ఇండియాలో వున్న అత్తగారు పోవడం, మామగారు వంటరి అయి పాపం అన్నీ చూసుకుంటూ ఒక్కరే వున్నారన్న చింత ఆయనని అమెరికా రమ్మంటే నేనక్కడ యిమడలేనురా నా పాట్లు నేపడతానన్నారు. ఏదో అయన బతుకు అయన బతుకుతున్నారానుకుంటే వేళకి ఆయనకి పెరాల్సిస్ స్ట్రోక్ వచ్చింది. ఒకకాలు, చెయ్యికి వచ్చింది. మూతి కాస్త వంకర అయినా నెమ్మదిగా సర్దుకుంది. మాట కాస్త స్పష్టత లోపించింది. ఎడం కాలు, యీడ్చుకుంటూ, ఎడం చెయ్యి కాస్త అవిటి పడంతో ఆయనకి మనిషి సాయం కావాల్సి వచ్చింది. తండ్రిని అలా వంటరిగా వదిలేయలేక ప్రకాష్ ఇండియా వెళ్ళిపోదాం అన్నాడు. అప్పటికి నాలుగైదేళ్ళు గడిచి అమెరికా మోజు తగ్గి తనూ సరేనంది. లక్కీగా ప్రకాష్ కి సత్యం కంప్యూటర్స్ లో , తనకి విప్రో లో ఉద్యోగాలు వచ్చాయి. మంచి జీతాలు ఆఫర్ రాగానే అమెరికా నుంచి వచ్చేశారు. అమెరికాలో సంపాదించుకు వచ్చిన లక్షలు పోసి మంచి యిల్లు కొన్నారు. వూరి నుంచి మామగారిని పిలిపించుకున్నారు. ఆయనకి పాపం వేళకింత పెడితే అయన పనులు అయన చూసుకోగలిగే శక్తి ఉంది.
ఇండియా వచ్చాక అక్కడికి యిక్కడికి పనులకెంత తేడా వుందో అర్ధం అయింది. ఇక్కడ మూడు పూటలా వండుకోవాలి. తినాలి, బట్టలు రోజూ ఉతకాల్సిందే. యిల్లు రెండు పూటలా చిమ్మాల్సిందే. వంట లేక్కువయి గిన్నెలు ఎక్కువ - యిండియాలో ఆకలీ ఎక్కువే. ఉదయం టిఫిన్ తప్పనిసరి. భోజనంలోకి అన్ని అధరువులూ వుండాలి.
ఫ్రిజ్ లో అమెరికాలోలాగ ఎన్నాళ్ళయినా పాడవకుండా వుండవు. కరెంటు పోవడాలు, వాతావరణంలో వేడి, ఫ్రిజ్ లో పెడితే తప్ప పదార్ధాలు నిలవుండవు. యింట్లో ముసలాయన వుండడంతో అన్నీ యధావిధిగా చెయ్యాలి. అక్కడ ఎంతోసేపు పనిచేసినా రాని అలసట యిక్కడోస్తుంది. ఆఫీసులోనూ- అక్కడి కంటే యిక్కడ పని టైమింగ్స్ ఎక్కువే. పాపని కని మూడో నెలలో రావడంతో చంటి పిల్లని చూసుకోవడం, రాత్రిళ్ళు సరిగా నిద్ర లేక యింట్లో పని ఎక్కువై డీలా పడిపోయింది. వంటకి మనిషి - యిద్దరు మారారు. వండి పెట్టిపోతాం అని ఒకరు , వాళ్ళకి అక్కడ అన్నీ అమర్చితే వంట చేసి పోవడానికి వాళ్ళెందుకు , రోజంతా యింట్లో వుండాలి అని తాననుకుంది.
ఒకావిడ యింట్లో మూడు నెలలు చేసి పప్పులు, ఉప్పులు , స్టీలు సామాన్లు అన్నీ కూతురింటికి చేరేసింది. ఒకసారి దొరికిపోయాక మానిపించింది. యింట్లో పిల్లని చూసుకోవడానికి ఎలాగో ఆయా కావాలి. వంటెంత సేపు అనుకుంది. కాస్త శుభ్రంగా వున్న పదమూడేళ్ళ పిల్ల దొరికింది.
యింట్లో పెద్ద దిక్కుగా మామగారుండడంతో కాస్త నిశ్చింత , పనిపిల్ల పాపని సరిగా చూడకపోయినా, కాస్త కేకలేసేందుకు , రాహుల్ ఇంటి కొచ్చి తిన్నాడో లేదో చూసేందుకు కాస్త దగ్గర కూర్చో పెట్టుకుని హోమ్ వర్క్ చేయించి చదివించుకోడానికి , అన్నింటి కన్నా భయం లేకుండా ఆయనుండడం నిశ్చింత. అన్నీ వండి పెడితే మధ్యాహ్నం కుక్కర్లో అన్నం పడేయడం. ఆయనకి మధ్యాహ్నం కాఫీ కలిపి ఇవ్వాదం పనులన్నీ పనిపిల్లకి నేర్పింది. గత ఏడాది నుంచి యీ రొటీన్ అలవాటయి బండి గాడిలో నడుస్తుంది. "ఏమిటి డల్ గా వున్నావు. అలసిపోయావా" ప్రకాష్ వాడిన జయలక్ష్మీ మొహం చూసి అన్నాడు జయలక్ష్మీ తలూపింది. "ఏమిటో ఇక్కడ తొందరగా అలసిపోతున్నాము. అసలు యింటికోచ్చేసరికి ఓపిక లేనట్లుంటుంది. "బి- కాంప్లెక్స్ వేసుకుంటున్నావా లేదా. కాస్త పాలు, అవీ తాగమంటే వినవు, ఎప్పుడూ హడావిడే నీకు తిండి దగ్గరకు వచ్చేసరికి."
'సావకాశంగా హాయిగా కూర్చుని తినే అదృష్టం కూడానా - ఏదో బతకడానికి తిన్నట్టు మిగడం - వున్న యిరవై నాలుగ్గంటలు కాక యింకో పది గంటలుంటే బాగుండును రోజులో ....' నిర్వేదంగా అంది. అతను కుర్చీ జరిపి లేచాడు. ' పడుకో వెళ్ళి , మళ్ళీ ఐదు గంటలకి లేస్తావు. - ఇంకో గంట పడుకోవచ్చు - కాస్త ఆ పనిపిల్ల చేత యింకాస్త పనులు చేయించుకో. లేదంటే ఇంకో పనిమనిషిని పెట్టుకోరాదూ-
"పెట్టుకో అంటారు. దొరికితే నాకేం సరదానా కష్టపడడానికి. ఎవరినడిగినా ఆరు గంటలకి ఎవరొస్తారు అంటున్నారు. నేవెళ్ళక వస్తే ఏం లాభం - ఇద్దరు ముగ్గురిని చూసాగా. ఎవరన్నా పట్టుమని పదిరోజులు నిలబడి చేశారా? ఈ ఏడాదిలో ఐదుగురు పనివాళ్ళు మారారు. ఏదో అదృష్టం కొద్దీ యీ పిల్లేనా దొరికింది. లేకపోతే నా పని అయ్యేది - అటు ఆఫీసులో పనీ ఎక్కువయింది. ఏమిటో యీ ఉద్యోగాలు ఒక్కోసారి మానేద్దాం అనిపిస్తుంది. ఉద్యోగం చేసి సాదించింది . అనుభవిస్తున్నది ఏముందో ఆలోచిస్తే అర్ధం కావడం లేదు' విసుగ్గా అంటూ లేచి చేయి కడుక్కుంది.
ఇది వాళ్ళిద్దరి మధ్య మొదటిసారి సంభాషణ కాదు. మరీ చెయ్యలేక నీరసం అనిపించినపుడు , శారీరకంగా , మానసికంగా అలసిపోయి ఏదో నిర్వేదం చుట్టుముడుతుంది. యిద్దరి జీతాలు కలిపి ఎనబై వేలు సంపాదిస్తున్నారు. ముప్పై ఐదు లక్షలు పెట్టి బంగ్లా కట్టారు. యింటికి సరిపడా ఫర్నిచర్ కొన్నారు.
ఒక్కరోజు ఆ సోఫాల్లో సావకాశంగా యిద్దరూ డ్రాయింగ్ రూంలో కూర్చున్నారా? యిన్ని వేలు సంపాదిస్తున్నారు. ఒక్కసారైనా ఓ సినిమాకో, షికారుకో, రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలన్న చిన్నకొరిక కూడా తీరలేదు. పిల్లాలతో కలిసి ఆదివారమైనా ఎటైనా వెళ్ళాలని వున్నా ఓపికుండదు. వారానికి సరిపడా కూరలు, సామాన్లు చూసుకోవడం , పిల్లలకి, తనకి తలంట్లు బెడ్ రూం అలమరలు , వంటిల్లు కాస్త సర్దుకోవడం , పిల్లాడు ఏం చదువుతున్నాడో , పిల్లకి ఏం బట్టలు పొట్టి అయ్యాయో, ప్రకాష్ పాత బట్టలు తీసి పడేయడం, వారానికి సరిపడా యిడ్లీ పప్పు రుబ్బడం , పిల్లల కోసం సాయంత్రం ఏస్వీటో చెయ్యడం, యివన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం నిద్ర ముంచుకు వస్తుంది. లేచేసరికి బద్ధకం, పాపతో ఆడుతూ కూర్చుంటుంది ఒక్కరోజేగా దాన్ని ముద్దు చేసేది అనిపిస్తుంది. యిలాగే రోజులు వెళ్ళిపోతున్నాయి.
డబ్బున్నందుకు మంచి మంచి చీరలైనా కొనుక్కోవాలన్న కోరిక లేనంత రొటీన్ అయిపొయింది జీవితం. అసలు అన్ని రకాలు కలుపుకుని సావకాశంగా అన్నం తింటుందా - ఎందుకీ సంపాదన , ఎందుకీ వేల జీతాలు - అమ్మా నాన్నలని చూసి రావ్దానికైనా సెలవు ఓ పట్టాన దొరకదు- వాళ్ళే పాపం అప్పుడప్పుడు వచ్చిపోతారు. బాగా విసుగొచ్చి విసుక్కున్నరోజు "నీకంత యిష్టం లేకపోతే మానేయి ఉద్యోగం నేనేం నిన్ను చెయ్యమని బలవంత పెట్టానా" అంటాడు. ఆ విసుగు తనమీద తిరిగిన రోజు మీ ఆడవాళ్ళు అసలింతింత చదువులు చదవడం దండగ - చదివి ఉద్యోగం చెయ్యకుండా యింట్లో కూర్చోడం క్రిమినల్ . మీ సీటు ఓ మగాడికి యిస్తే నలుగురిని పోషిస్తాడు చెయ్యలేరు. మళ్ళీ పెద్ద కబుర్లు. స్త్రీ సమానత్వాలు చూపాలని ఆరాటం, చదువుకుని మీకో అస్థిత్వం వుండాలని. వుందని చూపాలని తాపత్రయం . మళ్ళీ అంతంత జీతాలు వదులుకోలేరు. మీకేం కావాలో మీకే తెలియదు' అంటూ వెక్కిరిస్తాడు.
నిజమే, నాలుగేళ్ళ డిగ్రీ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండేళ్ళు చేసి యింట్లో కూర్చోడానికా, వేలు ఖర్చు పెట్టి , యింకా లక్షలు ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళి ఏం సాధించినట్లు - అంత చదివి ఉద్యోగం లేకుండా కూర్చోడం అంటే అన్యాయమే మరి. అలా అని సంపాదించుతూ సాధించింది ఏముందో అర్ధం కావడం లేదు. తన జీతం ఎంత చేతికి వస్తుందో పి.ఎఫ్ కట్స్ అని కూడా చూసుకోకుండా ప్లేసిప్ , డబ్బు తీసుకొచ్చి ప్రకాష్ కిచ్చేస్తుంది. అతనే ఖర్చులు, ఇన్ వెస్ట్ మెంట్లు చూసుకుంటాడు. యింటి ఖర్చులకి వేరే యిచ్చింది ఖర్చు చేస్తుంది తాను.
ఇల్లు ఎంతో కళాత్మకంగా దిద్దుకోవాలని మంచి గార్డేనుండాలని గార్డెను లో సాయంత్రం కల్సి కబుర్లు చెపుతూ టీ తాగడం, అవన్నీ సినిమాల్లో చూసి సంతోషించాలే తప్ప నిజ జీవితంలో జరిగేవి కావు అనిపిస్తుంది. అంత సావకాశం ఎక్కడుంది. చచ్చి చెడీ ఇంటి కొచ్చేసరికి తోటకూర కాడలా వాదిపోతుంటే యింక దేనిమీద వుంటుంది . అభిరుచులు ఏం లేవు. అన్నీ పగటికలలే , మిషనుకి తనకి ఏం తేడా లేదు. ఉద్యోగం లేకపోతే హాయిగా ప్రకాష్ యింటి కొచ్చేసరికి ఫ్రెష్ గా తయారై తోటలో ఎదురుచూస్తూ కూర్చుందామన్నా అతడు రాత్రి తొమ్మిది లోపల రాడు. కారులో షికార్లు అవన్నీ ఎప్పటి మాటలో! యిప్పుడు ప్రతివాళ్ళకి డబ్బు సంపాదన యావ ఒక్కటే అభిరుచిగా మిగిలింది.
ఇచ్చిన జీతానికి పన్నెండు గంటలు మనిషిని పిండుకుంటాయి కంపెనీలు, కంపెనీల మధ్య పోటీలు పెరిగి అందుకోవాల్సిన టార్గెట్ అందుకోలేకపోతే , నిర్ణీత కాలంలో అనుకున్న ప్రాజెక్టులు పూర్తి చెయ్యలేకపోతే ఉద్యోగాలుడతాయి. అన్న భయాలతో ఉద్యోగస్తులు - జీవితంలో రక్తి, అనురక్తి దూరం అయ్యాయి. మగ, అడ మధ్య శృంగార భావాలకీ టైమూ కెదు. ఓపికా లేదు - ఏదో ఒకరో ఇద్దరో పిల్లల్ని కని ముప్పై నలభై ఏళ్ళకే జీవితం యాంత్రికంగా సాగించే ధోరణి జనానికి - యీ పరుగులు, సంపాదన యివన్నీ ఎవరి కోసం!
ఆ కన్న ఒకరిద్దరినీ పెద్ద చదువులు చదివించేసి ఎమ్ సెట్లు రాయించేసి ఇంజనీర్లు చేసి అమెరికా తరిమేసి అ తరువాత తీరికగా పిల్లలు దూరం అయ్యారని బాధపడ్తూ, వెళ్ళిన వాళ్ళు రారని, అయినా యీ పాడు దేశంలో పిల్లలకేం భవిష్యత్తుంది అని తమకి తాము సర్ది చెప్పుకుంటూ పురుళ్ళకి పుణ్యాలకి అమెరికా వెళ్ళి వస్తూ వచ్చిందగ్గర నుంచి అక్కడుండలేక తిరుగు ప్రయాణాలు కట్టడం, ఏ రెండేళ్ళకో పిల్లలోస్తే పండుగ చేసుకోడం, పిల్లలు అమెరికాలో ఉన్నారని గర్వపడడం , ముసలివాళ్ళు అవుతున్న కొద్దీ చూసేవాళ్ళు , చేసేవాళ్ళు లేరని బాధపడ్తూ తలకొరివి పెట్టడాని కన్నా టైముకి కొడుకు వస్తాడో రాడోనని బెంగపడ్తూ ఈ కూడబెట్టిన ఆస్తులు అమ్ముకోడానికైనా వాళ్ళకి టైముంటుందో లేదోనని బెంగపడ్తూ, యిదీ జీవితం! యిదీ డబ్బుకి దాసోహం అయి రాత్రింబగళ్ళు భార్యాభర్తలు కష్టపడ్తూ చేస్తున్న నిర్వాకం ....'
నిద్రపట్టే వరకు ఏవో ఆలోచనలు - ఈ చదువులు, ఉద్యోగాలు , అమెరికాలు సుఖాలు ఎలాంటి వంటే పద్మవ్యూహంలోకి జోరపడే వరకు లోపలేలా వుంటుందో చూడాలన్న ఆరాటం, కుతూహలం , ఏదో సాధించాలన్న ఆరాటంతో జొరపడి ఆ తర్వాత బయటకొచ్చే మార్గం తెలీక అలా అలా అక్కడే తిరగడంలా అయిపోతుంది. లోపలికెళ్ళిడం తెల్సు గాని బయటికి రావడం అర్ధం కాని స్థితిలో వున్నారు తామంతా. ఎప్పటికో నిద్రపట్టింది జయలక్ష్మీకి.
*'పత్రిక' ప్రత్యెక సంచిక , అక్టోబరు - 2001
