Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 28

 

    కాఫీ సిప్ చేస్తూ కళ్ళని విప్పి సాగర్ ను చూసింది మాధవి. మనసిచ్చి మనసు అందుకొన్న మన్మధుడిలా వున్నాడు! ఆడదానికి జన్మలో అంతకన్నా కోరదగినదేముంది? ఆజానుభాహుడు, ప్రసన్నవదనుడు , విద్యావంతుడు, అన్నిటికి మించిన అత్మబల సంపన్నుడూ అయిన అతడు తనవాడు. భయంకరమైన కత్తుల బావిలో నుంచి తనను రక్షించాడు. సంఘర్షణలతో సతమతమైపోతున్న తనను ఆదుకొన్నాడు. తనకు పునర్జన్మ ప్రసాదించిన ధీశాలి. దయార్ద్రహృదయుడు. ఏడేడు జన్మలకు అతడే తన ప్రియుడు , భర్త.....
    "హల్లో మాధవీ!" ఆమె వీపు మీద చెయ్యి పడింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. చేతిలో వున్న కప్పు తొణికింది. కాఫీ చింది టేబుల్ క్లాత్ మీద పడింది. కాఫీ మరక కేసి బేరర్ చూశాడు.
    "బేరర్, దీన్ని తీసేసి మరో క్లాత్ వెయ్యి.' సాగర్ అన్నాడు.
    "కాఫీ మరకయితే కడిగేయచ్చు! లేకపోతే మరో టేబుల్ క్లాత్ వేసుకోవచ్చు, కాని...."
    "అగావేం ? కాని!" సాగర్ కంఠం తీవ్రంగా ఉన్నది.
    "మెదడుకు పట్టిన బూజు , మనసుకు అంటిన మరకలు ఎలా తొలగిస్తావ్ సాగర్?"
    "సుజాతా!: తీవ్రంగా చూశాడు సాగర్. మాధవి వెనుక నుంచి సుజాత గిర్రున తిరిగి వచ్చి పక్కన కూర్చున్నది.
    "మాట్లాడవేం సాగర్?' రెట్టించి అన్నది సుజాత.
    "అదేమో గాని ఒంటికి పట్టిన కొవ్వును నోటికి పట్టిన తీటను వదిలించవచ్చు అనుకొంటాను అవునా సాగర్?" మాధవి సుజాత వైపు సూటిగా చూసి గంభీరంగా కూర్చున్నది.
    సుజాతకు మళ్ళీ నోటమాట రాలేదు. సాగర్ మాధవిని చూసి గర్వపడ్డాడు. సుజాత కొట్టిన దెబ్బకు మాధవి మానసికంగా కృంగి పోవాల్సింది. అలా జరగలేదు. పైగా ఎదురు దెబ్బ తీసింది. మానసిక స్థయిర్యం ఆమెలో పెరిగింది. ఆత్మ విశ్వాసం పెరిగింది. మళ్ళీ వెనకటి స్థితికి   వెళ్ళే ప్రమాదం తగ్గిపోయింది. అనుకోకుండానే సుజాత మాధవికి పరీక్ష పెట్టింది. అందులో నెగ్గింది! ఇహ ఆమెకు తిరుగులేదు.
    "సారీ మాధవీ! ఐ డోంట్ మీనిట్. నన్ను అపార్ధం చేసుకోకు." సుజాత తేరుకుని ప్రాధేయపూర్వకంగా అన్నది.
    "దట్సాల్ రైట్! సుజాతా! నీ బాయ్ ఫ్రెండ్ ఏడీ?" మాధవి తమాషాగా అన్నది.
    "బాయ్ ఫ్రెండా? నాకెవరూ లేదు? సుజాత అన్నది.
    "వాటే పిటీ? ఒంటరిగా వచ్చావా?"
    "లేదు! రాణి, రుక్మిణి కలిసి వచ్చాం. అదుగో వాళ్ళు ఆ టేబుల్ దగ్గర కూర్చున్నారు. నిన్ను చూసి ఇలా వచ్చాను!"
    'అలాగా!"
    "వాళ్ళు చూస్తున్నారు నాకోసం, వెళ్తాను బై! బై! అంటూ సాగర్ కేసి చుర చుర చూస్తూ సుజాట్ లేచి తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళిపోయింది.
