Previous Page Next Page 
యువత నవత పేజి 28

   
    జవాబుగా సన్నగా మూలింగి సుజాత.

    "పోలీసుల దగ్గరికి కాదండీ ముందుగాడమనిషి వెళ్లాల్సింది, వెంటనే బండి తెప్పించండి. హాస్పిటల్ కి తీసికెడదాం"  సుధ పోలీస్ పటేలుని ఉద్దేశించి అంది.

     "కొన ప్రాణంతో ఉన్నట్టుంది వెంటనే వైద్యం జరిగితే  బ్రతుకు తుందేమో" ఒకాయన అన్నాడు.

    "వద్దు! దాన్ని బ్రతికించొద్దు!  ఆ కొన ఊపిరి అగిపోయేట్టుగా దాన్ని గొంతుమీద ఎవరైనా కాలుపెట్టి నొక్కేయండి. వద్దు! అది బతకొద్దు!"సుజాత త్లలి కాంతమ్మ ఉన్మాదిలా అరిచింది.

     "అదేం మాటమ్మా! బిడ్డ ప్రాణంతో వున్నందుకు సంతోషించు!" అన్నారెవరో.

     "మానంపోయినంక  పానమెందుకు?" అది బతికితే ఈ మనుషులు గజ్జికుక్కను చూసినట్టుగా చూస్తరు. ఓ పెద్ద రోగిని చూసినట్టుగా చూస్తరు."

    "కన్నతల్లివి. నువ్వు అలా అనుకోకుంటే చాలు. ప్రపంచం ఏమనుకుంటే ఏం?" సుధ శాంతంగా  అంది. "ఎవరో దుర్మార్గులు సుజాత మానం దోచేస్తే ఆమె బ్రతికి ఉండకూడదనడం న్యాయంకాదు. సుజాత బ్రతకాలి! ఆ దుర్మార్గులకు శిక్ష పడేట్టుగా చేయాలి?"

    "పేదోళ్ళకు డబ్బేకాదు, న్యాయంకూడా దొరకదు  తల్లి! ఆళ్లకి శిక్షపడినా నా బిడ్డ బతుక్కంటిన  బురదపోతుందా? బతికితే అది శానా నరకం పడతదతి దాని కొన ఊపిరి ఆర్పెయి తల్లి"వెక్కి వెక్కి ఏడవసాగింది కాంతమ్మ.

     ఒక్క సుధకుతప్ప అక్కడున్న ఎవరికీ ఆమె మాటలు ఆ సంగత మనిపించలేదు. ఎందుకంటే  సుజాత ఇప్పుడు కుక్క ముట్టిన కుండ. ఈ ప్రపంచంమీద వుండి ఏం లాభం?"

    పిల్లను  హాస్పిటల్ కి తీసికెళ్లి వైద్యం చేయించాలని ఎవరూ త్వరపడడంలేదు.  ఈ పని ఎవరుచేసి వుంటారా అని తర్జన భర్జన పడుతున్నారు. ఈ ప్రపంచం పూర్తిగా పాడయిపోయింది. ఇంట్లోవున్న  ఆడవాళ్ళకే ఒక్కోసారి భద్రతలేదు. ఇహ ఉద్యోగాలంటూ ఊళ్లమీద బయల్దేరే ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ?

     సుధ తొందరచేసి బండి తెప్పించి సుజాతని హాస్పిటల్ కి తరలించింది.

                                                                4

    వారం  పదిరోజులవరకు సుజాత సంగతే ఎక్కడ చూసినా, ఆపిల్ల చనిపోయే వుంటే సానుభూతి పొంది వుండేది ఈ ప్రపంచంనుండి బ్రతికి ఆ సానుభూతి పోగొట్టుకొంది. అసలు,  తనను ఎవరు అలాచేశారో ముందు చెప్పడానికి అంగీకరించలేదు సుజాత. సుధ అడగ్గా అడగ్గా చెప్పింది. ఒక్కడుకాదు. ఇద్దరు! చాలా రాక్షసంగా ఆమెను దోచుకున్నారు. ఆ ఇద్దరూ యిదివరకు ఆమెమీద కన్నేసినవాళ్లే!వెంకట్ రెడ్డి, సాయిగౌడ్.

