అంటే అక్కడికి నువ్వు సూర్యుడి వైనట్టు! అవునా" మాధవి పెదవులపై దరహాసం మెరిసింది. అలా నిలబడ్డ మాధవిని చూస్తూ సాగర్ బయటి ప్రపంచాన్నే మరచిపోయాడు. గ్రహణం విడిచిన పూర్ణ చంద్ర బింబంలా ఉన్న మాధవి వదనాన్ని జీవితాంతం అలాగే చూడగలిగే అదృష్టం మళ్ళీ తనకు కలిగింది. మాధవి ఇంత త్వరలో మాములు మనిషి అవుతుందని తను ఊహించ లేదు. చెదరి పోయిన ఆమె మనస్సు కుదుట పడింది. మానసిక సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడింది. ఈనాటి ఆమె ప్రవర్తన తనకు పూర్తీ నమ్మకాన్ని కలిగించింది. ఆమె అంతరంతరాల్లోని అస్తవ్యస్థ పరిస్థితి పూర్తిగా తొలగిపోయింది.
"సాగర్! ఏమిటలా పిచ్చివాడిలా చూస్తున్నావ్?" మాధవి సాగర్ భుజాలు పట్టుకొని కుదిపింది.
సాగర్ ఉలిక్కిపడ్డాడు.
"పిచ్చివాడికి, మంచివాడికి నిజంగా పెద్ద తేడా లేదు."
'అయితే నీకు నిజంగా మతి పోయిందనే చెప్పాలి!' మాధవి గలగలా నవ్వింది. ఆమె నవ్వులో సెలయేటి పరుగులు, కోయిల పిలుపులు స్పురించాయి. సాగర్ మనసు నిండా వెన్నెల నిండుకొన్నది.
"మాధవీ! నాన్నగారికి చెప్పు రేపు సాయంకాలం ఆరు గంటలకు వస్తానని"
"ఏం? ఆరు గంటలకు గాని ముహూర్తం కుదరదా? నీకు జాతకాల మీకా ముహూర్తాల మీద నమ్మకం లేధంటావుగా?"
"ముహూర్తాల మీద నమ్మకం ఉండి కాదు. మీ నాన్నగారు ఉదయం పూట కోర్టుకెళ్ళే హడావుడిలో ఉంటారు కదా అని!"
"రేపు ఆదివారం! నువ్వేప్పుడోచ్చినా నాన్నగారు ఇంటి దగ్గరే వుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్టుకు వచ్చేయ్!"
"ఏం రాత్రికి డిన్నర్ లేదంటావా?"
"బ్రేక్ ఫాస్టు, లంచ్, డిన్నర్ అన్ని ఆరగించి మరీ వెళు దువు గాని వచ్చేయ్!"
"ఓ.కే. మిస్. యువర్ అనర్!"
"రేపు జడ్జి గారి ముందు ఎలా మాట్లాడాలో ఇప్పటి నుంచే రిహార్సల్స్ చేస్తున్నావా?"
"యస్ యువరానర్! ,మై హార్ట్ బ్లీడ్స్ ఫర్ డాటర్ . మే ఐ హావ్ ది హాండ్--"
"ఏయ్! ఏమిటిది? సరిగ్గా తెలుగులో చెప్పు, కోర్టుదిక్కార నేరం క్రింద శిక్ష పడుతుంది. మా నాన్నగారి దగ్గర ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవంటే తెలుసా?"
సాగర్ కారు స్టార్టు చేశాడు. సాగిపోతున్న కారు కేసి కొద్ది క్షణాలు అలాగే చూస్తూ పోర్టికోలో నిలబడింది మాధవి.
13
"నా నిర్ణయం చెప్పాను . తర్వాత మీ ఇష్టం" సాగర్ తలవంచుకొని కాఫీ తాగుతూ తండ్రితో అన్నాడు.
నోటిదాకా వచ్చిన కప్పు టేబుల్ మీద పెట్టి సాంబశివరావు కొడుకు వైపు చూసాడు.
"నీ ఇష్టం, నా యిష్టమేనా? జడ్జిగారితో మాట్లాడాల్సిన పని లేదా?" తండ్రి కంఠం తీవ్రంగా ఉన్నది.
"మాట్లాడాను, ఆయనగారు తన అంగీకారాన్ని తెలియజేశారు!"
"ఓహో! చాలా వరకు వెళ్ళిందన్న మాట వ్యవహారం! అయితే ఇంకా నా కెందుకు చెప్పడం?" తండ్రి కటువుగా అన్నాడు.
"మీరు ఫార్మల్ గా వెళ్లి రామనధంగారితో మాట్లాడటం బాగుంటుంది."
"అని అయన గారు కోరేరా?"
"అవును, అది సంప్రదాయం కూడాను."
"సంప్రదాయం! ఇదెక్కడి సాంప్రదాయం? కొడుకు వెళ్ళి మాట్లాడి వచ్చాక తండ్రి వెళ్తాడా? కాబోయే మామగారితో సంప్రదింపు చేసి సంబంధం నిర్ణయించుకు వచ్చావు. మధ్యలో ఇంకా నేనెందుకు, " సాంబశివరావు టేబుల్ మీద కప్పు విసురుగా పెట్టి లేచి నిలబడ్డాడు.
"ముహుర్తమన్నా పెట్టిస్తారని!" సాగర్ కంఠంలో వ్యంగ్యం పసికట్టాడు తండ్రి.
"నేను ముహూర్తం పెట్టించకపోతే నీ పెళ్ళి ఆగిపోతుందా ఏం?' నెత్తిన హ్యాట్ సర్దుకుంటూ అన్నాడు సాంబశివరావు.
సాగర్ చివాలున తలెత్తి తండ్రిని చూశాడు. నిండు యూనిఫారం లో గంభీరంగా నిలబడి వున్నాడు తండ్రి.
"ఆగదు ఆపించడం ఎవరివల్లా కాదు ఆసంగతి నాకూ తెలుసు!"
"ఇంత చదువుకున్నావ్? నీకు ఆ మాత్రం తెలియదను కోడానికి నేనేం పూల్ ను కాదు."
"పైగా జిల్లా పోలీసు అధికారిని" మీరు ఫూల్ అని నేనలా అనుకుంటాను!"
"సాగర్" సాంబశివరావు కుడిచేతిలో వున్న స్టిక్ తో ఎడమ అరచేతిలో కొట్టుకున్నాడు. కసిగా కర్ర చుట్టూ వెళ్ళు తిరుగుతున్నాయి.
"విక్టర్!' గట్టిగా పిలిచాడు సాంబశివరావు.
"యస్! సర్!" టక్ మని బూటు శబ్దంతో పాటు ఎలక్షన్ లో నిలబడి శాల్యుట్ చేశాడు అర్దర్లీ.
"సార్- జీప్ రడీ" అన్నాడు విక్టర్.
సాంబశివరావు పెద్ద పెద్ద అంగలు వేస్తూ డైనింగ్ హల్లో నుంచి బయటకు నడవసాగాడు. సాగర్ చివాలున లేచి తండ్రి వెనకే గబగబా నడిచాడు.
"ఒక్క నిమిషం ఆగండి!"
సాంబశివరావు వేస్తున్న అడుగు అలాగే ఉండిపోయింది. గిర్రున కొడుకు వైపు తిరిగాడు. అతడి కళ్ళు చింత నిప్పుల్లా మండి పోతున్నాయి.
'అమ్మను వేరే డాక్టర్ కు చూపించాలని అనుకుంటున్నాను!' సాగర్ కంఠం గద్గద మయింది. ఆ మాట వింటూనే సాంబశివరావు నీరుకారిపోయాడు. మౌనంగా కొడుకు కేసి చూశాడు.
"డాక్టర్ మూర్తి మీదనమ్మకం లేదు నాకు! అమ్మ ఆరోగ్యం క్షీణించడానికి కూడా ఆయనే కారణం!"
"జిల్లా మెడికల్ ఆఫీసర్ అంటే గొడ్ల డాక్టర్ అనుకొన్నావా? అయన మన ఫామిలీ డాక్టరే కాదు , నా ఫ్రెండ్ కూడాను. ఎంతో శ్రద్ధతో ట్రీట్ మెంట్ ఇస్తున్నాడు. ఆయనను మనమెంతో రుణపడి వున్నాము"
'అందుకే అమ్మకు రానురాను ఎక్కువయి పోతున్నది!"
"అంటే నీ ఉద్దేశ్యమేమిటి? అయన డయాగ్నటిక్ రాంగ్ అంటావా?"
"అయన డయాగ్నసిస్ నే కాదు. ఆ డాక్టరే ఓ పెద్ద ఫ్రాడ్!' ఆ మాటన్నాక తండ్రి ముఖం చూడలేక ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు సాగర్. సాంబశివరావు కలవరపడ్డాడు. వీడు మాట్లాడేదేమిటి? వీడికేమయింది? ఆ పిచ్చిదాని పిచ్చి వదిలించబోయి వీడు పిచ్చివాడై పోయాడా? డాక్టర్ మూర్తినే ఫ్రాడ్ అంటున్నాడు! వీడేమయిపోతాడు! పైగా ఆ పిచ్చిదానితో వీడికి పెళ్ళయితే ఇంకేమన్నా వున్నదా? వీడు తనకు దక్కడు ఒక్కగాను ఒక్కడు . తన సర్వస్వమూ వీడే. అటు చూస్తే సుభద్ర రోజులా నెలలా అన్నట్టున్నది. అటు భార్యకు కాన్సర్, ఇటు కొడుక్కు ఉన్మాదం - సాంబశివరావుకు తలలో నుంచి చెమట కారి కలర్ తడిచిపోతుంది. టోపీ తీసి చేత్తో పట్టుకొన్నాడు. చేతికర్ర పట్టు తప్పి గచ్చుమీద పడింది.
