కాని ఆ క్షణంలో విశ్రాంతిని ఆశించని అడమనసులో మెదిలే ఆలోచనా తరంగాలను పట్టి యివ్వగల యంత్రాలు లేవు. అటువంటి సాధనాన్ని ఏనాటి కయినా మగవాడు సృష్టించగలిగితే సృష్టి అధిక భాగం అతనికి అర్ధమయిపోతుంది.
"ఆ సంగతులన్నీ అలా వుంచండి. మీరంటే నాకు భయం లేదు. ఎన్ని సంవత్సరాలయినా మీతో ప్రయాణం కొనసాగించటానికి మీ మంచితనం మీది నమ్మకంతో ఆనాడు సంసిద్దురాలను అయినాను. ఒకవేళ నే నాశించిన మంచితనం మీలో లేకపోయినా మీతో కలిసి వుండాలనే కోరుతున్నాను ఈనాడు" అంటూ కిలకిలా నవ్వటం సాగించింది జ్యోతి.
జయకృష్ణ విద్యుద్ఘాతం తిన్నవానివలెని నిశ్చేష్టుడు అయినాడు. అతని మనోపటలం మీద వింత వింత లోకాలు వాకిళ్ళు తెరచుకుని దర్శనమివ్వసాగినాయి.
జ్యోతి బౌతికరూపం కూడా అతనికి ఒక నీడలా కన్పించసాగింది.
"ఓ స్త్రీ నీవు మహిమాన్వితురాలవే కాదు. ఒక మాయావు. కన్పించే రూపం వెనుక కనుపించని గాధలెన్నో ; వ్యధలెన్నో, వేడుక లెన్నో, నిన్ను అన్వేషించటమే మగవాడి పని. అర్ధం చేసుకోవటం ఒక జీవితకాలంలో అసాధ్యం" అని స్మరించాడు.
పైకి మాత్రం చిరునవ్వు నవ్వి . "తీగ కదిపితే డొంక అంతా కదిపినట్లు అయింది. ఇంత చిన్న ప్రశ్న అడిగితే అంత పెద్ద సమాధానం చెప్పావు. నేను నీ గురించి ఒక అభిప్రాయానికి రావటానికి ఈ కొద్ది పరిచయం చాలదనుకుంటాను" అన్నాడు. ఆ మాటలకు జ్యోతి కూడా నవ్వింది.
క్రమంగా ప్రొద్దు దిగిపోతోంది. వెలుగురేకలు మటుమాయం అవుతున్నాయి. జయకృష్ణ చుట్టూ పక్కల వెదికి చితుకులు తెచ్చాడు. వాటిని రగిలించి తనే టీ పెట్టి యిచ్చింది జ్యోతి.
"ఇటువంటి అడవి ప్రాంతాలలో క్రింద పడుకోవటం ప్రమాదకరం. చెట్టుకొమ్మల్ని ఆశ్రయించాలి. కాని మీరు చెట్టుకొమ్మని ఆశ్రయించటం మరింత ప్రమాదం. ఎందుకంటె ఆదమరచి నిద్రిస్తే క్రింద పడిపోతారు." అన్నాడు జయకృష్ణ.
ముందు తనే చెట్టు కొమ్మ మీద ఎక్కి కూర్చున్నాడు . అంత ఎత్తు బూరుగు చెట్టునీ అతడు అవలీలగా ఎక్కేయటం చూచి నియండర్ తల్, క్రోమాన్యాన్ గుహంతరవాసుల్ని జ్ఞాపకం చేసుకుంది జ్యోతి.
"ముందుగా నీవు ఎక్కేయటం స్వార్ధం" అంది అసూయగా.
"పైకి వచ్చేటప్పుడు మీకు చేయి ఆసరా యివ్వాలంటే నేనేకదా ముందు చెట్టు పైకి ఎక్కేయాలి" అంటూ త్రిప్పికొట్టాడు జయకృష్ణ. జ్యోతి కొంతమేర శ్రమతో ఎక్కి అతని ఆసరా కోసం చేయి జాపింది. అతడు చేయి ని అందుకున్నాడు.
జ్యోతి పైకి చేరిపోయింది.
"ఆడవాళ్ళ చేతులు మెత్తగా వుంటాయంటారు. కానీ నీ చేతులు చాల మొరటుగా వున్నాయి. "అన్నాడు జయకృష్ణ. అతని ప్రక్కనే అనుకుని కూర్చుంది జ్యోతి. మెత్తగా మధురంగా నవ్వింది.
"సుకుమారం సోమరితనం నించి వస్తుంది. ఈ మొరటుతనాన్ని నా శ్రమ ఫలితంగా సాధించుకున్నాను." అంది గర్వంగా.
ఆమె చాలా అరుదయిన యువతి అని భావించాడు జయకృష్ణ.
"మనలో ఒకరు మరొక కొమ్మ మీదికి పోవాలి కదా, మీరు వెళ్ళగలరా, నేను పోనా?" అని ప్రశ్నించాడు.
"నేను వెళ్ళను" అన్నది జ్యోతి.
"సరే నేను పోతాను" అన్నాడు జయకృష్ణ.
'అక్కర్లేదు" అన్నదామె మరింత దగ్గరగా జరుగుతూ.
"అయితే ఈ రాత్రికి నిద్రకు నీళ్ళు వొదులుకున్నట్లే! గోవిందా!" అంటూ రెండు చేతులూ పైకి ఎత్తేశాడు జయకృష్ణ.
"బ్రహ్మచారి భయపడకు. ఆంజనేయ దండకం చదువుకో" అంటూ గాలి చొరకుండా అతన్ని అంటుకుపోయింది జ్యోతి.
"నాకీ అగ్నిపరీక్ష ఏమిటి?" అన్నాడతను రవంత గాలి చొరనిచ్చి.
"అగ్నిపరీక్ష కాదు. మిమ్మల్ని చూచి నేను భయపడుతున్నానని అన్నందుకిది శిక్ష" అంటూ లేచి వెళ్ళి మరొక కొమ్మ మీద నడుం వాల్చింది జ్యోతి. ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూ మౌనంగా వుండిపోయినారు రవంత సేపు. రెప్పలు బరువుగా వ్రాలినాయి.
జ్యోతి నిద్రలోకి జారుకుంది.
వృశ్చికరాశి వియత్తలాన కేంద్రబిందువుకి చేరింది. గురకొయ్యలు పశ్చిమానికి చేరిపొయినాయి.
ఎవరో తట్టినట్లు అయి ఉలికిపడి లేచింది జ్యోతి. నాలుక పిడచకట్టుకుపోయింది. మంచినీరు కావాలనిపించింది.
కిట్ చెట్టు తొర్రలో వుంది. అది తీయాలంటే క్రిందికి దిగాలి. మళ్ళీ అలికిడి అయినట్టు అనిపించి క్రిందికి చూచిందామే. మరుక్షణం అలాగే రాటలా బిగుసుకుపోయింది.
చెట్టు క్రింద ఏదో నీడ కదలాడినట్లు అయింది. అది నీడ కాదు నిజం!!
9
బూరుగు చెట్టు క్రీనీడలో నీడ లాంటి కొమ్మల క్రింద తిరుగుగాడుతున్న అ రూపాన్ని తదేక దృష్టితో పరిశీలించింది జ్యోతి.
జయకృష్ణ గాడతరమయిన నిద్రాముద్రలో మునిగివున్నాడు. ఆ నీడ చెట్టు కాండానికి తొలుచుకుపోయిన తోర్రలలో దేనికోసమో వెదుకుతోంది.
రవంత సేపు అయాక ఆమెకు కావలసినదేదో కన్పించినట్లు ఆగిపోయింది. బూరుగు కాండానికి అయిన గూడు లోకి చేయి పోనిచ్చింది.
కిట్టును బయటకు లాగి వస్తువులన్నింటినీ చిందర వందరగా నేల మీద విరజిమ్మిందామె.
జ్యోతి ఆశ్చర్య విప్పారితమయిన నేత్రాలతో చూడసాగింది. తాము ఇక్కడ వున్నట్లు ఎవరికి ఎలా తెలిసింది? జనసంచారం అధికంగా వుండే చోటు కాదు ఇది. ఈమె ఎవరు? ఎలా వొచ్చింది? అని ఆలోచించసాగింది.
ఆమె కిట్టు అంతా గాలించి తనకు కావలసిన వస్తువేదో తీసుకుంది. పైట కొంగున దాన్ని దాచుకుని అక్కడ నించి పరుగు తీయసాగింది. ఆమె అలా పరుగెత్తి పోతుందని తెలియని జ్యోతి నిర్విన్నురాలయి పోయింది. ఇలా ఊహించని స్థితిలో ఆమె వెళ్ళిపోతే తమ దగ్గర వుండి తీరవలసిన వస్తువేదో లేకుండా పోతోందని అనిపించింది జ్యోతికి.
వెంటనే ఆమె వెనక ముందులు చూడకుండా చెట్టు కొమ్మ మీది నుంచి క్రిందికి ఉరికింది మెరుపులా! ఆ నీడ లాంటి అమ్మాయి వెనుక ఏదో చప్పుడు అయి తనను మరో మనిషి వెన్నాడి రావటం గమనించి తెగించి పరుగెత్తసాగింది.
వెన్నంటి పోతోంది జ్యోతి. ఆమె ఎవరో, అలా వెన్నంటి పోతోంది ఎక్కడికో, ఆమెను వెన్నాడిపోతోంటే ఏమవుతుందో ఊహించలేదు జ్యోతి. దుస్సాహసంతో అడవి దారుల వెంట పరుగుతీసున్న ఆ అమ్మాయిని వెంబడించసాగింది.
పోను పోను అడవి దారులు చిక్కు అయినాయి. పరుగెత్తే అవకాశం లేకుండా పొదలు అడ్డు నిలుస్తున్నాయి. ఒంకీల్లా తిరిగి వున్న పీచంగి ముళ్ళు రాచుకుపోతున్నాయి. రక్తం చేమ్మలా అవుతోంది. ముందు పరుగెత్తే యువతి నల్లని రూపుతో మొరటుగా అడవి జీవితానికి అలవాటు పడిన దానిలా అన్పించింది. దారి వెతుక్కోవలసిన అవుసరం లేకుండా పరుగులు తీస్తోంది. జుట్టు విరియబోసు కుండటం నించి అనాచ్చాదితమయినా వీపు కన్పించటం లేదు.