     వాళ్లని కోర్టుకీడ్చి శిక్షపడేట్టు చేద్దామంది సుధ ఆవేశంగా.

     "అదంత తేలికా? వాళ్లు డబ్బు, పలుకుబడీ వున్నవాళ్లు ! పాదరసంలా జారిపోగలరు! మళ్లీ అదొక అవమానం! మానభంగం కేసు  అనగానే  ఎన్నెన్ని  పరీక్షలు!ఎన్నెన్ని  ప్రశ్నలు! అసలు మానభంగం  ఇదేననిపిస్తుంది ఆ మానభంగం యెక్కడో చేలమధ్య  జరిగింది. ఈ మానభంగం ప్రపంచంముందు జరుగుతుంది. ఊహుఁ నా వల్లకాదు!" అంది సుజాత నిస్పృహగా.

    "అలా అంటే యెలా సుజాతా? నేరం చేసిన వాడికి శిక్షపడొద్దా? వాడు దొరబాబులా తరగాల్సిందేనా? ఇలా యే శిక్షా పడకపోతే  ఇవాళ సుజాతను దోచుకొంటారు రేపు సుశీల! ఇవాళ వెంకట్ రెడ్డి చేస్తే రేపు సంకట్ రెడ్డి  చేస్తాడు!"

    "మనం కేసు పెట్టి ఎంత శ్రమపడితేనో వాడికి ఆర్నెల్లు, ఏడాది జైలుశిక్ష, వెయ్యో, రెండువేలో జరిమానా పడుతుంది. తరువాత  వాళ్లు కాలరెత్తుకుని రాజాలా తిరుగుతారు. నిజంగా వాళ్లు చేసిన దుర్మార్గానికి సరిపోయే శిక్ష అంటారా, సుధగారూ? వాళ్లకు ఆ కాస్తశిక్ష పడితే నాకు ఒరిగేది  యేముంది? నా బ్రతుకులో ముసిరిన యీ  చీకటి వాళ్లకు పడే ఆ శిక్షవల్ల తొలగదుగా?"

    "నీ శరీరం మీద అఘాయిత్యం జరిగింది నిజమే! అయితే బ్రతుకే శాశ్వతంగా చీకటి అయిపోవాలా? నువ్వు నీకై చెడిపోలేదుగా? చెడగొట్టారు వాళ్లు! గాయాలూ, బాధలూ శాశ్వతంకాదు. అవి కాలగమనంలో మాసిపోతాయి! ఈ  చీకటి క్రమక్రమంగా అంతరించి  వెలుగురేకలు విచ్చుకొంటాయి. నువ్వు మరీ అంత కృంగిపోకు? తప్పుచేసినదానిలా కుమిలి పోకు. నువ్వు ఏ తప్పూ చేయలేదు తలెత్తుకు ధీమాగా తిరుగు. ఉత్సాహం తెచ్చుకో! బ్రతుకుమీద తీపిని పెంచుకో!కాని ఆ దుర్మార్గులకి శిక్ష పడేట్టు చూడు. నీ వెంట నేనుంటాను! మన వెనుక ఎన్నో మహిళా సంస్థలుంటాయి. న్యాయం నీనుండి తప్పించుకుపోకుండా నా శక్తి ధారబోసి పోరాడతాను."

    "మీకు తెలియదు! వాళ్లు చాలా దుర్మార్గులు. మీరు సారధ్యం వహిస్తున్నారని తెలిస్తే మీ మీద కక్షగడతారు. నా కోసం మీరు బలికావడం నాకిష్టంలేదు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS