Previous Page Next Page 
త్రీ- ఇన్- వన్ పేజి 29

    "హబ్బా!చాలా సులభంగా ఉందండీ"గుండెలమీద చెయ్యేస్కున్నాను.

    "ఇప్పుడు నీకు తోచిన వాక్యం ఏదైనా చెప్పు!"

    నేను బుర్ర గోక్కున్నాను.

    "ఒక పువ్వు వికసించింది. దాని చుట్టూ తుమ్మెద తిరిగింది" అన్నాను రెండు క్షణాలు ఆలోచించి.

    "శభాష్... చూశావా నీకు బుర్ర గోక్కుంటే అయిడియా వచ్చింది. అంటే నీకు బుర్ర గోక్కుంటే అయిడియాలు వస్తాయన్న మాట. కాబట్టి నువ్వు కవిత్వం రాసేప్పుడు బుర్ర గోక్కుంటూ రాస్తుండు. ఆ మళ్ళీ ఆ!వాక్యం చెప్పు" అన్నాడు పిచ్చుమణి.

    "ఒక పువ్వు వికసించింది. దాని చుట్టూ తుమ్మెద తిరిగింది."

    "ఇప్పుడు దీన్ని వచన కవిత్వంగా మార్చేస్తా చూడు" అని ప్రక్కనున్న దువ్వెన తీసి దాంతో వీపు గోక్కోవడం మొదలు బెట్టాడు.

    "నీకు బుర్రగోక్కుంటే ఆలోచనలు ఎలా వస్తాయో నాకు వీపు గోక్కుంటే అలా వస్తాయ్" అని నవ్వాడు పిచ్చుమణి. మళ్ళీ క్రిందపడిపోయిన కట్టుడు పన్ను తీసి పెట్టుకుని రెండు నిమిషాలు ఆలోచించి, నాలుగు నిముషాలు వీపు గోక్కుని "ఇప్పుడు విను" అన్నాడు.

    పిచ్చుమణి గొంతు సవరించుకుని చదివాడు.

    "ఒక పువ్వు వికసించింది   

    వికసించిందొక పువ్వు
   
    దాని చుట్టూ గిర గిర

    గిరగిర తిరిగింది

    ఒక తుమ్మెద

    తిరిగి తిరిగి పువ్వును

    మరిగిందొక తుమ్మెద

                                          

    ఒక పువ్వు వికసించింది."

    అంటూ చదవడం ఆపి నా వైపు కళ్ళు ఎగరేశాడు "ఎలా ఉంది!"

    "చాలా బావుందండీ" అన్నాను.

    "నేను మామూలుగా చదివేశానుగానీ ఇదే మీరైతే ఒక్కో వాక్యాన్నీ రెండేసి మార్లు చదవాలి గుర్తుంచుకో, కవి సమ్మేళనల్లో ఒక పంక్తిని చదివిన తరువాత వెనక్కి తిరిగి బాగా పేరున్న పెద్ద కవి వైపు చూసి చిర్నవ్వు నవ్వాలి. అతగాడు ఊరికే కూర్చుంటే బావుండదని తనూ చిరునవ్వు నవ్వి "బావుంది బావుంది" అంటాడు. ఒక్కడే బావుందని మనమంతా ఊరుకుంటే మర్యాదగా ఉంటుందా? అని అనుకుని స్టేజిమీద ఉన్న మిగతా కవులంతా తలలు ఊగిస్తూ "బావుంది బావుంది" అంటారు నిన్ను చూసి అంతమంది కవులు బావుందని అంటుంటే దాంట్లో ఏదో గొప్ప భావం ఉండకపోయి ఉంటుందా అని కవి సమ్మేళనానికొచ్చిన తలమాసిన వాడెవడో చప్పట్లు కొడతాడు. మాకేనా తలమాయనిది అని కోపగించుకుని మిగతావాళ్లు చప్పట్లు కొడతారు. దాంతో హాలంతా చప్పట్ల మోత.అప్పుడు ఆ పంక్తిని రిపీట్ చేసి ముందుకి వెళ్తావ్..."

    "బావుంది బావుంది" అని సంతోషంగా తల ఊపాను నేనూ.

    "తరువాత రెండో పంక్తిని చదివి మళ్ళీ వెనక్కి తిరిగి పెద్దకవిని చూసి చిర్నవ్వు నవ్వుతావ్... అంతే! మళ్ళీ ఇందాక చెప్పినదంతా వరస తప్పకుండా జరుగుతుంది. ఆ కవి సమ్మేళనంలో చప్పట్లన్నీ నీకే... ప్రేక్షకుల మార్కులన్నీ నీకే..."

    నేను సంతోషం పట్టలేక చప్పట్లు కొట్టాను.

    పిచ్చుమణి మళ్ళీ చెప్పడం మొదలుబెట్టాడు.

    "సీజన్ బట్టి కవిత్వం రాయాలి. ఉగాది వచ్చిందనుకో... వచ్చింది ఉగాది అంటూ రాసెయ్యాలి.. ఎండాకాలం వస్తే ఎండలు ఎండలు, మండే ఎండలు అంటూ రాసి పడెయ్యాలి. అంతేకాదు, ఎప్పుడూ ఇలాంటి కవిత్వమే రాస్తే నీకు సామాజిక స్పృహ లేదని అంటారు. అందుకే రిక్షావాడి మీద, గుడిసెల్లో ఉండేవాళ్ళమీద "ఓ పేదవాడా... నువ్వుండేది మురికివాడా" అంటూ కవిత్వం రాయ్. వీలున్నప్పుడల్లా చంపుతా, నరుకుతా అను"

    "అదేమిటండీ!" ఆశ్చర్యపోతూ అడిగాను.

                                 

    "దాన్ని విప్లవ కవిత్వం అంటారు. ఇహపోతే మినీ కవితలు గురించి, మన రాజధాని గోడలమీద చూడు... ఎన్ని స్లోగాన్లో... ముందు అవి బాగా చదువు. అవన్నీ మినీ కవితలే..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS