Previous Page Next Page 
నా కథవింటావా పేజి 28


    ఏదో దివ్యమైన  అనుభూతి! ఆ పాపకి స్తనం నోట్లో పెడుతూ  వుంటే! తడుముకుంటూ  పాప రొమ్ము  నందుకుంటూ వుంటే  ఏదో గిలిగింత! కొత్త పులకింత !
    "ఈ పాప చరిత్రేమిటో, ఎక్కడి పిల్లో ఏమీ తెలీదు .కానీ తనకి తెలిసిందల్లా  ఒక్కటే! అమాంతంగా తను ఈ పిల్లని ఒదిలేస్తే, ఎవరో ఎత్తుకుపోయి, ఎక్కడికైనా  అమ్మేస్తే"....!
    నో! నో! అలా జరగడానికి వీల్లేదు! ఈ పాపని తనే పెంచుతుంది. భగవంతుడిచ్చిన  వరంగా, అది తన కర్తవ్యంగా భావించి  ఈ పాపని పెంచుతుంది. చదివిస్తుంది. విద్యావంతురాలిని  చేస్తుంది. దేశానికి ఒక వ్యభిచారినిని అందివ్వకుండా  ఒక విద్యావతిని  అందిస్తుంది! తను అదివరకు ఆలోచించినట్టు  ఏ పోలీసు రిపోర్టూ  ఇవ్వదు!" ఒక నిర్ణయానికి రావడమేమిటి తృప్తిగా  నిట్టూర్చింది.
    పెట్టె తెరిచి  తన పాతచీర  నొకదాన్ని తీసి, మడతవిప్పి, దాన్లో పాపని వెచ్చగా పడుకోబెట్టి, పాపని చుట్టివున్న గుడ్డల్ని  తీసి, ఎవ్వరూ చూడకుండా  కిటికీలోంచి  అవతలపారేసింది.
    కావ్య ఆ పాపమీద  చూపుతున్న  శ్రద్ధకి  అందరూ  ఆమే  తల్లి అనుకున్నారు.
    అందులో  ఒకావిడ "ఏమ్మా! వీళ్ళ నాన్నగారు లేరా ?" అడిగింది. ఈ అనుకొని ప్రశ్నకి  తడబడిపోయింది  కావ్య! నోటమాట  రాలేదు .వెంటనే  ఏం చెప్పాలో కూడా తెలీలేదు.
    "ఒదిలేశాడా ? అసలు పెళ్ళయ్యాక  పుట్టిందా  ఈ పిల్ల లేకపోతే...."
    "షటప్! మీకెందుకూ ఇవన్నీ ?" అందామనుకుంది. కానీ  పెదవులు  కదలలేదు.
    "అసలు, ఆయన ఈ లోకంలో  వున్నాడా ? అదీ లేదా ?" అంది ఆవిడే మళ్ళీ!
    వెంటనే ఏదో స్పురించినదానిలా  "లేరు" అంది! విధి తనని ఎలా ఆడిస్తోంది! ఏ మలుపు తిప్పితే ఆ మలుపు నందుకుంటోంది  తను. ఎప్పుడేం జరుగుతుందో  తన జీవితంలో  తనకే  తెలీదు. ఏమీ లేకుండానే  చెడిపోయిందని  ముద్రవేసుకుంది. పెళ్ళి  కాకుండానే, బిడ్డని  కనకుండానే, తల్లిగా  స్థిరపడిపోయింది! పెళ్ళికాని తల్లి! కాదు తల్లి కాని తల్లి తను!" కళ్ళల్లో నీళ్ళు  నిండి చెంపలమీదుగా  కారాయి.
    "అయ్యో పాపం! ఏదో అడిగానమ్మా  ఉండబట్టలేక ! ఏడవమాకు! అన్నీ గుర్తుకొచ్చుంటయ్ !" ఓదార్చింది ఆవిడ.
    కావ్యకి  మరో విషయం  గుర్తుకొచ్చింది. "మైగాడ్ ! ఒక విధమైన చలి పుట్టుకొచ్చింది ,వెన్నులోంచి! ఇకమీదట  తను విధవగా నటించాలన్నమాట! అంతేకాదు  పేరుకూడా  మార్చుకోవాలి! ఎందుకయినా  మంచిది !
    అన్నయ్యకేం  చెబుతుంది. వొదిన  నమ్ముతుందా ? తనకి  జీవితంలో  పెళ్ళేకాదు! అన్నయ్య  ఆశలూ, అమ్మ కోరిక అంతా ఏమైపోతుంది ? ఈ పిల్లని తనపిల్ల అని, తనే చెబుతూంటే, తనని  పెళ్ళి చేసుకోవడానికి  ఎవరు ముందుకొస్తారు ?" మద్రాసులో దిగగానే  పోలీసు స్టేషన్ కెళ్ళి  జరిగినదంతా  చెప్పి, ఈ పాపని పోలీసుల కప్పగించేస్తే  తన బాధ్యత తీరిపోతుందనుకుంది. అంతలో  పాప చీరంతా  తడిపేసిందేమో, ఏడుపు లంకించుకుంది. పెట్లోంచి  మరో చీర తీసి పరిచింది, నానిన గుడ్డల్ని  పక్కగా  ఆరేసింది. ఇంకా  ఏడుస్తోంది  పాప! కప్పులోంచి  కొన్నిపాలు తీసి మెల్లగా  చెంచాతో పోసింది. పాలు తాగుతూ  తాగుతూనే  నిద్రలోకి  జారుకుంది  పాప. రాత్రి తొమ్మిది గంటలకి, శోభన  పొట్లం  కట్టిచ్చిన  పులిహోర తిని నీళ్ళు  తాగింది.
    కొత్త ఆలోచనలూ, కొత్త భయాలూ, వింతైన పరిస్థితీ, ఇవన్నీ కలిపి మనస్సుని గజిబిజి చేస్తూ వుంటే, నిద్రపట్టక ,బర్త్ మీద  అటూ ఇటూ దొర్లుతూ  పడుకుంది. పక్కనే పాప పడుకోనుండడం, ఏదో వింత అనుభూతిని కలిగించింది ,వెచ్చగా  తనని  కరుచుకుని  పడుకుంది పాప! కొంచెం తను కదిలితే లేచిపోతోంది. మధ్య మధ్య రైలు చప్పుడుకీ, రైలు కూతకీ ఉలిక్కిపడి  కెవ్వుమంటోంది! అలా ఉలిక్కిపడి ఏడ్చినప్పుడల్లా  కావ్యలేచి కూర్చుని పాపని పొత్తిళ్ళలో పడుకోబెట్టుకుంది! రాత్రంతా అలాగే  గడిచిపోయింది ?
    తెల్లారాక  మద్రాసు స్టేషన్లో  ఆగింది రైలు, ఏడున్నరా ఎనిమిదీ ఆ ప్రాంతానికి! అంతసేపూ  ఊకదంపుడు  ఉపన్యాసాలతో  తలనొప్పి తెప్పించినవారూ ,రాజకీయాలన్నీ  వీళ్ళ  నెత్తినే  వున్నట్టు, వీళ్ళే దేశాన్ని  ఉద్దరించేవారిలా  ప్రభుత్వాలని  విమర్శించేవారూ, కొంచెమైనా  మొహమాటం  లేకుండా  ఇతరుల స్వంత విషయాలలో  తలదూర్చి, కాలక్షేపం చేసేవారూ, అందరూ  కూడా  గబగబా  రైలు దిగిపోతున్నారు, గమ్యస్థానం చేరగానే అన్నీ మరిచిపోయి !
    పాపనీ  పెట్టెనీ  పుచ్చుకుని  రైలు దిగింది కావ్య! మనసులో సంఘర్షణ జరుగుతోంది. పాపని పోలీసుల చేతిలో పెట్టి, తన మానాన తాను పోవడమా ? తనతో కూడా తీసుకుపోయి, కొత్త సమస్యలను  కొని తెచ్చుకోవడమా ?
    మనసు పాపని  వదిలి  వెళ్ళమంటోంది !
    మానవత్వం  పాపని రక్షించమంటోంది !
    తన్ను మాలిన ధర్మం  వొద్దంటోంది మనసు !
    త్యాగమే జీవన పరమార్ధం  అంటోంది  మానవత్వం !
    'ఇప్పటికే  నిందలమయం  నీ జీవితం ! ఇంకా ఎందుకు కొనితెచ్చుకుంటావ్ కష్టాలని' హెచ్చరిస్తోంది  మనసు !
    "నిండా మునిగావు నీకు చలేమిటి ? కనీసం  ఇంతమంచి  పనిచేశానన్న  తృప్తినైనా  అనుభవించు ! ఒక పసికందుకు  తోడువై నీడవై, ఆ జీవితాన్ని సక్రమంగా  నడిపించు!" అర్ధిస్తోంది  మానవత్వం! 
    మనసుకీ, మానవత్వానికీ మధ్య  జరుగుతూన్న  ఘర్షణలో  ఎటూ చెప్పలేక, బరువుగా అడుగులు వేస్తూ నడుస్తోంది కావ్య !
    "వాంగో  వాంగో!" "ఆటో  వేణుమా ?" అంటూ వెంటబడుతున్నారు ఆటోవాళ్ళు.
    "రా...." పిలిచింది ఒక ఆటోని.
    "చూడూ, ఏదైనా  హోటలుకి తీసికెళ్ళు. అక్కడ  కాస్త  కాఫీ టిఫినూ తిన్నాక, పాండిచేరీ వెళ్ళడానికి బస్ స్టాండులో  ఒదిలిపెట్టు!" అంది.
    "అయితే మీటర్  వెయ్యను .నీదా....యోచన  చేసి, ఎంతిస్తారో సెప్పండి" అన్నాడు తెలుగుని అరవయాసలో మాట్లాడుతూ.
    "సరే పద" అంటూ ఆటోలో ఎక్కికూర్చుంది  కావ్య!
    లజ్ కార్నర్ దగ్గర  'శాంతివిలాస్' కి తీసికెళ్ళాడు ఆటోవాడు.
    "ఇక్కడి నుంచి  పాండిచేరీకి  ఎంతసేపు  పడుతుంది ప్రయాణం" ఎవరినో  అడిగింది.
    "రెండున్నరా  మూడు గంటలు" అన్నాడతను.
    లోపలికెళ్ళి  కాళ్ళూ చేతులూ  కడుక్కుంది. టిఫినూ కాఫీ తీసుకుంది. పక్కనున్న దుకాణాలలో  ఒక పాలసీసా, పాపకి  కొన్ని ఫ్రాకులూ, నేప్ కిన్ లూ కొంది. పాపకి  పాలుపట్టి, బట్టలు  మార్చింది. వెంటనే "ఇవ్వన్నీ  ఎందుకు కొంది తను ? పాపని తనతో  తీసుకుపోతోందా? పోలీసులకి ఇచ్చెయ్యడం లేదా ? మనసు _మానవత్వం  మధ్య, మానవత్వమే గెలిచిందా ? అయ్యుంటుంది. ఎంత  ఆలోచించినా  పాపని ఒదిలిపెట్టలేక పోతోంది. ఏమిటో ఈ బంధం ? ఏనాటిదో  ఈ ఋణం ? లేకపోతే, ఇటువంటి విచిత్ర  సంఘటన తనకే  ఎందుకు జరగాలీ ? ఇది దైవఘటన కాక మరేమిటి? ఈ బాధ్యతని  తను నిర్వర్తించి  తీరుతుంది ! బహుశ అరబిందో  మహర్షి పేరులోనే ఆ వేదాంతం  వుందేమో! లేకపోతే తను ఎందుకు పాండిచేరీ కే  పోవడానికి  నిశ్చయించుకుంది. అరబిందో  రచనలు తనని ప్రభావితం చేశాయా ?" ఆలోచిస్తూ ఆటోలో కూర్చుంది.
    ఆటో బస్ స్టాండులో  ఆగింది.
    కావ్య పోలీస్ స్టేషన్ కి వెళ్ళే ఆలోచన  మానుకుంది !
    పరిస్థితులను ఎదుర్కోవడానికే  సిద్ధపడింది !
    అందుకే నిశ్చింతగా  కూర్చుంది  ఆటోలో !
    ఆటో దిగి ఒక ఇరవై రూపాయలు  వాడి చేతిలో పెట్టింది  కావ్య !
    చాలదని సణిగాడు! వెంటనే  మరో పదినోటు  తీసి వాడిచేతిలో  పెట్టింది.
    సంతోషంగా  వెళ్ళిపోయాడు వాడు !
    మనము కుదుటపడింది! కుదుటపడ్డ  మనసుకి, అప్పుడుగానీ, అలసట తెలీలేదు. రాత్రంతా పడ్డ  మానసిక సంఘర్షణా, ఆవేదనా, ఇప్పుడు అణిగిపోయి, తుఫానొచ్చి వెలిశాక, కలిగిన ప్రశాంత  వాతావరణంలా వుంది మనస్సు !
    రఁయ్ మని పోతూన్న మనసు  ఉయ్యాల  ఊగుతున్నట్టుగా  అనిపించింది.
    తనకి తెలీకుండానే  కునికిపాట్లు  పడింది !
    పాలు బొజ్జనిండా  వుండడంవల్లేమో, పాపకూడా  హాయిగా  నిద్రపోయింది !
    బస్సు ఆగేసరికి  మెలకువ వొచ్చింది కావ్యకి !
    అందరూ సామాన్లు  తీసుకుని  దిగుతున్నారు! తనూ పెట్టెనీ సామాన్లనీ  ఒక చేత్తో  పట్టుకుని, పాపని మరోచేత్తో గుండెలకి హత్తుకుని బస్సు దిగింది !
    ఎదురుగుండా  వున్న టాక్సీని పిలిచి, అరబిందో  ఆశ్రమానికి  తీసుకెళ్ళమని  చెప్పింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS