Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 28

 

అడుగుజాడ గురజాడది


      మహత్తర ఘట్టాలు వస్తాయి కొన్ని మానవజాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో, చిరస్మరణీయంగా లిఖించదగినవి. ప్రతి జాతి సంస్కృతీ స్రవంతిలో దిగ్దిగంతాలకు ప్రకాశమానం చేసిన అత్యంత ప్రతిభాశాలుల అవతరణ అప్పుడప్పుడు జరుగుతూ వుంటుంది. సమకాలీనంగా యశస్సులు పండించుకొనేవారు కొందరు అయితే, తమ ప్రభావాన్ని రానున్న తరాలపై చెరగని ముద్రగా వేసే మహిమాన్వితులు, మహనీయులు మరి కొందరు. వారే యుగపురుషులు. మహాకవి శ్రీ గురజాడ అప్పారావుగారు తెలుగుతల్లి ముద్దుబిడ్డలలో ఒకరుగా, అనంతకాల ప్రవాహంలో జాతి సంస్కృతీ చరిత్రలో ఒక సాహితీ యుగకర్తగా, సంస్కరణాత్మక రచనా చక్రవర్తిగా ఎన్నదగినవారు.
    కవుల హృదయాలు పులకరించేవి ఒకనాడు చందమామను చూచి, కలువ భామనుచూచి. వారి గంటాలలో రసగంగలు వురకలెత్తిపారేవి  ఒకనాడు శృంగారబాల శిగకట్టును చూచి, పెట్టని నగ కట్టును చూచి. ఆ రోజులు పోయాయి. రేయనక, పవలనక రెక్కలు ముక్కలు చేసుకొనే బక్క జీవుల యిక్కట్లను చూచి స్పందిస్తోంది ప్రజా కవుల హృదయం యీనాడు. రక్తాన్ని స్వేదంగా చెమరించే కార్మిక సోదరీసోదరుల కన్నీళ్ళకు కరగి కడలిలా పొంగుతోంది కవుల స్రవంతి ఈనాడు. ఈ ప్రగతిశీల నవ కవిత్వధోరణులకు నాంది పలికిన ఆద్యుడు గురజాడ. అందుకే ఆనాడు శ్రీశ్రీ అందరి మనసులలో వున్న భావాన్ని అందమైన గీతికలా మలచాడు, 'అడుగుజాడ గురజాడది'- అని
    తాతలనాటి సంప్రదాయాలు, తరతరాలుగా బూజుపట్టిన భావాలు కాళ్ళకు బంధాలయినప్పుడు ఏ జాతీ ముందుకు పురోగమించలేదని మనవి చేస్తున్నాను. అర్ధాంగి సమభాగిని అంటూ స్తుతిచేస్తూ ఆదిశక్తి, సృష్టికారిణి అంటూ ప్రస్తుతి చేస్తూ, స్త్రీకి సమాజంలో వున్న స్థాన అత్యున్నతమైనదని, అత్యంత గౌరవప్రదమైనదని స్త్రోతపాఠావల్లిస్తూ మన సమాజం ఆడపడుచులకు ఏం కట్టబెట్టింది? ఏం వొరగ బెట్టింది? తాతలనాడు కన్యాశుల్కం పేరుతో కాసుల మూటల కోసం కక్కుర్తిపడి ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డలను కాటికి కాళ్ళు చాచిన ముదుసలి ఒగ్గులకు కట్టబెట్టుతుంటే కాదన్న మాదన్న కన్పించలేదు ఆనాడు.
    సాంఘిక దురాచారాలను ఎదుర్కొనడానికి సర్వధా సన్నద్ధంగా వున్న మహాకవి గురజాడ కలానికి ఆడపిల్లల దయనీయస్థితి చూచి అంతరంగం ద్రవించింది. ఆయన ఆవేదన 'కన్యాశుల్కం' అన్న కమనీయ నాటకంగా కలకాలం నిలిచిపోయేలా కాగితంపై గూడుకట్టుకొంది. ఆయన కలం నుండి జాలువారిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ కన్నీళ్ళు జాతిలో నిద్రాణంగా వున్న మానవత్వపు విలువలను మేలుకొల్పాయి. ఈ రోజు కావాలి మనకు గురజాడ వంటి కవులు- వరశుల్క దురాచారాన్ని నిర్మూలించడానికి. ఈనాడు కూడా పుత్తడి బొమ్మలైన పూర్ణమ్మలంతా కట్నం యిచ్చుకో లేక, సంతలో పెండ్లి కొడుకులను కొనుక్కోలేక నిరాశానిస్పృహలతో కృంగిపోతున్నారు. ఏదో విధంగా పెళ్ళిచేసినా అత్తమామల ఆశాపాశానికి చిక్కుబడి అలమటిస్తూ, చివరికి నిలువునా దహించబడుతున్నారు. ఏది మానవత్వం? ఎక్కడ చచ్చింది సామాజిక న్యాయం? మనం ఆలోచించుకోవలసివుంది. అట్టి సాంఘిక దురాచారాలను కూకటి వ్రేళ్ళతో పెళ్ళగించి నిర్మూలించడమే మహాకవి గురజాడవంటి సంస్కరణాభిలాషులకు, సాహితీమూర్తులకు మనం అందించగలిగిన నివాళి. ఆ మహాకవి చెప్పినట్లు 'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్' అన్న సూక్తి మనకు నిరంతరం స్ఫూర్తిని అందించాలి.
    
    విజయనగరంలో 1984 మార్చి 24 న మహాకవి గురజాడ అప్పారావు గారి కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా    

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS