'బస్సులో వెళ్లేటప్పుడు నేను రోజూ వాటిని చదువుతానండీ" అన్నాను.
"ఏదీ.. అయితే ఆ అనుభవంతో ఒక మినీ కవిత ఆశువుగా చెప్పుచూద్దాం."
"కవిత్వం రాయడంలోనే అనుభవం లేదు. ఒక ఆశువుగా ఎలా చెప్పగలనండీ" నసిగాను.
"ఓరి నీ అమాయకత్వం కూలా హ్హహ్హహ్హ...దీని తస్సచెక్క... మళ్ళీ క్రింద పడిపోయిందయ్యా..."
క్రిందనుండి కట్టుడు పన్ను తీసి పెట్టుకున్నాడు.
"మినీ కవిత్వం రాయడానికిగానీ ఆశువుగా చెప్పడానికిగానీ అనుభవం కావాలటయ్యా...ఇప్పటికిప్పుడు నె చెప్తా చూడు..."
ఓసారి దువ్వెనతో వీపు గోక్కుని
"బడికి వెళ్తే బలపం
గుడికి వెళ్తే గిల్పం" అన్నాడు.
"గిలపం అనే పదం లేదు. కానీ ప్రాసకోసం మనం అలా అంటాం. దానికి ప్రేక్షకులు లేదా పాఠకులు కర్పూరంగా అర్థం చెప్పుకుంటారు. అలా మనకి కొన్ని కొత్త పదాలు సృష్టించే స్వేచ్ఛ ఉంది.
నాకు హుషారు పుట్టింది.
"నేను కూడా ఓ మినీ కవిత చెప్తానండీ"అన్నాను.
"చెప్పు చెప్పు"
"ఇడ్లీకి జత సాంబారు"
దేవదాసుకి జత బీరు బారు" అన్నాను బుర్ర గోక్కుంటూ.
పిచ్చుమణి చప్పట్లు కొట్టాడు.
"నీకు కవిత్వం ఎలా రాయాలో అర్థం అయిపోయిందయ్యా. ఇంక నేను చెప్పేది ఏముంది?"

నేను కుర్చీలోంచి లేచాను.
"మరో విషయం. నువ్వు కాస్త మంచి కవిని అనిపించికోవాలంటే నాలా ఇలా సిల్కు లాల్చి వేసుకుని, మీద కాశ్మీరు శాలువా కప్పుకోవాలి" అన్నాడు.
"అలాగేనండీ" వినయంగా తల ఊగించాను.
పిచ్చుమణి ఇంట్లోపలికి చూస్తూ "ఓసేవ్ ముండా... ఈ పెద్దలమ్డీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? చిన్న ముండా కొడుకు ఇందాకనగా నా సిగరెట్లు తేడానికి వెళ్ళాడు. ఇంకా ఇంటికి చాపలేదా? పనిమనిషి ఈవేళ రాలేదన్నావు? కాలెండర్లో గుర్తు పెట్టుకుని ఫస్టుకి దాని జీతం కట్ చెయ్... దానెమ్మ..."
నేను బికచచ్చిపోయాను. హఠాత్తుగా పిచ్చుమణీకి ఏమైంది?...
పిచ్చుమణి నావైపు తిరిగి "మరేమీ అనుకోకోయ్... కవిత్వం విషయం మాట్లాడేటప్పుడే నేను మామూలుగా మాట్లాడతాను. మిగతా టైమంతా నేను మాట్లాడేది ఈ భాషే... హహహ..."
క్రిందకి వంగాడు కట్టుడు పన్ను తీసుకోవడం కోసం.
"నేనిహ వస్తానండీ!..." అన్నాను అయోమయంగా.
"మంచిది" అన్నాడు పన్ను తగిలించుకుంటూ పిచ్చుమణి.
నేను గుమ్మం దాటగానే నా వెనకాల తలుపులు ధబేల్ అని మూసుకున్నాయ్.
"మాయదారి సంత.. ఊరికే వచ్చి డిస్టర్బ్ చేస్తారు" అన్న మాటలు తలుపులు మూసుకోడానికి క్షణం ముందు వినిపించాయి నాకు.
***
పిచ్చుమణి దగ్గరికి వెళ్ళిన రోజునుండీ నేను అదే పనిగా కవిత్వం రాయడం మొదలుబెట్టాను.
ఆఫీసులో లంచ్ టైంలో అందరూ తింటున్న సమయంలో గట్టిగా గొంతెత్తి నా కవిత్వం చదువుతూ వాళ్ళకి వినిపించేవాడిని.వాళ్ళు ఇప్పుడు నా గదిలోకాక ఎక్కడికో పోయి లంచ్ చేస్తున్నారు. నాకు పరిచయస్తులు కూడా నేను ఎదురుపడితే ఇదివరకు నవ్వి పలకరించేవారు. ఇప్పుడు ముఖం చాటేసి నన్ను చూడనట్టు వెళ్ళిపోతున్నారు. కొందరైతే కోపంగా కొరకొరా చూస్తున్నారు కూడా.
ఆఖరికి చంచల్రావు కూడా అలా చేస్తాడని నేను అనుకోలేదు.
ఆ రోజు-
చంచల్రావు నా గదికి వచ్చాడు. ఓరెండు నిముషాలు మాట్లాడిన తరువాత "కొత్తగా ఈ వల ఉదయమే ఒక కవిత రాశానోయ్... వింటావా?" అన్నాను.

మంచం మీదనుండి హఠాత్తుగా లేచి "విననుగాక వినను" అని చెప్పుల్లో కాళ్ళు దూర్చేశాడు.
నేను వాడి గడ్డం పట్టుకుని బ్రతిమలాడాను.
"నీకు గ్రీన్ క్యాట్ రెస్టారెంటులో బిర్యాని తినిపిస్తాను" అన్నాను.
అప్పుడు శాంతించి మంచంమీద కూర్చుని "చిన్న కవితైతే వింటాను" అన్నాడు చంచల్రావు.