    ఆడలేక మద్దెల వోడన్నట్టు సుజాత తన మీద చూపిస్తుందే? మాటకు మాట విసురుతూ అందరినీ ఉడికించి వేధించే సుజాత పిల్లిలా జారుకున్నది. తను చేసిన పోరపాటేమిటో గ్రహించేటట్టు చేసింది మాధవి. సాగర్ కాఫీ సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. సుజాత లేచి వెళ్ళగానే మాధవి కేసి చూశాడు. ఆమె ముఖం ప్రశాంతంగా ఉన్నది. ఏ రకమైన ఉద్రేకమూ లేదు. వండర్ పుల్! ఆమె బయటపడింది. సాగర్ హృదయం ఆనందంతో పొంగిపోయింది.
    "పూర్ క్రీచర్! ఐ పిటీ హర్!" మాధవి పెదవి విరిచింది.
    సాగర్ నవ్వాడు. ఆమె నవ్వింది. సాగర్ నవ్వుతో మాధవి శృతి కలపగా సుజాత బార్ లో నుంచి దెబ్బతిన్న చిరుత పులిలా బయటికి నడిచింది.
    సాగర్ మాధవీ కాఫీ బార్ లో నుంచి బయటికి వచ్చేసరికి వర్షం తగ్గిపోయింది.
    "మాధవీ! ఎక్కడికి వెళ్దాం' స్టీరింగ్ ముందు కూర్చున్న సాగర్ అడిగాడు.
    "ఇంకెక్కడికీ వద్దు మా యింటి దగ్గర దించు!" సాగర్ ను ఓరగా చూసి అన్నది మాధవి. సాగర్ కారు స్టార్టు చేశాడు.
    "మాధవీ!"
    "ఊ!"
    "నువ్వింత పని చేస్తావను కోలేదు?"
    "ఏం చేశాను?"
    "సుజాతను పెద్ద దెబ్బ తీశావు. దిమ్మెర పోయిందనుకో!"
    "ఏం? నీకేమయినా బాధ కలిగిందా?"
    సాగర్ చివాలున పక్కకు తిరిగి మాధవిని చూశాడు. "నాకెందుకు బాధ మధ్యలో!" అన్నాడు.
    మాధవి తనలో తనే నవ్వుకుంది.
    కారు జడ్జి రామనాధం గారింటి ముందు ఆగింది. మాధవి కారు దిగి సాగర్ కేసి చూసింది.
    "దిగవా?"
    "లేదు!"
    "మళ్ళి ఎప్పుడోస్తావ్?"
    "వీలైనప్పుడు."
    "బడాయి మాటలు చెప్పకు! ఎప్పుడు వస్తావో ఖచ్చితంగా చెప్పు. నాన్నగారికి నువ్వోస్తావని చెప్తాను."
    "ఎందుకు వస్తావని చెప్తావూ?"
    "వచ్చాక నువ్వే చెప్పు! నాకేం పని! మాట్లాడతానని అన్నావుగా? నువ్వేమీ మాట్లాడుతావో నాకేం తెలుసు."
    "మీ నాన్నగారు నీ అభిప్రాయం తెలుసుకోవాలని అంటే?"
    "తెలుసుకోన్నానని చెప్పు!"
    "ఏమని!"
    "మాధవికి నన్ను చేసుకోవడం ఇష్టం లేదని చెప్పు!"
    "ఆ మాటయితే ఇప్పుడే చెప్తాను! మళ్ళీ ఎప్పుడో ఎందుకూ?" అంటూ సాగర్ కారు డోర్ తెరచి దిగడానికి ప్రయత్నించాడు.
    'అలాగా! అయితే రా!' అంటూ మాధవి సాగర్ చెయ్యి పట్టుకొని గుంజింది. సాగర్ చెయ్యి వెనక్కు లాక్కొని మళ్ళీ కారులో కూర్చున్నాడు.
    "దిగావేమోయ్! పెద్ద . ఏదో చెప్తానన్నావుగా?"
    "మాధవీ!"
    "ఏమిటలా చూస్తున్నావ్?"
    "ఇప్పుడు నువ్వెంత ఆనందంగా ఉన్నావో తెలుసా?"
    "చూసే వాడికి నీకే తెలియాలి. అంతా గాస్!"
    "నిజంగా మాధవీ చిరుకోపంలో ఉన్న నీ ముఖం సూర్యుడి మీద అలిగిన పద్మం లా ఉన్నది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS