రీనివాసుని ముందు చేతులు జోడించి నిలబడ్డారు. ఆ దివ్యమంగళ రూపాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయారు. స్వామి నేత్రాలనుంచి ఏదో కాంతిపుంజం వ్యాపించి తన ఆపాదమస్తకమూ ఆవరించినట్టు మంగమాంబకు అనిపించింది. ఇంటికి తిరిగి వెడుతూ ఆ సంగతి భర్తతో చెప్పింది మంగమాంబ.
    కృష్ణయ్య చిరునవ్వు నవ్వాడు. "మనల్ని స్వామి అనుగ్రహించాడు. మనింట్లో త్వరలోనే పసిడికాంతుల పసిపాప అవతరిస్తుందని నా మనసు చెబుతోంది!" అన్నాడు కళ్ళు వింత కాంతితో వెలుగుతుండగా.
    మంగమాంబ సిగ్గుతో ముడుచుకుపోయింది.
                                                  *    *    *
    రెండు మాసాలు ఇట్టే గడిచిపోయాయి. ఉన్నట్టుండి మంగమాంబలో ఏదో నలత. ఒకరోజునైతే మంచం మీంచే లేవలేదు. దేవుడికి దీపం కూడా పెట్టలేదు.
    కృష్ణయ్య ఆందోళన పడ్డాడు. ఇప్పుడే వస్తానని భార్యకు చెప్పి పెద్దాచార్యుడైన కృష్ణమాచార్యుల వద్దకు పరుగెత్తాడు. కృష్ణమాచార్యులు ఊళ్ళో గొప్ప ఆయుర్వేద వైద్యుడు.
    పది నిమిషాలలో ఆయన్ను వెంటబెట్టుకుని వచ్చాడు. కృష్ణయ్య. మంగమాంబ నాడిచూసిన వైద్యుని పెదవులపై చిరునవ్వు మెరిసింది. అందులోని భావం అర్థంకాగానే కృష్ణయ్య ముఖం సంతోషంతో విప్పారింది. తమ పూజలు ఫలించాయి. తమ కల నిజం కాబోతోంది. భగవంతుడు కరుణించాడు......! కృష్ణయ్య మనసులోనే కోటి దండాలు అర్పించుకుని కృతజ్ఞతలు ప్రకటించుకున్నాడు. మంగమాంబకు కూడా ఆ శుభవార్త చెబుదామని అతని మనసు తొందరచేసింది. కానీ, వైద్యుడి ఎదురుగా ఆ మాట చెప్పడానికి సంకోచించాడు. ఆయనను ఇంటి వద్ద దిగవిడిచి పరుగెత్తుతున్నట్టుగా ఇంటికి చేరుకొని మంగమాంబకు విషయం చెప్పాడు.
    మంగమాంబ నిజమా అన్నట్టు చూసింది. అంతటి ఆనందాన్ని పట్టలేక ఆమె హృదయం ఉక్కిరిబిక్కిరైపోయింది. పేరుపేరునా అందరు దేవుళ్ళను తలచుకుని సజలనయనాలతో కృతజ్ఞతలు చెప్పుకుంది. కళ్ళు మూసినా తెరచినా బాలకృష్ణుని రూపమే అంతటా కనిపిస్తోంది. మంగమాంబ తీయని ఊహాజగత్తులోంచి ఈ లోకంలోకి రావడానికి చాలా సమయం పట్టింది. అంతసేపూ మురిపెంగా తనవైపే చూస్తూ చిరునవ్వు చిందిస్తున్న భర్తను చూడగానే సిగ్గుతో చితికిపోయింది.
    హఠాత్తుగా తనలో వెయ్యి ఏనుగుల బలం ప్రవేశించినట్లయి, ఒక్క ఉదుటున  లేచి తులసికోట దగ్గరకు వెళ్ళి తులసమ్మకు మొక్కింది. దేవుడి ముందు దీపం పెట్టింది. ఆ దీపకాంతిలో లీనమై వింతకాంతులీనింది.
    "చూలింతకు ఎన్నో రుచులు కావాలనిపిస్తుందట కదా! మరి నీకేం కావాలో చెప్పు" అడిగాడు కృష్ణయ్య మంగమాంబను ఆపేక్షగా చూస్తూ, పూజకు పువ్వుల కోస్తూ.
    భర్త కళ్ళలోకి చూసి చిరునవ్వు నవ్వింది మంగమాంబ.
    "భగవన్నామమే నాకు రుచి. నా కడుపులోని పసిగుడ్డుకు కూడా ఆ రుచిని అందించాలని నా కోరిక"  అంది, భర్త తన ముందు రాసిపోసిన పూలను మాలగా గుచ్చుతూ. అప్పుడామె కళ్ళముందు గోదాదేవి మెదిలింది. ఎదనిండా భక్తి నిండిపోయింది. ఆ తన్మయస్థితిలోనే అందమైన పూలదండ అల్లి భర్త చేతికి అందించింది. కృష్ణయ్య గుడికి వెళ్ళాడు. మంగమాంబ అల్లిన దండ అలమేలుమంగా, శ్రీనివాసుల గళసీమను అలంకరించింది.
    ఓ రోజు కృష్ణయ్యకు కల వచ్చింది. ఆ కలలో శ్రీనివాసుడు స్త్రీ  రూపంలో కనిపించాడట. మంగమాంబకు ఈ విషయం చెబితే ఆమె ఆలోచనలో పడింది. ఏమిటో ఇందులోని అంతరార్థం, తనకు కూతురు పుట్టడంలేదు కదా! అనుకుంది.
    అదే జరిగింది. కృష్ణయ్య మంగమాంబ దంపతులకు కూతురు పుట్టింది.
    పక్కలో ఉన్న పసికందు వైపు చూసింది. ఆమె కళ్ళలో చెప్పలేనంత ఆత్రుత. చూసిందో లేదో, ఆమె ముఖంలో నైరాశ్యపు నీలినీడలు ఒక్కసారిగా కమ్ముకున్నాయి. ఆడపిల్ల! ఆమెకు హఠాత్తుగా  ముచ్చెమటలు పోశాయి. ఆ నీరసస్థితిలో మరింత నీరసం ఆవరించింది. కాసేపటికి ఎలాగో తెప్పరిల్లి పాపను మరోసారి చూసింది. తన పసిచేతులను, లేత పాదాలను చిత్రంగా కదిలిస్తోంది. మంగమాంబలో మాతృప్రేమ ఉబికి వచ్చింది. పక్కకు తిరిగి  పాపను గుండెలకు హత్తుకుంది. మానవనైజం ఎంత విచిత్రమో! అసలు సంతానమే లేని తను, సంతానం  కలిగితే చాలుననుకుంటూ ఎన్నో పూజలు చేసింది. ఎందరికో మొక్కుకుంది. ఇప్పుడు మగపిల్లవాడు కలగలేదేననుకుని బాధపడుతోంది. ఆశకు అంతులేదు. మగైతేనేం, ఆడైతేనేం.... తనకో సంతానం కలిగింది. తనిప్పుడు గొడ్రాలు కాదు! తననెవరూ ఇప్పుడు వేలెత్తి చూపించలేరు. ఆ తృప్తి చాలు.
    అంతలోనే భర్త గుర్తొచ్చాడు. ఆడపిల్ల వద్దు అనలేదు కానీ, మగపిల్లవాడు కలుగుతాడనీ ఆయన ఆశపడ్డాడు. ఆడపిల్ల మన పిల్ల అవుతుందా, వంశాన్ని నిలబెడుతుండా? అని ఒకటి రెండుసార్లు అన్నారు కూడా. ఇప్పుడు ఆడపిల్ల అని తెలిసి ఎంత నిరాశపడ్డారో! మంగమాంబకు భర్తను తలచుకుని జాలీ, బాధా కలిగాయి.
    పాప చిట్టిపాదాలను, చిట్టి చేతులను చాపుతూ ఒళ్ళు విరుచుకుంది. జీవన సమరానికి సిద్ధమవుతున్నాను సుమా అన్న హేచ్చారికలా అనిపించింది ఆ చర్య. పుడుతూనే ఆకలితో పుట్టిస్తాడు కాబోలు భగవంతుడు. ఆ చిన్న పాదాలు కదులుతున్నాయి. నల్లని జుత్తు... చిన్న చెవులు..... పద్మాల మొగ్గల్లా లేత పాదాలు..... దూది పింజల్లా మృదువైన బుగ్గలు.... పాప ఒడలంతా తడుముతూ మంగమాంబ మురిపెంగ చూసింది.
    అంతలో అడుగుల చప్పుడయింది. మంగమాంబ పక్కకు తిరిగిచూసింది. గుమ్మంలో భర్త కృష్ణయ్య నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో భావాలను చదవడానికి ప్రయత్నించింది మంగమాంబ. ఆశా, నిరాశా రెండూ లేని ఒక ప్రశాంత స్థితి ఆ ముఖంలో కనిపించి ఊరట చెందింది.
    "ఆడపిల్ల" అంది మెల్లగా.
    "ఆడపిల్ల అని నాకు ముందే తెలుసు" అన్నాడు కృష్ణయ్య ఏదో రహస్యాన్ని బయట పెడుతున్నట్టుగా.
    ఎలా తెలుసని కళ్ళతోనే ప్రశ్నించింది మంగమాంబ.
    "ఓ రోజు గుళ్ళోంచి వస్తుంటే చెట్టు కింద కోయవాడు కనిపించి పిలిచాడు.... ఏం చెబుతాడోననుకుని వెళ్ళాను. చేయి చూసి అన్నీ ఉన్నవి ఉన్నట్టు చెప్పాడు. ఆడపిల్లే ముందు పుడుతుందన్నాడు" కృష్ణయ్య చెప్పాడు.
     భర్త మాటతో మంగమాంబ మనసులో అలజడి పూర్తిగా మాయమైపోయింది.
    " అయినా  మంగా , ఆడపిల్ల అయితేనేం? మనయింట అలివేలు మంగమ్మతల్లే అవతరించింది. మన ఇలవేల్పే మన ఇంట వెలిసింది" అన్నాడు కృష్ణయ్య.
    బిడ్డతోడిదే లోకమైపోయింది మంగమాంబకి. బిడ్డ ఏడ్చినా ముద్దే, పాదం కదిపినా ముద్దే, ఆవులించినా ముద్దే..... భగవంతుని సృష్టివైచిత్రినంతటినీ ఆ శిశువులోనే చూస్తూ మంగమాంబ మళ్ళీ పసిపాపే అయిపోయింది. తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి. బారసాల వచ్చింది.
    పేరేంపెట్టాలని భార్యభర్తలిద్దరూ కాస్సేపూ చర్చించుకున్నారు. "ఇంటవెలసింది అలివేలు మంగ. ఆ అమ్మ పేరొక్కటే పెడితే అయ్య ఏంకాను? ఆ దివ్య దంపతులను విడదీయడం ఏం న్యాయం? కనుక అమ్మ పేరూ, అయ్యపేరూ కలిపేపెట్టాలి" అంది మంగమాంబ పాపకు సాంబ్రాణి పోగవేస్తూ.
    "ఆ పేరు కూడా నువ్వే చెప్పు" అన్నాడు కృష్ణయ్య.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS