ఈ నిధి అన్వేషణకి , ఆ వ్యాధులకి ఏదన్నా సంబంధం ఉందా!
అలా అనుకోగానే అతని వళ్ళు గగుర్పోడించింది.
"తన ప్లాన్స్ అన్నీ నాటో చెప్పాడు సదానంద్! తను మీ మేగజైనుకి వెళుతున్నాననీ, తన అన్వేషణలో సహాయపడితే మంచి సీరియల్ కి తగిన సమాచారం అందిస్తాననీ చెబుతానని కూడా నాతొ చెప్పాడు. సరేనన్నాను" అన్నాడు బ్రహ్మచారి.
అనుమానంగా అన్నాడు అతను.
"మరి ఈ సమాచారం అంతా అందరికీ తెలిసిపోయి బట్టబయలై పొతే మీకు నష్టమేమీ లేదా?"
"నాకేం నష్టం! అందరినీ తెలుసుకోమనండి! తర్వాత ఎవరి ఓపిక వాళ్ళది! కానీ ఫలాని సమాచారం వల్ల జనానికి నష్టం జరుగుతుందని నాకు అనిపిస్తే మాత్రం, అది ఎవరికి చెప్పకుండా రహస్యంగానే ఉంచుతాను."
"మాకు కూడా చెప్పరా?"
"మీకు కూడా చెప్పలేను! కానీ ఎంతవరకూ చెప్పొచ్చో అంత వరకూ తప్పకుండా చెబుతాను. మీకు చెబుతానని సదానంద్ కి మాట ఇచ్చాను కదా. సదానంద్ మీకు ఇచ్చిన మాట తప్పిఉండవచ్చు. కానీ నేను మాట తప్పలేను......తప్పితే...."
"తప్పితే?"
"నా మంత్రాలు పనిచెయ్యవు" అన్నాడు బ్రహ్మచారి.
ఉన్నట్లుండి గాలికి బుడ్డీ దీపం రెపరెపలాడింది. బ్రహ్మచారి నీడ బ్రహ్మరాక్షసుడి నీడలాగా గోడమీద పడింది.
దాన్ని చూసి వశం తప్పుతున్న మనసుని కంట్రోల్ లోకి తెచ్చుకుంటూ అనుకున్నాడు ఉదయార్కర్.
మాట్లాడే మూడ్ లో వున్నాడు బ్రహ్మచారి! ఇదే అవకాశం ఇప్పుడే సాధ్యమైనంత ఎక్కువ సమాచారం సేకరించాలి.
ఆ తర్వాత పరిస్థితి ఎలా వుంటుందో!
నిధులు దొరకడం అంత సులభమా! నిధులు ఎక్కడ వున్నాయో నీకు తెలుసునా?" అన్నాడు జాగ్రత్తగా.
"తెలియకేం! ఒకటా రెండా చాలా వున్నాయి! అయినా శబరీ నాధుడి శాస్త్రం, గుడికట్ల గ్రంధం వున్నాయిగా!" అన్నాడు బ్రహ్మచారి.
"అంటే?"
"దేవాలయాలలో ధనం దాచినప్పుడు దానికి ఎలాంటి సంకేతాలు ఉంచాలో సూచించాడు శబరినాధుడు" అని చెప్పడం మొదలెట్టాడు బ్రహ్మచారి.
"దేవాలయానికి ఉత్తరదిశన ద్వారం వున్నా, కుడికాలు ముందుకు ఉంచిన ఆంజనేయుడు విగ్రహం వున్నా, తొండము కుడిచేతిలో వుంచుకున్న విఘ్నేశ్వరుడు వున్నా అక్కడ ఏదో నిధి నిక్షేపించబడి ఉందనుకోవాలి. అలాగే పడమరకు తిరిగి వున్న పరమేశ్వరాలయం, రెండు స్తనములను తన రెండు చేతులతో పట్టుకున్న స్త్రీ , తంబుర మీటుతున్న శిల్పం, సగము స్త్రీ సగము పురుష రూపముగా వున్న ప్రతిమ, నాలుగు చేతులూ, నాగపోశ్యాలు వున్న ప్రతిమ అంటే పైన మనిషి కింద సర్పం అన్నమాట. రతిక్రీడని సూచించే కొన్ని బూతు శిల్పాలు ఇవన్నీ నిక్షేపించబడిన నిదులకి సంకేతాలు."
అది వింటున్న ఉదయార్కర్ కి తమ కాలంలో రెండు మూడు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయినట్లు అనిపించింది.
చిత్రమయిన అసహజమయిన వాతావరణంలోకి వచ్చిపడ్డాడు తను.
ఇవన్నీ నిజమేనా? నిజం కావడానికి ఆస్కారం వుందా?
ఎప్పుడెప్పుడు బ్రహ్మచారితో బాటు వెళ్ళి అవన్నీ చూసి వీటిలో నిజానిజాలు తెల్చుకుందామా అనిపిస్తోంది అతనికి.
"నాతొ రావచ్చు నువ్వు!" అన్నాడు బ్రహ్మచారి. "నువ్వు ఏమీమీ చూడదలుచుకుంటే అవన్నీ చూపిస్తాను. కానీ వీటన్నిటినీ చూసి నిగ్రహంగా వుండగల గుండెధైర్యం వుందా నీకు"
"ఉంది" అన్నాడు అతను మెల్లిగా.
"అయితే ఇక్కడికి దగ్గరలోనే రేణుకాబిలం వుంది. అది చూడు. ఆ తర్వాత మిగతావి."
"ఎప్పుడు వెళదాం?"
"ఇప్పుడే?"
"ఇప్పుడా! ఇంత చీకటిలోనా?" అన్నాడు ఉదయార్కర్ ఆశ్చర్యంగా.
పెద్దగా నవ్వాడు బ్రహ్మచారి.
"చీకటికి భయపడేవాడివి ఇంక నువ్వేం చెయ్యగలవు?"
"భయం కాదు. వెళ్ళగలమా అని అనుమానం?"
నవ్వి "నీకు అవసరమనుకుంటే నీ దగ్గర టార్చ్ ఉందిగా!" అని లోపలికి వెళ్ళి నాలుగు పళ్ళు తెచ్చాడు బ్రహ్మచారి. "ఇవి తిని ఒక గంట విశ్రాంతి తీసుకో. సరిగ్గా అర్ధరాత్రి అయేసరికి లేపుతాను. రేణుకా బిలం ఇక్కడికి దగ్గరే! కారెంపూడి మండలం! ఒకప్పుడు దాన్ని హేమగిరి అనేవాళ్ళు. అక్కడి కొండల్లో బంగారం కరిగించేవాళ్ళు ఆ కొలుములు ఇప్పటికీ కనబడతాయి. మన వేమారెడ్డి, అనవేమారెడ్డి పాలించిన ప్రాంతం అది......."
చిత్రమైన మాటలు!
ఇక్కడే .......దగ్గరే.........కారెంపూడి .........మన వేమారెడ్డి......మొన్నటి వాడే........
చరిత్రలో గబగబ వెనక్కి నడిచిపోతున్నట్లు అనుభూతి. కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఉదయార్కర్ కి.
