Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 28

    "ఆయన నిక్షేపంగా ఉన్నారు అమ్మవారి సన్నిధిలో. అయినా నా భర్త శ్రీనివాసుడు చిదానందస్వరూపుడై ఉండగా నేను విధవరాలినెలా అవుతాను? నేను ఎప్పుడూ ముత్తైదువనే."
    "అదేంమాట? నీకు పెళ్ళి అయింది వేంకటాచలపతితో"
    "అది మీరు వేడుకకి చేసిన బొమ్మలపెళ్ళి. నా అసలు పెళ్ళి ఆ వేంకటపతితోనే
    "అట్లా మాట్లాడితే పిచ్చి అంటారు"
    "ఎవరేమనుకున్నా ఫరవాలేదు"
    "వాదనలెందుకు? నువ్వు బాగా చదువుకున్నదానివి. అన్నీ తెలిసినదానివి. సంప్రదాయాన్ని పాటించాలి"
    "అట్లా చేస్తే దేవుడిని చంపినట్లు అవుతుంది. శ్రీనివాసుడుండగా నేను భర్తలేనిదానిని అవను కదా!"
    అసలేం జరుగుతోందో చూద్దామని నీలాటిరేవుకెడుతున్నవంకన ఆడవాళ్ళంతా వచ్చారు. ఇంట్లో మగవాళ్లుకూడా వెళ్ళమని ప్రోత్సహించారు
    "పెద్దావిడ చెపుతోంది, వినచ్చుకదా వెంకమ్మా! ఆడవాళ్ళు సంప్రదాయాలు పాటించకపోతే ఎట్లా?" పారిజాత అందుకుంది.
    "సంప్రదాయం అంటే ఏమిటి? అది మనుషులకి మేలు చేసిదిగా ఉండాలికాని కష్టం కలిగించకూడదు."
    "ఇందులో కష్టం ఏం ఉంది?"
    "ఆడపిల్లలు పుట్టినప్పటినుంచి పెట్టుకునే బొట్టు, కాటుక, పూలూ, అలంకారాలు భర్తపోగానే ఎందుకు వదిలెయ్యాలి?"
    "భర్తపోయినట్టు తెలియటానికి" పారిజాత అంది.
    "భార్యపోయిన భర్తని గుర్తుపట్టటానికి ఏమున్నాయి?"
    "జంధ్యంలో..."
    "అది పెళ్ళిలో వేసింది కనక తీసేస్తారు. అట్లాగే భర్తపోతే భర్తకట్టిన తాళిని తీసెయ్యవచ్చు. బొట్టూగాజులూ పెళ్ళితో రాలేదుకదా! వాటినెందుకు తియ్యాలి?"
    "మేము నీ అంత చదువుకోలేదు తిరిగి చెప్పటానికి. కాని పెద్దలమాట వినాలి"
    "అందుకే అందరూ చదువుకోవాలి. మీరంతా కూడా చదువుకుంటే ఎంతో బాగుండేది. సరిగ్గా ఆలోచించ గలిగేవారు. ఆడవాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతోందో తెలుసుకో గలిగేవాళ్ళు."
    ఆలోచించగలిగినవాళ్ళకి మనస్సులో వెంకమాంబ చెప్పిన మాటలు నిజమే అనిపించాయి. కాని పైకి చెప్పగల ధైర్యం, సమర్థించగల చదువు, తెలివి లేవు. అందుకే మాట్లాడలేదు.
    "పెద్దవాళ్ళమాట ఎదిరిస్తున్నావు. మంచిదికాదు" భ్రమరాంబ హెచ్చరికగా అంది.
    "నేను చెప్పేది మీరుకూడ ఒక్కసారి ఆలోచించండి. భర్త కట్టిన తాళి, కాలిమెట్టెలు తియ్యటానికి అంత భయంకరమైన తంతు అవసరమా? చాలామంది భర్తపోయినందుకన్న, ఆ తంతు తలుచుకుని ఏడుస్తారుట తెలుసా!"
    "చెప్పొచ్చింది ఆరిందా గోవిందమ్మ" అంటూ సోమిదమ్మ ఈసడించినా చాలామంది ఆ మాటలు మనసులోనే ఒప్పుకున్నారు.
    "జంధ్యంలో కొన్ని పోగులు మగవాళ్ళకి తీసేసినట్టే, తాళి, మెట్టెలు, నల్లపూసలు, గుట్టుచప్పుడు కాకుండా తీసేయొచ్చుగా. లేకపోతే భర్త శవంతోపాటు కట్టెలమీద పడేస్తేసరి."
    "అయ్యో! బంగారం పడేస్తే పోదూ!"
    "మీ అందరి బాధా అదీ! బంగారం మీద మోజు"
    "నీకూ ఉందిగా?"
    "నాకెప్పుడూ లేదు. మీలాంటి వారి పోరు పడలేక ఈ నగలు పెట్టుకున్నా. వీటినిప్పుడే తీసేస్తాను" గబగబా మెడలో బంగారు గొలుసులన్నీ తీసేసింది.
    "అవిసరే! గాజులు, జుట్టు ..."
    వెంకమాంబ ముఖంలో ఎప్పుడు లేని కోపం.
    "మళ్ళీ చెపుతున్నాను. పునిస్త్రీ అవి తియ్యకూడదు. సకలలోకైకపతికి ఆగ్రహం వస్తుంది."
    "దీనిపని ఇట్లాకాదు. ఇప్పుడు నడవండి" అని బయటికి నడిచింది సోమిదమ్మ. మిగిలినవారు అనుసరించారు లోపల సంతోషపడుతూ కొంతమంది, లోపలా బయటా కోపపడుతూ కొంతమంది.
    "ఏమిటమ్మా ఈ అల్లరంతా!" అని అడిగింది మంగమాంబ కన్నీరు కారుస్తూ. పూజగదిలో ఉండి ఈ సంభాషణ అంతా విన్న కృష్ణయార్యుడు ఆడవాళ్ళంతా వెళ్ళారని నిశ్చయించుకుని బయటికి వచ్చాడు. ముఖమంతా దుఃఖం అవమానం.
    "ఎందుకమ్మా అట్లా కన్నీరు కారుస్తావ్. కలకంఠి కన్నీరొలికిన ఇంత సిరి ఉండదని తెలుసుకదా! మీరైనా చెప్పండి నాన్నా! వాళ్ళు అసూయతో అన్నమాటలకి మీరెందుకు బాధపడటం?"
    "అమ్మా! ఏమీలేనిచోటనే అపనిందలు వేస్తుంది లోకం. నువ్వీ రకంగా మాట్లాడితే, నీ దురదృష్టానికి పడుతున్న బాధతోపాటు లోకనింద కూడా భరించాల్సి ఉంటుంది. నిన్ను అందరూ దూషిస్తూ ఉంటే మేం తట్టుకోలేం. మన కుటుంబాన్ని, వంశాన్ని కూడ నిందిస్తారు. మనవల్ల వంశ ప్రతిష్ఠకి భంగం రాకూడదు కదా! అది నరకహేతువవుతుందని నీకూ తెలుసు."
    "మీరీ విషయంలో చింతించవలసిన పనిలేదు. వంశప్రతిష్ఠకి భంగం కలిగించేపనులేవీ చెయ్యను నేను. నా జీవితం భగవంతునికి నివేదన అయిపోయింది. దైవచింతనలో భగవదాజ్ఞా నిర్వహణం నా జీవిత లక్ష్యం. నా వల్ల మన కుటుంబ గౌరవం ఇనుమడించేట్లు నడుచుకుంటాను" అన్నది శాంతంగా.
    తల్లితండ్రులిద్దరూ ఆ పై ఏమీ మాట్లాడలేకపోయారు. కాని వారి ముఖంలో ఉన్న వేదననిచూసి పరిపరివిధాల ఓదార్చింది. ఎన్నో తాత్విక విషయాలు చర్చించింది.. ఎన్నో అవమానాల పాలైన ద్రౌపదినిగురించి, నీలాపనిందల పాలైన సీతాదేవి గురించి చెప్పింది. తాము ఓదార్చవలసిన చిన్నది తమని ఓదార్చుతుంటే వారికి బాధ, గౌరవం, ధైర్యం కలిగాయి.
    ఆడవాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళి జరిగినదంతా గోరంతలు కొండతలు చేసి మరీ చెప్పారు. ఈ విషయంలోనైనా తమ ఆధిపత్యం చూపుదామంటే కుదరనందుకు ఉక్రోషం వచ్చింది. రెండురోజుల్లో తరిగొండలోనూ చుట్టుపక్కల వెంకమాంబ గురించి ఎన్నో కథలు అలా గాలిలో తేలి అందరి కర్ణపుటాలకీ సోకాయి.
    "వెంకమాంబకి పిచ్చి పట్టిందిట!"
    "జుట్టు విరబోసుకుని తిరుగుతోందిట!"
    "అది పిచ్చికాడు. దెయ్యం. అందుకే జుట్టు విరబోసుకోటం."
    "అయ్యో! అది బ్రహ్మరాక్షసిట. అందుకే ఏవేవో వేదాంత విషయాలు మాట్లాడుతుందిట"
    "అసలు రహస్యం అదికాదు. చచ్చిపోయిన మొగుడే దెయ్యం అయి పట్టాడుట"
    "తనని చంపిందని కోపం"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS