"చాలా బాగున్నాయి" అన్నాడు.
"అవినాష్! మా అమ్మకి నిజంగా నేనంటే ఇష్టమేననుకుంటా!" అంది శిల్ప అవినాష్ కేసి చూస్తూ.
"ఇష్టం లేకపోతే ఇవన్నీ ఎందుకు పంపిస్తుంది? నువ్వే మొండికేసి, మీ అమ్మను చూడనంటే చూడనని పట్టు పట్టావు"
"కానీ నన్నిలా చిన్నప్పటి నుంచీ వదిలేసి, తను తన ప్రోగ్రాములకోసం వెళ్ళిపోవడం బాగుందా? పోనీ, అదీ వదిలేయ్! నన్ను తనని 'అమ్మా' అని పిలవనియ్యకుండా, అక్కా అని పిలిపించుకోవడమేమిటి?"
ఆలోచించాడు అవినాష్!
"ఊ!..... చెప్పు?" అంది శిల్ప.
"అదే నాకూ అర్థంకావడంలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. మీ అమ్మ నీకోసం చాలా బాధపడింది. నీతో సారీ చెప్పాలని, అనుకుందిట. కానీ నువ్వు ఆమెని కలుసుకోలేదుట! తాతయ్య చెప్పాడు" అన్నాడు అవినాష్. శిల్ప మాట్లాడలేదు. రోజుకోడ్రెస్సు తల్లి పంపించినవి వేసుకుంటోంది. ఆమె ఆలోచనలన్నీ తల్లిచుట్టూ తిరుగుతున్నాయ్. శిల్పలోని మార్పును గమనిస్తూ వస్తున్న సిస్టర్ ఫెర్నాండిస్ రాగిణితో ఈ సంగతి చెప్పింది. తను పంపిన బట్టలు వేసుకుంటోందో లేదో అని సంకోచించిన రాగిణికి ఈ వార్త ఎంతో ఆనందాన్నిచ్చింది. 'అయితే తనెక్కడుందో ఏమిటో చెప్పకుండా వుండడం వల్ల, శిల్పలో తనని గురించిన ఆలోచనలు రావడానికి ఎక్కువ అవకాశం వచ్చింది. సిస్టర్ ఫెర్నాండిస్ సలహా బాగా పనిచేసింది!' అనుకుంది.
తను పంపించిన డ్రెస్సులు శిల్ప వేసుకుంటే ఎలావుందో చూడాలని, ఒకరోజు స్కూలయిపోగానే వెళ్ళింది. ఆ రోజు ఆటలు లేనట్టున్నాయి. ఎంతకీ శిల్ప కనబడలేదు. దాదాపు గంటకుపైగా నిలబడి చూస్తూన్న రాగిణి, ఇంక రాదేమోనని వెళ్ళిపోతూండగా, అవినాష్, శిల్పా మాట్లాడుకుంటూ అటువెళ్ళడం చూసింది. వాళ్ళు ఈమెను చూడలేదు. రెండు నిమిషాలు ఆశ్చర్యంగా అలా చూస్తూనే వుండిపోయింది ఈ రెండు నెలల సెలవుల్లోనూ శిల్ప ఎంతో పొడుగైంది. తెల్లటిచ్ఛాయా, పెద్దకళ్ళూ, కోటేరువేసినట్టున్న ముక్కు, ఆ పిల్ల తన కూతురే నంటే, ఏదో సంతోషం గిలిగింతలు పెట్టినట్టయింది. 'కన్నబిడ్డని కళ్ళారా చూసుకుని ఆనందించకుండా ఇలా దొంగచాటుగా చూసి తృప్తిపడే దురదృష్టాన్ని శత్రువులకు కూడా కలిగించకు భగవంతుడా' అనుకుంటూ, శిల్పా, అవినాష్ లు కనుమరుగయ్యేదాగా అలాగే చూస్తూ, ఇంటి ముఖం పట్టింది రాగిణి.
ఇంటికి వెళ్ళేసరికి కోటయ్య బాబాయ్ ఉత్తరం పడుంది. వెంటనే తీసి కవరు చింపింది, ఆత్రుతగా. కోటయ్య బాబాయ్ ఉత్తరమంటే కనీసం నాలుగు పేజీలకి తక్కువవుండదు! ఈసారి ఉత్తరంలో శిల్ప తనకి పంపిన సందేహాన్ని, శిల్పకి తను రాసిన జవాబునీ జతపరుస్తూ పంపాడు.
"కోటయ్య తాతా! అమ్మ తనే నా అమ్మ అని చెప్పకుండా నా చేత 'అక్కా' అని ఎందుకు పిలిపించుకుంది? నాకు ఆమె అమ్మ అవుతుందని ఎందుకు చెప్పకుండా పెంచింది?" అని రాసింది.
రాగిణికి అది చదువుతూంటే, మతిపోయినట్టనిపించింది. 'నిజమే తను ఎందుకలా చేసింది? పైగా ఎన్నాళ్ళు తను శిల్పకి తన తల్లినని తెలీకుండా దాచాలనుకుంది? తనకే సమాధానం దొరకలేదు ఈ ప్రశ్నలకి!
కోటయ్యగారు శిల్పకి రాసిన ఉత్తరం తీసి చదివింది. "శిల్పా! మీ అమ్మా నాన్నల పెళ్ళి గుట్టుగా దేవుడి గుళ్లో కొందరి స్నేహితుల మధ్య జరిగిందని చెప్పానుగా! ఆ తరువాత మీ నాన్న రాజేష్ మీ అమ్మను డాన్స్ మానెయ్యమనీ, రాగిణి మానననీ దెబ్బలాటలు జరిగేవని చెప్పానుగా. ఆ పరిస్థితిలో వీళ్ళ పెళ్ళి సంగతి ఎవరికీ చెప్పకుండా, రహస్యంగా వుంచేయడం జరిగింది. అప్పటికే నువ్వు కడుపులో పడ్డావు! రాజేష్ మీ అమ్మతో తెగతెంపులు చేసుకుని. "ఈ జన్మలో నీకు నా మొహం చూపించను" అంటూ వెళ్ళిపోయాడు. అతను అలా కోపంలో అన్నాడే తప్ప, కోరిచేసుకున్నవాడు, అందులోనూ తనవాళ్ళు కాదంటారని గుట్టుగా పెళ్లిచేసుకుని వెళ్ళిపోయిన వాడు తప్పకుండా తిరిగొస్తాడని ఆశించింది మీ అమ్మ. కాని మీ నాన్న రాలేదు. మీ అమ్మమ్మ, మీ అమ్మని డాక్టరు దగ్గరికి తీసికెళ్ళి నువ్వు పుట్టకుండా చెయ్యమని అడిగింది. కాని, అమ్మ అందుకు ఒప్పుకోలేదు!
శిల్పా! మీ అమ్మకి పెళ్ళయిన సంగతి ఎవ్వరికీ తెలీదు. మరి బిడ్డ పుట్టిన సంగతి తెలిస్తే ఎలా? సమాజం ఊరుకోదు కదా! మన పురాణాల్లో కుంతి కథ తెలుసుకదూ! మొన్నొచ్చినప్పుడు చెప్పాను కదా! అటువంటి కుంతే, లోకానికి భయపడి కవచకుండలాలతో పుట్టిన కర్ణుణ్ణి, నదిలో వదిలేసింది. మరి మనమెంత? మీ అమ్మమ్మ మీ అమ్మ డాన్సు నేర్చుకోవడం కోసం, మద్రాసులో కాపురం పెట్టామనీ చెప్పి, దాదాపు సంవత్సరం పాటు అక్కడే వుండిపోయారు. నువ్వు పుట్టాక, నువ్వు తన బిడ్డవని అందరికీ చెప్పుకుంది సరోజిని! "ఈ వయస్సులో కూడా ఇంకా కనిందా?" అంటూ ఎగతాళి చేశారు కొందరు. అన్నీ భరించారు మీ అమ్మా, అమ్మమ్మా!
ఇందులో మీ అమ్మ, పెళ్ళయిన మర్నాడే రాజేష్ చెప్పినట్టు, డాన్సు చెయ్యడం మానేసి వుంటే ఎలా వుండేదో చెప్పలేము కానీ, తనకుంటూ కొన్ని ఆశయాలూ, అభిప్రాయాలూ కలిగిన మీ అమ్మ అలా ఒప్పుకోలేదు. అది ఆమె తప్పనుకుంటే, మరి ఈ లోకంలో, ఏ ఆడదీ తన కోర్కెలు పెంచుకోకూడదు. ఆశయాలూ, అభిప్రాయాలూ ఆమెకి ఉండకూడదు. అంతేనా? నన్నడిగితే మీ అమ్మచేసినది ఒకటే తప్పు. అమాయకంగా, ఆవేశంలో రాజేష్ ని పెళ్ళిచేసేసుకుంది! అలాకాకుండా, రాజేష్ వాళ్ళ పెద్దల్ని ఒప్పించేవరకు పెళ్ళిచేసుకోకుండా వుండవలసింది. నువ్వు ఎవరిని చూడాలని ఆరాటపడుతున్నావో ఆ మీనాన్న తెగతెంపులు చేసుకుని వెళ్ళాక ఒక్కసారైనా, మీఅమ్మని చూడ్డానికి వచ్చాడా? వస్తే తెలిసేది నువ్వు పుట్టినట్లు. ఏమీ జరగనట్లు అంతా మరిచిపోయి, హాయిగా పెళ్ళిచేసుకుని, పిల్లల్ని కని విదేశాలలో కులుకుతున్నాడు. మరి మీ అమ్మ కూడా, నువ్వు పుట్టకుండా చేసుకుని వుండొచ్చుగా! ఆమెలోని మాతృత్వం ఆ పనికి ఒప్పుకోలేదు! నవమాసాలూ మోసి నిన్ను కన్నది! తన ప్రేమని తన గుండెల్లోనే దాచుకుని పైకి కనబడనీయకుండా నిన్ను చూసి మురిసిపోయింది. అదేనమ్మా భగవంతుడు చేసిన నేరం. మగవాడు తప్పుచేసినా పెద్ద మనిషిలా తప్పించుకుపోతాడు. ఆడవాళ్ళు ఆపదలో పడిపోతారు! ఇప్పుడు చెప్పు. కనిపించని మీ నాన్న మీదున్నపాటి గౌరవం మీ అమ్మమీద ఇంకా కలుగలేదా? ఆమె నేరాన్ని మన్నించలేవా? తల్లిగా ఆమెని స్వీకరించి, ఆమెకి తృప్తినీ, సంతోషాన్నీ కలిగించలేవా? ఆలోచించుకో! బాగా ఆలోచించుకుని, ఏ నిర్ణయాన్నీ నాకు రాయి. వెంటనే సమాధానం రాయకు. నీ చిన్ని వయస్సుకి మించిన ప్రశ్నలివి. వీటి భావం, ఈ పరిస్థితి నీకు ఇప్పుడు సరిగ్గా అర్థంకాదు. అర్ధమయ్యే వయస్సు నీకు లేదు. కానీ అర్ధమయిన రోజున, మీ అమ్మని నువ్వు మనసారా క్షమిస్తావనే నమ్మకం నాకుంది! నీ మనస్సుని, 'ఇన్ ఫ్లూయన్స్' చేస్తున్నానని కానీ, నీకు బ్రెయిన్ వాష్ చేస్తున్నానని కానీ అనుకోకు. ఈ విషయంలో ఎవ్వరి ప్రమేయం వుండకూడదు. తుది నిర్ణయం నీదే కావాలి.
నీ కోటయ్య తాతయ్య."
